మే డే: అడ్డా కూలీ జీవితంలో ఒక రోజు - బీబీసీ ప్రత్యేక కథనం

కూలీలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

నగరాల్లో, పట్టణాల్లో పని కోసం ఉదయాన్నే క్యారేజీలు పట్టుకుని అడ్డాలకు చేరుకునే వారు కనిపిస్తుంటారు.

అలా అడ్డాలకు చేరుకునే అందరికి పని దొరకదు. దొరికితే పనికి, లేదంటే మళ్లీ ఇంటికి.

ఏ రోజూ మరుసటి రోజుకి గ్యారంటీ ఉండదు. ప్రతిరోజూ రేపటి కోసం చింతే.

ఏ రోజుకారోజు అనిశ్చితే. ఇదే అడ్డాకూలీల జీవితం.

అడ్డా, బజార్, సెంటర్..

అడ్డా కూలీగా పని చేస్తున్న అప్పయ్యమ్మది శ్రీకాకుళం జిల్లా. 20 ఏళ్ల కిందట జీవనోపాధి కోసం భర్తతో కలిసి విశాఖ వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వీరి కుటుంబంలోని నలుగురు నిర్మాణ రంగంలో కూలీలుగానే పని చేస్తున్నా, రోజూ అందరికీ పని దొరకదు.

అసంఘటిత రంగంలో ఉన్న అనిశ్చితికి ఈ కుటుంబం ఒక ఉదాహరణ.

అప్పయ్యమ్మ, ఆమె కూతురు రాము ఇద్దరు కూలి కోసం రోజూ కృష్ణా కాలేజ్ అడ్డాకు వెళ్తుంటారు. ఈ అడ్డాలను బజారు, సెంటర్ అని కూడా అంటారు. ఇలా అడ్డాలకు చేరుకునే కూలీల మెదళ్లలో ఒకటే ఆలోచన తిరుగుతూ ఉంటుంది.

పని దొరుకుతుందా? దొరకదా?

అదే ఆలోచనతో కృష్ణా కాలేజ్ అడ్డాకు చేరుకున్నారు అప్పయ్యమ్మ, రాము. అప్పటికే అక్కడ కొందరు కూలీలు ఉన్నారు.

కూలీలు
ఫొటో క్యాప్షన్, కూలీలు

'ఏ రోజు ధైర్యంగా నిద్రపోలేదు'

కొందరు కాంట్రాక్టర్లు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, కూలీ రేట్లు, చేయాల్సిన పని వివరాలు చెబుతున్నారు. కుదిరిన వారు పనికి వెళ్తున్నారు. కుదరని వాళ్లు ఇంకా ఎదురు చూస్తున్నారు. అప్పయ్యమ్మ, రాములకు ఇంకా ఆ రోజు పని కుదరలేదు.

కొంత సేపటికి మరో కాంట్రాక్టరు వచ్చారు. అప్పయ్యమ్మతో పాటు మరో ఆరుగురితో ప్లాస్టరింగ్ పని చేయాలని మాట్లాడుకున్నారు. బేరం కుదరడంతో మద్దిలపాలెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్దకు తీసుకుని వెళ్లారు. ఆరోజుకు అప్పయ్యమ్మ, ఆమె కూతురు రాముకి పని దొరికింది.

"ఇవాళ్టికైతే పని దొరికింది. కానీ రేపటి పనికి గ్యారంటీ లేదు. పని దొరికితే మనిషికి రోజుకు ఐదొందలు ఇస్తారు. బిల్డింగు పనుల్లో బస్తాలు మోయడం, సున్నం కలపడం, గమేలాలు మేస్త్రీలకు అందించడం చేస్తుంటాను, నాతో పాటు నా కూతురు కూడా ఇదే పని చేస్తుంది".

"తాను అవసరమైనప్పుడు మా అందరికి టీ, నీళ్లు తెచ్చి ఇస్తుంటుంది. నెలకు 15 నుంచి 20 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. కుటుంబంలో అందరం కూలి పని చేస్తున్నా రోజు పని దొరకకపోవడంతో...ఏ రోజు ధైర్యంగా నిద్రపోలేకపోతున్నాం" అని అడ్డా కూలీల జీవితంలోని అనిశ్చితిని అప్పయ్యమ్మ బీబీసీకి వివరించారు.

వీడియో క్యాప్షన్, నెలకు 20 రోజులు పని దొరకదు, పని లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు

'పని దొరకాలనే ఆశ ఉంటుంది కదా...'

