LIC స్టార్ ఏజెంట్ భరత్ విక్రయించిన పాలసీల విలువ ఎంతో తెలుసా... రూ. 2,467 కోట్లు

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరెస్పాండెంట్
భరత్ పారేఖ్, చాలా ఏళ్లుగా దినపత్రికల్లో మరణాలకు సంబంధించిన నోటీసులను స్కాన్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో జరిగే అంత్యక్రియలను గమనించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆర్థిక ఉత్పత్తుల్లో ఒకటైన జీవిత బీమాలను అమ్మడానికి ఆయన ఈవిధంగా చేశారు.
''భారత్‌లో అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆహ్వానాలు అక్కర్లేదు. పాడెను మోసే వారిని చూస్తే మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను గుర్తించవచ్చు. వారి బంధువులు లేదా స్నేహితుల వద్దకు వెళ్లి పరిచయం చేసుకుంటాం. మరణించిన వ్యక్తి జీవిత బీమాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించడానికి ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు వారికి చెప్తాం. విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చేస్తాం'' అని పారేఖ్ చెప్పారు.
మరణించిన వ్యక్తికి చేసే కర్మలన్నీ ముగిసిన తర్వాత వారి కుటుంబాల నుంచి ఆయనకు పిలుపు వస్తుంటుంది. చాలా సందర్భాల్లో వారి కంటే ముందు ఆయనే వెళ్లి వారిని పలకరిస్తుంటారు. సరైన సమయంలోగా వారికి డెత్ క్లెయిమ్ అందేలా ఆయన చూస్తుంటారు. వ్యక్తి మరణం, వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకుంటారు.
"మరణం, కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నాకు తెలుసు. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు'' అని ఆయన చెప్పారు.
భారత్‌లోని అతిపెద్ద బీమా కంపెనీ అయిన 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)'కు 13,60,000 మంది ఏజెంట్లు ఉన్నారు. అందులో 55 ఏళ్ల భరత్ పారేఖ్ ఒకరు.
ఎల్ఐసీ గురించి భారత్‌లో తెలియని వారుండరు. 66 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వ సంస్థ, స్టాక్ మార్కెట్‌లో ఘనంగా రంగ ప్రవేశం చేసింది. ఎల్‌ఐసీ ఖాతాలో లక్షకు పైగా ఉద్యోగులు, 28.6 కోట్ల పాలసీలు ఉన్నాయి. భరత్ పారేఖ్ లాంటి ఏజెంట్ల ద్వారానే ఈ పాలసీ విక్రయాల్లో 90 శాతానికి పైగా జరిగాయి.

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL
భరత్ పారేఖ్, ఎల్ఐసీ స్టార్ ఏజెంట్లలో ఒకరు. స్నేహపూర్వకంగా ఉండే ఆయన పొదుపు, మితవ్యయం గురించి ఉత్సాహంగా మాట్లాడతారు. ఇప్పటివరకు రూ. 2,467 కోట్ల విలువైన జీవిత బీమాలను ఆయన విక్రయించారు. దాదాపు ఇవన్నీ నాగ్‌పూర్‌లో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయించినవే. స్వయంగా అమ్మిన పాలసీలతో కలిపి మొత్తంగా దాదాపు 40,000 పాలసీలకు తాను సేవలు అందిస్తున్నట్లు భరత్ చెప్పారు. వీటిలో మూడొంతుల పాలసీలు ఆయన సొంతంగా విక్రయించినవే. వాటి నుంచి ఆయనకు కమిషన్ లభిస్తుంటుంది. ప్రీమియంల సేకరణ, క్లెయిమ్‌లను పరిష్కరించడం వంటి సేవలను ఉచితంగానే అందిస్తానని అన్నారు.
ఈ రంగంలో భరత్ ఒక సెలెబ్రిటీ. ఎల్ఐసీ చైర్మన్ కంటే కూడా ఆయనే ఎక్కువగా సంపాదిస్తున్నట్లు బ్రెత్‌లెస్ మీడియా నివేదికలు చెబుతుంటాయి. ప్రపంచంలోని ప్రముఖ జీవిత బీమా, ఆర్థిక సేవల నిపుణుల బృందం అయిన 'మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్' లో ఆయన 30 ఏళ్లుగా సభ్యుడు. పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు, మేనేజ్‌మెంట్ స్కూళ్లు ఆయనను అతిథిగా ఆహ్వానిస్తుంటాయి. ఆయన తన స్ఫూర్తిదాయక ప్రసంగాల్లో ఒక దాన్ని 'మీట్ ద నంబర్‌వన్, బీ ద నంబర్‌వన్' అనే పేరుతో ఆడియో క్యాసెట్లను విక్రయించారు.
ఆర్థిక సేవలకు సంబంధించి పారేఖ్ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో 35 మంది పనిచేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులు ఉండే ప్రాంతంలో ఒక విశాలమైన అపార్టుమెంట్‌లో ఆయన నివసిస్తారు. ఆయన భార్య బబిత కూడా ఒక బీమా ఏజెంట్.
