తెలంగాణ ఉద్యోగాల నోటిఫికేషన్లు: ప్రిపేర్ అవుదామంటే పుస్తకాలు ఎందుకు దొరకడం లేదు?

తెలంగాణ ఉద్యోగాల నోటిఫికేషన్లు
    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొలువుల సందడి మొదలైన తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు దొరకడం కష్టంగా మారుతోంది.

ఈ ఏడాది మార్చిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్, 91,142 పోస్టులు భర్తీ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీచర్, గ్రూప్-1, గ్రూప్-2, ఎస్సై, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కానీ పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ మాత్రం మార్కెట్‌లో పెద్దగా దొరకడం లేదు.

హైదారాబాద్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు

ఫొటో సోర్స్, Getty Images

స్టడీ మెటీరియల్‌ ఎందుకు దొరకడం లేదు?

ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వారికి తెలుగు అకాడమీ పబ్లిష్ చేసే బుక్స్ ఎంతో కీలకం. హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకానమీ, భారత రాజ్యాంగం వంటి పుస్తకాల కోసం అభ్యర్థులు ఎక్కువగా తెలుగు అకాడమీని ఆశ్రయిస్తుంటారు. కానీ డిమాండ్‌కు తగినట్లుగా మార్కెట్‌లో స్టాక్ ఉండటం లేదు. అలాగే ప్రైవేట్ పబ్లిషర్స్ ప్రింట్ చేసే బుక్స్‌కు కూడా కొరత ఏర్పడుతోంది.

తెలంగాణలో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలకు కొరత ఉన్న మాట వాస్తవమేనని నవతెలంగాణ బుక్‌హౌస్ కరీనంగర్ బ్రాంచ్ మేనేజర్ పి.సతీశ్ తెలిపారు. 'మార్కెట్‌లో పోటీ పరీక్షలకు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాల కొరత బాగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు వస్తున్నాయి. దాంతో పుస్తకాల కోసం మా వద్దకు వచ్చే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. గ్రూప్స్‌కు సంబంధించి హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ వంటి పుస్తకాలను ఎక్కువగా అడుగుతుంటారు. కానీ మా దగ్గర తగినంత స్టాక్ లేదు.' అని సతీశ్ బీబీసీకి తెలిపారు.

పుస్తకాల కొరత అనేది విద్యార్థులు, ఎంట్రెన్స్ టెస్టులు రాసే వాళ్ల మీద కూడా ప్రభావం చూపుతోంది.

హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లు

పుస్తకాల కొరతకు కారణమేంటి?

తెలంగాణలో స్టడీ మెటీరియల్ దొరక్కపోవడానికి ప్రధాన కారణం భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రకటించడం. ఉద్యోగాల ప్రకటన వల్ల స్టడీ మెటీరియల్‌కు డిమాండ్ పెరిగింది. గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల కోచింగ్ సెంటర్లు ఎక్కువగా మూసే ఉండటం, నోటిఫికేషన్లు లేకపోవడంతో పుస్తకాలు పెద్దగా ప్రింట్ చేయలేదు. ఇప్పుడు డిమాండ్ పెరిగింది కదా అని పుస్తకాలు ప్రింట్ చేద్దామంటే పేపర్ దొరకడం లేదు. తెలుగు అకాడమీకి ఇప్పుడు ఇదే సమస్య.

'ఉద్యోగాల భర్తీ ప్రకటన రావడంతో ఒక్కసారిగా పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. కానీ పుస్తకాలను ప్రింట్ చేయడానికి మా వద్ద పేపర్ లేదు. మార్కెట్లో పేపర్‌కు కొరత ఉంది. అలాగే టెండర్లు ఖరారు చేయడంలోనూ ఆలస్యం అయింది.

పంజాబ్ నుంచి మాకు ఒక వారంలో పేపర్ వస్తుంది. పేపర్ వచ్చిన తరువాత పుస్తకాల ప్రింటింగ్ మొదలవుతుంది. మరొక రెండు వారాల్లో పుస్తకాలు మార్కెట్‌లోకి వస్తాయి.' అని తెలుగు అకాడమీకి చెందిన ఒక ఉద్యోగి తెలిపారు. పేరు వెల్లడించడానికి ఆ ఉద్యోగి ఇష్టపడలేదు.

తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు

పుస్తకాల ధరలు పెరగనున్నాయ్!

మార్కెట్‌లో సరఫరా తగినంతగా లేకపోవడం వల్ల పేపర్ ధరలు భారీగా పెరిగాయి. ఇది తెలుగు అకాడమీకి భారంగా మారుతోంది. కాబట్టి పెరిగిన ప్రింటింగ్ ఖర్చుకు అనుగుణంగా పుస్తకాల ధరలు పెంచాలని యోచిస్తోంది.

