పూంచ్ ఎన్‌కౌంటర్: తొమ్మిది మంది భారత సైనికులు చనిపోయిన ఈ ఆపరేషన్‌లో సమాధానాలు లేని ప్రశ్నలెన్నో...

- రచయిత, రాఘవేంద్రరావు, మోహిత్ కాంధారి
- హోదా, బీబీసీ న్యూస్
"మా మనసులో ప్రశ్నలు అలాగే ఉన్నాయి. అక్కడికి వెళ్లి ఏం జరుగుతుందో చూడాలని కూడా అనుకున్నాం. కానీ, మమ్మల్ని అనుమతించలేదు. ఎన్‌కౌంటర్ అంతకాలం కొనసాగడం విచిత్రం. దాడి చేసిన వారెవరూ పట్టుబడలేదు. ఎవరూ చనిపోలేదు. ఈ ఎన్‌కౌంటర్ గురించి మాకు సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వం ఎందుకు ఏమీ చెప్పడం లేదు?"
అక్టోబర్ 11న జమ్మూ-కశ్మీర్ లోని పూంచ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన భారత ఆర్మీకి చెందిన గజన్ సింగ్ మామ దిల్‌బాగ్ సింగ్ అన్న మాటలివి.
పూంచ్‌లోని సురన్‌కోట్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన నాయబ్ సుబేదార్‌తో సహా అయిదుగురు సైనికులు మరణించారు.
రెండు రోజుల తర్వాత, అక్టోబర్ 14న, అదే ప్రాంతానికి సమీపంలోని మెంధార్ వద్ద జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా మరో నలుగురు భారతీయ ఆర్మీ సిబ్బంది మరణించారు.
మొత్తంగా ఈ ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది భారత సైనికులు మరణించారు. అయితే ఏ ఉగ్రవాదిని పట్టుకోవడం గురించి, లేదా మరణించడం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడ లేదు.
"మా కుటుంబాల మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. ఇది అసలు ఎలా జరిగిందన్నదే ప్రధాన చర్చ. ప్రభుత్వం, ఏజెన్సీలు పూర్తిగా సమాచారం ఇవ్వలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఎన్‌కౌంటర్ కొనసాగింది. వారు వివరణ ఇచ్చేదాక ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు'' అన్నారు గుర్వీందర్ సింగ్.
ఆయన అక్టోబర్ 11 ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇండియన్ ఆర్మీకి చెందిన మన్‌దీప్ సింగ్‌కు బంధువు.
ఈ రెండు ఎన్‌కౌంటర్ల తర్వాత, భారత సైన్యం పూంచ్ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించింది. ఇది సుమారు నాలుగు వారాల పాటు కొనసాగింది.
ఒక జేసీఓ సహా అయిదుగురు సైనికులు హతమైన తర్వాత, అక్టోబర్ 11న సురన్ కోట్ అటవీప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభమైంది. పారిపోతున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి సైన్యం మెంధార్ వరకు వారిని వెంటాడింది.
సైన్యం ఆపరేషన్ సాగిన ప్రాంతం 10 నుండి 15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం.
భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని కనీసం మూడు, నాలుగు వారాలపాటు వార్తలు కొనసాగాయి. ఇది బహుశా అత్యంత సుదీర్ఘమైన ఎన్‌కౌంటర్ అని కూడా అంటున్నారు. కానీ, ఇన్నిరోజులు గడిచినా ఉగ్రవాదుల జాడ దొరకలేదు.
కొన్నిరోజుల కిందట ఈ ఎన్‌కౌంటర్‌ను నిలిపేశారు. తర్వాత దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
ఎన్‌కౌంటర్‌ను నిలిపేశామని భారత ఆర్మీ ప్రతినిధి కల్నల్ సుధీర్ చమోలీ బీబీసీకి చెప్పారు. అయితే పూంచ్‌లోని అటవీ ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కానీ ఏ రోజున ఎన్‌కౌంటర్‌ను ఆపేశారో ఆయన వెల్లడించ లేదు.
దీని గురించి ఆర్మీ అధికార ప్రతినిధిని బీబీసీ ప్రశ్నించింది. అయితే, ఆయన దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
ఈ ఎన్‌కౌంటర్ దట్టమైన, పెద్ద అటవీ ప్రాంతంలో జరుగుతోందని, ఎవరైనా ముందు నుండి కాల్పులు జరిపితే తప్ప వారిని గుర్తించడం సులభం కాదని చెప్పారు. ఎన్‌కౌంటర్ సమయంలో దాడి చేసిన వారు ఎవరో తెలియరాలేదని కూడా ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్‌కౌంటర్ పై సమాధానం దొరకని 5 ప్రశ్నలు
''ఈ ప్రాంతంలో రెండు మూడు నెలలపాటు చొరబాటుదారుల కదలిక ఉంది. జూలై 8 నుండి ఈ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది" అని రాజౌరి-పూంచ్ రేంజ్ డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివేక్ గుప్తా కొన్ని వారాల కిందట చెప్పారు.
