చైనా: ‘శిథిలాల కింద చిక్కుకుపోయాను, నీళ్లు తాగి బతికాను.. నిశ్శబ్దంగా ఉంటే రాయితో గోడపై కొట్టేదాన్ని, ఎందుకంటే..’

చైనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పాట్రిక్ జాక్సన్
    • హోదా, బీబీసీ న్యూస్

చైనాలోని చాంగ్షా నగరంలో ఆరు రోజుల క్రితం ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది.

"ఆ భవనం శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళను ఆరు రోజుల తర్వాత రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు" అని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

గురువారం తెల్లవారుజామున ప్రాణాలతో బయటపడిన మహిళ సుమారు 132 గంటలు శిథిలాల కింద ఉన్నారు.

"ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 53మంది చనిపోయారు" అని అధికారులు తెలిపారు.

భవన శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించడానికి చాంగ్షా నగర రెస్క్యూ సిబ్బంది సంప్రదాయ పద్ధతులు ఉపయోగించారు. పిలవడం, శిథిలాలపై కొట్టడం, వాసన పసిగట్టే శునకాలతో పాటు డ్రోన్లను కూడా వాడారు.

వీడియో క్యాప్షన్, చైనాపై దుమ్ము దండయాత్ర

'నీళ్లు కొద్ది కొద్దిగా తాగుతూ ప్రాణాలు కాపాడుకున్నా..'

ఈ భవనం శిథిలాల కింద 88 గంటల పాటు చిక్కుకున్న మరొక మహిళను కూడా రెస్క్యూ సిబ్బంది ఇదివరకు కాపాడారు.

ప్రాణాలతో ఎలా బయటపడిందో 21 సంవత్సరాల ఆ యువతి వివరించారు.

గత శుక్రవారం మధ్యాహ్నం ఆ భవనం వెనుక భాగం కూలినప్పుడు ఆమె బెడ్‌పై ఉన్నారు.

"ఆమె నాలుగు అంతస్తులు కిందికి పడిపోయారు. కానీ ఆమె ఉన్న గది గోడలు పూర్తిగా కూలిపోలేదు. ఆ గోడలు ఆమె తలపై త్రిభుజాకారంలో ఏర్పడి, ఆమెకు రక్షణ కల్పించాయి" అని ది గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

కుండలో సగం వరకు ఉన్న నీళ్లు ఆమె ప్రాణాలను కాపాడాయి. దాహం వేసినప్పుడు కొద్దిగా నీళ్లు తాగేది. నీటిని చాలా పొదుపుగా వాడుకుంది. దాంతో ఆమెను కాపాడే సమయానికి కూడా ఆ కుండలో కొన్ని నీళ్లు మిగిలే ఉన్నాయి.

శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ఆమె ఒక బొంత కప్పుకున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఆమె ఫోన్‌లో సిగ్నల్ పోయింది. కానీ తేదీ, సమయం తెలుసుకునేందుకు ఆమె దాన్ని వాడుకుంది. ఫోన్ బ్యాటరీని కూడా ఆమె చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. 88 గంటల తర్వాత ఆమెను రక్షించిన సమయానికి కూడా ఫోన్‌ పని చేస్తూనే ఉంది.

సాయం కోసం ఆమె రాయితో గోడపై కొట్టారు.

"బయట శబ్ధం వినిపించినప్పుడు నేను రాయితో కొట్టేదాన్ని కాదు. కానీ రెస్క్యూ సిబ్బంది నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపించినప్పుడు లేదా బయట చాలా నిశ్శబ్దంగా అనిపించిన ప్రతిసారీ నేను రాయితో గోడపై కొట్టాను. కొన్ని గంటల్లోనే రెస్క్యూ సిబ్బంది స్పందించారు" అని ఆమె చెప్పారు.

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసులు ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

వీడియో క్యాప్షన్, చైనా జైలు నుంచి తప్పించుకున్న ఉత్తర కొరియా దొంగ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)