విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌లీక్‌కు రెండేళ్లు.. బాధితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
"మా అమ్మ చనిపోయింది, గ్యాస్ లీకైనప్పుడు మా అమ్మ చనిపోయింది... అని నేను ఎదురుగానే ఉన్నా మా ఐదేళ్ల బాబు ఇప్పటికీ అందరికి అదే మాట చెప్తాడు"
విశాఖపట్టణానికి చెందిన షేక్ హాసినా కన్నీళ్లతో చెప్పిన మాటలివి.
పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం తర్వాత తన కుమారుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని హాసినా బీబీసీతో అన్నారు.
"ప్రమాదం తర్వాత మా శరీరాలపై చిన్నవో, పెద్దవో కణుతులు, మచ్చలు ఏర్పడుతున్నాయి. అవి ఎందుకు ఏర్పడ్డాయో చెప్పే వైద్యుడే లేడు. స్టైరీన్ గ్యాస్ ప్రభావానికి ఎటువంటి వైద్యం అందించాలో ఎవరికి తెలియడం లేదు. ఇప్పటికీ ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటోంది'' అని ఒంటి మీద కణుతులతో బాధపడుతున్న సత్యరావు, కమలాకర్ బీబీసీతో చెప్పారు.
ఇలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం బాధిత గ్రామాల్లో అన్ని సదుపాయాలు, వైద్య సేవలు అందుబాటులో ఉండే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అయితే ఆ హామీ ఏమైంది? ప్రమాదం జరిగినప్పటి నుంచి (రెండేళ్లుగా) ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బాధితుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?

'ఎంపీపీ స్కూల్, హెల్త్ క్లినిక్ అయ్యింది'
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంలో 14 మంది మరణించగా, 324 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలయ్యారు. వీరిలో చాలామంది ఇంకా చికిత్స పొందుతుండగా, కొత్తగా మరికొందరికి కొత్తగా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి.
ప్రమాదం జరిగిన తర్వాత 2020, జూలై 7 తేదీన వెంకటాపురంలో ఉన్న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశారు.
దీనిని అప్పుడు విశాఖ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన బాధిత గ్రామ ప్రజలతో మాట్లాడారు.
"ప్రస్తుతానికి ఈ పాఠశాలలో అత్యవసరంగా హెల్త్ క్లినిక్ ప్రారంభించాం. త్వరలో స్థలం చూసి పెద్ద ఆసుపత్రిని పక్కగా, శాశ్వతంగా నిర్మిస్తాం. బాధితుల ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించే అన్నీ వైద్య సౌకర్యాలు ఆ ఆసుపత్రిలో ఉంటాయి. అలాగే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ కూడా బాధితులకు అవసరమైన డాక్టర్లు, మందులు, వసతుల విషయంలో రాజీపడొద్దని చెప్పారు" అని రాష్ట్ర మంత్రి హోదాలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు.

'పాఠశాలలోని క్లినిక్ కనిపించలేదు’
ప్రమాదం జరిగిన ఏడాది కాలంలో బాధిత గ్రామాల్లో బీబీసీ రెండుసార్లు పర్యటించింది. బాధితుల సమస్యలపై కథనాలు అందించింది.
స్టైరీన్ గ్యాస్ పీల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం హమీ ఇచ్చినట్టు ఆసుపత్రి అత్యవసరంగా నిర్మించాలని వారు అప్పుడు కోరారు.
ఇప్పుడు మరోసారి బాధిత గ్రామాల్లో బీబీసీ పర్యటించింది. ప్రమాదం జరిగాక 2020, జూలై నెలలో ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ ఇప్పుడు కనిపించలేదు.
"ఎంపీపీ పాఠశాలలోనే అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ హెల్త్ క్లినిక్ ఓపెన్ చేశారండీ. ఇది తాత్కాలికమేనని, రాబోయే ఆర్నెళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టి, బాధితులందరికి అక్కడే వైద్యం అందిస్తామన్నారు. అక్కడైతే 24 గంటలు మీకు ఆరోగ్య సదుపాయం ఉంటుందని చెప్పారు.
అయితే పాఠశాలలో ప్రారంభించిన క్లినిక్‌ను కేవలం 8 నెలలు నిర్వహించారు. తర్వాత దానిని తీసేశారు. కరోనా తర్వాత స్కూల్స్ ప్రారంభం కావడంతో ఇక్కడ నుంచి తీసేసి మరోచోట పెడతారనుకున్నాం. కానీ ఎక్కడ పెట్టలేదు. కనీసం ప్రాధమిక వైద్యం, వైద్య సలహా ఇచ్చేవారైన ఉండేవారు. ఇప్పుడు ఏదీ లేదు" అని వెంకటాపురం నివాసి రవి బీబీసీతో చెప్పారు.

