ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?

ఫొటో సోర్స్, @ncbn
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
నాలుగు దశాబ్దాల పార్టీ చరిత్రలో తొలిసారి తెలుగుదేశం పార్టీ పొత్తుల విషయంలో అయోమయంలో పడిపోయింది. పొత్తులపై చివరి క్షణం దాకా ఏదీ తేల్చకుండా అందరిని నరాలు తెగే ఉత్కంఠకు గురి చేయడం చంద్రబాబు నాయుడి విధానం. తన మిత్రుడెవరో, శత్రువెవరో స్వేచ్ఛగా నిర్ణయించుకుంటూ పొత్తులు పెట్టుకుంటూ వచ్చిన పార్టీ టీడీపీ.
1985 నుంచి 1994 దాకా ఎన్టీఆర్ శాసించారు. 1996 నుంచి నుంచి 2014 దాకా చంద్రబాబు శాసించారు. అయితే, ఎన్టీఆర్ హయాంలో ఎన్నికల సర్దుబాటు జరిగేది. చంద్రబాబు హయాంలో పొత్తులుండేవి. 2019 తర్వాత చంద్రబాబు అంచనా తారుమారయింది. చివరకు పొత్తు ఎవరితో పెట్టుకోవాలో, ఎవరొస్తారో, ఎవరు రారో నిర్ణయించుకోలేకపోతున్న సంకటంలోకి టీడీపీ జారిపోయింది.
ఒకపుడు తన సాయం కోసం ఎదురు చూసిన బీజేపీ ఇపుడు చంద్రబాబును దూరంగా ఉంచుతున్నది. ఏమేమో వూహించుకుని ఎన్డీయే నుంచి బయటకు జరిగి ఎదురుదెబ్బలు తిన్నాక మళ్లీ బీజేపీయే భేష్ అని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉంది. గత మూడేళ్లుగా స్నేహ హస్తం కోసం బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారు. మోదీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు.
అయితే, 2014లాగా మళ్లీ టీడీపీతో పొత్తు ఉంటుందన్న నమ్మకం ప్రధాని మోదీ కూడా కలిగించడం లేదు. మోదీ అసలు జగన్మోహన్‌రెడ్డిని కాదని చంద్రబాబు వైపు వస్తారా? దేని కోసం రావాలి? జగన్మోహన్‌రెడ్డితో ప్రయోజనం నెరవేరుతున్నపుడు చంద్రబాబు అవసరమేమిటి?
బీజేపీని టీడీపీని జనసేన కలుపుతుందా?
2024 ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పొత్తు ఎలా ఉండబోతున్నదో టీడీపీ తేల్చుకోలేకపోతున్నది.
ప్రస్తుతం బీజేపీకి జనసేనకు ఒక అవగాహన కుదిరింది. అయితే, ఇదే సమయంలో జనసేన టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నది. ఇదెలా సాధ్యం? దీనికోసం బీజేపీని తమ కూటమిలోకి తీసుకురావాలి. పవన్ ఈ పనిచేయగలరా? బీజేపీతో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎలాంటి సూచనలు లేవు.
ఈ కూటమిలో బీజేపీ కలిసే అవకాశమే లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు చెబుతున్నారు.
"ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బీజేపీకి ఒకే లైన్ ఉంటుంది. ఈ రాష్ట్రాలలో బీజేపీ సొంతంగా ఎదగాలనుకుంటున్నది. అలాంటపుడు పొత్తులు పనికిరావు. ఆంధ్రకు సంబంధించి వైసీపీతో గాని, టీడీపీతో గాని పొత్తు ఉండకపోవచ్చు. ఈ పొత్తు బీజేపీని ఎదగనీయదు. టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ బాగా నష్టపోయింది. అందువల్ల స్వంతంత్రంగా పోటీ చేసేందుకు కార్యకర్తలు ఇష్టపడుతున్నారు'' అని ఆయన చెప్పారు.