ప్రశ్న 1: రెండు మూడు నెలలుగా ఈ ప్రాంతంలో చొరబాటుదారులు ఉండి ఉంటే వారు అడవిలోనే తలదాచుకుని ఉండే అవకాశం ఉందా?
ప్రశ్న 2: దాదాపు రెండు వారాల పాటు భారీ ఎత్తున కాల్పులు జరిగినా ఒక్క చొరబాటుదారుని కూడా ఎందుకు చంపలేక పోయారు? భారత సాయుధ దళాలకు చెందిన చాలామంది సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోయారు?
ప్రశ్న 3: భద్రతా దళాల భారీ సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదులకు ఏమైంది?
ప్రశ్న 4: చొరబాటుదారులు ఇప్పటికీ అడవిలోనే దాక్కుంటే, వారికి తిండి, ఇతర అవసరాలు ఎలా సమకూరుతున్నాయి ? భద్రతా బలగాల దృష్టిలో పడకుండా వారు ఎలా ఉండగలుగుతారు ?
ప్రశ్న 5: ఎన్‌కౌంటర్ ప్రారంభం నుంచి భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని చెప్పారు. అలాంటప్పుడు భద్రతా బలగాల కంటబడకుండా చొరబాటుదారులు తప్పించుకోవడం సాధ్యమేనా?
ఎన్‌కౌంటర్‌లో అండర్ ట్రయల్ మరణం
ఈ ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్ గాయాలతో అండర్ ట్రయల్ ఖైదీ మరణించినట్లు అక్టోబర్ 24న వార్తలు వచ్చాయి. ఉగ్ర స్థావరాన్ని గుర్తించేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో, పాకిస్తానీ తీవ్రవాది జియా ముస్తఫాను భట్టా ధురియా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.
జియా ముస్తఫా 2003లో జమ్మూ-కశ్మీర్ పోలీసులు కశ్మీరీ పండిట్ల హత్యాకాండ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యాడు. ముస్తఫా 18 ఏళ్లుగా అండర్ ట్రయల్ ఖైదీగా జైలులో ఉన్నాడు.
జైల్లో ఉన్న ముస్తఫాకు, జమ్మూలోని పూంచ్ జిల్లాలోకి చొరబడిన పాకిస్తానీ తీవ్రవాదులకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ముస్తఫా ఈ చొరబాటుదారులకు అడవి గుండా వెళ్లేందుకు సాయం చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు.
పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంయుక్త బృందంపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముస్తఫా మరణించాడని జమ్మూ-కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ఒక ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు.
అయితే, ఇక్కడ ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఒకవైపు భద్రతా దళాలకు చాలారోజులపాటు ఉగ్రవాదులు కనిపించ లేదు. మరి అండర్ ట్రయల్ ఖైదీని అక్కడికి తీసుకెళ్లిన రోజునే ఉగ్రవాదులు ఎలా కాల్పులు జరిపారు?
జియా ముస్తఫా మరణంతో 2003 నాటి ఊచకోతకి సంబంధించిన విచారణ కూడా ముగిసినట్లేనని పలు మీడియా సంస్థలు నివేదించాయి.

ఫొటో సోర్స్, Reuters
పూంచ్ నుంచి చొరబాటుదారులు కశ్మీర్ లోయలోకి ప్రవేశించారా?
భారత సైన్యానికి చెందిన రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.బి. అస్థానా తన పదవీ కాలంలో జమ్మూ-కశ్మీర్‌లో చాలా సంవత్సరాలు పనిచేశారు. 1999లో కార్గిల్‌లో ఆపరేషన్ విజయ్‌లో కూడా ఆయన పాల్గొన్నారు.
"పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదులకు సామాన్య ప్రజల నుంచి సహకారం లేదు. వారు పీర్ పంజాల్ కొండల గుండా కశ్మీర్ లోయలోకి ప్రవేశించడానికి తరచుగా ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నారు" అని అస్థానా చెప్పారు.
ఈ ఉగ్రవాదులు పీర్ పంజాల్ దాటి దక్షిణ కశ్మీర్‌లోకి ప్రవేశించి అక్కడి ప్రజలతో కలిసిపోయే అవకాశం ఉందని మేజర్ జనరల్ అస్థానా అన్నారు.
కశ్మీర్ లోయతో పోలిస్తే జమ్మూలోని పూంచ్ వంటి ప్రాంతాల్లో మోహరించిన సైనికుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, బహుశా దీనిని సద్వినియోగం చేసుకుని, ఉగ్రవాదులు ఈ మార్గంలో కశ్మీర్ లోయలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని మేజర్ జనరల్ అస్థానా అభిప్రాయపడ్డారు.
కొన్ని వారాల పాటు సాగిన ఆర్మీ ఆపరేషన్ గురించి మాట్లాడిన అస్థానా, ఈ అడవుల్లో తీవ్రవాదులు ఎలాంటి శిబిరాలు ఏర్పాటు చేసుకోకుండా చూడడమే సైన్యం ప్రధాన లక్ష్యమని చెప్పారు.
సెర్చ్ ఆపరేషన్ ఒక పెద్ద అడవిలో జరుగుతున్నందున, దీనికి సమయం పట్టడం సహజమేనని అన్నారు.

