రాహుల్ గాంధీ: కీలకమైన సమయాల్లో ఎందుకు విదేశీ పర్యటనలకు వెళ్లిపోతున్నారు?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Mohd Zakir/Hindustan Times via Getty Images

    • రచయిత, అనంత ప్రకాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కీలకమైన సమయాల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు విదేశాలకు వెళ్లిపోతున్నారు?

ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఇబ్బంది పడుతూ కనిపిస్తుంటారు.

ఎందుకంటే రాజకీయ జీవితం కంటే వ్యక్తిగత జీవితానికే రాహుల్ గాంధీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కనిపించడం ఇదేమీ తొలిసారి కాదు. ఎప్పటికప్పుడే ఆయన విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు.

పుట్టిన రోజు వేడుకలు, నూతన సంవత్సర వేడుకలు.. ఇలా చాలా సమయాల్లో ఆయన కొన్నిసార్లు ఒంటరిగా, మరికొన్నిసార్లు కుటుంబంతో విదేశాలకు వెళ్లి వస్తుంటారు.

ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన విదేశీ పర్యటనలు మాత్రం తగ్గనేలేదు.

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ

ఫొటో సోర్స్, ANI

వార్షికోత్సవంలోనూ కనపడలేదు..

డిసెంబరు 28న కాంగ్రెస్ 138వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ మాజీ అధ్యక్షుడైన రాహుల్, లేదా తాత్కాలిక అధ్యక్షురాలైన సోనియా.. ఇద్దరూ వీటిలో కనబడలేదు.

ఈ వేడుకలకు ఒక రోజు ముందే రాహుల్ ఇటలీకి వెళ్లిపోయారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సోనియా ఈ కార్యక్రమాలకు హాజరుకాలేదు. దీంతో అన్నింటినీ ప్రియాంకా గాంధీ ముందుండి నడిపించారు.

రాహుల్ ఎందుకు రాలేదని ప్రియాంకను విలేకరులు ప్రశ్నించారు. అయితే ఆమె సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఇతర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆయన్ను వెనకేసుకొని వచ్చారు.

అమ్మమ్మ అనారోగ్యంతో ఉండటం వల్ల రాహుల్ అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించలేదు.

దీంతో రాహుల్‌పై బీజేపీ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించారు.

ఇలాంటి పరిస్థితుల్లో అసలు రాహుల్ గాంధీ ఎందుకు మళ్లీ మళ్లీ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారనే ప్రశ్న అందరి బుర్రలనూ తొలచేస్తోంది.

రాహుల్, సోనియా

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES

ఏడాదికి 65 పర్యటనలు

కేంద్ర హోం శాఖ సమాచారం ప్రకారం.. ఏటా రాహుల్ సగటున 65 విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. 2015 నుంచి 2019 మధ్య ఆయన 247సార్లు విదేశాల్లో పర్యటించారు. ఆయనకు భద్రత కల్పించే ఎస్‌పీజీ బలగాలు ఇచ్చిన సమాచారం ఇది. అంటే వాస్తవంగా ఇంతకంటే ఎక్కువే ఆయన విదేశీ పర్యటనలు ఉంటాయి.

మొత్తంగా 247 విదేశీ పర్యటనలు అంటే.. 2015 నుంచి 2019 మధ్య ఏటా దాదాపు 65 విదేశీ పర్యటనలకు ఆయన వెళ్లారు. అంటే నెలకు ఐదుకు తగ్గకుండా ఆయన విదేశీ పర్యటనలు చేశారు.

గతేడాది లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వివరాలు వెల్లడించారు.

ఆయన ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారనేది ఇక్కడ ప్రధానం కాదు. కానీ, పార్టీకి అవసరమైన, కీలక సమయాల్లో ఆయన ఎందుకు విదేశాలకు వెళ్తున్నారన్నదే ప్రశ్న.

