అమెరికా: జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్‌లో ఉన్న రహస్యాలేంటి, ఏమిటీ వివాదం?

ఫొటో సోర్స్, Getty Images
అది 2020 సంవత్సరం అక్టోబర్ నెల. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది.
ఆ సమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ టాబ్లాయిడ్ 'ది న్యూయార్క్ పోస్ట్' ఒక స్పెషల్ రిపోర్ట్‌ను ప్రచురించింది. ఇందులో యుక్రేనియన్ ఎనర్జీ కంపెనీ బురిస్మా గురించి కొన్ని వివరాలను ప్రచురించింది. జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ ఒకప్పుడు దాని డైరెక్టర్.
ఈ కథనం ప్రకారం, రిపేర్ షాపుకు వచ్చిన ఒక ల్యాప్‌టాప్ నుండి కొన్ని ఈ మెయిల్ బైటికి వచ్చాయి. జో బైడెన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు, ఆయన కొడుకు హంటర్ తన తండ్రి ఇంటి పేరును వ్యాపార సంబంధాలను ప్రభావితం చేయడం కోసం ఒక సంస్థ ఉన్నతాధికారి ముందు ఉపయోగించారని ఈ ఈమెయిళ్లలో ఉంది.
బురిస్మా వ్యవస్థాపకుడిని విచారిస్తున్న యుక్రేనియన్ ప్రాసిక్యూటర్‌ను తొలగించాలని జో బైడెన్ ఒత్తిడి చేసినట్లు కూడా ఈ కథనం పేర్కొంది.
డోనాల్డ్ ట్రంప్, ఆయన అనుచరులు మాత్రం లీకైన ఈ వాదనలను జో బైడెన్ తిరస్కరిస్తారని తమకు తెలుసని, కానీ, తన కొడుకు వ్యాపారం గురించి కూడా బైడెన్‌కు కూడా తెలిసే ఉంటుందని అన్నారు.
ఈ ల్యాప్‌టాప్ నుండి అనేక కథనాలు, వ్యక్తిగత ఫొటోలు కూడా బైటికి వచ్చాయి. కానీ ఇతర మీడియా సంస్థలు ఈ కథనానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.
న్యూయార్క్ పోస్ట్ కథనం వెనుక 'విదేశీ హస్తం' ఉంటుందనే భయంతో సోషల్ మీడియా కూడా దానిని నిషేధించింది. ఆ కథ 'బ్రేక్' అయ్యి రెండేళ్లు దాటింది. అయితే, దీనిపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
'దురదృష్టవంతుడైన కొడుకు'
''హంటర్ బైడెన్‌ను జీవితాంతం దురదృష్టం వెంటాడుతూనే ఉంది'' అని పొలిటికో మ్యాగజైన్ జర్నలిస్ట్ బెన్ ష్రెకింగర్ చెప్పారు. ఆయన "ది బైడెన్స్: ఇన్‌సైడ్ ది ఫస్ట్ ఫ్యామిలీస్' 50 ఇయర్స్ రైజ్ టు పవర్" అనే పుస్తకాన్ని రచించారు.
హంటర్ తండ్రి జో బైడెన్ 1972లో అమెరికా స్టేట్ డెలావేర్ నుండి సెనేటర్‌గా ఎన్నికయ్యారని బెన్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు జో బైడెన్ వయసు 29 ఏళ్లు మాత్రమే. ఆ నెలలోనే బైడెన్ కుటుంబానికి ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది.
జో బైడెన్ భార్య, తన ముగ్గురు పిల్లలతో కలిసి క్రిస్మస్ ట్రీ తీసుకురావడానికి బయలుదేరారు. ''కారులో హంటర్ బైడెన్, అతని సోదరుడు బో బైడెన్, చెల్లెలు, తల్లి నీలియా ఉన్నారు. కారును ట్రక్కు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో అతని తల్లి, సోదరి మరణించారు. హంటర్, అతని సోదరుడు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది'' అని బెన్ వివరించారు.
జో బైడెన్ ఆసుపత్రి నుండే సెనేటర్‌గా ప్రమాణం చేశాడని బెన్ వివరించారు. అప్పుడు హంటర్ వయస్సు కేవలం 2 సంవత్సరాలు. అతను అప్పటి నుండి ప్రజల దృష్టిలో ఉన్నారు.