"నెలలో 10 రోజులైన పని దొరకదు. పని దొరికిన రోజు కూడా కాంట్రాక్టరు వచ్చి చేయాల్సిన పని చూపించి ప్రారంభించేవరకు కూడా అనుమానమే. రోజూ పని దొరకితే బాగుంటుందని అనిపిస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు నెలలో 30 రోజులు పని దొరకలేదు. నాకే కాదు మా అడ్డాలో ఎవరికి దొరకదు. ఒకే కాంట్రాక్టరు వద్ద పని చేసినా కూడా రోజూ పని ఉండదు".

"పని దొరకని రోజున.. పని దొరికుంటే ఆ డబ్బులతో బియ్యం, కారం, ఉప్పు, పప్పులు కొనుకుందును కదా అనిపిస్తుంది. పని లేని రోజున మాలాంటి వాళ్లమంతా కలిసి కష్టసుఖం మాట్లాడుకుని...తెచ్చిన క్యారేజీలను తీసుకుని తిరిగి ఇంటికెళ్లిపోతాం" అని చెబుతుండగా .. అప్పయ్యమ్మ కుమార్తె రాము నీళ్లు తెచ్చి ఇవ్వడంతో సిమెంట్ కలిపే పనిలో పడ్డారు.

వీడియో క్యాప్షన్, వీడియో: సోనూ సూద్ ఇంటర్వ్యూ - ‘నాకు ఒకరోజు అధికారం ఇస్తే..’

'కరెంట్, కేబుల్, అద్దెలు, రోగాలు...'

"ఐదేళ్ల క్రితం నేను, మా ఇంటాయన పని చేసేవాళ్లం. ఆ తర్వాత మా బాబు, పాప కూడా అప్పడప్పడు అవరసమైతే కూలీకి వచ్చేవారు. ఇప్పుడు అందరం చేస్తున్నాం".

"నేను విశాఖపట్నం వచ్చి 20 ఏళ్లైనా...అడ్డాకూలీగా గత ఐదేళ్లుగానే పని చేస్తున్నాను. అంతకు ముందు చిన్నచితకా పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంటిల్లిపాది పని చేస్తున్నా కూడా నిత్యం పని దొరక్కపోవడం, కరెంటు, కేబులూ, పాలు, ఇంటి రెట్లు, పండుగలు, ఆడపాదడపా వచ్చే రోగాలకే సంపాదించినదంతా అయిపోతుంది. పైసా కూడా దాచుకోకపోవడంతో పిల్లలిద్దరిని ఐదో తరగతి కంటే ఎక్కువ చదివించలేకపోయాను. ఒక్కమాటలో చెప్పాలంటే సంపాదిస్తున్నదంతా రెండుపూటల తింటూ ఇంటి అద్దెలు కట్టుకోడానికే సరిపోతుంది" అని చెప్పారు.

ఇంతలో వారికి మధ్యాహ్న భోజన సమయం అయింది.

కూలీలు

'ఏదైనా ఆశ ఉంటే...అది పిల్లల మీదే'

"జ్వరమో, జబ్బో వస్తే అప్పులు చేయడమే. అది కూడా ఇరుగుపొరుగు దగ్గర. పనికి పిలిచే కాంట్రాక్టర్లు అడ్డా కూలీలం కాబట్టి అడ్వాన్సులు ఇవ్వరు. ఏ రోజైనా పదోపరకో మిగిలితే అది పనిలేని రోజుకు సర్దుకుంటాం. అంతకు మించి దాచుకోవడం, బ్యాంకులో వేసుకోవడం వంటివి ఏమీ లేవు. ఇక గట్టిగా జబ్బు చేస్తే అప్పులు చేయడం, తీర్చలేకపోతే చావడం తప్ప మరో మార్గమే లేదు".

"ఈ పనిలో ఇలాగే జీవితం సాగిపోతుంది. మా జీవితాల మీద మాకేలాంటి ఆశలు లేవు. ఏదైనా ఆశ ఉంది అంటే అది పిల్లలపైనే. వాళ్లు ఈ పనిలోనే ఉన్నారు కాబట్టి...ఏదైనా ఆలోచన చేసి కూలి పని నుంచి మేస్త్రో, కాంట్రాక్టరో అవుతారని కలలు కంటాం" అని తన కుతూరు రాముకి అన్నం తినిపిస్తూ చెప్పారు.

కూలీలు

'ఆలోచన ఉంది...డబ్బు లేదు'

"అడ్డాకూలీగా ఐదేళ్ల క్రితం రూ. 150 రూపాయలతో మొదలు పెట్టాను. ఇప్పుడు నాకు రోజుకు రూ. 500 ఇస్తున్నారు. మా పాపకు అంతే. పనుంటుందో లేదో తెలియక రోజు ఎదురుచూపులు చూసే ఈ అడ్డాకూలీ జీవితం కంటే ఏదైనా సొంతంగా చేసుకుందామని చాలా సార్లు అనుకున్నాను. మా ఊర్లోనో, ఇక్కడో ఏదైనా కిరాణా బడ్డీ పెట్టుకుందామని అనుకునేదాన్ని.

