సెక్స్‌కు ఒప్పుకుంటేనే అక్కడ నీళ్లు ఇస్తారు... లేదంటే అత్యాచారానికి తెగిస్తారు

నీటి సమస్య

హెచ్చరిక: ఇందులోని అంశాలు మిమ్మల్ని కలచి వేయవచ్చు.

''రాత్రి పూట ఇక్కడ నీళ్లు అమ్మడానికి వచ్చేవారంతా మగవారే. వాళ్ల కోరిక తీర్చకపోతే మీకు నీళ్లు పుట్టవు''- ఇది కెన్యా రాజధాని నైరోబీలోని కిబెరా అనే కాలనీలో నివసిస్తున్న ఓ మహిళ చెప్పిన మాట. కిబెరా ఇక్కడ ఒక అనధికారిక కాలనీ.

నైరోబి ప్రస్తుతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు, పాతబడిన, చెడిపోయిన నీటి సరఫరా వ్యవస్థలు నీటి కొరతకు కారణాలలో కొన్ని.

కిబేరా లాంటి మురికివాడల్లో నీళ్లు కొనుక్కోవాల్సిందే. అంటే ఇప్పుడు ఇక్కడి ప్రజల జీవితాలను నీటి సరఫరా చేసే వ్యాపారులు శాసిస్తుంటారు.

ఇక్కడ నీళ్లు కావాలంటే డబ్బు కావాలి. అదే మహిళలైతే అంతకంటే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాలి.

నీటి కోసం వచ్చే మహిళలపై వ్యాపారులు అకృత్యాలకు పాల్పడుతున్నారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, నీటి కోసం వచ్చే మహిళలపై వ్యాపారులు అకృత్యాలకు పాల్పడుతున్నారు

నీళ్ల కోసం లైంగిక వేధింపులు

ఇక్కడ నివసించే మేరీ రోజుకు ఎనిమిది క్యాన్ల నీళ్లు ఇంటికి తెచ్చుకుంటుంది. నీళ్ల కోసం ఆమె నెలకు రూ.1300 ఖర్చు చేస్తున్నారు. వారి నెలవారీ ఆదాయంలో కేవలం 25 శాతం నీటికే ఖర్చు చేస్తున్నారు.

ఇక్కడ నివసించే వారిలో చాలామంది నిరుపేదలు. వారి కష్టార్జితంలో ఎక్కువభాగం నీటి కోసం ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

నీళ్లు కొనుక్కోడానికి వెళ్లిన మేరీపై కొందరు వ్యాపారులు అత్యాచారం చేశారు.

"అది రాత్రి సమయం. అక్కడ ఇద్దరు వ్యక్తులు నీళ్లు అమ్ముతున్నారు. వారు నా మీద చెయ్యి వేశారు. నా దుస్తులు చించేశారు. నేను అరుస్తూ ఇతర మహిళలను పిలిచేలోగానే వారు నాపై అత్యాచారం చేశారు'' అని మేరీ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఫెమిసైడ్: మహిళల్ని కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్లే చంపేస్తున్నారు, ఎందుకు?

అలాంటి నేరస్తులను పట్టుకోవడం కష్టమని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే చాలామంది మహిళలు తమపై జరిగిన అకృత్యాలను పోలీసులకు ఫిర్యాదు చేయరు.

"ఎవరో చెప్పగానే పోలీసులు కేసులు పెట్టలేరు. వారు ఇలాంటి వాటిపై విచారణ జరపాలంటే బాధితులు ఫిర్యాదు చేయాలి'' అని కెన్యా పోలీసు శాఖ ప్రతినిధి బ్రూనో షిసో బీబీసీతో అన్నారు.

కిబేరాలో పబ్లిక్ కుళాయిలు ఉన్నా అవి ఇక్కడి ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. నైరోబీ నగరం 2005 నుంచి నీటి కొరతను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ వ్యవస్థ సరిపోకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు నీటి వ్యాపారంలోకి దిగారు. కిబేరా వంటి ప్రదేశాలలో వాళ్లే నీటిని సరఫరా చేస్తుంటారు.

నైరోబీలో కిబెరా ఒక మురికివాడ. ఇక్కడ నీటి కొరత ఎక్కువ
ఫొటో క్యాప్షన్, నైరోబీలో కిబెరా ఒక మురికివాడ. ఇక్కడ నీటి కొరత ఎక్కువ

‘‘నీటి కోసం నా శరీరాన్ని ఇవ్వాలి’’

కొంతమంది మహిళలు నీటి కోసం అధిక ధర చెల్లించాల్సి వస్తుంది.

ఇక్కడ నివసించే జేన్ అనే తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు. "నేను నీటిని అప్పుగా తీసుకునేదానిని. ఆ అప్పు పెరిగింది. ఓ సారి వ్యాపారి ఈ అప్పు ఎలా తీరుస్తావని అడిగారు. కరోనా కారణంగా నా దగ్గర డబ్బు లేదని నేను అతనితో చెప్పాను'' అని జేన్ వెల్లడించారు.

''అప్పుడు ఆ నీళ్ల వ్యాపారి, నువ్వు డబ్బు ఇవ్వలేకపోతే నీ శరీరం ద్వారా దాన్ని తీర్చాలి అన్నాడు'' అని ఆమె వివరించారు.

ఉమాండే ట్రస్ట్ కిబెరాలో బాధితులైన ఈ మహిళలకు మానసిక సహాయాన్ని అందిస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న బెనజీర్ ఉమాడో మాట్లాడుతూ... ''ఇక్కడి మహిళలకు తరచూ మానసిక సమస్యలు వస్తుంటాయి'' అని వెల్లడించారు.

నైరోబీలో కొన్నేళ్లుగా నీటి కొరత ఉంది. దాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు
ఫొటో క్యాప్షన్, నైరోబీలో కొన్నేళ్లుగా నీటి కొరత ఉంది. దాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు

ఇక్కడి నివాసితుల్లో కొందరు ఇప్పుడు 'ఎండ్ సెక్స్ ఫర్ వాటర్' అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా వారు, నీళ్లను అమ్మడానికి ఏర్పాటు చేసే సిబ్బందిలో ఎక్కువమంది మహిళలు ఉండేలా చూడాలని నీటి సరఫరా కంపెనీలను డిమాండ్ చేశారు.

''నా ఈ మధ్య ఇక్కడ ఓ మహిళ నీళ్లు అమ్ముతూ కనిపించారు. నేను చాలా సంతోషించాను'' అని ఓ మహిళ బీబీసీతో అన్నారు. ఇంతకు ముందు ఇక్కడ అందరూ పురుషులే ఉండేవారని ఆమె చెప్పారు.

కొన్ని స్వచ్ఛంద సంస్థలు నీటి పై జాతీయ విధానంలో మార్పు కోసం ఒత్తిడి చేస్తున్నాయి. పేద, అణగారిన స్త్రీలు నీటి కోసం దోపిడీకి గురి కాకూడదనేది ఈ ప్రయత్నాలలోని ప్రధాన లక్ష్యం. స్త్రీలను దోపిడి చేసే వారెవరైనా నీటిని అమ్మరాదని వారు వాదిస్తున్నారు.

"మహిళలకు భద్రత, గౌరవం, అలాగే నీటిని పొందే హక్కును కల్పించే బిల్లును మేము పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నాము" అని ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న విన్సెంట్ ఉమా చెప్పారు.

మేరీ వంటి అనేక మంది బాధిత మహిళలు ఈ కొత్త విధానాల కోసం ఎదురుచూస్తున్నారు.

వీడియో క్యాప్షన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నది నిరసనలు తెలపాల్సిన రోజా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)