‘మేం వైద్యం ఎక్కడ చేయించుకోవాలి?’
గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌తో పాటు...ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్, ఇతర మంత్రులు చాలామందే చెప్పారని, ఇప్పటికీ రెండేళ్లు అవుతున్నా ఆసుపత్రి నిర్మాణం జరగలేదని గ్యాస్ లీక్ బాధితుడైన కమలాకర్ చెప్పారు.
"ఒక డాక్టరు, ఒక ఏఎన్ఎంతో కంటితుడుపు చర్యగా రెండేళ్ల క్రితం పెట్టిన హెల్త్ క్లినిక్ ఇప్పుడు లేదు. ప్రమాదం జరిగిన రోజున స్టైరీన్ ట్యాంకుల వద్ద 172 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని హైపవర్ కమిటీ రిపోర్టులో పేర్కొంది. ఆ ఉష్ణోగ్రత వద్ద స్టైరీన్ వాయువు రూపంలో మా గ్రామాల్లోని 3 కిలోమీటర్ల పరిధిలో వ్యాప్తి చెంది తీవ్ర ప్రభావం చూపింది. మా శరీరాల్లో ఎంత శాతం స్టైరీన్ ఉంది? దాని ప్రభావం ఎలా ఉంటుంది? అని చెప్పే వైద్యులు మాకు అందుబాటులో లేదు. మా ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించే ఆసుపత్రి అత్యవసరంగా నిర్మించాలి" అని కమలాకర్ డిమాండ్ చేశారు.

'బాధితుడి పేరు కూడా లేని ఆరోగ్య కార్డులు ఇచ్చారు'
గ్యాస్ లీక్ బాధితుల శరీరంపై కణుతులు, చర్మంపై మచ్చలు ఏర్పడుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే కొందరికి, ఆ తర్వాత క్రమంగా మరికొందరికి ఈ సమస్యలు వచ్చాయి.
అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని కూడా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ఆరోగ్య పర్యవేక్షణ కార్డులు ఇచ్చింది. కనీసం వాటిపై బాధితులు పేర్లుగానీ, అధికారుల సంతకాలుగానీ లేవు.
"మాకు అంతకు ముందు లేని వ్యాధులు ఇప్పుడు ఎందుకు వచ్చాయో, చెప్పే వైద్యులు లేక ఆందోళన చెందుతున్నాం. వైఎస్సార్ ఆరోగ్య పర్యవేక్షణ కార్డులంటూ తెల్లకాగితాల పుస్తకాలు ఇచ్చారు. అవి ఎందుకు ఇచ్చారో, వాటిని ఏం చేసుకోవాలో తెలియడం లేదు. ప్రమాదం జరిగిన నెల తర్వాత నుంచి క్రమంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మా గ్రామాల వైపు రావడంగానీ, పట్టించుకోవడం కానీ మానేశారు. ప్రమాదం జరిగిన వెంటనే మాకున్న కోపాన్ని తగ్గించేందుకే హామీలు ఇచ్చి మోసం చేశారని ఇప్పుడు అనిపిస్తోంది" అని ఎటువంటి వివరాలు లేని హెల్త్ కార్డులను చూపిస్తూ మరో బాధితుడు సత్యారావు బీబీసీతో చెప్పారు.