ఆయన విదేశీ పర్యటనల వల్ల చాలాసార్లు కాంగ్రెస్ తమ కార్యక్రమాలు, ప్రచారాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు అయితే, ఆయన లేకుండానే కార్యక్రమాలను నడిపించాల్సి వచ్చింది.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుతో మొదలుపెట్టి... కర్ణాటకలో మంత్రుల పదవుల అప్పగింతల వరకు చాలాసార్లు రాహుల్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయాల్లో రాహుల్ విదేశీ పర్యటనల్లో ఉన్నారు.

రాహుల్, సోనియా

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

పౌరసత్వ చట్టంపై నిరసనల సమయంలోనూ..

2019లో పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి.

ఈ విషయంలో బీజేపీని కాంగ్రెస్ తూర్పారబడుతూ వచ్చింది. కానీ అప్పుడు రాహుల్ గాంధీ మాత్రం దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. దీనిపై కాంగ్రెస్ చాలా విమర్శలను మూటగట్టుకుంది. అయితే, ముందే సిద్ధంచేసిన ప్రణాళికల ప్రకారమే రాహుల్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది.

2018లో కర్నాటక ఎన్నికల అనంతరం సోనియాతో కలిసి రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల పంపకాలు ఆలస్యం అయ్యాయి.

2016 కొత్త సంవత్సర వేడుకల సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. కొందరు పంజాబ్ కాంగ్రెస్ నాయకులు మీడియా ముందుకొచ్చి అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఇలాంటి పర్యటనల వల్ల బీజేపీతోపాటు యూపీఏలోని పార్టీలు కూడా రాహుల్ గాంధీని విమర్శిస్తున్నాయి. సొంత పార్టీ నాయకులు కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

అసలు ఈ విమర్శలను రాహుల్ పట్టించుకుంటారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

రాహుల్, సోనియా

ఫొటో సోర్స్, ANI

పట్టించుకోరా?

రాహుల్ ఇలాంటి విమర్శలను పట్టించుకోకపోవచ్చని కాంగ్రెస్ పార్టీపై ఏళ్ల నుంచీ వార్తలు రాస్తున్న సీనియర్ జర్నలిస్టు అపర్ణ ద్వివేది వివరించారు.

‘‘రాహుల్ ఇవేమీ అంతగా పట్టించుకోరు. అవి పార్టీ లోపల విమర్శలైనా, బయటవి అయినా ఆయనపై అంత ప్రభావం చూపవు. 23 మంది సీనియర్ నాయకులు తమకు అధినాయకుడు కావాలంటూ బహిరంగంగా లేఖ రాసినప్పటికీ.. ఇంకా అందరూ గాంధీ కుటుంబం వెనకే పడుతున్నారు. దీంతో ఆయన లేకుండా పార్టీ ముందుకు వెళ్లదని రాహుల్ గాంధీకి కూడా అర్థమైంది’’అని ఆమె అన్నారు.

‘‘ఇక బీజేపీ విమర్శల విషయానికి వస్తే.. గత ఏడెనిమిదేళ్లుగా రాహుల్‌ను పప్పు అంటూ వారు విమర్శలు చేస్తూ వస్తున్నారు. వీటిని తిప్పికొట్టే తరహాలో కాంగ్రెస్ ఏమీ చేయలేదు. మరోవైపు పార్టీ తన కనుసన్నల్లోనే నడుస్తోందని రాహుల్ భావిస్తూ వస్తున్నారు. అందుకే ఆయనే కొన్ని బాధ్యతలను తన సోదరి ప్రియాంకకు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, PTI

ఇక బాధ్యతల విషయానికి వస్తే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం అనంతరం ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడి పదవికి రాహుల్ రాజీనామా చేశారు.

ఈ నిర్ణయాన్ని సోనియా పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అప్పటి నుంచీ రాహుల్‌ను మళ్లీ అధ్యక్షుడిని చేసేందుకు పార్టీ చాలా ప్రయత్నించింది.

కానీ రాహుల్ మాత్రం తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.

