శ్రీలంక సంక్షోభం 1991 నాటి భారత్‌ను ఎందుకు గుర్తు చేస్తోంది? పీవీ నరసింహారావు ఇండియాను ఎలా గట్టెక్కించారు?

పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంక విదేశాల నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించలేకపోతోంది. ఎందుకంటే శ్రీలంక వద్ద విదేశీ కరెన్సీ లేదు.

రుణ చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు మంగళవారం శ్రీలంక ఆర్థిక శాఖ కార్యదర్శి మహింద సిరివర్దన ప్రకటించారు. ప్రస్తుతం తమ దేశం రుణాలు చెల్లించే పరిస్థితిలో లేదని, రుణాలు ఇచ్చినవారితో చర్చలు జరుపుతామని శ్రీలంక కేంద్ర బ్యాంకు గవర్నర్ నంద్‌లాల్ వీరాసింఘే తెలిపారు.

విదేశాల నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించలేకపోవడం అంటే దివాలా తీయడానికి సంకేతం అని శ్రీలంక వార్తాపత్రిక ఫైనాన్షియల్ డైలీ పేర్కొంది.

శ్రీలంక ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి సహాయంతో అప్పులను చెల్లించే ప్రయత్నం చేస్తోంది. దీనికితోడు భారత్, చైనా వంటి దేశాల నుంచి కూడా సహాయం పొందేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది.

వీడియో క్యాప్షన్, జీవితంలో ఇంకెప్పుడూ ఆయనకు ఓటు వెయ్యబోమని అక్కడి ప్రజలు ఎందుకంటున్నారు

''విదేశీ రుణాలను చెల్లించే సామర్థ్యం ఇప్పుడు మాకు లేదు. ఈ అప్పులు తీర్చడం ఇప్పుడు అసాధ్యం. మేం ఇప్పుడు మా ముందున్న నిత్యావసర వస్తువుల దిగుమతి సమస్యపై దృష్టి కేంద్రీకరించాలి. ఇలాంటప్పుడు విదేశాల రుణాలు ఎలా తీర్చాలి అన్న అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని శ్రీలంక కేంద్ర బ్యాంకు గవర్నర్ మంగళవారం అన్నారు.

''శ్రీలంక ఈ ఏడాది 7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.53 వేల కోట్లు) విదేశీ రుణాలను చెల్లించాల్సి ఉంది. కానీ, విదేశీ మారకద్రవ్యం మాత్రం 150 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1100 కోట్లు) కంటే తక్కువగా ఉంది. వచ్చే ఏడాది నుంచి 2026 వరకు శ్రీలంక 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.90 లక్షల కోట్లు) విదేశీ రుణాలను చెల్లించాల్సి ఉంది.''

శ్రీలంక మొత్తం విదేశీ అప్పులు 50 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3.8 లక్షల కోట్లు.

శ్రీలంక ఇలా విదేశీ రుణాల చెల్లింపును నిలిపివేయడం వల్ల రేటింగ్ ఏజెన్సీలు ఆ దేశాన్నీ డీఫాల్టర్‌గా భావిస్తాయని చెబుతున్నారు.

''శ్రీలంక ఏప్రిల్ 12వ తేదీన సాయంత్రం 5 గంటలకల్లా విదేశీ రుణాలను చెల్లించాల్సి ఉంది. కానీ, శ్రీలంక చెల్లించలేకపోయింది. ఇప్పుడు అధికారికంగానే విదేశీ రుణాల చెల్లింపును నిలిపివేసింది'' అని శ్రీలంక కేంద్ర బ్యాంకు మాజీ గవర్నర్ డబ్ల్యూఏ విజెవర్థన ట్వీట్ చేశారు.

గొటబాయ, మహింద

ఫొటో సోర్స్, Getty Images

సంక్షోభంలో శ్రీలంక

శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితులు బాగా దిగజారిపోయాయి. ఆహార పానీయాల ధరలు సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి పెరిగిపోయాయి. అత్యవసర మందులు కూడా దొరకట్లేదు.

వేలాది మంది ప్రజలు రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నిరసనకారులు గొటబాయ రాజపక్ష రాజీనామా చేయాలని కోరుతున్నారు. గొటబాయ రాజపక్ష అధ్యక్షుడు. ఆయన సోదరుడు మహింద రాజపక్ష ప్రధాన మంత్రి. నిరసనకారులంతా ఓపిక పట్టాలని ఇద్దరు సోదరులూ విజ్ఞప్తి చేస్తున్నారు.

శ్రీలంక రూపాయి విలువ పతనం కూడా ఆగట్లేదు. మంగళవారం డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ 320కి పడిపోయింది. దీనికి తోడు శ్రీలంక కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను ఏడు శాతం పెంచింది. ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకునేందుకే ఇలా వడ్డీ రేట్లు పెంచిందని చెబుతున్నారు.