'మార్కెట్‌లో పేపర్ దొరకడం లేదు. ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 100 టన్నుల పేపర్ దొరకాలంటే 20 రోజులు పడుతోంది. ఇప్పుడు తెలుగు అకాడమీ 1,300 టన్నుల పేపర్ కొనుగోలు చేస్తోంది. కానీ ఇది మాకు సరిపోదు. మళ్లీ టెండర్లు పిలిచి పేపర్ కొనాల్సి ఉంటుంది.

పేపర్ ధర దాదాపు 35శాతం వరకు పెరిగింది. ఇంతకు ముందు ఒక్కో పేజీని 35 పైసలకు అమ్మే వాళ్లం. కానీ ఇప్పుడు ఈ రేటు గిట్టుబాటు కాదు. కాబట్టి మరొక 15 పైసల వరకు పెంచొచ్చు. ఎంత పెంచాలనేది కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.' అని పేరు చెప్పడానికి ఇష్టపడని తెలుగు అకాడమీ ఉద్యోగి వెల్లడించారు.

ప్రస్తుతం తెలుగు అకాడమీ కిలో పేపర్‌కు సుమారు రూ.89 చెల్లిస్తోంది. ఈ లెక్కన చూస్తే ఒక టన్ను ధర రూ.89,000 పడుతోంది. మొత్తం 1,300 టన్నులకు సుమారు రూ.11.57 కోట్లు అవుతోంది. కొద్ది నెలల కిందట కిలో టన్ను పేపర్ ధర రూ.60,000-65,000 మధ్య ఉండేది.

స్కూలు, కాలేజీ విద్యార్థులు ఉపయోగించే రైటింగ్ పేపర్ ధర కూడా పెరుగుతోంది. కొన్ని కంపెనీలు కిలో రైటింగ్ పేపర్ ఖరీదు రూ.100 వరకు పెంచుతున్నట్లు ఈ ఏడాది మార్చిలో బిజినెస్ లైన్ రిపోర్ట్ చేసింది. ఇంతకు ముందు పేపర్ ధర కిలో రూ.50-55 ఉండేది.

తెలుగు అకాడమీ భవనం

పేపర్ ఎందుకు దొరకడం లేదు?

భారతదేశంలో పేపర్ కొరత తీవ్రంగా ఉందని పబ్లిషర్లు, ట్రేడర్లు చెబుతున్నారు. యుక్రెయిన్-రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే పేపర్ కొరతకు అసలు మూలాలు కరోనా సంక్షోభంలో ఉన్నాయి.

కరోనా సంక్షోభం వల్ల గత కొంత కాలంగా యాక్టివిటీస్ తగ్గిపోవడంతో అందుకు తగినట్లుగానే పేపర్‌కు డిమాండ్ పడిపోయింది. దీంతో అంతర్జాతీయంగా ప్రొడక్షన్ తగ్గింది. ఇప్పుడు మళ్లీ యాక్టివిటీలు పెరుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు తెరచుకుంటున్నాయి. కోచింగ్ సెంటర్లు పని చేయడం ప్రారంభించాయి. ఆఫీసుల్లోనూ పేపర్ వాడకం మళ్లీ పెరుగుతోంది. అందువల్ల పేపర్‌కు బాగా డిమాండ్ పెరిగింది. ఇక న్యూస్ పేపర్ల సర్క్యులేషన్ పడిపోవడం కూడా దేశంలో పేపర్ కొరతకు మరొక కారణమని ట్రేడర్లు చెబుతున్నారు.

'దేశంలో సుమారు 70శాతం పేపర్‌ను వేస్ట్ నుంచే తయారు చేస్తారు. అంటే వాడేసిన న్యూస్ పేపర్లు వంటి వాటిని రీసైకిల్ చేసి, ప్రాసెస్ చేయడం ద్వారా వైట్ పేపర్ వస్తుంది. కానీ కరోనా సంక్షోభంతో యాక్టివిటీస్ తగ్గడం వల్ల పేపర్ వినియోగం తగ్గిపోయింది. అలాగే న్యూస్ పేపర్ల సర్క్యులేషన్ కూడా భారీగా పడిపోయింది. ఈనాడు పేపర్ వాళ్లు కరోనాకు ముందు నెలకు 1,400 టన్నుల వరకు పేపర్ వాడే వాళ్లు. కానీ ఇప్పుడు 600-700 టన్నులు మాత్రమే యూజ్ చేస్తున్నారు. అంటే మార్కెట్‌లో పేపర్ లభ్యత తగ్గుతోంది. దీంతో వైట్ పేపర్‌కు ముడి సరుకు అయిన ఫైబర్ అంటే వేస్ట్ పేపర్ తగినంతగా లభించడం లేదు.' అని హైదరాబాద్‌కు చెందిన పేపర్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ గరీమా ట్రేడర్స్ యజమాని బీఆర్ రావు వివరించారు.

