Roshni Act: జమ్మూకశ్మీర్‌లో లక్షల ఎకరాల భూమి ఎలా ఆక్రమణకు గురైంది?

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Subhendu Sarkar/LightRocket via Getty Images

    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ కోసం, శ్రీనగర్ నుంచి

ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురి పేర్లతో కూడిన ఒక జాబితాను జమ్మూకశ్మీర్ డివిజినల్ కమిషనర్ ఆఫీస్ ఇటీవల విడుదల చేసింది. దీనిలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు, ఒక మాజీ మంత్రి కుటుంబ సభ్యుడు, విశ్రాంత ఐజీ, ఎస్‌ఎస్‌పీ పేర్లు కనిపిస్తున్నాయి.

మరోవైపు ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి అయిన తాజ్ మొహునిద్దీన్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసులు నమోదు చేసినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో భూ ఆక్రమణ కేసులు కొత్త వివాదాలకు తెరతీస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకులైన ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాల పేర్లూ ఆక్రమణదారుల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను వారిద్దరూ ఖండించారు.

జమ్మూ, శ్రీనగర్‌లలోని నేషనల్ కాన్ఫెరెన్స్ ప్రధాన కార్యాలయాల కోసం సేకరించిన భూమిని వివాదాస్పద రోషిణి చట్టం కిందే తీసుకున్నారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

రోషిణి చట్టంలో పేర్కొన్న దానికంటే ఎక్కువ భూమినే చాలా మంది స్వాధీనం చేసుకున్నట్లు కొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరి జాబితాను జమ్మూకశ్మీర్ పరిపాలనా విభాగం మంగళవారం విడుదల చేసింది.

ఫరూక్ అబ్దుల్లా

ఫొటో సోర్స్, European Photopress Agency

వివాదాస్పద రోషిణి చట్టంలో తన పాత్రపై ఫరూఖ్ అబ్దుల్లా బీబీసీతో మాట్లాడారు. ‘‘వారికి ఓటమి అంటే భయం. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మమ్మల్ని లొంగదీసుకోవాలని చూస్తున్నారు. శ్రీనగర్‌లో, లేదా జమ్మూల్లో నా ఇళ్లేవీ రోషిణి చట్టం కిందకు రావు.. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.

వారంటే ఎవరు? అని ఆయన్ను బీబీసీ ప్రశ్నించింది. అయితే, ‘‘వారంటే ఎవరో మీకు తెలుసు.. మీకు తెలుసు..’’ అని ఆయన సమాధానం ఇచ్చారు.

రోషిణి చట్టం కింద లబ్ధి పొందిన వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో పీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన హసీబ్ దరాబూ, కాంగ్రెస్ రాష్ట్ర కోశాధికారి కేకే అమ్లా, ఆయన కుటుంబానికి చెందిన మరో ముగ్గురి పేర్లు జాబితాలో ఉన్నాయి.

నేషనల్ కాన్ఫెరెన్స్‌కు చెందిన సజ్జద్ కిచ్లూ, హరూన్ చౌధరితోపాటు మరో ఇద్దరి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తంగా దాదాపు 400 మంది పేర్లను కశ్మీర్ పరిపాలనా విభాగం విడుదల చేయడంతో.. దీనిలోని కొందరి పేర్లపై వివాదం చెలరేగింది.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ రోషిణి యాక్ట్?

2018లో ఈ రోషిణి చట్టాన్ని అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ నేతృత్వంలోని పరిపాలనా మండలి రద్దు చేసింది. ఆక్రమణదారులకు అధికారికంగా భూమిని అప్పగించేందుకు 2001లో ఈ రోషిణి చట్టంను తీసుకొచ్చారు. అప్పటి ఫరూఖ్ అబ్దుల్లా ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. ప్రభుత్వ భూములను ఆక్రమించినవారికే వాటిని విక్రయించింది. అంటే కొంత రుసుముపై భూమి హక్కులు కల్పించింది.

భూములపై వచ్చే నిధులను జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేయాలని భావించారు. తద్వారా రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభాన్ని అడ్డుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా 1990ల కంటే ముందే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారికి ఈ లబ్ధి చేకూర్చేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

రోషిణి చట్టం అమలు చేసినప్పుడు.. 20,64,972 కనాళ్ల స్థలాన్ని ప్రజలు ఆక్రమించినట్లు అప్పట్లో ప్రభుత్వం వెల్లడించింది. ఒక కనాల్ అంటే 505.85 చ.మీ.. అంటే దాదాపు రెండున్నర లక్షల ఎకరాలకు పైనే భూములు ఆక్రమణకు గురయ్యాయి.

రోషిణి చట్టాన్ని అమలు చేసిన తర్వాత.. కశ్మీర్‌ లోయలోని ఈ భూముల్లో చాలా మంది ఇళ్లు, షాపులు ఏర్పాటు చేసుకున్నారు.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

జమీన్ జిహాద్ పేరుతో..

