ఫిలిప్పీన్స్; ప్రజాందోళనకు భయపడి పారిపోయిన నియంత కుమారుడు 'మార్కోస్ జూనియర్' దేశాధ్యక్షుడు ఎలా అయ్యారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరేత్ ఇవాన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నాలుగు దశాబ్దాల కిందట అవినీతిపరుడంటూ ఆయన తండ్రిని ప్రజలు ఉద్యమించి అధికారం నుంచి తొలగించారు. కానీ, మళ్లీ ఇప్పుడు అదే తండ్రికి వారసుడైన వ్యక్తి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు కాబోతున్నారు. ఆయన పేరు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్. ముద్దు పేరు బాంగ్‌బాంగ్.
అధ్యక్షుడిగా మార్కోస్ జూనియర్ విజయం దాదాపుగా ఖాయమైంది. కానీ, ఆయన కుటుంబానికి ఫిలిప్పీన్స్‌లో అంత మంచి పేరు లేదు. కారణమేంటి?
మార్కోస్ జూనియర్ ఫిలిప్పీన్స్ మాజీ నియంత ఫెర్డినాండ్ మార్కోస్ సీనియర్ ఏకైక కుమారుడు. మార్కోస్ సీనియర్ 1965 నుండి1986 వరకు అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పుడు ఆయన కుటుంబీకులు అధికారంలోకి తిరిగిరావడం చరిత్రాత్మక ఘటనగా నిలుస్తోంది.
ఈ కుటుంబపు రాజకీయ పునరాగమనాన్ని అర్థం చేసుకోవడానికి, గతంలో వారి ఎదుగుదల, పతనాలను కూడా అర్ధం చేసుకోవాలి.
ఈ కథంతా హత్య, నిరసనలు, బహిష్కరణలు, విలాస జీవితాల సమ్మేళనం.

ఫొటో సోర్స్, Reuters
భయానక పాలన
మార్కోస్ సీనియర్ మొదటిసారిగా 1965లో అధ్యక్షుడైనప్పటికీ,1972లో ఫిలిప్పీన్స్‌పై పూర్తి నియంత్రణను సాధించారు. అధ్యక్షుడిగా ఆయన తన రెండో పదవీ కాలం ముగియడానికి ఒక ఏడాది ముందు ఆయన రాజీనామా దేశంలో మార్షల్ లా ప్రకటించారు.
పార్లమెంటును రద్దు చేశారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు. దేశంలో సెన్సార్‌షిప్ విధించారు. సీనియర్ మార్కోస్ స్వయంగా న్యాయవాది. కానీ, ఆయన కోర్టులను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు.
సైన్యం, పోలీసులు ఆయన ప్రత్యర్ధులను చిత్రహింసలకు గురి చేశారు. చాలామంది హత్యకు గురయ్యారు. ఇవన్నీ మార్కోస్ సీనియర్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే జరిగాయి.
ఆనాటి కాలమంతా ఫిలిప్పీన్స్ చరిత్రలో చీకటి కాలంగా చెబుతారు. ఆ సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా జరిగినట్లు, విపరీతమైన అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. లక్షలమంది ప్రజలు కడు పేదరికంలో అల్లాడగా, దేశం అప్పుల్లో కూరుకుపోయింది.
అయితే, 1983 ఆగస్టులో జరిగిన ఓ హైప్రొఫైల్ మర్డర్ మార్కోస్ సీనియర్ పతనానికి బాటలు వేసింది.
మార్కోస్ సీనియర్ భయానక పాలన నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్ష నేత బెనింగో ఆక్వినో దేశం వదిలి అమెరికాకు శరణార్ధిగా వెళ్లిపోయారు. కొన్నాళ్ల తర్వాత ప్రభుత్వం మీద పోరాడాలన్న లక్ష్యంతో ఆయన తిరిగి స్వదేశానికి వచ్చారు. అయితే, ఆయన రాజధాని మనీలా వచ్చీరాగానే హత్యకు గురయ్యారు.
ప్రభుత్వం బెనింగోకు అత్యంత భద్రత కల్పించినా, ఆయన హత్యకు గురికావడం ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఆయనకు నివాళులు అర్పించేందుకు వేలు, లక్షలమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అదే చివరకు ప్రజాస్వామ్య ఉద్యమంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజాఉద్యమం
బెనింగో భార్య కోరీ కి మద్ధతుగా ప్రజలంతా ఉద్యమించారు. ప్రజల ఆగ్రహాన్ని తగ్గించేందుకు మార్కోస్ సీనియర్ 1986లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు. 1986లో జరిగిన ఎన్నికల్లో మార్కోస్ సీనియర్ మీద కోరీని పోటీకి నిలబెట్టారు. అయితే, ఈ ఎన్నికల్లో మార్కోస్ సీనియర్ విజయం సాధించారు.
ఎన్నికల్లో విపరీతమైన అవినీతి జరిగిందంటూ ప్రజా ఉద్యమం మరోసారి ముమ్మరమైంది. లక్షలమంది జనం వీధుల్లోకి వచ్చారు. ఈ ఆందోళనలు చివరకు పీపుల్స్ పవర్ రివల్యూషన్ గా మారాయి. ఇక్కడ జరుగుతున్న ఉద్యమాలు మిగతా దేశాలలో కూడా స్ఫూర్తి నింపాయి.
