శ్రీలంక సంక్షోభం నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?

మహింద రాజపక్స, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, GETTY IMAGES/EPA/TWITTER

ఫొటో క్యాప్షన్, మహింద రాజపక్స, నరేంద్ర మోదీ
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌, శ్రీలంకల మధ్య ఎలాంటి పోలిక లేదు. ఆర్థిక పరంగా చూస్తే శ్రీలంక చాలా చిన్న దేశం. జనాభా కూడా భారతదేశం కంటే చాలా చాలా తక్కువ. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీలంక పరిస్థితులు భారత్ ‌లో కూడా వస్తాయంటూ పోస్ట్‌లు చాలానే కనిపిస్తున్నాయి. నిజంగానే భారత్‌ కూడా శ్రీలంక బాటన నడుస్తోందా?

ఈ ప్రశ్నకు ప్రతిస్పందనగా, హలాల్ బహిష్కరణ, ముస్లిం దుకాణాలు, మసీదులపై దాడులు, క్రైస్తవులపై హింస వంటి శ్రీలంక వార్తలకు సంబంధించిన హెడ్‌లైన్ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.

శ్రీలంక సంక్షోభంలో ఈ వార్తల పాత్ర గురించి నిపుణుల అభిప్రాయం భిన్నంగా ఉన్నప్పటికీ, చాలామంది మాత్రం ఈ సంక్షోభం నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ రోజు శ్రీలంకలో ఏం జరుగుతోందనే కథ ఆర్థిక సంక్షోభంగా ప్రారంభమైంది. అయితే ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇప్పుడు రాజకీయ సంక్షోభం రూపంలో ప్రపంచం ముందు ఉంది.

శ్రీలంకలో ప్రజాందోళనలు

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, శ్రీలంకలో ప్రజాందోళనలు

తగినంత విదేశీ మారక నిల్వలు

శ్రీలంక నుండి భారతదేశం నేర్చుకోగలిగే అంశాలను రెండు భాగాలుగా విభజించవచ్చు- ఒకటి ఆర్థిక పాఠాలు, రెండోది రాజకీయ పాఠాలు.

ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ భిన్నమైనవని. అయితే అందరికీ వర్తించే కొన్ని ఫార్ములాలు ఉన్నాయని సోనెపట్‌లోని అశోకా యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ పుల్లాప్రె బాలకృష్ణ అన్నారు.

ఉదాహరణకు, ఒక దేశంలో అవసరమైన ఆహార పదార్థాలు తగినంత పరిమాణంలో లేకుంటే, ఆ దేశం బయటి నుండి ఆ వస్తువులను దిగుమతి చేసుకోవాలి. దాని కోసం విదేశీ మారక నిల్వలు అవసరమవుతాయి. విదేశీ మారకద్రవ్యం పొందడానికి, ఆ దేశం ఏదైనా ఎగుమతి చేయాలి. అందుకు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేందుకు కూడా సిద్ధంగా ఉండాలి.

"ఆర్థిక రంగంలో శ్రీలంక సంక్షోభం నుండి భారతదేశం తీసుకోవాల్సిన మొదటి పాఠం ఫారెక్స్ నిల్వలపై ఒక కన్నేసి ఉంచడం, ఈ విషయంలో భారతదేశం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే దీర్ఘకాలంలో తన దిగుమతి బిల్లును ఎలా తగ్గించుకోవాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి" అని ఆయన అన్నారు.

సంప్రదాయకంగా ఒక దేశపు విదేశీ మారకద్రవ్య నిల్వలు కనీసం 7 నెలల దిగుమతులకు సరిపోతాయని నిపుణులు చెబుతారు.

అందులోనే రెండో పాఠం ఉంది.

శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, అధ్యక్షుడు గొటాబయ రాజపక్స

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, అధ్యక్షుడు గొటాబయ రాజపక్స

దిగుమతి బిల్లును తగ్గించేందుకు చర్యలు

రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టడం, బొగ్గు కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, అలాగే దేశంలోనే వంట నూనె ఉత్పత్తిని ఎలా పెంచుకోవాలనేది భారతదేశానికి చాలా ముఖ్యమైన అంశం. ఇది దిగుమతి బిల్లును తగ్గించడానికి, స్వావలంబనకు సహాయపడుతుంది.

