రాజపక్స సోదరులు: జనం దృష్టిలో యుద్ధ వీరులు అకస్మాత్తుగా విలన్లు ఎలా అయ్యారు?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ న్యూస్, కొలంబో
శ్రీలంక ఇప్పుడు కూడలిలో నిలబడి దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆర్థిక సంక్షోభం దేశంలోని 2.2 కోట్ల మంది ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. అంతర్యుద్ధాన్ని గెలిచిన వీరులుగా చాలా మంది కీర్తించే రాజపక్స సోదరులు ఇప్పుడు ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నారు. ఇలా ఎందుకు జరిగింది? మున్ముందు ఏం జరుగుతుంది?
దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన సోదరుడు ప్రధానమంత్రి మహీంద రాజపక్సలు పదవుల్లోంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ ఆరంభం నుంచి నిరసనలు మొదలయ్యాయి. దేశం ఆర్థికంగా పతనమవటానికి వారే బాధ్యులని నిరసనకారులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. అయితే ఈ వారం ఓ నిర్ణయాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల మీద మహీంద రాజపక్స మద్దతుదారులు దాడి చేయటంతో దేశవ్యాప్తంగా భీకర ఘర్షణలు చెలరేగాయి. పదుల సంఖ్యలో రాజకీయ నాయకులకు చెందిన ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. వీటిలో రాజపక్స సోదరులకు చెందిన ఇళ్లు కూడా ఉన్నాయి.
ఆగ్రహంతో రగిలిపోతున్న నిరసనకారులు మహింద రాజపక్స అధికారిక నివాసాన్ని సైతం చుట్టుముట్టి దిగ్బంధించటంతో.. ఆయనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. భద్రత కోసం కొలంబో నగరంలోని ఈశాన్య ప్రాంతంలో గల ఓ నౌకాదళ స్థావరంలో ఆయన తలదాచుకోవాల్సి వచ్చింది. ఆయన దేశం వదిలి వెళ్లటానికి వీలులేదంటూ ఓ కోర్టు నిషేధ ఉత్తర్వులు ఇచ్చింది. రెండు సార్లు దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడికి ఇది అత్యంత అవమానకరమైన విషయం.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిస్థితుల్లో మహీంద రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే.. ఆయన తప్పుకున్నా అధ్యక్షుడిగా ఉన్న ఆయన తమ్ముడు గొటబయ రాజపక్స (72) మీద పెరుగుతున్న ఒత్తిడి ఏమాత్రం తగ్గలేదు.
అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లను ఆయన ఇప్పటివరకూ విస్మరిస్తూనే వచ్చారు. అయితే ఆయనిప్పుడు కొన్ని రాయితీలు ప్రతిపాదించక తప్పని పరిస్థితిలో ఉన్నారు. అధ్యక్షుడిగా తన కార్యనిర్వహణాధికారాలు కొన్నిటిని పార్లమెంటుకు బదిలీ చేయటానికి ఆయన ఒప్పుకున్నారు. అలాగే ప్రతిపాదిత సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా సీనియర్ నాయకుడు రణిల్ విక్రమసింఘేను నియమించారు.
కానీ గొటబయ రాజకీయ భవిష్యత్తుకు ఇంకా ముప్పు తొలగిపోలేదు. ఆయన కూడా దిగిపోయే రోజు ఎంతో దూరంలో లేదని కొందరు భావిస్తున్నారు.
బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాతి కాలంలో అత్యంత విషమ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్న శ్రీలంక ఇప్పుడు మరింత రాజకీయ అస్థిరతను తట్టుకోగలిగే పరిస్థితి లేదు. అంతులేకుండా పెరిగిపోయిన నిత్యావరసాల ధరలు.. ఆహార, చమురు కొరతల వల్ల జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
దశాబ్ద కాలానికి పైగా శ్రీలంక రాజకీయాల్లో రాజ్యం చేసిన రాజపక్స కుటుంబ ఆధిపత్యం చాలా నాటకీయంగా పతనమైంది.

ఫొటో సోర్స్, AFP
మహీంద రాజపక్స తొలి విడత దేశాధ్యక్షుడిగా ఉన్నపుడు.. 2009లో తమిళ పులుల తిరుగుబాటుదారులను అణచివేయటం ద్వారా మూడు దశాబ్దాల అంతర్యుద్ధానికి ముగింపు పలికారంటూ మెజారిటీ సంహళీయులు ఆయనను హీరోగా ఆరాధించారు.
ఆ యుద్ధం ముగిసిన అనంతరం జరిగిన విజయోత్సవ ప్రదర్శనలు, బహిరంగ కార్యక్రమాల్లో మహీంద రాజపక్సను సింహళ బౌద్ధ రాజులతో పోల్చారు.