పార్టీ వార్షికోత్సవానికి ఒక్క రోజు ముందుగా విదేశీ పర్యటనలకు వెళ్లడం ద్వారా ఆయన అందరికీ ఒక సందేశం ఇవ్వాలని భావిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

‘‘వ్యవస్థాపక దినోత్సవానికి ఒక రోజు ముందు ఆయన మిలాన్‌కు వెళ్లడాన్ని బట్టి చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. అధ్యక్షుడిగా కొనసాగాలంటే తను ఎలా ఉంటే అలా పూర్తిగా స్వీకరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన చెప్పాలని అనుకుంటున్నట్లుంది’’అని అపర్ణ వివరించారు.

‘‘అలా ఏమీలేదు...’’

రాహుల్ తాజా పర్యటనపై బీజేపీ నాయకులు వరుస విమర్శలు సంధిస్తున్నారు. ‘‘ఆయనవి పార్ట్ టైమ్ పాలిటిక్స్.. ఫుల్ టైమ్ టూరిజం.. హిపోక్రసీ.. ఆయన నానీని చాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారో ఆయనకే తెలియాలి’’అని బీజేపీ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వి వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ స్పందించారు. ‘‘అమ్మమ్మను చూడటానికి రాహుల్ వెళ్లారు. ఇందులో తప్పేముంది? వ్యక్తిగత పర్యటనలకు వెళ్లడానికి ప్రతి ఒక్కరికీ హక్కులున్నాయి. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. కావాలనే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంటున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు రాహుల్ గాంధీని చూస్తుంటే జాలేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి అమితాబ్ సిన్హా వ్యాఖ్యానించారు. ‘‘నాకు తెలిసి రాహుల్ చాలా మంచి వ్యక్తి. ఆయన సాధారణ పౌరుడిలా తన జీవితం గడపాలని అనుకుంటారు. కానీ తల్లి ఒత్తిడిపై ఆయన పార్టీ పగ్గాలు తీసుకున్నారు. ఆయన్ను చూస్తుంటే జాలేస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లేదా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఆయన ఏ పదవినీ సీరియస్‌గా తీసుకోలేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మనం దీన్ని రాహుల్ స్వభావం అనుకున్నా.. లేక నిర్లక్ష్యం అనుకున్నా.. లేదా అంతర్గత విభేదాలు అనుకున్నా... దీనికి కాంగ్రెస్సే బాధ్యత వహించాల్సి వస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరు నడిపిస్తారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అది రాహుల్ గాంధీనా? లేక వేరే ఎవరినైనా ముందుకు తీసుకుస్తారా? అనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగులుతోంది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలైంది. పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండే నాయకుడే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని పార్టీలో కొందరు భావిస్తున్నారు.

మరోవైపు రాహుల్‌తోనే మరోసారి పగ్గాలు చేపట్టించేలా చూసేందుకు మరో వర్గం ప్రయత్నిస్తోంది. త్వరలో కాంగ్రెస్‌లో అంతర్గత ఎన్నికలు మొదలుకాబోతున్నాయి. కానీ రాహుల్ మాత్రం క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనేలా ఎలాంటి సంకేతాలు ఇవ్వడంలేదు.

కాంగ్రెస్‌కు ఇది దురదృష్టకరమని సీనియర్ జర్నలిస్టు నీర్జా చౌధరి వ్యాఖ్యానించారు.

‘‘మీకు అమిత్ షా, మోదీల సిద్ధాంతాలు నచ్చినా నచ్చకపోయినా.. వారు చేసే కృషి మీకు కనిపిస్తుంది. అమిత్ షాకు ఇటీవల కరోనావైరస్ సోకింది. ఆ తర్వాత కూడా ఆయన అసోం, బెంగాల్, మణిపుర్‌లలో పర్యటించారు. ఆయన ఎక్కడో ఒక చోట తిరుగుతూ కనిపిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో నాయకుల్ని ఒకరితో మరొకర్ని ప్రజలు పోల్చి చూస్తుంటారు’’అని నీర్జా వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)