డెత్ రోడ్: భయంకరమైన ఈ మార్గంలో ప్రయాణం ఎలా ఉంటుందంటే...

ప్రమాదకరమైన ఈ రోడ్డును డెత్ రోడ్ అంటారు

ఫొటో సోర్స్, Harald von Radebrecht/Alamy)

ఫొటో క్యాప్షన్, ప్రమాదకరమైన ఈ రోడ్డును డెత్ రోడ్ అంటారు
    • రచయిత, షఫీక్ మేగ్జీ
    • హోదా, బీబీసీ ట్రావెల్

అమెరికాలోని కొలరాడోలో 4,800 మీటర్ల పొడవైన 'కుంబ్రే పాస్'ని దాటిన తర్వాత, మా టాక్సీ పొగమంచులోకి దూసుకుపోయింది. ఒక బుడగలో చిక్కుకుపోయిన ఒక వింత అనుభూతిని పొందాం. మేం ఆ సమయంలో 'డెత్ రోడ్' అని పిలుచుకునే ఒక భయంకరమైన మార్గంలో ప్రయాణిస్తున్నాం.

పశ్చిమ బొలీవియాలోని ఎత్తైన నగరమైన లా పాజ్ నుండి యుంగాస్ వ్యాలీకి, ఆ తర్వాత అమెజాన్ పర్వత ప్రాంతాలకు వెళ్లే రోడ్డు ఏటవాలుగా ఉంటుంది. యుంగాస్ రోడ్డు వాలు చాలా నిటారుగా ఉంది. 64 కిలోమీటర్ల పొడవైన ఈ దారిలో 3,500 మీటర్ల వాలు రోడ్డు కూడా ఉంటుంది.

చాలాచోట్ల ఈ రోడ్డు వెడల్పు మూడు మీటర్లు కూడా మించదు. దీనికి చాలా మలుపులు, అంచులు ఉన్నాయి. చిన్న చిన్న జలపాతాలు రోడ్డు పక్కన రాళ్ల మీద నుండి జాలువారుతుంటాయి.

ఈ దారిలో కొన్నిచోట్ల మాత్రమే భద్రతా ఏర్పాట్లు కనిపిస్తాయి. రోడ్డు పక్కన అక్కడక్కడ తెల్లటి శిలువ గుర్తులతోపాటు, రకరకాల పువ్వులు కూడా కనిపిస్తాయి.

1990లలో ఈ రోడ్డు మీద ప్రయాణించిన అనేకమంది మరణించారు. ఇంటర్-అమెరికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ దీనిని 'ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రహదారి' అని పేర్కొంది. ఈ రహదారిని పరాగ్వే (1864-70), చాకో (1932-35) యుద్ధాల ఖైదీలతో నిర్మింపజేశారు.

మా టాక్సీ రోడ్డు మీద నెమ్మదిగా వెళుతోంది. డ్రైవర్ ముందుకు వాలి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఎదురుగా హఠాత్తుగా దూసుకు వచ్చిన మోటర్ బైక్ మ టాక్సీ రివ్యూ మిర్రర్‌ను విరగ్గొట్టింది.

మా ముందు వెళ్తున్న ముగ్గురు సైక్లిస్టులు పెద్ద గుంటను దాటుకుంటూ వెళ్లారు. ఈ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఒక బైపాస్‌ను నిర్మించినప్పటికీ, ఈ రహదారికి ఉన్న పేరు కారణంగా చాలామంది పర్యాటకులు ఈ రోడ్డు మీదనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు.

ఈ రహదారి గమ్యాన్ని చాలామంది చూడలేదు. కానీ, ఇది ఎన్నో సుందర దృశ్యాల సంగమం.

ఖైదీలతో ఈ రోడ్డును నిర్మింపజేశారు

ఫొటో సోర్స్, Streetflash/Getty Images

ఫొటో క్యాప్షన్, ఖైదీలతో ఈ రోడ్డును నిర్మింపజేశారు

సుందరమైన లోయ

అండీస్, అమెజాన్ మధ్య విస్తరించి ఉన్న యుంగాస్ లోయ జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఇక్కడ సారవంతమైన నేలలు ఉంటాయి. బొలీవియాలోని స్థానిక తెగల భాష 'ఐమార'లో యుంగాస్ అంటే 'వెచ్చని భూమి' అని అర్థం.