''స్వాతంత్ర్యానంతర శ్రీలంకలో అత్యంత ప్రజాదరణ గల సింహళ బౌద్ధ నాయకుడు ఆయన. కొంతమందైతే ఆయనను 'చక్రవర్తి మహీంద' అని కూడా కీర్తించారు'' అని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు కుశాల్ పెరీరా పేర్కొన్నారు.
పెరీరా 2017లో ప్రచురించిన 'రాజపక్స: ద సింహళ సెల్ఫీ' అనే పుస్తకంలో.. శ్రీలంక రాజకీయాల్లో రాజపక్స కుటుంబం పాత్రను, రాజపక్స తనను తాను మలచుకుంటూ అధికారంలోకి ఎలా వచ్చారనేది వివరించారు.
మహీంద తండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఉండేవారు. మహీంద రాజపక్స పార్లమెంటులో ప్రతిపక్ష నేత నుంచి క్రమంగా 2004 నాటికి ప్రధానమంత్రిగా ఎదిగారు.

ఆ మరుసటి ఏడాది ఆయన దేశాధ్యక్షుడయ్యారు. అప్పుడు తన తమ్ముడు గొటబయ రాజపక్సను రక్షణ మంత్రిగా నియమించారు. అప్పటికి శ్రీలంక సైన్యం నుంచి పదవీ విరమణ చేసి అమెరికాలో ప్రశాంతంగా నివసిస్తున్న గొటబయ ఏకంగా రక్షణమంత్రి కావటం ఆయన కెరీర్‌లో ఓ భారీ ఎదుగుదల.
తన అన్న తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించటానికి వచ్చిన గొటబయ ప్రముఖుడిగా ఎదిగారు. తనకు జాలీ దయా లేవన్న పేరును సంపాదించుకున్నారు.
ఆ వెంటనే రాజపక్స ఇతర సోదరులు, బంధువులు కూడా ప్రభుత్వంలో చేరారు. అలా రాజపక్స సామ్రాజ్యాన్ని స్థాపించటంలో కీలకంగా పనిచేసింది కుటుంబ పెద్ద అయిన మహీంద రాజపక్స.
ఇప్పటివరకూ ఈ అన్నదమ్ములు కలిసే ఐక్యంగా ఉన్నారు. కానీ ఇటీవల వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాజీనామా చెయ్యాలన్న నిరసనకారుల డిమాండ్‌ను విని 'అందరి కోసం త్యాగం చేయాల'ని రాజపక్సకు గొటబయ చెప్పటంతో ఇవి ప్రస్ఫుటమయ్యాయి.
పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్న తమ్ముడిని ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన అన్నకు ఈ డిమాండ్ పెద్ద అవమానమే అయింది. తన రాజకీయ జీవితం ఇలా ముగియాలని ఆయన కోరుకోలేదు.

ఫొటో సోర్స్, EPA
''యువత నిరసనలను నియంత్రించటంలో తడబడ్డ మహీంద రాజపక్స.. తప్పనిసరిగా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన వయసు రీత్యా మళ్లీ తిరిగి అధికారంలోకి రాలేకపోవచ్చు'' అంటారు పెరీరా.
మహీంద, గొటబయల సోదరుల మధ్య విభేదాలున్నాయనే మాటను మహీంద పెద్ద కొడుకు నామల్ నిరాకరిస్తున్నారు.
''కానీ అధ్యక్షుడికి, (మాజీ) ప్రధానమంత్రికి మధ్య విధానపరమైన తేడాలు కచ్చితంగా ఉన్నాయి'' అని ఆయన ఈ వారంలో రాజీనామా చేసేముందు బీబీసీతో పేర్కొన్నారు.
తన తండ్రి మహీంద ఎల్లప్పుడూ రైతులు, సామాన్య ప్రజలకు అండగా ఉన్నారని, గొటబయ తీరు భిన్నంగా ఉంటుందని, సామాన్య ప్రజలకు బదులుగా నిలకడ లేని ఓట్లవైపు ఎక్కువగా చూస్తుంటారని నామల్ వ్యాఖ్యానించారు.
మహీంద రాజపక్స వైదొలగటం పట్ల నిరసనకారులు సంతోషించివుండవచ్చు. కానీ గొటబయ రాజపక్స కూడా తప్పుకుని తీరాల్సిందేనని వారు బలంగా పట్టుపడుతున్నారు. గొటబయ వైదొలగే ప్రసక్తే లేదని ఆయన మద్దతుదారులు చెప్తున్నారు.