పారేఖ్ చేస్తోన్న పనిలో చాలా వేగంగా ఎదిగారు. తన స్వీయ అనుభవాలు, పొదుపు సలహాల మేళవింపుతో ఒక పుస్తకాన్ని రాశారు. అందులో 'మీరు ఒక దాని గురించి కలలు కనగలిగితే, దాన్ని మీరు చేయగలరు' అనే వాల్ట్ డిస్నీ వ్యాఖ్యను ఉటంకించారు.

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL
పారేఖ్ తండ్రి మిల్లు కార్మికుడు, తల్లి గృహిణి. 200 చదరపు అడుగులు ఉండే ఒక కిరాయి ఇంటిలో వారి కుటుంబం నివాసం ఉండేది. కేవలం ఒకే గది ఉండే ఆ ఇంట్లో పారేఖ్ తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులు, అత్తతో కలిపి మొత్తం 8 మంది ఉండేవారు. అప్పట్లో వారి జీవనం కష్టంగా సాగింది. తల్లిదండ్రులకు సహాయకంగా పిల్లలు అగర్‌బత్తీల ప్యాకింగ్ పని చేసేవారు.
18 ఏళ్ల వయస్సులో పారేఖ్, ఉదయం కాలేజీకి వెళ్తూనే జీవిత బీమాలు విక్రయించడం మొదలు పెట్టారు. సైకిల్ కిరాయి తీసుకొని క్లయింట్‌లను వెదికేవారు. ఆయన సోదరి దీనికి సంబంధించిన రాతపనిలో సహాయపడ్డారు. నిజజీవిత ఉదాహరణలతో క్లయింట్లను ఆకట్టుకుంటూ ఆయన పాలసీలు విక్రయించేవారు. తన మొదటి క్లయింట్లలో ఒకరైన మోటారు విడిభాగాల డీలర్‌తో '' మీ టైర్ పంక్చర్ అయినప్పుడు లేదా మీ వాహనం చెడిపోయినప్పుడు స్పేర్ టైర్ ఎలా ఉపయోగపడుతుందో అలాగే మీ జీవితానికి, బీమా ఉపయోగపడుతుంది'' అని వివరించారు. దీంతో ఆయన పాలసీ కొనడంతో పారేఖ్‌కు 100 రూపాయలు కమీషన్‌గా లభించాయి.
తొలి ఆరు నెలల్లో పారేఖ్ ఆరు పాలసీలను అమ్మారు. పని మొదలు పెట్టిన తొలి ఏడాది కమీషన్ల ద్వారా రూ. 15,000 సంపాదించారు. ఇది ఇళ్లు గడవడానికే సరిపోయేది. ''జీవిత బీమా పాలసీలను విక్రయించడం చాలా కష్టం. కొన్నిసార్లు నేను ఇంటికి వెళ్లి ఏడ్చేవాన్ని'' అని పారేఖ్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL
ప్రజల అభద్రతతో ఆడుకునే రాబందులు అంటూ బీమా ఏజెంట్లపై వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ, పారేఖ్‌ను ఇలాంటి వ్యాఖ్యలు అడ్డుకోలేకపోయాయి. ఏళ్లు గడిచిన కొద్ది ఆయన ఈ పనిలో నైపుణ్యాన్ని సాధించారు. జీవించి ఉన్నవారి నుంచి పాలసీలు రాబట్టుకోవడం కంటే చనిపోయిన వారి కుటుంబాలను ట్రాక్ చేయడం మెరుగ్గా పనిచేస్తుందని ఆయన గ్రహించారు. ఆయన క్లయింట్లలో వీధి వ్యాపారుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఉన్నారు.
పారేఖ్ క్లయింట్లలో బసంత్ మెహతా ఒకరు. ఐదోతరం టెక్స్‌టైల్ మిల్లు యజమాని. నాగ్‌పూర్‌కు 90 కి. మీ దూరంలో ఆయన నివసిస్తుంటారు. పారేఖ్ ద్వారానే తన ఉమ్మడి కుటుంబంలోని 16 మంది జీవిత బీమా పాలసీలు తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ జాబితాలో 88 ఏళ్ల తన తల్లితో పాటు ఒక ఏడాది వయస్సున్న తన మనవడు కూడా ఉన్నారని తెలిపారు. పారేఖ్, బసంత్ మెహతా ఒక విమానంలో కలుసుకున్నారు. ''జీవిత బీమా చాలా ముఖ్యమైనది. దాని కంటే కూడా మనం పూర్తిగా ఆధారపడదగిన, నమ్మదగిన ఏజెంట్ ఉండటం మరింత ముఖ్యం'' అని మెహతా అన్నారు.
