Kurukshetra: శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశంలో ముస్లింలు సమాధి నిర్మించారా? బీబీసీ పరిశోధనలో ఏం తెలిసిందంటే...

ఫొటో సోర్స్, KAMAL SAINI/BBC
- రచయిత, ప్రశాంత్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''శ్రీకృష్ణుడు, అర్జునుడికి గీతోపదేశం చేసిన చోట సమాధిని నిర్మించారు'' అంటూ హరియాణాలోని కురుక్షేత్రకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతోంది.
కురుక్షేత్రలోని జ్యోతిసర్ పుణ్యక్షేత్రానికి ఒక గాథ ఉంది. మహాభారత యుద్ధ సమయంలో ఈ క్షేత్రంలోనే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశారని నమ్ముతారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సుమారు రెండున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఒక యువకుడు మాట్లాడుతూ, కురుక్షేత్ర పుణ్యక్షేత్రంలోని దేవాలయం సమీపంలో సమాధిని నిర్మించినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఆ సమాధిని తొలిగించేలా, వీలైనంత ఎక్కువగా ఈ వీడియోను షేర్ చేయాలని హిందూ సమాజాన్ని అభ్యర్థించారు.
''మిత్రులారా, నేను మిమ్మల్ని కురుక్షేత్రకు తీసుకువచ్చాను. ఇక్కడే అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించాడు. ఇలాంటి చోట గుడికి బదులుగా సమాధిని నిర్మిస్తున్నారు. మీరు నిజమైన హిందువులు లేదా సనాతన ధర్మాన్ని పాటించేవారు అయితే ఈ వీడియోను షేర్ చేయండి లేదా నీళ్లలో మునిగి చచ్చిపోండి. వీళ్లు (ముస్లింలు) 20 శాతంగా ఉన్నప్పుడే మనల్ని బతకనివ్వడం లేదు, ఇక 50 శాతానికి పెరిగితే మీరంతా మనుగడ సాగించలేరు'' అని ఆ వైరల్ వీడియోలో యువకుడు మాట్లాడారు.
ఇదంతా మాట్లాడిన ఆ తర్వాత ఆ యువకుడు ఒక చెట్టును చూపిస్తూ ''ఇదే చెట్టు కింద శ్రీకృష్ణుడు, అర్జునుడికి గీతా జ్ఞానాన్ని అందించాడు. ఇక్కడ ఒక మందిర నిర్మాణం జరుగుతుండగా, అక్కడ ఒక సమాధి నిర్మాణం జరిగిపోయింది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, KAMAL SAINI/BBC
దీని తర్వాత ఒక నిర్మాణంపై పరిచి ఉన్న వస్త్రాన్ని చూపించారు. ఆ వస్త్రంపై 'జై పీర్ బాబా దీ', '786' అనే అక్షరాలు రాసి ఉండటాన్ని వీక్షకులకు చూపిస్తూ... ''వీళ్లు (ముస్లింలు) ఇలాగే మొదలు పెడతారు. కాశీలో ఏం జరిగిందో, మథురలో ఏం జరిగిందో మీ అందరికీ గుర్తుంది కదా'' అంటూ అడిగారు.
సమాధి నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు ట్విటర్, ఫేస్‌బుక్‌లో రెండు లక్షలసార్లకు పైగా వీక్షించారు. 25 వేల సార్లుకు పైగా షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Google
'సుదర్శన్ న్యూస్' అనే న్యూస్ చానల్ కూడా తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ 'ల్యాండ్ జిహాద్' అనే వ్యాఖ్యను జోడించింది. ఈ వీడియోకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హోం మంత్రి అనిల్ విజ్‌లను ట్యాగ్ చేసి సమాధి నిర్మాణంపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
విశ్వ హిందూ పరిషత్ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ ట్విటర్‌లో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హోం మంత్రి అనిల్ విజ్‌లను ట్యాగ్ చేస్తూ... '' చికిత్స పూర్తయింది. సమాజాన్ని జాగృతం చేయడానికి ఇలాంటి కార్యాచరణ చాలా అవసరం'' అని పేర్కొన్నారు.
వైరల్ అవుతోన్న ఈ వీడియో అసందర్భంగా, తప్పుదోవ పట్టించే విధంగా ఉందని బీబీసీ దర్యాప్తులో తేలింది.
వీడియోలో నిజం ఎంత?
ఈ వీడియోలో పేర్కొన్న విషయాలకు సంబంధించిన నిజాలు తెలుసుకోవడానికి కురుక్షేత్ర అడిషనల్ డిప్యూటీ కమిషనర్, ఐఏఎస్ అఖిల్ పిలానీతో బీబీసీ మాట్లాడింది.