''బయట అంతా గందరగోళంగా ఉన్నంత మాత్రాన - దానికి చాలా సరైన కారణాలున్నాయి, అందరం ఒప్పుకుంటాం - దాని అర్థం గొటబయ రాజీనామా చేయాలని కాదు'' అని మాజీ మీడియా మంత్రి నలక గొడహెవా బీబీసీతో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2019లో గొటబయను అధ్యక్షుడిగా అధికారంలోకి తీసుకొచ్చిన ఓటర్ల మద్దతును ఆయన ఇప్పుడు కోల్పోయారు. ఇప్పుడాయన ఏం చేస్తారన్న అంశంపై స్పష్టత లేదు.
రెండో విడత అధ్యక్ష పదవి చేపట్టాలన్న ఆసక్తి తనకు లేదని, కానీ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కోరుకుంటున్నానని గొటబయ రాజపక్స తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
గొటబయ రాజపక్స మీద దేశంలో విస్తృతంగా వ్యతిరేకత ఉండటంతో ఆయన కొనసాగే అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. అయితే.. కఠినవైఖరికి పేరుపడ్డ గొటబయ అధికారంలో కొనసాగటం కోసం సైన్యాన్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నించే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రాజపక్స సోదరులకు సింహళ ప్రజానీకంలో ఏళ్ల తరబడి విపరీతమైన ప్రజాదరణ ఉంది. వారి మీద తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలపై దౌర్జన్యం, మీడియా మీద హంతక దాడుల ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు. సింహళ మెజారిటీ ప్రజల్లో ఎక్కువ మంది ఆ ఆరోపణల గురించి అప్పుడు గొంతెత్తలేదు.
ఇప్పుడు దేశమంతా కష్టాల్లోపడింది. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోవటం ఇక్కడి జాతులను ఏకం చేసింది. మైనారిటీ హక్కులకు మద్దతుగా కూడా సింహళ నిరసనకారులు గళమిప్పుతున్నారు.
''ఆర్థిక కష్టాలు మెజారిటీ ప్రజలను బలంగా దెబ్బకొట్టాయి. అకస్మాత్తుగా వారు తిరగబడ్డారు. దశాబ్దాల పాటు తాము ఏంచేసినా చెల్లుబాటైన రాజపక్స కుటుంబం.. ఈ స్థాయి ఆగ్రహాన్ని చవిచూసి ఆశ్చర్యపోయారని నేను అనుకుంటున్నా'' అన్నారు మానవ హక్కుల న్యాయవాది భవాని ఫోనెస్కా.
అయితే రాజపక్సలు తమ పట్టును అంత సులభంగా వదులుకోవటానికి సుముఖంగా ఉండరు. వారు కేవలం తమ రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రమే కాదు.. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక తమ భద్రత పరిస్థితి ఏమిటనేదాని గురించి కూడా ఆందోళన చెందుతున్నారు.
సీనియర్ ప్రతిపక్ష నాయకుడు రణిల్ విక్రమసింఘేను కొత్త ప్రధానమంత్రిగా నియమించటంలో ఉద్దేశాన్ని ఈ ఆందోళన విశదీకరిస్తుంది. రాజపక్సలతో సత్సంబంధాలున్న మనిషిగా రణిల్‌ను పరిగణిస్తారు.
అయితే శ్రీలంక వాసులు చాలా మంది రాజపక్స రాజకీయాలతో విసుగెత్తిపోయారు. వారు సహనం కోల్పోతున్నారు.
స్థిరమైన ప్రభుత్వం లేకుండా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో రుణం కోసం చర్చలు జరపటం కష్టమవుతుంది. కానీ రాబోయే కొత్త ప్రభుత్వం ఆ పని త్వరగా చేయకపోతే విద్యుత్ కోతలు, ఇంధన కొరతలు మరింతగా పెరిగిపోతాయి.
''ఈ దేశాన్ని ఎవరు నడుపుతున్నారనేది అనవసరం. మా కనీస అవసరాలు తీరితే చాలు'' అంటున్నారు కొలంబో నివాసి చందన్ మానెల్.
''నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారికి తిండిపెట్టాలి. నా కుటుంబాన్ని పోషించుకోవాలి. రాజకీయ నాయకులు వారికున్న సంపదతో బతికేస్తారు. కానీ మేం బతకలేం'' అంటున్నారామె.
ఇవి కూడా చదవండి:
- 'ఏడాదిలోగా మనుమడో, మనుమరాలినో కనివ్వండి, లేదా 5 కోట్ల పరిహారం కట్టండి' -కొడుకు, కోడలిపై తల్లిదండ్రుల కేసు
- సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట
- మదర్స్ డే: తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇది
- తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














