సింహం పెరట్లోకి ఎలా వచ్చింది... అసలు సంగతి తెలిసి అంతా ఆశ్చర్యపోయారు

చెట్ల పొదల కింద షాపింగ్ బ్యాగ్ పెట్టారు
ఫొటో క్యాప్షన్, చెట్ల పొదల కింద షాపింగ్ బ్యాగ్ పెట్టారు
    • రచయిత, పీటర్ మవాయ్
    • హోదా, బీబీసీ న్యూస్, నైరోబీ

చెట్ల మధ్య సింహాన్ని చూసి ఓ వ్యక్తి హడలిపోయారు. జాతీయ పార్క్‌కు కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న తన యజమాని ఇంటి పెరడులో చప్పుడు చేయకుండా నక్కినట్లున్న సింహాన్ని చూసిన వెంటనే ఆ వ్యక్తి అటవీ అధికారులకు ఫోన్ చేశారు.

సింహం కనిపించిందనే ఫిర్యాదు అందుకున్న వన్యప్రాణి అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఆయుధాలతో ముగ్గురు అధికారులు ఆ ప్రాంతానికి వచ్చారు. జాగ్రత్తగా ఆ ఇంటి స్థలానికి చేరుకున్న అధికారులు అక్కడ కదలకకుండా మెదలకుండా ఉన్న సింహం ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

అప్పటివరకు హై అలర్ట్‌తో ఉన్నవారంతా కాస్త దగ్గరగా వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి హమ్మయ్య అని రిలాక్సయ్యారు. నిజానికి అది సింహం కాదు. ఓ షాపింగ్ బ్యాగ్ మీదున్న సింహం బొమ్మ. ఆ బ్యాగును ఎవరో అక్కడ వదిలేశారు.

చెట్ల పొదల్లో ఉన్న ఆ సంచీ మీదున్న సింహం బొమ్మను చూసి నిజమైన నిజమైన సింహం అని భ్రమపడటంతో ఈ టెన్షన్ అంతా చెలరేగింది.

బ్యాగులో అవకాడో మొక్కలు పెంచుతున్నారు
ఫొటో క్యాప్షన్, బ్యాగులో అవకాడో మొక్కలు పెంచుతున్నారు

కెన్యాలోని కిన్యాయా గ్రామంలో ఉన్న ఆ ఇంటి యజమానే ఆ బ్యాగ్‌ను ఆ పొదల్లో పెట్టారు. అందులో మట్టివేసి అవకాడో మొక్కలను పెంచుతున్నారు. మొక్కలు వాడిపోకుండా ఉండేందుకు దాన్ని చెట్ల నీడలో ఉంచారు.

''ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో సింహాలు తిరుగుతున్నట్లు ఎలాంటి వార్తలు లేవు. కానీ, తమ పశువులు కనిపించడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు'' అని బీబీసీతో చీఫ్ సైరస్ ఎంబిజివే చెప్పారు.

"మేం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాం. మొదట ప్రజలు అందరూ సురక్షితమైన ప్రదేశాల్లో ఉన్నారో లేదో నిర్ధారించుకున్నాం. ఆ తర్వాతే సింహాన్ని వెదికే పని మొదలుపెట్టాం. అప్పుడు ఈ బ్యాగ్‌ కనిపించింది'' అని చీఫ్ చెప్పారు.

అటవీ అధికారులు వచ్చినప్పుడు ఆ ఇంటి యజమాని అక్కడ లేరు. ఆమె తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, సింహం ఉన్నట్లు ఆమెకు చెప్పి మరోవైపు నుంచి ఇంటి లోపలికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆమెకు ఆ బ్యాగ్ సంగతి వెంటనే గుర్తుకు రాలేదు.

ఆ షాపింగ్ బ్యాగ్ నేరుగా ఒక కిటికి కింద ఉంది. దాని దగ్గరకు వెళ్లి చూడగా సింహం ముఖం తప్ప మిగతా శరీరం కనిపించలేదు. అప్పుడు అది నిజానికి షాపింగ్ బ్యాగ్ అని నిర్దారించుకున్నారు.

వీడియో క్యాప్షన్, మూడు సింహాలను తాబేలు ఎలా ఓడించిందో చూడండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)