హంటర్ చదువులో చాలా తెలివైన వాడని బెన్ చెప్పారు. కానీ, తల్లి మరణం తాలూకు షాక్ ఆయనను వెంటాడుతూనే ఉంది. మొదట మద్యానికి, ఆ తర్వాత డ్రగ్స్‌కు బానిసయ్యాడు.
అతని సోదరుడు బో బైడెన్ మొదట సైన్యంలో చేరారు. తరువాత తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. డెలావేర్ అటార్నీ జనరల్ అయ్యారు.
2015లో, బో బైడెన్ బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించారు. దీంతో హంటర్ మరోసారి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
''మొదట హంటర్ భార్య అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత మరణించిన తన సోదరుడు బో బైడెన్ భార్య హేలీతో ఆయనకున్న అనుబంధం బైటికి వచ్చింది. దీని గురించి పత్రికల్లో కథనాలు వచ్చాయి. తండ్రి జోబైడెన్ కూడా ఈ అనుబంధాన్ని అంగీకరించారు. కానీ, వారి మధ్య బంధం కూడా కొన్నాళ్లకు చెడిపోయింది. తన బిడ్డకు తండ్రి అంటూ హంటర్ బైడెన్ పై ఓ మహిళ అర్కన్సాస్‌లో కేసు కూడా వేసింది. ఆ తర్వాత హంటర్ మెలిస్సా కోయెన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. తాను వ్యసనాల నుంచి బైటపడటానికి మెలిస్సాయే కారణమని హంటర్ చెబుతుంటారు. వారిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది'' అని బెన్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
హంటర్ బైడెన్ తన వ్యక్తిగత జీవితంలోని గందరగోళం వల్ల మాత్రమే వార్తల్లోకి ఎక్కలేదు. ఆయన వ్యాపార వ్యవహారాలు కూడా వివాదాస్పదమయ్యాయి.
యేల్ లా స్కూల్ నుండి పట్టా పొందిన తరువాత, హంటర్ ఎంబీఎన్ఏ బ్యాంకు కోసం పని చేశారు. ఆ సమయంలో అది డెలావేర్ లో అతి పెద్ద బ్యాంక్. అందులో చేరినప్పటి నుంచి తండ్రి జోబైడెన్‌తోపాటు, హంటర్ బైడెన్ కూడా వివాదాల్లో చిక్కుకుంటూ వచ్చారు.
''ఈ బ్యాంకు ఎజెండాను జో బైడెన్ ముందుకు తెస్తున్నారని దేశంలోని వార్తాపత్రికలు విమర్శించాయి. ఈ బ్యాంకుకు మొదట హంటర్ బైడెన్ ఉద్యోగిగా, తరువాత కన్సల్టెంట్ గా పని చేశారు. హంటర్ ఎప్పుడూ నేరుగా లాబీయింగ్ చేయలేదని జో బైడెన్ చెప్పారు. కానీ, సెనెటర్ కుమారుడు లాబీయింగ్ చేస్తున్నారని నిరంతరం విమర్శలు వినిపించేవి'' అని బెన్ వెల్లడించారు.
బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హంటర్ అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో కూడా పనిచేశారు. ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఆయనను రైలు ఆపరేటర్ ఆమ్‌ట్రాక్ బోర్డుకు నామినేట్ చేశారు. ఆయన ఒక లాబీయింగ్ సంస్థకు సహ వ్యవస్థాపకుడు కూడా. యుక్రెయిన్, చైనాలతో వ్యాపారం చేశారు.
2019 సంవత్సరం వరకు కూడా ఆయన డ్రగ్స్ వ్యసనం నుంచి బైటపడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని గుర్తు చేసుకోవాలని బెన్ అన్నారు. ల్యాప్‌టాప్‌ను మరమ్మతు కోసం డెలావేర్‌లో దుకాణానికి అప్పగించినప్పుడు హంటర్ ఏం చేస్తున్నారు ?