ఆ ప్రాంతంలో రెండు విలువైన వనరులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి: ఒకటి కోకా, రెండోది బంగారం. దీని కారణంగా, ఆ ప్రాంతం శతాబ్దాలుగా ప్రజల ఆకర్షణకు, అనుమానాలకు, అపోహలకు, వివాదాలకు కేంద్రంగా నిలిచింది.

ఆ ప్రమాదకరమైన 'డెత్ రోడ్'లో దాదాపు రెండు గంటలపాటు నడిచి కొరైకో చేరుకున్నాం. ఇది ఒకప్పుడు బంగారు మైనింగ్‌కు కేంద్రంగా ఉండేది. కానీ, ఇప్పుడిది ఒక నిశ్శబ్ధం నిండిన ఒక పర్యాటక కేంద్రం.

మా కారు పచ్చ పచ్చటి వాలు వైపు కదులుతూనే ఉంది. తినడానికి, తాగడానికి, నిద్రపోవడానికి చక్కని ప్రదేశాలతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఒక్కసారి కొరైకో వెళితే, దాన్ని వదిలిపెట్టాలనిపించదు. తీవ్రమైన ప్రయాణ బడలికతో రోజంతా గడిపిన తర్వాత, నేను ఆ ప్రాంతంలో కలియదిరిగాను. ఆధునిక బొలీవియా నిర్మాణానికి అది ఎలా దోహదపడిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాను.

సారవంతమైన నేల, భారీ వర్షాలు కారణంగా, యుంగాస్ వ్యవసాయానికి ప్రధాన కేంద్రంగా మారింది. గతంలో, ఈ ప్రాంతం, 'ఇన్కా' అంతకు ముందు 'తివానా' వంటి సామ్రాజ్యాలకు ప్రధాన ఆహార వనరుగా ఉంది. ఈ ప్రాంతంలో లామా అని పిలిచే చిన్న ఒంటె జాతి కనిపించింది. గతంలో ఈ మార్గం ద్వారా వ్యాపారం జరిగేది.

నేటికీ, ఈ ప్రాంతం అనేక రకాల ఆహార పదార్థాల ఉత్పత్తికి ప్రధాన కేంద్రం. నేను రియో వెళ్లే శతాబ్దాల నాటి కాలిబాట మీద నడుస్తున్నప్పుడు పర్వతాల వెంబడి కాఫీ, అరటి, సరుగుడు, జామ, బొప్పాయి, సిట్రస్ పండ్ల తోటలు అనేకం కనిపించాయి.

అక్కడ కనిపించిన కొన్ని గుబురు మొక్కలు నన్ను ఆకర్షించాయి. ఆకులు ఓవల్ ఆకారంలో, పండ్లు ఎరుపు రంగులో ఉన్నాయి. ఇవి కోకా చెట్లు.

వేల సంవత్సరాలుగా కోకా అనేక దక్షిణ అమెరికా సంస్కృతులలో అంతర్భాగంగా ఉంది. ఈ ఖండంలో కోకాను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో బొలీవియా ఒకటి. ఇక్కడ వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోకాను సాగు చేస్తారు. ఈ దేశంలో పండే పంటలో మూడింట రెండు వంతుల యుంగాస్‌లోనే పండుతుంది.

విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే కోకా ఆకులు తేలికపాటి ఉద్దీపనగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల ఎత్తైన ప్రాంతాలకు వెళ్లడం వల్ల కలిగే సమస్యలతో పాటు ఆకలి, దాహం, అలసట కూడా తొలగిపోతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, నొప్పిని తొలగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

గత 8,000 సంవత్సరాలుగా, కోకాను మతపరమైన వేడుకలు, వైద్యం, ఆర్థిక లావాదేవీలు, సామాజిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నారు.