పేపర్ వేస్ట్ ఎగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

చెట్ల నుంచి ఎక్కువ పేపర్ తయారు చేయలేమా?

ప్రస్తుతం భారత్ చట్టాల ప్రకారం చెట్ల ద్వారా 10-15శాతం పేపర్ మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది. అంటే 100 టన్నుల పేపర్ తయారు చేయాలంటే రీసైకిల్ ద్వారా 70 టన్నులు, చెట్లను నరకడం ద్వారా 10-15 టన్నులు, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి 15-20 టన్నులు తయారు చేయాల్సి ఉంటుంది. 1965 నుంచి చెట్లు నరికి పేపర్ తయారు చేసేందుకు కొత్తగా మిల్లులకు అనుమతి ఇవ్వలేదని బీఆర్ రావు తెలిపారు. కాబట్టి కొత్త పేపర్ తయారు చేయాలంటే పేపర్ వేస్ట్, విదేశీ దిగుమతుల మీదనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.

కానీ కరోనా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, యుక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరగడంతో పేపర్ దిగుమతులు కూడా భారంగా మారాయి. అధిక ముడి చమురు ధరల వల్ల రవాణా చార్జీలు పెరుగుతున్నాయి. యురోపియన్ యూనియన్ నుంచి పేపర్ వేస్ట్‌ను భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. 2020లో 1.6 మిలియన్ టన్నుల పేపర్ వేస్ట్‌ను ఈయూ నుంచి భారత్ దిగుమతి చేసుకుంది.

కానీ కొన్ని కారణాల వల్ల గత ఏడాది నవంబరులో పేపర్ వేస్ట్‌ను భారత్‌కు ఎగుమతి చేయడాన్ని ఈయూ నిషేధించింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను సుమారు 100 డాలర్లుగా ఉన్న పేపర్ వేస్ట్ 400 డాలర్లకుపైగా పెరిగింది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చు టన్నుకు 1,800 డాలర్ల నుంచి 3,200 డాలర్లకు పెరిగినట్లు బిజినెస్ లైన్ రిపోర్ట్ చేసింది. ఈ కారణాలతో దేశంలో పేపర్ కొరతతోపాటు రేట్లు కూడా భారీగా పెరిగాయి.

మరొక వైపు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగా పేపర్ తయారీని పెంచేందుకు దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇవ్వడం లేదనే వాదన కూడా ఉంది. దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్ మీద డ్యూటీ తగ్గించాలంటూ బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

పేపర్ రీల్స్

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్ యుద్ధంతో న్యూస్ ప్రింట్ కొరత

భారత్‌కు ఎక్కువగా రష్యా నుంచి న్యూస్ ప్రింట్ వస్తుంది. ఇండియన్ న్యూస్‌ ప్రింట్ మ్యానుఫాక్చర్స్ అసోసియేషన్ ప్రకారం దేశంలోకి దిగుమతి అయ్యే న్యూస్ ప్రింట్‌లో సుమారు 45శాతం వాటా రష్యాదే.

యుక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి దిగిన నేపథ్యంలో ఆ దేశం మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడం వల్ల భారత్‌కు న్యూస్ ప్రింట్ రావడం కష్టతరంగా మారింది. దాంతో దేశీయంగా న్యూస్ ప్రింట్‌కు డిమాండ్ పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు మిల్లర్లు వైట్ పేపర్‌కు బదులు న్యూస్ ప్రింట్ తయారు చేయడం మొదలు పెడుతున్నారు. దీని వల్ల కూడా పుస్తకాల ప్రచురణకు పేపర్ దొరకడం లేదు.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు

రానున్న రోజుల్లో ధరలు తగ్గొచ్చు

గత ఏడాది నవంబరులో పేపర్ వేస్ట్ ఎగుమతులను నిషేధించిన ఈయూ, అది పొరపాటున తీసుకున్న నిర్ణయమంటూ ఆ తరువాత నిషేధాన్ని ఎత్తి వేసింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి భారత్‌కు మళ్లీ దిగుమతులు మొదలయ్యాయి. యూరప్ దేశాల నుంచి బయలుదేరిన కంటైనర్లు భారత్‌కు చేరుకోవడానికి 30-45 రోజులు పడుతుంది. ఈయూ నిషేధం ఎత్తి వేయడంతో అంతర్జాతీయంగా ధరలు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా భారత్‌లోనూ ధరలు తగ్గొచ్చు.

వీడియో క్యాప్షన్, ఇప్పుడు ఈ ఉద్యోగాలకే ఎక్కువ డిమాండ్, ఫ్రీగా శిక్షణ ఇస్తున్న మైక్రోసాఫ్ట్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)