ఆ ల్యాప్‌టాప్ గురించి తనకేమీ తెలియదని చెప్పినట్లు బెన్ వెల్లడించారు. తాను డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు ఉపయోగించిన ల్యాప్ టాప్ అదొక్కటే కాకపోవచ్చని కూడా ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డెలావేర్ రిపేర్ షాప్- ల్యాప్‌టాప్
''ఏప్రిల్ 2019లో ఎవరో తనకు మూడు ల్యాప్‌టాప్‌లను రిపేర్ కోసం ఇచ్చారని డెలావేర్‌లోని కంప్యూటర్ రిపేర్ షాప్ యజమాని జాన్ పాల్ మాక్ ఐజాక్స్ పేర్కొన్నాడు" లాస్ ఏంజెల్స్ టైమ్స్ వైట్‌హౌస్ కరస్పాండెంట్ కర్ట్నీ సుబ్రమణ్యం వెల్లడించారు.
షాపు యజమాని తెలిపిన వివరాల ప్రకారం..నీరు పడి పాడైపోయిన రెండు కంప్యూటర్లకు మరమ్మతులు సాధ్యం కాలేదని, ల్యాప్‌టాప్‌లు తెచ్చింది ఎవరో గుర్తులేకపోయినా, ఇచ్చిన వ్యక్తి మాత్రం హంటర్ బైడెన్ అనే పేరు చెప్పాడని షాపు యజమాని వెల్లడించారు.
అయితే, ఆ ల్యాప్‌టాప్‌ను ఆ షాపుకు ఇచ్చినట్లు తనకు గుర్తు లేదని హంటర్ చెబుతున్నారు. చాలా నెలలు గడిచినా ల్యాప్‌టాప్ తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో షాప్ యజమాని అందులోని డేటాను తనిఖీ చేశారు.
''కంప్యూటర్‌లో ఏముందో, అది ఎవరిదో తెలిసిన తర్వాత తాను ఎఫ్‌బీఐని సంప్రదించాలని నిర్ణయించుకున్నట్లు షాప్ యజమాని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ల్యాప్‌టాప్‌లో దొరికిన ఆధారాలకు షాప్ యజమాని కాపీని కూడా తయారు చేసారు. ల్యాప్‌టాప్‌లోని విషయాలు తెలిసిన తర్వాత తాను ప్రమాదంలో పడతానేమోనని షాప్ యజమాని జాన్ భయపడ్డారు'' అని కర్ట్నీ వెల్లడించారు.
కొన్ని వారాల తర్వాత ఎఫ్‌బీఐ ఆ ల్యాప్‌టాప్‌కు సీలు వేసింది. అది 2019 డిసెంబర్ నెల. అప్పటికి ఒక పెద్ద రాజకీయ వార్త సిద్ధమవుతోంది.
''డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు అభిశంసనను ఎదుర్కొన్నారు. యుక్రెయిన్‌కు సైనిక సహాయం చేయాలంటే బైడెన్ పై దర్యాప్తు చేయాల్సిందిగా ట్రంప్ యుక్రేనియన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలను ఎదుర్కొన్నారు. 2015లో బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉండగా, అవినీతిపరుడైన యుక్రేనియన్ ప్రాసిక్యూటర్ తొలగించేందుకు బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ ఆరోపించారు. అయితే, ఈ ప్రయత్నాలన్నీ అమెరికా విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉండగా, తన కుమారుడికి ప్రయోజనం కలిగించే లక్ష్యంతోనే బైడెన్ ఈ ప్రయత్నాలన్నీ చేశారని ట్రంప్ అన్నారు. ఈ ప్రాసిక్యూటర్ హంటర్‌కు చెందిన గ్యాస్, ఆయిల్ కంపెనీకి సంబంధించిన కేసును విచారిస్తున్నారు.
కంప్యూటర్ షాపు యజమాని జాన్ తనను తాను ట్రంప్‌కు మద్దతుదారుగా అభివర్ణించుకున్నారు. అభిశంసన ప్రక్రియను కూడా ఆయన వీక్షించారు. ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఈ సమాచారాన్ని దాచి పెట్టవచ్చన్న అనుమానంతో, రూడీ గియులియానీ లాయర్‌కు హార్డ్ డ్రైవ్ కాపీని కూడా ఇచ్చినట్లు జాన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రూడీ అప్పుడు ట్రంప్ కోసం పనిచేస్తున్నారు. ఆయన యుక్రెయిన్ బైడెన్ కుమారుడికి సంబంధించిన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ల్యాప్‌టాప్ రిపేర్ షాప్ యజమాని చెప్పిన వింత కథనంపై మీడియా సంస్థలు కూడా అనుమానం వ్యక్తం చేశాయి.