గణాంకాల ప్రకారం, భారతదేశం తన చమురు అవసరాలలో 80-85% బయట దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. రష్యా-యుక్రెయిన్ సంక్షోభం వల్ల గత కొద్ది రోజులుగా చమురు ధరలు పెరుగుతున్నాయి.

భారతదేశం ఇదే విధంగా చమురు కోసం ప్రపంచ దేశాలపై ఆధారపడుతుంటే, అక్కడ చమురు ధరలు ఇలా పెరుగుతూ పోతుంటే, విదేశీ మారక నిల్వలు ఖాళీ కావడానికి ఎక్కువకాలం పట్టదు. అందువల్ల దేశం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని వేగంగా పెంచుకోవలసి ఉంటుంది. ఇది రాత్రికి రాత్రే జరిగేది కాదు. సుదీర్ఘ ప్రణాళిక అవసరం.

బొగ్గు రంగంలోనూ ఇదే పరిస్థితి. భారతదేశపు విద్యుత్ రంగం, దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడి ఉంది. ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొన్నాయి.

వంట నూనె, బొగ్గు కథలు పెట్రోల్, డీజిల్ కంటే భిన్నంగా లేవు. భారతదేశపు దిగుమతి బిల్లులో ఎక్కువ భాగం కూడా వీటికే ఖర్చు అవుతుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజానీకం కూడా చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

శ్రీలంక సంక్షోభానికి మరో కారణం రాజకీయం. ఆ కోణంలో కూడా భారతదేశం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి.

గ్యాస్ కోసం బారులు తీరిన ప్రజలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గ్యాస్ కోసం బారులు తీరిన ప్రజలు

అధికార కేంద్రీకరణ

ఏళ్ల తరబడి కొందరి చేతుల్లోనే అధికార కేంద్రీకరణ ఏ దేశానికి మేలు చేయదన్నారు ప్రొఫెసర్ పూలప్రి బాలకృష్ణ. శ్రీలంకకు సంబంధించి రాజపక్సే కుటుంబం ఏళ్ల తరబడి అధికారాన్ని ఏ విధంగా శాసించిందో, అదే పరిస్థితి భారత్‌లో కూడా ఉందని అంటున్నారు.

‘‘ఇక్కడ కూడా ఆర్థిక, రాజకీయ నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వంలోని ఎంపిక చేసిన కొంతమంది సలహాదారుల చేతుల్లోనే ఉంటుంది. భారతదేశంలోని అన్ని ప్రభుత్వాలు (రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కావచ్చు) పక్షపాత వైఖరితో పనిచేస్తుంటాయి’’ అని ఆయన అన్నారు

శ్రీలంక సంక్షోభం నుండి పాఠాలు నేర్చుకుంటూ , భారత ప్రభుత్వం ఈ వ్యూహంలో మార్పు తీసుకురావాలని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.

మెజారిటీ రాజకీయాలు

శ్రీలంకలో అత్యధిక జనాభా సింహళీయులు. తమిళులు మైనారిటీలు. అక్కడి ప్రభుత్వం మెజారిటీ రాజకీయాలు చేస్తోందని తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

"చాలాకాలం శ్రీలంకలో విద్యార్థిగా జీవితం గడిపినందున, ఈ అందమైన దేశంలో సంక్షోభానికి స్వల్పకాలిక ఆర్థిక సమస్యలకంటే గత దశాబ్దంలో ఉన్న భాషా, మత, సాంస్కృతిక మెజారిటీవాదంతోనే ఎక్కువ సమస్య ఉందని నేను చెప్పగలను. దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది'' అని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

నేడు భారతదేశంలోని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలన్నీ, హిందీని తమపై రుద్దుతున్నారని ఆరోపిస్తున్నాయనీ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హిజాబ్, లౌడ్ స్పీకర్, గుడి-మసీదు, మాంసం వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.

"మెజారిటీవాద రాజకీయాలకు, సాంస్కృతిక ఎజెండాకు సంబంధం ఉందని నేను అంటాను. ఈ రకమైన రాజకీయాల కారణంగా, దేశంలోని ఒక వర్గం ఏకాకులమన్న భావనలోకి వెళుతుంది'' అన్నారు బాలకృష్ణ

శ్రీలంకలో ఇన్నాళ్లు జరిగిందే భారతదేశంలో చాలా రోజుల నుంచి జరుగుతోందని ఆయన అన్నారు.