''వీడియోలో కనిపిస్తోన్న సమాధి, జ్యోతిసర్ క్షేత్రం పరిసరాల్లోనే ఉంది. అది ఎంతో కాలం నుంచి అక్కడే ఉంది. కొత్తగా నిర్మించినది కాదు. ఈ వీడియోను కావాలనే, అక్కడి పరిస్థితులను చెడగొట్టాలనే ఉద్దేశంతోనే రూపొందించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం'' అని అఖిల్ చెప్పారు.
దీని తర్వాత కురుక్షేత్ర డీఎస్పీ సుభాష్ సింగ్‌తో కూడా బీబీసీ మాట్లాడింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేసినట్లు సుభాష్ సింగ్ తెలిపారు. ఈ వీడియోలో ముస్లిం సమాధి, దేవాలయ ఆక్రమణగా చెబుతోన్న సమాధి... నిజానికి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినదని ఆయన వెల్లడించారు. ఆ సమాధి ఎన్నో ఏళ్లుగా అదే ప్రాంగణంలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, KAMAL SAINI/BBC
''కొంతమంది సంఘ విద్రోహులు, ఆ ప్రాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి పూర్వీకులకు చెందిన ఆ సమాధిపై నీలిరంగు వస్త్రాన్ని ఉంచారు. ఆ వస్త్రంపై ముస్లిం మత చిహ్నాన్ని, 'జై పీర్ బాబా దీ' అనే అక్షరాలను రాశారు'' అని సుభాష్ సింగ్ వివరించారు.
కురుక్షేత్ర పోలీస్ స్టేషన్ థానేదార్ రాజ్‌పాల్ సింగ్, బీబీసీతో మాట్లాడుతూ ''వీడియో వైరల్ అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులకు లభించిన సమాచారం ప్రకారం... జ్యోతిసర్ గ్రామానికి చెందిన రోషల్ లాల్ తండ్రి అర్జున్ దాస్ ఈ సమాధిని నిర్మించారు. తన పూర్వీకుల కోసం 30-35 ఏళ్ల క్రితం దీన్ని కట్టించారు. ఈ కేసులో పోలీసులు డీడీఆర్ (డైలీ డైరీ రిజిస్టర్) నమోదు చేశారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారనే అభియోగం కింద దోషులపై చర్యలు తీసుకుంటాం'' అని అన్నారు.

ఫొటో సోర్స్, KAMAL SAINI/BBC
కురుక్షేత్రకు వెళ్లిన బీబీసీ
ఈ విషయంలో గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోవడానికి బీబీసీ, జ్యోతిసర్ క్షేత్రానికి వెళ్లింది. అప్పటికే 'అఖండ భగవా భారత్ సంఘ్' అనే హిందూ సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు నిరసన వ్యక్తం చేయడానికి ఆ సమాధి వద్దకు చేరుకున్నారు. ఆ సమాధిని అక్కడి నుంచి తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నిర్మాణంతో సంబంధం ఉన్న అర్జున్ దాస్ ఇంటికి బీబీసీ వెళ్లినపుడు, ఆయన ఆరుగురు కుమారుల్లో ఒకరైన రుషిపాల్ భార్య పింకీ శర్మ, బీబీసీతో మాట్లాడారు.
''మా పూర్వీకుల సమాధిపై నీలిరంగు వస్త్రాన్ని ఉంచి ఎవరో అల్లరి పని చేశారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. అది మా పూర్వీకులకు సంబంధించింది. మేం దీపావళి రోజు ఆయనను పూజిస్తాం. మాది హిందూ కుటుంబం. మేం బ్రాహ్మణులం'' అని ఆమె చెప్పారు.
ఈ ఘటనపై తాజా సమాచారాన్ని జ్యోతిసర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్ సనేహి, బీబీసీకి చెప్పారు.
''తప్పుడు వార్తలతో చెలరేగిన వివాదం కారణంగా ఆ కుటుంబం, తమ పూర్వీకులకు చెందిన ఆ నిర్మాణాన్ని జ్యోతిసర్ క్షేత్రం నుంచి తొలిగించి తమ పొలంలో ఏర్పాటు చేసుకున్నారు'' అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
- మన పాలపుంతలో మహా కాల బిలం ఫొటోకు చిక్కింది...
- పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న రూపాయి విలువ... మీ జేబుపై పడే భారమెంత?
- 'ఏడాదిలోగా మనుమడో, మనుమరాలినో కనివ్వండి, లేదా 5 కోట్ల పరిహారం కట్టండి' -కొడుకు, కోడలిపై తల్లిదండ్రుల కేసు
- అమెరికా: జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్‌లో ఉన్న రహస్యాలేంటి, ఏమిటీ వివాదం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