ఫాక్స్ న్యూస్‌కు ట్రంప్ కు సంబంధాలున్నట్లు తెలుసు. అయినా, ఆ పత్రిక ఈ కథనం విశ్వసనీయతను ప్రశ్నించింది. కానీ, చివరకు న్యూయార్క్ పోస్ట్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. అయితే, చాలామంది జర్నలిస్టులు ఈ కథనం మూలాలను ప్రశ్నించారు.
ఈ కథనం బైటికి రాకుండా ఆపేందుకు, జో బైడెన్‌ను రక్షించడానికి మీడియా కూడా కుట్ర పన్నిందని ట్రంప్ సన్నిహితులు ఆరోపించడం ప్రారంభించారు.
అయితే, మీడియా జాగ్రత్త పడటానికి ఒక కారణం ఉంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో హిల్లరీ క్లింటన్, డెమొక్రాట్‌లను దెబ్బతీసేలా ఉన్న రష్యన్ ప్రాయోజిత లీక్ మెయిళ్ల ఆధారంగా ఎన్నికల సమయంలో చాలా కథనాలు ప్రచురించింది మీడియా. అందుకే, ఈసారి సోషల్ మీడియా కూడా న్యూయార్క్ పోస్ట్ వార్తను ముందుకు వెళ్లనివ్వలేదు.
"ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు ఈ కథనానికి సంబంధించిన లింక్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు మేం గమనించాము. దీని తర్వాత మరింత ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ కథనాన్ని కావాలని తొక్కేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి'' అని కర్ట్నీ అన్నారు.
న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని బ్లాక్ చేయడం పొరపాటని ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తరువాత అన్నారు. ఆ ల్యాప్‌టాప్ ఇప్పటికీ ఎఫ్‌బీఐ దగ్గర ఉంది. అయితే, ఇప్పటికే చాలామంది ఆ హార్డ్‌డ్రైవ్‌లో ఏముందో చూశారు.

ఫొటో సోర్స్, Reuters
ల్యాప్‌టాప్ డేటా
"ఈ ల్యాప్‌టాప్‌లో 217 గిగాబైట్ల కంటెంట్ ఉంది. ఇందులో 10 సంవత్సరాలలో దాదాపు లక్షా 29 వేల ఈమెయిళ్లు ఉన్నాయి. అలాగే 36 వేల ఫొటోలు, 5 వేల టెక్స్ట్ మెసేజ్ ఫైళ్లు, 1300 వీడియో ఫైళ్లు ఉన్నాయి'' అని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వైట్ హౌస్ రిపోర్టర్ మాట్ వీజర్ వెల్లడించారు.
మాట్ వీజర్ వద్ద కూడా ఆ ల్యాప్‌టాప్ హార్డ్ డ్రైవ్ కాపీ కూడా ఉంది. ట్రంప్ సహాయకుడు స్టీవ్ బన్నన్‌తో కలిసి పనిచేసిన జాక్ మాక్సీ తనకు ఈ హార్డ్ డ్రైవ్ ఇచ్చారని ఆయన అంటున్నారు. అయితే అందులో చాలా సమస్యలు ఉన్నాయి.
"ఇది చాలామంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. మేము వారి వేలిముద్రలను డ్రైవ్‌లో చూడగలిగాము. ల్యాప్‌టాప్‌లోని కంటెంట్‌లను సీక్వెన్షియల్ పద్ధతిలో ఉంచడానికి వారు ఫోల్డర్‌లను సృష్టించారు. అది ప్రామాణికమైనదా లేదా డేటా కొత్త డేటాతో భర్తీ చేశారా అని మేం కనుక్కోవాల్సి ఉంది'' అన్నారు మాట్ వీజర్.