''ఇక ముందు బీజేపీ మొదటి స్థానానికో లేకుంటే రెండో స్థానానికో పోటీ పడుతుంది కాని, పొత్తులు పెట్టుకుని ఎక్కడో మూడో స్థానంలోనో నాలుగో స్థానంలోనో ఉండటం ఇక సాధ్యంకాదు" అని శేఖర్‌రావు తెలిపారు.

ఫొటో సోర్స్, CBN/facebook
టీడీపీ సంకట పరిస్థితి
టీడీపీ అవస్థ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాటల్లో చాలా స్పష్టంగా వ్యక్తమయింది."జగన్మోహన్‌రెడ్డి అరాచక పరిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు అన్ని పార్టీలు దగ్గరవ్వాలి. దానికి నేను కొన్ని త్యాగాలకు సిద్ధమవుతాను" అని మొన్న కాకినాడ జిల్లా అన్నవరంలో మాట్లాడుతూ ప్రకటించారు. దీనర్థం ఏమిటి? కూటమిలో చేరితే ఎక్కువ సీట్లు ఇస్తామనా? లేక ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీయేతర అభ్యర్థిని నిలబెడతామని సంకేతమా?
దీనికి చంద్రబాబును బాగా ఇరుకున పెట్టేలా అధికార వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
''చంద్రబాబు తాను ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించి త్యాగనిరతి నిరూపించుకోవాలి'' అని సజ్జల గుచ్చుకునే వ్యాఖ్య చేశారు.
ఇది సరదాగా చేసిన వ్యాఖ్యే అయినా బాగా భగ్గున మండే స్వభావం ఉన్న వ్యాఖ్య కూడా. పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అభిమానులు 'పవన్ - సీఎం' అని అరుస్తున్న సంగతి తెలిసిందే. కాపులు కూడా ఇదే ఆశిస్తున్నారు. సజ్జల ఝలక్ వారందరిని కితకితలు పెడుతూ ఉంటుంది.
పదేళ్లవుతున్నా 'జనసేన' సొంతంగా పోటీ చేసే స్థాయికి ఎదగలేకపోతున్నది. పొత్తుంటే తప్ప ముందుకు పోలేని పరిస్థితి పవన్ కల్యాణ్‌ది. బలమయిన ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నంత కాలం ముఖ్యమంత్రి కాదు కదా ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా కాలేరు.
పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలంటే, 2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫ్రంటు కోసం కుటుంబేతరుడయిన డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ని ఎలా ప్రధానమంత్రిగా ప్రకటించారో అదే 'త్యాగనిరతి'ని చంద్రబాబు కూడా ప్రదర్శించి కుటుంబేతర వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. ఇది సాధ్యమా?

ఫొటో సోర్స్, @ncbn
ప్రాంతీయ పార్టీల్లో త్యాగాలుంటాయా?
కుటుంబాల జమీందారీల్లాగా నడుస్తున్న ప్రాంతీయ పార్టీలు ఇలాంటి పదవీ త్యాగాలు చేసిన సందర్భాలు లేవు. చరిత్రలో ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ నాయకుడు అధికారాన్ని ఇతరులకు అప్పగించి పదవులకు దూరంగా ఉన్నారు. ఆయనే శివసేన నేత సంస్థాపకుడు బాల్ ఠాక్రే. అధికారాన్ని కుటుంబం దరిదాపుల్లోకి రానీయలేదు. శివసేన ఎన్నికల్లో గెలిచినపుడు కుటుంబాన్ని ముఖ్యమంత్రి, మంత్రి పదవులతో, ఎంపీలతో కుక్కి పడేయలేదు. కుటుంబ సభ్యులెవ్వరినీ పార్లమెంటుకు పంపలేదు. ఇది తప్ప మరొక ఉదాహరణ లేదు.
కాకపోతే, ఒక కేసులో శిక్షపడి జైలుకు పోతున్నపుడు గత్యంతరం లేక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన కుటుంబ సభ్యులను కాకుండా విధేయుడైన పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి చేశారు. ప్రాంతీయ పార్టీల సంస్కృతికి భిన్నంగా ముఖ్యమంత్రి పదవికి వేరే పార్టీకి చెందిన పవన్ కల్యాణ్ పేరును కేవలం పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ప్రకటించగలరా? సజ్జల బాగా ఇబ్బందికరమయిన సవాల్ విసిరారు.