బలమైన పౌర సమాజం

ఒకదేశంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు, పౌర సమాజం, రాజ్యాంగ సంస్థలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తాయి.

"రష్యా-యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. అది రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. న్యాయవ్యవస్థ, పోలీసు, ప్రభుత్వం, పార్లమెంటు వంటి సంస్థలు బలంగా ఉండటం ముఖ్యం. ఏది సరైనది, ఏది కాదో నిర్ణయంచుకోవడం ముఖ్యమన్న విషయాన్ని మండుతున్న లంక మనకు తెలియజేస్తుంది'' అని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్ ట్విటర్ లో అన్నారు.

మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (IDSA)లో శ్రీలంక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అసోసియేట్ ఫెలో డాక్టర్ గుల్బిన్ సుల్తానా కూడా ఉదయ్ కోటక్‌ తో ఏకీభవించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి అనేక కారణాలున్నాయని ఆమె అన్నారు.

''అప్పుల భారం, ప్రభుత్వ నిర్వహణ తీరు, వారి విధానాలు అన్నీ బాధ్యత వహిస్తాయి. భారత ప్రభుత్వం వీటి నుంచి అనేక పాఠాలను నేర్చుకోవాలి. శ్రీలంక ప్రభుత్వం తీసుకున్నట్లుగా ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే నిర్ణయాలు తీసుకోకూడదు'' అని ఆమె అన్నారు.

ఓట్ల రాజకీయాలకు శ్రీలంకలో పన్ను మినహాయింపులను ఉదాహరణగా చూపారు. 2019 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు పన్ను మినహాయింపులు ఇస్తామని గొటాబయ రాజపక్స హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే అమలు చేశారని, కానీ ఇది దేశంపై భారం పడేలా చేసిందని ఆమె అన్నారు.

వాగ్దానాలు చేస్తున్నప్పుడు, నిపుణుల అభిప్రాయం లేదా ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని కాకుండా, కేవలం ఎన్నికల లాభాలను మాత్రమే చూడటం వల్ల వచ్చిన సమస్య ఇదని ఆమె అన్నారు. అటువంటి పరిస్థితిలో, పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పౌర సమాజం తమ స్వరాన్ని వినిపించడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో కూడా ఇలాంటి ఎన్నికల వాగ్దానాలు చాలా ఎక్కువ. కొన్నిసార్లు ఈ వ్యవహారం కోర్టుకు చేరుతుంది. కొన్నిసార్లు పౌర సమాజం దానిపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరికొన్నిసార్లు దేశ పార్లమెంటులో నిరసనలు కనిపిస్తాయి.

సాంస్కృతికంగా ప్రజల మధ్య విభేదాలు కూడా లంక సమస్యకు ఒక కారణమని నిపుణులు అంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాంస్కృతికంగా ప్రజల మధ్య విభేదాలు కూడా లంక సమస్యకు ఒక కారణమని నిపుణులు అంటున్నారు

తొందరపాటు నిర్ణయాలు

శ్రీలంక ప్రభుత్వం చేసిన మరో పెద్ద పొరపాటు గురించి డాక్టర్ సుల్తానా వివరించారు.

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఎరువుల దిగుమతులను నిలిపివేస్తే విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావించింది. ఏప్రిల్ 2021లో గొటాబయ రాజపక్స ప్రభుత్వం వ్యవసాయంలో ఉపయోగించే అన్ని రసాయనాల దిగుమతిపై నిషేధాన్ని ప్రకటించింది.

అయితే ఈ నిర్ణయం వల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి ప్రభుత్వం ఆలోచించలేకపోయింది. దీంతో దిగుబడిపై ప్రభావం పడింది. ఎరువులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. నవంబర్ నాటికి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.

''ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ముందు విభిన్న నిపుణుల అభిప్రాయం తీసుకోవడం చాలా ముఖ్యం. భారత ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని అర్థం చేసుకోవాలి. తక్షణ లాభాల కోసం తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో పెను సమస్యగా మారతాయి'' అని డాక్టర్ సుల్తానా హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)