డెత్‌రోడ్ మీద ప్రయాణం అత్యంత క్లిష్టం

ఫొటో సోర్స్, James Brunker/Alamy

ఫొటో క్యాప్షన్, డెత్‌రోడ్ మీద ప్రయాణం అత్యంత క్లిష్టం

కోకాపై నిషేధం

స్పెయిన్ దక్షిణ అమెరికాను స్వాధీనం చేసుకున్నప్పుడు, అక్కడి ప్రజలు కోకాను వాడకుండా నిషేధించారు. కానీ స్పానిష్ అధికారులు గనులు, తోటలలో పని చేసే స్థానిక ప్రజలపై కోకా ప్రభావాన్ని గమనించిన తర్వాత, ఈ పంటను కమర్షియల్ పంటగా మార్చి ప్రోత్సహించారు.

తరువాత కోకా కీర్తి దక్షిణ అమెరికా దాటి విస్తరించింది. 1662లో లండన్‌కు చెందిన అబ్రహం కౌలీ రాసిన 'ఎ లెజెండ్ ఆఫ్ కోకా' అనే కవిత ద్వారా ఆంగ్ల సాహిత్యంలో మొదటిసారిగా కోకా పేరు ప్రస్తావించినట్లు చెబుతారు.

19వ శతాబ్దంలో, కోకా, దాని సైకోయాక్టివ్ ఆల్కలాయిడ్ 'కొకైన్'లు యూరప్, ఉత్తర అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందాయి. వివిధ పానీయాలు, టానిక్కులు, మందులు, అనేక ఇతర ఉత్పత్తులలో కొకైన్ ఒక భాగంగా మారింది.

ఫ్రాన్స్‌కు చెందిన విన్ మరియాని అనే వైన్‌లో లీటరుకు 200 మిల్లీగ్రాముల కొకైన్ ఉంటుంది. కొకైన్ ఆరాధకులలో శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ కూడా ఒకరు.అలాగే అమెరికా అధ్యక్షుడు గ్రాంట్, ఫ్రెంచ్ నవలా రచయిత ఎమిలీ జోలా, పోప్ లియో-13 కూడా కొకైన్ ప్రేమికుల్లో కొందరు.

అమెరికాకు చెందిన జాన్ పెంబర్టన్ అనే సైనికుడు కోలా గింజలు, కొకైన్, ఆల్కహాల్‌లను కలిపి ఒక మద్యాన్ని తయారు చేశారు. కెఫిన్‌లో కోలా గింజలు పుష్కలంగా ఉంటాయి.

తర్వాత దీని నుంచి 'కోకా కోలా' పుట్టుకొచ్చింది. కోకా-కోలా నుండి కొకైన్, ఆల్కహాల్‌లను చాలాకాలం కిందటే తొలగించినా, కొకైన్ లేకుండా కోకా ఆకులను నుంచి తీసిన పదార్ధాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.

మనస్తత్వవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా కొకైన్ గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. '' కొద్దిగా తీసుకున్న కొకైన్, నాలో ఆనందాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది'' అని పేర్కొన్నారు.

కొకైన్ నేరాలకు కేంద్రంగా మారడంతో ప్రపంచంలోని అనేక దేశాలలో కొకైన్, కోకా రెండింటినీ నిషేధించారు. కానీ, బొలీవియాలో కోకా వాడకం ఇప్పటికీ చట్టబద్ధమే.

మాదక ద్రవ్యాల పై చర్యల కారణంగా మానవ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లింది. ఈ చర్యలలో చాలా మంది చనిపోయారు. అనేకమంది హింసకు గురయ్యారు.

దీనికి ప్రతిగా కోకా ఉత్పత్తి చేస్తున్న రైతుల ప్రజాఉద్యమం తెరపైకి వచ్చింది. ఈ రైతులలో ఎక్కువ మంది 'క్వెకువా' లేదా 'ఐమార' గిరిజన వర్గానికి చెందినవారు.