ఫిబ్రవరి 2020 నాటికి ఈ చట్టం కింద దాదాపు 30,000 మంది లబ్ధి పొందినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ చట్టం ముసుగులో చాలా మంది ‘‘జమీన్ జిహాద్ (భూమి జిహాద్)’’కు పాల్పడినట్లు జమ్మూకు చెందిన అతివాద సంస్థ ఐకేకేజేయూటీటీ ఆరోపించింది. జమ్మూ ప్రాంతంలో హిందూ జనాభాలో భిన్నత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నినట్లు సంస్థ ఆరోపణలు చేసింది.

జమ్మూకశ్మీర్‌లోని అటవీ భూములతోపాటు ప్రభుత్వ భూములూ భారీగా ఆక్రమణకు గురయ్యాయని 2011లో ఎస్‌కే భల్లా ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు. 2014లోనూ దీనిపై అంకుశ్ శర్మ ఒక పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ బ్రిజేష్ బిందాల్ సభ్యులుగాగల ధర్మాసనం గత నెలలో విచారణ చేపట్టింది. అధికారులకు చీవాట్లు పెడుతూ, రోషిణీ చట్టానికి తీసుకొచ్చిన సవరణలన్నీ కొట్టిపారేయాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశం అనంతరం, రోషిణీ చట్టం కింద తీసుకున్న నిర్ణయాలన్నీ రద్దుచేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. దీంతో రోషిణి చట్టం కింద లబ్ధి పొందిన వేల మంది తమ భూములపై హక్కులు కోల్పోతామనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

2014లో ఈ భూ ఆక్రమణలపై కాగ్ కూడా ఒక నివేదిక సమర్పించింది. 3,48,160 కనాళ్ల భూమి హక్కులు జారీ చేసినందుకు రూ. 317.54 కోట్లు రావాలని, కానీ రూ. 76.24 కోట్లు మాత్రమే వచ్చాయని కాగ్ పేర్కొంది.

రోషిణి చట్టం కింద లబ్ధి పొందిన వారి పేర్ల జాబితాలో తన పేరు కూడా ఉందని పీడీపీ నాయకుడు హసీబ్ దరాబు చెప్పారు. అయితే, తను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆయన వివరిస్తున్నారు.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Hilal Shah

లబ్ధిదారులు ఏం చెబుతున్నారు?

‘‘1956లో రాజా హరీ సింగ్ నుంచి మా తాత నాలుగు కనాళ్ల భూమి లీజుకు తీసుకున్నారు. రూ. 56,000 వేలు చెల్లించి ఆ భూమిని మా తాత లీజుకు తీసుకున్నారు. స్టాంప్ డ్యూటీని కూడా ఆయన చెల్లించారు. ఆ నాలుగు కనాళ్ల స్థలాన్ని మా తాత మా అమ్మకు ఇచ్చారు. అందులో ఒక కనాల్ స్థలాన్ని నాకు ఇచ్చారు. ఇందులో కుంభకోణం ఏముంది? మా దగ్గర అన్ని పత్రాలూ ఉన్నాయి’’ అని హసీబ్ వివరించారు.

‘‘ఆ లీజుకు 1980తో కాలం చెల్లింది. దీంతో 90ల్లో మేం మళ్లీ లీజుకు దరఖాస్తు చేశాం. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 2000లోనూ డెవలప్‌మెంట్ అథారిటీకి లేఖరాసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2004లో రోషిణి చట్టం అమలులోకి వచ్చింది. దాని కింద మేం 7.5 లక్షలు కట్టాం. 2007లో మాకు భూమి వచ్చింది. ఇందులో కుంభకోణం ఏముంది?’’ అని ఆయన ప్రశ్నించారు.

రోషిణి చట్టం కింద వేల ఎకరాల అటవీ భూమిని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వాధికారులు, న్యాయవ్యవస్థలో కీలక పదవుల్లో ఉండేవారికి కట్టబెట్టారని, రూ. 25,000 కోట్లకుపైనే కుంభకోణం జరిగిందని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

దీంతో రోషిణి చట్టం-2001 కింద చేతులు మారిన భూములపై విచారణ చేపట్టాలని గత నెలలో జమ్మూకశ్మీర్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీనిపై సీబీఐ కొన్ని ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదుచేసింది.

చట్టం కింద లబ్ధి పొందిన వారి జాబితాను కూడా సమర్పించాలని కోర్టు సూచించింది. ఈ చట్టాన్నికి నేషనల్ కాన్ఫెరెన్స్, ఆ తర్వాత పీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు సవరణలు చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం ఈ చట్టం చెల్లదని ప్రకటనించడంతో.. దీనికి కింద హక్కులు పొందినవారు తమ భూములను వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, దీనిపై రాజకీయాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)