శాంతియుతంగా సాగిన ఈ ఉద్యమానికి చర్చి నుంచి, సైన్యంలోని ఉన్నతాధికారుల నుంచి మద్ధతు లభించింది. ప్రజల మీద దమనకాండ జరపడానికి సైన్యం నిరాకరించింది.
నాలుగు రోజుల పాటు తీవ్రంగా సాగిన ఉద్యమంతో మార్కోస్ సీనియర్ తన కుటుంబంతో సహా అమెరికన్ హెలీకాప్టర్‌లో హవాయి ద్వీపానికి పారిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పటికి 28 ఏళ్ల వయసున్న మార్కోస్ జూనియర్ కూడా తన తండ్రితోపాటు పారిపోయారు. ఈ కుటుంబం తమతోపాటు భారీ ఎత్తున నగదు, ఆభరణాలు, దుస్తులు, లక్షల కొద్దీ డబ్బును హెలీకాప్టర్‌లో తీసుకెళ్లినట్లు అమెరికా కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ రికార్డులలో ఉంది.
ఈ సంఘటనలు జరిగిన తర్వాత మూడేళ్లకు అంటే 1989లో మార్కోస్ సీనియర్ హవాయి దీవుల్లో ప్రవాసంలో ఉండగానే మరణించారు.
అధికారంలో ఉన్న కాలంలో మార్కోస్ సీనియర్, ఆయన కుటుంబీకులు 10 బిలియన్ డాలర్లు ( ఇప్పటి కరెన్సీలో సుమారు రూ.77191650000) ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు తేలింది. అందులో కేవలం 4 బిలియన్ డాలర్లు ( ప్రస్తుత కరెన్సీలో సుమారు రూ. 308766600000) మాత్రమే తిరిగి రాబట్టగలిగారు.
మార్కోస్ సీనియర్ భార్య ఇమెల్డా మార్కోస్ మాజీ అందాల రాణి. డిజైనర్ వస్తువులు, విలాసవంతమైన వస్తువుల సేకరణకు ఆమె ఫేమస్. డిజైనర్ షూలను కొనుగోలు చేయడానికి ఆమె ప్రపంచంలో చాలా ప్రాంతాలు పర్యటించారని చెబుతారు. 3,000 కంటే ఎక్కువ జతల చెప్పులను వారు పారిపోయిన తర్వాత అధ్యక్ష భవనంలో గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
పునరాగమనం
1990లలో వారు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత, మార్కోస్ జూనియర్ తమ కుటుంబ సంపదను తన రాజకీయ ఆశయాలను పునరుజ్జీవింపజేయడానికి, సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ఉపయోగించారు. మొదట ఆయన ప్రావిన్షియల్ గవర్నర్, ఆ తర్వాత కాంగ్రెస్ మెంబర్, ఆ తర్వాత సెనెట్ సభ్యుడు అయ్యారు.
ఆయన తల్లి ఇమెల్డా వయసు ప్రస్తుతం 92 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె రాజధాని మనీలాలో నివసిస్తున్నారు. ఆయన సోదరి ఇమీ కాంగ్రెస్ సభ్యురాలు, సెనెటర్, మాజీ గవర్నర్ కూడా.
ఇప్పుడు 64 ఏళ్ల వయసున్న మార్కోస్ జూనియర్, ఫిలిప్పీన్స్ యువతలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆర్ధికాభివృద్ధి గురించి మాట్లాడటం, మానవ హక్కుల ఉల్లంఘనలను తగ్గించడం ద్వారా తన తండ్రి పాలన నాటి చెడ్డపేరును తొలగించేందుకు ప్రయత్నించారని చెబుతారు.
తన తండ్రి కాలంలో జరిగిన నేరాలకు బాధ్యత వహించడానికి అప్పటికి తాను చాలా చిన్నవాడినని కూడా ఆయన వాదించేవారు. తన కుటుంబపు రాజకీయ ప్రభావాన్ని పునర్నిర్మించే ఆయన ప్రయత్నం ఈ ఎన్నికల విజయంతో పూర్తి అయినట్లు కనిపిస్తుంది.
ఆయన తండ్రి మార్షల్ లా ప్రకటించిన 50 సంవత్సరాల తర్వాత వస్తున్న ఎన్నికల ఫలితం, హవాయి ప్రవాసం నుండి అధ్యక్ష భవనానికి మార్కోస్ పునరాగమనానికి సాక్ష్యంగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: పెళ్లైన నెల రోజులకే భర్త పీక పిసికి, పైట బిగించి హత్య చేసిన భార్య.. ఏం జరిగిందంటే..
- ఆ గిరిజన గ్రామానికి వెళ్లిన వారంతా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు?
- ఆటలు ఆడట్లేదా? అయితే, మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా..
- కర్ణాటక: హిజాబ్ వివాదంతో రాళ్ల దాడులు, మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన ప్రభుత్వం
- నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు: బీబీసీ చేతికి నేపాల్ నివేదిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