బొలీవియాలో కోకా వాడకం చట్టబద్ధమే

ఫొటో సోర్స్, Mathess/Getty Images

ఫొటో క్యాప్షన్, బొలీవియాలో కోకా వాడకం చట్టబద్ధమే

మోరేల్స్‌ ఎదుగుదలకు దారి తీసిన ఉద్యమం

కోకా రైతుల ఈ ఉద్యమం కారణంగా, బొలీవియాలో ఈవో మోరేల్స్ వంటి పెద్ద నాయకులు ఉద్భవించారు. ఆయన ఈ ఉద్యమంలో పాల్గొన్న కోచబాంబ ట్రాపిక్స్ ట్రేడ్ యూనియన్ 'సిక్స్ ఫెడరేషన్' నాయకుడు. బొలీవియాలో జరుగుతున్న అనేక ఇతర ఉద్యమాలతో పాటు, ఈ ఉద్యమం చివరికి 2005 ఎన్నికలకు కారణమైంది.

ఎన్నికలలో గెలుపొందడం ద్వారా, స్థానిక ఐమారా తెగకు చెందిన మోరేల్స్ బొలీవియా కొత్త అధ్యక్షుడయ్యారు. ఈ విధంగా, ఆయన అమెరికా రెండు ఖండాలలో అధ్యక్ష పదవి చేపట్టిన మొదటి గిరిజనుడు.

ఆయన అధ్యక్షుడయ్యాక నిర్దేశిత పరిమితిలోపు రైతులు కోకా సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నేడు, బొలీవియాలోని చాలామంది ప్రజలు కోకాను పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. అక్కడ దాదాపు మూడొంతుల మంది దీన్ని నిత్యం ఉపయోగిస్తున్నారు. కొకైన్ వాడకం మాత్రం అక్కడ చట్ట విరుద్ధం.

డెత్ రోడ్

ఫొటో సోర్స్, Filrom/Getty Images

బొలీవియాలో బంగారపు మెరుపులు

చివరగా, నేను యుంగాస్ రెండవ ప్రధాన వనరు బంగారానికి కేంద్రమైన కొరైకో నది ఒడ్డుకు చేరుకున్నాను.

దాదాపు 350 కిలోమీటర్ల పొడవైన 'రూటా డెల్ ఓరో' (గోల్డెన్ రూట్) ప్రాంతం నదులు, పొరుగున ఉన్న అమెజాన్ ప్రాంతం గుండా వెళుతుంది. బంగారం ఉన్నట్లు తెలిసినా ఎప్పుడూ తగినంత ఉత్పత్తి లేదు. దీనికి కారణం, ఆ ప్రాంతం మీద పుట్టుకొచ్చిన వదంతులే.

క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసిన రోమ్‌లోని 'సొసైటీ ఆఫ్ జీసస్' లేదా 'జెస్యూట్స్'తో అనేక పురాణాలు ముడిపడి ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, ప్రమాదకరమైన ఘాట్ రోడ్లలో పదేళ్లుగా బస్సులు నడుపుతున్న మహిళా డ్రైవర్

పెర్సీ హారిసన్ ఫాసెట్ అనే అన్వేషకుడు 20వ శతాబ్దం ప్రారంభంలో అనేక సంవత్సరాలు అక్కడ ప్రయాణించారు. తన పుస్తకం 'ఎక్స్‌ప్లోరేషన్ ఫాసెట్'లో ఇక్కడి బంగారం గురించి రాశారు. అందులో, సకాంబయ నదికి సమీపంలో ఉన్న సొరంగంలో జెస్యూట్‌లు దాచిన 'గొప్ప నిధి' గురించిన కథను వివరించాడు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పెర్సీ హారిసన్ ఫాసెట్, బంగారం గుప్త నిధుల ఆచూకీ కోసం వెతుకుతున్నప్పుడు అదృశ్యమయ్యాడు.

ఇలాంటి అనేక ఊహాగానాలు, భయాలు ఉన్నా, ప్రస్తుతం బొలీవియాలోని యుంగాస్, అమెజాన్‌లలోని కొన్ని ప్రాంతాలలో బంగారం తవ్వకం వేగంగా కొనసాగుతోంది. ప్రపంచంలో 2007-08 ఆర్థిక సంక్షోభం తర్వాత, బంగారం ధర వేగంగా పెరగడం కూడా దీనికి ఒక కారణం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)