గురుదాస్‌పూర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఎలా గెలిచింది?

ఫొటో సోర్స్, SUNIL JAKHAR / FACEBOOK
గురుదాస్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నికలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జక్కర్ 1.93 లక్షల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఆయనకు 4,99,752 ఓట్లు రాగా బీజేపీ-అకాలీదళ్ అభ్యర్థి స్వరణ్ సలారియాకి 3,06,533 ఓట్లు దక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి 23,579 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
సినీ నటుడు, దివంగత ఎంపీ వినోద్ ఖన్నా మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
అయితే అన్ని ఎన్నికల్లో మోదీ-షా గాలి వీస్తున్న తరుణంలో గురుదాస్‌పూర్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఉత్సాహాన్నిచ్చేదే.
సునీల్ జక్కర్‌కి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. గురుదాస్‌పూర్ ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Twitter
అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎలా గెలవగలిగింది?
గురుదాస్‌పూర్ ఉపఎన్నికలో కేవలం 56 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 7 నెలలే అయ్యింది కాబట్టి అప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏమీ ఉండదు. ప్రభుత్వం నుంచి ఇప్పుడే మార్పు, అభివృద్ధి ఆశించడం అనేది తొందరపాటే.
బీజేపీ-అకాలీదళ్ ప్రచారవ్యూహంతో పోల్చి చూస్తే కాంగ్రెస్ చాలా పకడ్బందీ ప్రణాళికతో ఎన్నికకి సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అనారోగ్యంతో అసలు ప్రచారానికే రాలేదు. కానీ కాంగ్రెస్ అలా కాదు, ఏకంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పాటు మంత్రులు మన్‌ప్రీత్ బాదల్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ వంటి నేతలు ప్రచారాన్ని ముందుండి నడిపించారు.

ఫొటో సోర్స్, Facebook
స్వరణ్ సలారియాపై అత్యాచార ఆరోపణలు కూడా బీజేపీ కూటమి విజయావకాశాలను దెబ్బతీసింది. సలారియా ఈ ఆరోపణలను ఖండించినా, కాంగ్రెస్ అభ్యర్థిపై ఎలాంటి వ్యతిరేకతా లేకపోవడం కూడా ఆ పార్టీ విజయానికి మరో కారణం.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అకాలీదళ్ నేత సుచా సింగ్ లాంగాని పార్టీ నుంచి బహిష్కరించినా అది ఎలాంటి అనుకూల ప్రభావాన్నీ చూపలేకపోయింది.
గురుదాస్‌పూర్‌లో కాంగ్రెస్ విజయం మోదీ ప్రభుత్వం, జీఎస్టీ, రైతుల పట్ల కేంద్రం వైఖరిపై ప్రజల తీర్పుగా భావించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ గెలుపుని అమరీందర్ సింగ్ ప్రభుత్వానికి ప్రజల మద్దతుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని, రాహుల్ అధ్యక్ష పట్టాభిషేకానికి ఇది తొలి అడుగుగా భావించవచ్చనేది మరో విశ్లేషణ.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