ఫొటో సోర్స్, AFP
స్థానికుల మద్దతు ఉందా?
జమ్మూలోని పూంచ్, రాజౌరి వంటి ప్రాంతాల్లో ఉగ్రమూకలకు సామాన్య ప్రజల మద్దతు లభించదని భద్రతా సంస్థలు చాలా రోజుల నుంచి నమ్ముతున్నాయి.
అయితే, ఈ ఇటీవలి ఎన్‌కౌంటర్ తర్వాత, స్థానిక ప్రజలు చొరబాటుదారులకు ఆశ్రయం, ఆహారంలాంటివి అందించారా అనే దానిపై కూడా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
బీబీసీకి అందిన సమాచారం ప్రకారం, పూంచ్‌లోని మెంధార్ తహసీల్‌లోని భట్టా ధురియ అడవులలో దాక్కున్న చొరబాటుదారుల బృందానికి సహకారం అందించినందుకు జమ్మూకశ్మీర్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
"ఆపరేషన్ సమయంలో, ఇద్దరు మహిళలతో సహా డజనుకు పైగా అనుమానితులను పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురిని అరెస్టు చేశారు'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని జమ్మూ-కశ్మీర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
పోలీసుల చెప్పినదాని ప్రకారం ఈ నలుగురు నిందితులు భట్టా ధురియ ప్రాంతవాసులు. వారిలో ఒకరు మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. వయస్సు 16 సంవత్సరాల కంటే తక్కువ.
ఈ నిందితులందరిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద హత్య, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ప్రేరేపణ, నేరస్థులకు ఆశ్రయం కల్పించడం వంటి అభియోగాలు మోపారు. అలాగే ఆయుధ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మరోవైపు, యాసిర్ అరాఫత్ అనే వ్యక్తిని అక్టోబర్ 25న సౌదీ అరేబియాకు వెళ్తుండగా కాఠ్‌మాండు లో అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూ-కశ్మీర్ పోలీసులు తెలిపారు.
అరాఫత్ సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడని, చొరబాటుదారులతో అతనికి పరిచయాలు ఉన్నాయని, పోలీసులు తెలిపారు. భట్టాధురియ అడవుల్లో దాక్కున్న ఉగ్రమూకలకు యాసర్ అరాఫత్ ఆహారం, ఆశ్రయం కల్పించినట్లు నిర్ధరణ అయిందని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2003 తరహాలోనా ?
ఈ ఎన్‌కౌంటర్ భద్రతా బలగాలకు ఒక హెచ్చరిక పంపింది. 2003లో పూంచ్ అకస్మాత్తుగా తీవ్రవాదులకు బలమైన కోటగా మారిన నాటి పరిణామాలను గుర్తు చేసింది.
అప్పట్లో తీవ్రవాదులను ఏరి వేయడానికి ప్రభుత్వం 'ఆపరేషన్ సర్పవినాశ్'ను నిర్వహించింది.
1999 కార్గిల్ యుద్ధ సమయంలో డజన్ల కొద్దీ పాకిస్తానీ తీవ్రవాదులు పూంచ్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) గుండా చొరబడ్డారు. ఎల్‌ఓసి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలోని సురాన్‌కోట్ తహసిల్‌లోని హిల్కాకాలో క్యాంపింగ్ ప్రారంభించారు.
2003 నాటికి, లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందిన తీవ్రవాదులు హిల్కాకాలో పాగా వేశారు. అనేక నెలలకు సరిపడా ఆహార పదార్ధాలను కూడా సమీకరించారు.
అయితే, ఆపరేషన్ "సర్ప్ వినాశ్"లో భాగంగా, భారత సైన్యం రెండు వారాలపాటు ఆపరేషన్ నిర్వహించి 62మంది ఉగ్రవాదులను హతమార్చింది. భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది.
అక్టోబరు 11, 14 తేదీల్లో భారత సైన్యంపై దాడి చేసిన ఉగ్రమూకల సంఖ్య 6 నుంచి 8కి మించి లేదని భద్రతా బలగాలు భావిస్తున్నప్పటికీ..ఈ చొరబాటుదారులు ఇప్పటి వరకు భారత భద్రతా బలగాలకు అందకుండా తప్పించుకున్న తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన తొమ్మిది సైనిక కుటుంబాలు ఈ సందేహాలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- త్రిపుర: ఈ రాష్ట్రంలో మత ఘర్షణల వెనుక అసలు నిజాలేంటి - బీబీసీ పరిశోధన
- భారత్‌లో తొలి బిట్ కాయిన్ స్కామ్: 25 ఏళ్ల హ్యాకర్ చుట్టూ తిరుగుతున్న కర్ణాటక రాజకీయాలు
- అద్భుతం: చికిత్స లేకుండానే హెచ్ఐవీ వైరస్‌ను తరిమేసిన మహిళ శరీరం
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పును ఇది తప్పిస్తుందా
- ‘‘మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ఓ పెద్ద ఎత్తుగడ.. ఇదీ తెరవెనుక కథ’’
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