చంద్రబాబు నాయుడు ఈసారి పొత్తులకు చిత్తయి సొంత రాష్ట్రంలో 'కింగ్' కాకుండా 'కింగ్ మేకర్'గా మారే ఔదార్యం ప్రదర్శించగలరా? రేపు బీజేపీ పవన్ పేరుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సూచించి పొత్తుకు సై అంటే టీడీపీ ఎలా స్పందిస్తుందో ఊహించలేం. పొత్తు ఇలా ఇరకాటంలో పడేస్తుందని టీడీపీ అధినేత ఊహించి ఉండరేమో.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL
ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులెలా మొదలయ్యాయి?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి లేదా మిత్రపక్షం అనే రాజకీయ వ్యూహం తెలుగుదేశం పార్టీతో మొదలయింది. అసలు 1982లో తెలుగు దేశం పార్టీ పుట్టుకే ఒక ఎన్నికల కూటమి అని, అప్పుడు చెల్లాచెదురుగా ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక శక్తులైన స్వతంత్ర పార్టీ, లోక్ దళ్, సోషలిస్టు పార్టీ, తర్వాత జనతా పార్టీల మాజీ నేతల కలయికే 'తెలుగుదేశం' రూపం తీసుకుందని హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ కె.సి.సూరి వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎపుడూ కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు బలంగానే ఉండేవి. ఈ పార్టీలకు ఓట్లు సమృద్ధిగా పడుతూ ఉండేవి. తెలుగుదేశం పార్టీ పుట్టుకలో వీళ్లందరి పాత్ర ఉంది. వారి వల్లనే టీడీపీకి విశాల పునాది ఏర్పడింది. ఎలాంటి రాజకీయ, ఉద్యమ నేపథ్యం లేకుండానే 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఎన్టీఆర్ ఆఖండ విజయం సాధించడంలో ఈ శక్తుల పాత్ర గణనీయమయినదని ఆయన తన 'డెమోక్రటిక్ ప్రాసెస్ అండ్ ఎలెక్టోరల్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్' అనే వర్కింగ్ పేపర్‌లో పేర్కొన్నారు. అందుకేనేమో టీడీపీ చరిత్రలో పొత్తులులేని ఎన్నికలు బాగా తక్కువ.
1984లో ఆగస్టులో ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోయి, నాదెండ్ల ప్రభుత్వం వచ్చినపుడు ప్రజాస్వామిక పరిరక్షణ (సేవ్ డెమోక్రసీ) ఉద్యమం పెద్ద ఎత్తున జరగడానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న ఈ నేపథ్యమే కారణం. అపుడు ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయేందుకు ఇందిరా గాంధీయే కారణమంటూ ఆమెకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, బీజేపీ, జనతా పార్టీ వగైరా కలసి పెద్ద ఎత్తున 'సేవ్ డెమోక్రసీ' ఉద్యమం చేశాయి. దీనితో ఎన్టీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా నియమించక తప్పలేదు. దానితోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్ర పటం పూర్తిగా మారిపోయింది.
ఈ ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నింటిని ఆయన 'మిత్ర ప్రతిపక్షాలు' (ఫ్రెండ్లీ అపోజిషన్ పార్టీస్) అని పిలుస్తూ వాటికి ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తూ వచ్చారని, అలా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు దగ్గరయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL
ఏపీలో మిత్రపక్ష రాజకీయాలు
ఈ 'సేవ్ డెమోక్రసీ' ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మిత్రపక్ష అధ్యాయం మొదలయ్యింది. అంతవరకు ఆంధ్రలో కూటమి రాజకీయాల్లేవనే చెప్పాలి. అవసరమూ రాలేదు. 1983లో ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో పార్టీలేవీ కలసి 'కూటమి'గా పోటీ చేయలేదు. అవగాహన కుదర్చుకోలేదు. టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ, జనతా పార్టీలు కూడా విడివిడిగానే పోటీ చేశాయి. టీడీపీ 201 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్‌కు 60 సీట్లు దక్కాయి. అపుడు సీపీఐకి 6, సీపీఎంకు 5, బీజేపీకి 3, జనతా పార్టీకి 1 సీటు దక్కాయి.