''ఈ డ్రైవ్‌లో కేవలం ఈమెయిళ్లు కాక అనేక విషయాలున్నాయి. హంటర్ బైడెన్ ఒక మహిళతో ఉన్న చిత్రాలు ఉన్నాయి. అనేక ఇతర ఫొటోలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని వార్తాపత్రికలు ప్రచురించాయి. డ్రైవ్‌లో అధ్వాన్నమైన మెటీరియల్ ఉండవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి, కానీ అలాంటిది ఏదీ కనిపించలేదు'' అని మాట్ వీజర్ అన్నారు.
ఈ డేటా హంటర్, అతని వ్యాపార కార్యకలాపాల గురించి కొంత సమాచారాన్ని అందిస్తుందని మాట్ అన్నారు. అయితే, జో బైడెన్ స్వయంగా హంటర్ వ్యాపార కార్యకలాపాలలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారం లేదని వీజర్ వెల్లడించారు.
''హంటర్ చేసే డీల్స్‌లో జో బైడెన్ 10 శాతం పొందుతారనేది ఆరోపణ. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో చాలామంది దృష్టిని ఆకర్షించిన ఒక ఈమెయిల్ చైనీస్ ఎనర్జీ కంపెనీతో వ్యాపార సంబంధం గురించి చెబుతుంది. దాని నుంచి వచ్చిన లాభాలు బైడెన్ కొడుకుతో లింకు ఉన్నవి. కానీ అలాంటి వ్యాపార సంబంధాలు ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదు. జో బైడెన్ 10% డబ్బును పొందినట్లు కూడా ఎక్కడా సంకేతాలు లేవు" అన్నారు మాట్ వీజర్
అప్పట్లో జో బైడెన్ కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

ఫొటో సోర్స్, EPA
కుటుంబ సంబంధాలు
''ఇది వ్యక్తిగత విషయం కాదు. ఒక వ్యక్తి తన వ్యాపారం కోసం తన కుటుంబాన్ని ఉపయోగించుకోవడం. ల్యాప్‌టాప్ నుంచి బైటపడ్డ ఈమెయిళ్లను బట్టి హంటర్ బైడెన్ వ్యాపారాలు చక్కగా ఉండకపోవచ్చు, కానీ చట్టవిరుద్ధంగా కాకపోవచ్చు'' అని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్‌లోని గవర్నమెంట్ ప్రొక్యూర్‌మెంట్ లా స్టడీస్ అసిస్టెంట్ డీన్ జెస్సికా టిలిప్‌మాన్ అన్నారు.
అధ్యక్షుడి కొడుకుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వారిలో హంటర్ బైడెన్ మొదటి వారు కాదని జెస్సీకా అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన కుటుంబ సభ్యులు అధ్యక్ష పదవిని సద్వినియోగం చేసుకున్నారనే ఆరోపణలు వినిపించాయని జెస్సీకా గుర్తు చేశారు.
ట్రంప్ తన కూతురు, అల్లుళ్లకు వైట్‌హౌస్‌లో ఉద్యోగం ఇచ్చారని జెస్సికా అన్నారు. ట్రంప్ అల్లు జరాద్ కుష్నర్ ఇటీవల వైట్ హౌస్ నుంచి నిష్క్రమించిన తర్వాత, అతని పెట్టుబడి సంస్థ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ నేతృత్వంలోని ఫండ్ నుంచి రెండు బిలియన్ డాలర్ల మొత్తాన్ని పొందినట్లు సమాచారం.
అయితే, తన ఇంటి పేరు కారణంగా యుక్రెయిన్ ఎనర్జీ కంపెనీ బురిస్మా తనతో చేతులు కలిపిందని హంటర్ బైడెన్ అంగీకరించారు. ఇంటి పేరు వల్ల అదృష్టంతోపాటు, సమస్యలు కూడా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.
ల్యాప్‌టాప్‌ల విషయంలో రాజకీయాలకు త్వరలో తెరపడనుందనేది కూడా నిజం. అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ వస్తే వారు దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- తెలంగాణ: పెళ్లయిన నెల రోజులకే భర్త పీక పిసికి, పైట బిగించి హత్య చేసిన భార్య... ఏం జరిగిందంటే
- సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- బిట్ కాయిన్ ధర ఆరు నెలల్లో ఎందుకు సగానికి పడిపోయింది... క్రిప్టోవింటర్ అంటే ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