ముందుచూపుతో చర్యలు చేపట్టడమే తన విజయానికి కారణమని పారేఖ్ నమ్ముతున్నారు. 1995 ప్రారంభంలోనే ఆయన తన రికార్డులను కంప్యూటరైజ్ చేశారు. సింగపూర్ నుంచి తోషిబా కంప్యూటర్‌ను తెప్పించుకున్నారు. విదేశాలలో ఫైనాన్స్ శిక్షణా కోర్సులు పూర్తిచేయడానికి చాలా ఖర్చు చేశారు. కాల్ ఛార్జీలు అధికంగా ఉన్న సమయంలోనే ఆయన భారతదేశంలోని మొట్టమొదటి మొబైల్ ఫోన్ కనెక్షన్‌లలో ఒకదాన్ని కొనుగోలు చేశారు. తన ఉద్యోగులకు పేజర్లను అందించారు. కార్యాలయం కోసం క్లౌడ్ ఆధారిత సాంకేతికతలో పెట్టుబడి పెట్టారు. సొంత యాప్‌ను కూడా రూపొందించుకున్నారు. స్థానిక వార్తాపత్రిల్లో రోజూవారీ ప్రకటనలు ఇవ్వడం, క్లయింట్లను ఆకర్షించడం కోసం వేడుకలకు స్పాన్సర్ చేయడం లాంటి చేస్తుంటారు.

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL
భారతీయులు సాధారణంగా చిన్నవయస్సులోనే చనిపోతే ఎదురయ్యే పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి, పన్ను రాయితీలు పొందడానికి, సంస్థ లాభాల ద్వారా లబ్ధి పొందేందుకు జీవిత బీమాలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకు డిపాజిట్లు, చిన్న తరహా పొదుపు పథకాలు తదితరాల నుంచి ఎల్‌ఐసీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
ఎల్ఐసీ, ఇప్పుడు డిజిటల్ ఉనికిని పెంచుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది. తద్వారా క్లయింట్లు ఆన్‌లైన్‌లో బీమా తీసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఈ డిజిటలైజేషన్ ద్వారా పారేఖ్ లాంటి ఏజెంట్ల పాత్ర తగ్గిపోనుందా? అంటే అలాంటిదేమీ ఉండదు అంటున్నారు లైఫ్ ఇన్సూరెస్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సింగారపు శ్రీనివాస్.
''జీవిత బీమాను విక్రయించాలంటే క్లయింట్‌తో ముఖాముఖి చర్చించాల్సి ఉంటుంది. క్లయింట్లు చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. వారితో మాట్లాడాంటే ఏజెంట్లు తప్పకుండా ఉండాల్సిందే'' అని ఆయన అన్నారు.
ఎల్ఐసీ ఆధునీకరణ చర్యలను పారేఖ్ స్వాగతించారు. ''వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. మేం మరింత పని చేయాల్సి ఉంటుంది'' అని వ్యాఖ్యానించారు.
ఏజెంట్లు చాలా పని చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు పారేఖ్, ఆయన ఉద్యోగులకు చనిపోయిన కుటుంబాలను ట్రాక్ చేయాల్సిన పనిలేని సమయంలో... ఇతర క్లయింట్ల సంబరాల్లో భాగం అవుతుంటారు. మరణాలకు సంబంధించిన నోటీసులను ట్రాక్ చేసిన తర్వాత పారేఖ్... వాట్సాప్‌లో అనేక మంది క్లయింట్లకు మెసేజీలు చేస్తుంటారు. ''నేను ప్రతీరోజు చాలామందికి పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు పంపించాల్సి ఉంటుంది'' అని ఆయన చెప్పారు.
మేమిద్దరం కలిసిన రోజున ఆయన తన ఈవెంట్ల జాబితా, క్లయింట్ల వేడుకలు, అడ్రస్‌లకు సంబంధించిన జాబితాను తన ఫోన్‌లో చూపించారు. అదే రోజు తన క్లయింట్లలో 60 మంది పుట్టినరోజు, 20 మంది పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ''వీరందరికీ నేను శుభాకాంక్షలు చెప్పాలి. కొందరికి బహుమతులు కూడా పంపాలి'' అని ఆయన నాతో చెప్పారు.
దాదాపు 40,000 పాలసీలదారులకు ఆయన పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. వారి జీవితంలోని ముఖ్యమైన మలుపులను గుర్తు చేస్తూ స్పందిస్తుంటారు. ఇంతమందితో సత్సంబంధాలు ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్నకు భరత్ నవ్వుతూ ఇలా బదులిచ్చారు:
'అది ఒక రహస్యం.'
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: 111 జీవో రద్దు ఎవరి కోసం... ఫామ్‌హౌస్‌ల స్థానంలో ఆకాశహర్మ్యాలు వస్తాయా?
- శ్రీలంక: సమైక్య నిరసనల వెనుక ఎందుకీ విభజన రేఖలు?
- టీవీ9 వర్సెస్ విష్వక్సేన్: సహనం కోల్పోయింది ఎవరు
- యాదగిరిగుట్టలో కుంగిన రోడ్డు, పాతబస్తీ వీధుల్లో పడవలు - భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులు
- ‘సిగ్గులేకుండా మా అమ్మ పాటను కాపీ చేశారు’ అంటున్న పాకిస్తాన్ గాయని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