సకాలంలో శ్రీలంక అప్పులు తీర్చలేకపోయింది. దీని అర్థం ఆ దేశం డీఫాల్టర్‌గా మారిందనా?

ఒక దేశం డీఫాల్ట్ అయ్యే పరిస్థితిని వివిధ రకాలుగా ఎదుర్కొంటుంది. డీఫాల్ట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు చాలా దేశాల్లో అప్పులు తీర్చేందుకు తమ వద్ద డబ్బు లేదని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటిస్తారు.

ఒక దేశం తనను తాను డీఫాల్టర్‌గా ప్రకటించుకోవడం చాలా పెద్ద విషయం. కొన్నిసార్లు వేరే గత్యంతరం లేక ఇలా ప్రకటించుకుంటుంది.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, Getty Images

1991లో భారత్‌..

శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని కొందరు భారత్ 1991లో ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితితో పోలుస్తున్నారు. అప్పుడు భారతదేశం వద్ద విదేశీ మారకద్రవ్యం నిల్వలు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. ఒక బిలియన్ డాలర్ నిల్వలు మాత్రమే మిగిలాయి. అవి కూడా 20 రోజుల పాటు చమురు, ఆహార బిల్లుల చెల్లింపుకు మాత్రమే సరిపోతాయి.

ప్రపంచంలోని ఇతర దేశాలతో ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు అవసరమైన విదేశీ మారకద్రవ్యం కూడా అప్పట్లో భారత్ వద్ద లేదు. భారత్ విదేశీ అప్పులు 72 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.5.48 లక్షల కోట్లకు) చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా అప్పులు ఉన్న దేశాల్లో బ్రెజిల్, మెక్సికో తర్వాత మూడో స్థానంలో భారత్ ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రభుత్వంపైనా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. ద్రవ్యోల్బణం, రెవెన్యూ లోటు, కరెంట్ ఖాతా లోటు రెండంకెలకు చేరుకున్నాయి.

అంతర్జాతీయ కారణాలు..

1990లో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి అప్పట్లో అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు కూడా కారణం. 1990లో గల్ఫ్ యుద్దం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. దీని ప్రభావం భారత్‌పై నేరుగా పడింది. 1990-91లో పెట్రోలియం దిగుమతి బిల్లు 2 బిలియన్ డాలర్ట నుంచి 5.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

భారతదేశం ఎగుమతులు, దిగుమతుల సమతుల్యం దెబ్బతింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంపాదన, వారి నుంచి భారతదేశానికి వచ్చే నగదుపైనా ప్రభావం పడింది. ఆ రెండు సంవత్సరాల్లో దేశంలో రాజకీయ అస్థిరత పెరిగిపోయింది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: 'గ్యాస్ లేదు, కరెంటు లేదు... బిడ్డకు పాలు కూడా కొనే పరిస్థితి లేదు'

1989 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం దక్కలేదు. రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిరాకరించింది. దీంతో రెండో అతిపెద్ద పార్టీ అయిన జనతాదళ్ వీపీ సింగ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నెలకొల్పింది.

కానీ, ఈ సంకీర్ణ ప్రభుత్వం కులం, మతం సంఘర్షణల్లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రధానమంత్రి వీపీ సింగ్ 1990 డిసెంబర్‌లో రాజీనామా చేయాల్సి వచ్చింది. 1991 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకూ ఆపద్ధర్మ ప్రభుత్వం నడిచింది. దేశంలో ఇలాంటి రాజకీయ అనిశ్చితి మధ్య 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు.

ఈ పరిస్థితుల్లోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఎన్‌ఆర్ఐలు తమ డబ్బును ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. భారతదేశానికి ఎగుమతులు చేసేవారంతా భారత్ తమకు డబ్బులు చెల్లించలేదని భావించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దిగుమతులు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుంది. రూపాయి విలువ 20 శాతం పడిపోయింది. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి.

20 టన్నుల బంగారం తాకట్టు పెట్టిన ప్రభుత్వం..

ఐఎంఎఫ్ భారతదేశానికి 1.27 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది. అయినా పరిస్థితులు మెరుగుపడలేదు. 1991 ఆర్థిక సంవత్సరం చివరికి చంద్రశేఖర్ ప్రభుత్వం 20 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

1991 జూన్ 21వ తేదీన పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నిర్ణీత గడువులోగా భారతదేశం విదేశీ అప్పును చెల్లించలేకపోతుందని, డీఫాల్టర్‌గా ప్రకటించుకుంటుందని అప్పట్లో అంతా భావించారు. కానీ, మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా పెట్టుకున్న పీవీ నరసింహారావు పలు సంస్కరణలు తీసుకొచ్చారు. నిర్మాణాత్మక మార్పులతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు.

కాపీ - రజనీశ్ కుమార్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)