1985 మార్చి నాటికి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీటీడీపీ దోస్తులయ్యాయి. ఆ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీఆర్ 'మిత్ర ప్రతిపక్షా'లను అక్కున చేర్చుకున్నారు. సీట్లు కేటాయించారు. దీనిని పొత్తు అనలేం. ఎందుకంటే ఈ పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు. అపుడు టీడీపీకి 202 సీట్లు వచ్చాయి. మిత్ర ప్రతిపక్షాల వాటా గణనీయంగా పెరిగి 33 సీట్లకు చేరింది. ఇందులో సీపీఐకి 11, సీపీఎంకు 11, బీజేపీకి 8, జనతా పార్టీకి 3 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇది తొలి కాంగ్రెస్ వ్యతిరేక 'కలయిక'.
వామపక్షాల స్నేహం వల్ల ఎన్టీ రామారావుకు పేదల పక్షపాతిగా పేరొచ్చింది. భారతీయ జనతా పార్టీ వల్ల అగ్రకులాల మద్దతు బాగా లభించింది. జనతా పార్టీ వల్ల మధ్యతరగతి ప్రజలు దగ్గరయ్యారు.
తర్వాత 1989 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అపుడు ఎన్టీఆర్ బలం 74 కు పడిపోతే, కాంగ్రెస్ పార్టీ శక్తి అమాంతం 181కి పెరిగింది. 'మిత్రపక్షాల'లో సీపీఐకి 8, సీపీఎం 6, బీజేపీకి 5, జనతా పార్టీకి 1 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఓటిమితో ఎన్టీఆర్ కుంగిపోయి మిత్రపక్షాలను వదిలేయలేదు. ఆయన రాజకీయ స్నేహానికి బాగా గౌరవమిచ్చారనే అనాలి.
1994 ఎన్నికల్లో ఇదే స్నేహబంధంతో ఎన్నికల్లో పోటీ చేసి 216 సీట్లతో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించారు. టీడీపీ మిత్ర పక్షాలుగా ఉన్న వామపక్షాల బలమూ బాగా మెరుగు పడింది. సీపీఐ 19 స్థానాలలో గెలిస్తే, సీపీఎం 15 స్థానాలు సాధించింది. ఆ ఏడాది బీజేపీ స్వతంత్రంగా 280 స్థానాల్లో పోటీ చేసింది. కానీ గెల్చుకున్నది 6 స్థానాలనే.

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP/GETTY IMAGES
చంద్రబాబు బ్రాండ్ రాజకీయాలు
1995లో ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి చంద్రబాబు అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ రాజకీయ స్నేహాల అర్థం కూడా మారిపోయింది. కొద్ది రోజులు యునైటెడ్ ఫ్రంట్ (యుఎఫ్) అంటూ కాంగ్రెస్‌కు, బీజేపీకి దూరంగా ఉన్నా, దేవగౌడ్, ఐకే గుజ్రాల్‌ల సారథ్యంలోని యూఎఫ్ ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనలేకపోవడంతో చంద్రబాబు రాజకీయ వ్యూహం మార్చుకోవలసి వచ్చింది.
రాజకీయాల్లో స్నేహం కంటే ప్రయోజనం ముఖ్యమని భావించారు. 1998 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన దీనిని ఆచరణలో పెట్టారు. 1999 ఎన్నికల నాటికి ఆయన పూర్తిగా మారిపోయారు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ బలపడటం మొదలయింది.