'నేను ఎదురుగా ఉన్నా, మా అమ్మ చనిపోయిందని మా బాబు అంటాడు'
ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదం కొందరు పిల్లల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపింది. దాని నుంచి కొందరు పిల్లలు ఇంకా కోలుకోలేదు. గ్యాస్ లీక్ ప్రమాదంలో షేక్ హసీనా, ఆమె భర్త, మూడేళ్ల కుమారుడు అస్వస్థతకు గురైయ్యారు.
''నేను కుప్పకూలిపడిపోయిన దృశ్యం చూసిన మా బాబు ఇప్పటికీ నేను చనిపోయాననే అంటుంటాడు'' అని షేక్ హసీనా చెప్పారు.
"బాబు ఇప్పటికీ అందరికి మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయిందనే చెప్తాడు. నేను ఎదురుగానే ఉన్నా కూడా అలా చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. వీడికి ఏమైందోననే ఆందోళనగా ఉంటుంది. వైద్యం కావాలంటే మా సొంత డబ్బులతో చేయించుకుంటున్నాం. ఖర్చులు భరించలేకపోతున్నాం. ఆరు నెలల్లోనే సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి ఇస్తామని చెప్పారు. ఇప్పటి దాకా ఏదీ లేదు. వెంటనే ఆసుపత్రిని నిర్మించండి చాలు" అని షేక్ హసీనా బీబీసీతో అన్నారు.

'గ్రామాల్లో కాలుష్య పరీక్షలు జరగడం లేదు'
ప్రమాదం జరిగిన తరువాత నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారకాల స్థాయి తెలుసుకునేందుకు కాలుష్య నియంత్రణ మండలి తరుచూ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
కానీ ప్రస్తుతం అటువంటి పరీక్షలు జరుగుతున్నట్లు బాధిత గ్రామాల్లో ఎక్కడ కనిపించలేదు. దీనిపై విశాఖ నియంత్రణ మండలి అధికారులను బీబీసీ సంప్రదించగా, తాము స్పందించలేమని చెప్పారు.
"ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని రోజులు గాలి, నీరు పరీక్షలు చేస్తున్నామంటూ కొందరు గ్రామాల్లోకి వచ్చేవారు. ఆ తర్వాత వాళ్లు కనిపించ లేదు. ఇప్పుడు మా ఊరి గాల్లో స్టైరీన్ గ్యాస్ ఉందో లేదో, నీటిలో ఏ రసాయనాలు ఉన్నాయో మాకు తెలియదు. పరీక్షలు చేసేవారు లేరు. ప్రస్తుతం మా గ్రామాల్లో ఉండటం మా ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో కూడా తెలియడం లేదు" అని గ్యాస్ లీక్ బాధితుడు చంద్రశేఖర్ అన్నారు.

