డోనల్డ్ ట్రంప్‌కి చైనాలో బ్యాంకు అకౌంట్ ఉంది: న్యూయార్క్ టైమ్స్ వెల్లడి

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చైనాలో బ్యాంకు అకౌంట్ ఉందని.. ఆ దేశంలో వ్యాపార ప్రాజెక్టుల కోసం ఎన్నో ఏళ్లు ఖర్చుచేశారని ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో వెల్లడించింది.
ఈ అకౌంట్‌ను ట్రంప్ ఇంటెర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ నిర్వహిస్తోంది. ఈ ఖాతా ద్వారా 2013 - 2015 వరకు చైనాలో స్థానిక పన్నులు కూడా చెల్లించారు.
ఆసియాలో హోటల్ వ్యాపార అవకాశాల కోసం ఈ అకౌంట్ తెరిచినట్లు ట్రంప్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
అమెరికా సంస్థలు చైనాలో వ్యాపారాలు చేయటం పట్ల ఇటీవలి కాలంలో ట్రంప్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు కూడా రాజుకున్నాయి.
ట్రంప్ పన్నుల రికార్డులను పరిశీలించిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆయనకు చైనాలో బ్యాంకు ఖాతా ఉందనే విషయాన్ని బయట పెట్టింది. ట్రంప్ పన్నుల రికార్డుల్లో ఆయన వ్యక్తిగత పన్నుల వివరాలతో పాటు, వ్యాపార పన్నులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడయిన తరువాత 2016 , 2017 సంవత్సరాలలో అమెరికాకు పన్నుల రూపంలో 750 డాలర్లు (సుమారు రూ. 55,000) చెల్లించారని న్యూయార్క్ టైమ్స్ ఇంతకు ముందు కథనాలలో వెల్లడించింది.
అయితే.. చైనాలో ఉన్న బ్యాంకు అకౌంట్ ద్వారా ఆ దేశంలో స్థానిక పన్నుల రూపంలో 1,88,561 డాలర్లు చెల్లించినట్లు తాజాగా బయటపెట్టింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 3వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. చైనా విషయంలో అనుసరించే విధానాలను కూడా ట్రంప్ విమర్శిస్తున్నారు.
జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్‌కి చైనాతో ఉన్న సంబంధాలను కూడా ట్రంప్ ప్రభుత్వం వేలెత్తి చూపుతోంది. అయితే.. జో బైడెన్ ఆదాయ పన్ను రిటర్నుల్లో చైనాతో ఎటువంటి లావాదేవీలూ కనిపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్స్ మేనేజ్మెంట్.. చైనాలో స్థానిక పన్నులు చెల్లించడానికి మాత్రమే అమెరికాలో కూడా బ్రాంచీలు గల ఒక చైనా బ్యాంకులో ఖాతా తెరిచినట్లు ట్రంప్ సంస్థల లాయర్ అలన్ గార్టెన్ చెప్పారు.
‘‘దాని ద్వారా ఎటువంటి ఒప్పందాలు కానీ, లావాదేవీలు కానీ, కార్యకలాపాలు కానీ జరగలేదు.. 2015 నుంచి ఆ కార్యాలయం క్రియారహితంగా ఉంది’’ అని గార్టెన్ పేర్కొన్నారు.
ఈ బ్యాంకు అకౌంట్ పనిచేస్తున్నప్పటికీ.. దీనిని మరే ఇతర పనులకూ వాడలేదని ఆయన న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి అమెరికాతో పాటు ప్రపంచంలో వివిధ దేశాలలో వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకు స్కాట్లాండ్, ఐర్లాండ్ లో ఉన్న గోల్ఫ్ కోర్సులలో, కొన్ని విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్ల వ్యాపారాలు ఉన్నాయి.
ఆయనకు చైనాతో పాటు, బ్రిటన్, ఐర్లాండ్‌లలో కూడా బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
చైనా నుంచి తమ వ్యాపారాలను ఉపసంహరించిన వారికి పన్ను మినహాయింపులు ఇస్తానని ట్రంప్ ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించారు.
అమెరికా నుంచి చైనాకు పనులను అవుట్‌సోర్స్ చేస్తున్న కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులను కూడా రద్దు చేస్తామని బెదిరించారు.
పది నెలల్లో కోటి ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ, 'చైనా మీద ఆధారపడటానికి ముగింపు పలకాలి' అనే పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ట్రంప్ చేస్తున్న పనులు ఈ ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ చెబుతోంది.
చైనాలో భూ సంబంధిత వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ భావిస్తున్నట్లు న్యూ యార్క్ టైమ్స్ కథనం. 2012 తర్వాత షాంఘై ఆఫీసుని తెరవడం ద్వారా ఈ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది అని పత్రిక పేర్కొంది.
ట్రంప్‌కి సంబంధించిన సంస్థలు.. చైనాలో ప్రాజెక్టుల కోసమే కొన్నేళ్లలో ప్రత్యేకంగా నెలకొల్పిన 5 చిన్న సంస్థలలో 1,92,000 డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు ట్రంప్ పన్నుల వివరాలు చెబుతున్నాయని పత్రిక తెలిపింది.
ఈ కంపెనీలు 2010 నుంచి వ్యాపార ఖర్చుల నిమిత్తం కనీసం 97,400 డాలర్లు వాడాయి. అందులో కొంత మొత్తాన్ని 2018లో కూడా పన్నుల చెల్లింపులు, అకౌంటింగ్ రుసుముల నిమిత్తం వాడినట్లు తెలుస్తోంది.
అయితే.. చైనాలో ట్రంప్ వ్యాపార ప్రణాళికలను చాలా వరకు ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్స్ మేనేజ్మెంట్.. టీఎచ్‌సీ చైనా డెవలప్‌మెంట్ సంస్థలో ప్రత్యక్ష యాజమాన్యం ద్వారా నడిపిస్తోందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జపాన్ 'ట్విటర్ కిల్లర్': ‘అవును ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- ‘నన్ను నేను చంపుకోవాలనే ప్రయత్నాలను చంపేశా.. ఇలా..’
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