"చదువుకున్నోళ్లకే కాదు, చదువురానోళ్లకు కూడా ఎదగాలనే ఆలోచనలు ఉంటాయి. అలాంటివి చాలా ఆలోచనలు ఉన్నాయి. అయితే ఆలోచన ఒక్కటే సరిపోదు కదా...డబ్బు ఉండాలి. మన దగ్గర అది లేదు. అందుకే ఎన్ని ఆలోచనలు ఉన్నా డబ్బు లేని కారణంగా కూలి పని తప్ప సొంత ప్రయత్నం చేయలేకపోతున్నాం" అని అప్పయ్యమ్మ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.

ఆ రోజు సాయంత్రానికి ప్లాస్టరింగ్ పని ముగియడంతో.. అప్పటికే అక్కడికి వచ్చిన కాంట్రాక్టర్లు అడ్డా నుంచి తీసుకొచ్చిన మహిళలకు రూ. 500, పురుషులకు రూ. 700 చొప్పున్న కూలి డబ్బులను ఇచ్చారు. వాటిని

తీసుకున్న అప్పయ్యమ్మ, రాము ఇంటికి బయలుదేరారు.

ఇంటికి వెళుతూ వంటసరకులు కొనుక్కుంటామని , మళ్లీ రేపు కృష్ణా కాలేజ్ అడ్డాకూలీ సెంటరుకు వస్తామని చెప్పారు. అయితే రేపు పని దొరుకుతుందో దొరకదో మాత్రం చెప్పలేమని అన్నారు.

కూలీ

అసంఘటిత రంగ కార్మికుల కోసం 'ఈ-శ్రమ్ పోర్టల్'

మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయమెంట్ శాఖ నిర్వహించే e-Shram Portal (ఈ-శ్రమ్ పోర్టల్) అనేది కేంద్ర ప్రభుత్వం అసంఘంటిత రంగ కార్మికుల డేటాబేస్ నమోదు కోసం నిర్వహిస్తోంది.

అసంఘటిత రంగ కార్మికులంతా ఈ పోర్టల్ లో తమ పేరును నమోదు చేసుకోవచ్చు. వారికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారు.

Source: Ministry of Labour & Employment as of April 28, 2022

ఈ కార్డు ఉంటే కుటుంబంలోని అంసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తిస్తాయి.

అలాగే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైక్యలం పొందినా రూ. రెండు లక్షల బీమా, పాక్షిత వైకల్యమైతే రూ. లక్ష రూపాయల బీమా వర్తిస్తుంది.

కూలీ
ఫొటో క్యాప్షన్, కూలీ

'ఈ-శ్రమ్' లో ఎలా నమోదు కావాలి? అర్హులెవరు?

ఈ పోర్టర్ లో నమోదు అయ్యేవారి వయసు 16 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే వీరు అసంఘటితరంగం (వ్యవసాయ అనుబంధ ఉపాధి, భవన నిర్మాణం, నర్సరీలు, ఉద్యానాలు, సున్నపు బట్టీలు, టైలరింగ్, చేనేత, బీడీ కుమ్మరి, క్షౌర వృత్తి, రిక్షా కార్మికులు, వీధి వ్యాపారులు, కల్లుగీత కార్మికులు, చిన్న, సన్నకారు రైతులు, కొరియర్ బాయిస్, పెయింటర్లు, డ్రైవర్లు తదితర కార్మికులు) లో పని చేస్తున్న కార్మికులై ఉండి, వీరు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ (ESIC), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులై ఉండకూడదు.

ఈ-శ్రమ్ పోర్టర్ లో నమోదు కోసం సమీప గ్రామ, వార్డు సచివాలయాలు, పోస్టాఫీసులు, కార్మిక కార్యాలయాల్లో లేదా స్వయంగా ఈ-శ్రమ్ పోర్టల్లో (www.eshram.gov.in) నమోదు చేసుకోవచ్చు.

కూలీలు
ఫొటో క్యాప్షన్, కూలీలు

మనదేశంలో ఉత్తరప్రదేశ్ (8,27,68,552 ), బిహార్ ( 2,81,65,072) పశ్చిమబెంగాల్ (2,54,64,389) రాష్ట్రాల్లో అత్యధికంగా అసంఘటిత రంగ కార్మికులున్నారు.

అలాగే దేశంలో అత్యధికంగా అసంఘటితరంగ కార్మికులు వ్యవసాయ (14,20,11,500), ఇంటి పని (2,74,25,764), నిర్మాణ (2,51,57,621) రంగాల్లో ఉన్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: స్వంత రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు మళ్లీ వస్తున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)