స్టైరీన్...దీర్ఘకాలంలో రోగాలకు కారణమవుతుంది: వైద్యులు
స్టైరిన్ సాధారణంగా 5 పీపీఎం (parts per Million) స్థాయి వరకు ప్రమాదకరం కాదు. కానీ ప్రమాదం జరిగిన రోజున 300 నుంచి 500 పీపీఎం వరకు విడుదలై ఉంటుందని ఆంధ్రా యూనివర్సీటీ మాజీ వీసీ, రసాయన శాస్త్ర ఆచార్యులు జి.నాగేశ్వరావు అన్నారు.
ఈ స్థాయిలో విడుదలైన స్టైరీన్ కొందరికి వెంటనే, మరి కొందరికి క్రమంగా ఆరోగ్య సమస్యలను తెస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.
"స్టైరీన్ శరీరంలో ఇతర రసాయన పదార్థాలతో చర్య పొంది విషపూరితమై అనేక అవయవాలపై ప్రభావం చూపుతుంది. స్టైరీన్ గ్యాస్ కొద్దిగా కొద్దిగా శరీరంలో చేరుతూ ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది.
స్టైరిన్ దీర్ఘకాలంలో మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీ, నరాలపై ప్రభావం చూపుతుంది. క్యాన్సర్‌కు కూడా కారణమవుతుంది. మహిళలకు రుతుక్రమం, గర్భస్థ సమస్యలను తీసుకొస్తుంది" అని ప్రముఖ వైద్యులు పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు బీబీసీకి వివరించారు.
హామీ ఇచ్చారు, ఆసుపత్రి అవసరం: టీడీపీ ఎమ్మెల్యే గణబాబు
ఎల్జీ పాలిమర్స్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. టీడీపీకి చెందిన గణబాబు ఈ విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అలాగే గణబాబు కూడా గ్యాస్ లీక్ బాధిత ప్రాంతానికి చెందిన వ్యక్తే.
"ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆసుపత్రిని నిర్మించాలి. అది ప్రస్తుతం బాధిత గ్రామ ప్రజలకు చాలా అవసరం. అలాగే హైలెవల్ కమిటీ సూచించినట్లు అక్కడి నుంచి కంపెనీని తరలించాలి. ఎల్జీ పాలిమర్స్ జీవీఎంసీ పరిధిలో నగరంలోనే ఉంది. ఇలాంటి చోట ప్రమాదాలకి అవకాశముండే కంపెనీలు ఉండకూడదు" అని ఎమ్మెల్యే గణబాబు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆసుపత్రి స్టేటస్ తెలియదు: మంత్రి అమర్నాథ్
ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితులు చెప్పిన విషయాలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ దృష్టికి బీబీసీ తీసుకెళ్లింది.
"పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన జరిగిన వెంటనే బాధితులను ప్రభుత్వం ఆదుకుంది. ఇంకా ఏమైనా హామీలు ఉంటే వాటిని కూడా అమలు చేస్తుంది. అయితే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి స్టేటస్ ప్రస్తుతం నాకు తెలియదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక్కుని చెప్తాను. ఏదీ ఏమైనా, ఎల్జీ పాలిమర్స్ కంపెనీని వెంకటాపురం నుంచి తరలించడం మాత్రం కచ్చితంగా జరుగుతుంది." అని మంత్రి అమర్నాథ్ బీబీసీతో అన్నారు.

రెండేళ్లు గడిచిపోయింది...ఒక్క ఆసుపత్రి కట్టలేరా?
గత రెండేళ్లు కోవిడ్ పేరు చెప్పి అధికారులు, నాయకులు గ్రామాల్లోకి పెద్దగా రాలేదని, ఇప్పుడు కోవిడ్ తగ్గినా కూడా ఎవరు తమని పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు. ప్రమాదం జరిగి ఇప్పటికే రెండేళ్లు గడిచింది, అయినా మాకు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించలేదని చెప్పారు.
"రెండేళ్లు గడిచినా బాధితుల కోసం ఒక్క ఆసుపత్రి కట్టలేదా ప్రభుత్వం? బాధిత గ్రామాల్లోని ప్రజలకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే చిన్న సమస్యలే అనుకున్నవి కూడా క్రమంగా పెద్ద ఆరోగ్య సమస్యలై తీవ్రంగా బాధిస్తున్నాయి. అందుకే తొలి ప్రాధాన్యతగా ఆసుపత్రి కట్టించాలని కోరుతున్నాం" అని ఎల్జీ పాలిమర్స్ బాధితుల సంఘం ప్రతినిధి సీహెచ్ కిరణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడిని నడిరోడ్డుపై చంపిన యువతి అన్న
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- ‘శిథిలాల కింద చిక్కుకుపోయాను, నీళ్లు తాగి బతికాను.. నిశ్శబ్దంగా ఉంటే రాయితో గోడపై కొట్టేదాన్ని, ఎందుకంటే..’
- సింహం పెరట్లోకి ఎలా వచ్చింది... అసలు సంగతి తెలిసి అంతా ఆశ్చర్యపోయారు
- డెత్ రోడ్: భయంకరమైన ఈ మార్గంలో ప్రయాణం ఎలా ఉంటుందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