1995 తిరుగుబాటు తర్వాత ఆయన ఎన్టీఆర్ ముద్ర నుంచి బయటపడాలనుకున్నారు. దీనికోసం ఎన్టీఆర్ సంక్షేమ మార్గం వదిలేసి సంస్కరణల మార్గం పట్టారు. ఈ సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల ప్రయోగశాలకు మార్చేశారని వామపక్షాలు విమర్శించాయి. దీనికి ''ఏ 'ఇజం' లేదు, కమ్యూనిజం చచ్చిపోయింది'' అని చంద్రబాబు స్పందించారు. ఈ ఘర్షణలో వామపక్షాలు చంద్రబాబు నుంచి పక్కకు జరిగాయి.
ఈ వివాదం నడుస్తున్నపుడే, 1998 లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 32 శాతం ఓట్లు (12 సీట్లు) వస్తే, బీజేపీకి 18 శాతం ఓట్లు (4 సీట్లు) పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 22 స్థానాలు వచ్చాయి. పది స్థానాలలో బీజేపీ రెండో స్థానంలో లేదా మూడో స్థానంలో ఉంది. వామపక్షాల ఓట్లు 5.5 శాతానికి పడిపోయాయి. కాపులు, గ్రామీణ ప్రాంతాల యువకులు, వెనకబడిన వర్గాల ప్రజలు టీడీపీ నుంచి బీజేపీ వైపు వెళ్తున్నారనే ఆందోళన టీడీపీలో మొదలయింది.
1998 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జడిసి అంతవరకు తానే నాయకత్వం వహిస్తూ వచ్చిన 'థర్డ్ ఫ్రంట్'ను చంద్రబాబు వదిలేసుకునేందుకు వెనకాడలేదు. బీజేపీ దారి పట్టాలనే నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకే తాను వాజపేయి ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునిస్తున్నానని బాణీ మార్చి ఎన్‌డీఏకు దగ్గరయ్యారు. బీజేపీతో కలిసి 1999 ఎన్నికల్లో పోటీ చేశారు. టీడీపీకి ఇదే తొలి ఎన్నికల పొత్తు. టీడీపీ-బీజేపీ పొత్తు విజయవంతమయింది. 42 లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి 29, బీజేపీకి 7 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు కేవలం అయిదు స్థానాలే వచ్చాయి. ఇక అసెంబ్లీ ఫలితాల విషయానికి వస్తే, టీడీపీకి 180 స్థానాలు దక్కాయి. భారతీయ జనతా పార్టీ బలం 12 కు పెరిగింది. కాంగ్రెస్ బలం 91కి పడిపోయింది. ఈ ఘన విజయానికి బాగా దోహదపడింది బీజేపీయేనని ప్రొఫెసర్ సూరి వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, NARA CHANDRABABU NAIDU/FACEBOOK
దూరమైన బీజేపీ వైపు చంద్రబాబు చూపు...
అయితే, 2004 ఎన్నికల్లో ఈ పొత్తు పనిచేయకపోవడంతో బీజేపీని వదులుకునేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. బలపడుతున్న తెలంగాణ వాదం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు బీజేపీ నుంచి దూరం జరిగారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మహాకూటమి అంటూ టిఆర్‌ఎస్, వామ పక్షాలతో చేతులు కలిపారు. ఈ ప్రయోగం విఫలమవడంతో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. ఈసారి 2014 ఎన్నికల్లో ఒక వైపు బీజేపీతో కలిశారు. మరొక వైపు పవన్‌ను వెంటేసుకున్నారు. మోదీతో కలసి ప్రచారం చేశారు. గెలిచారు.
2019 లోపు మళ్లీ ఆయనలో మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తేలేదని జగన్ ఉధృతంగా క్యాంపెయిన్ చేయడంతో చంద్రబాబు కూడా కేంద్రం మీద నిరసన తెలుపుతూ, మోదీ మంత్రివర్గం నుంచి ఎన్‌డీఏ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అదే సమయంలో కేంద్రంలో మోదీ బలహీనపడుతున్నారని భావించి కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలసి ప్రచారం చేశారు. ఇదీ బెడిసి కొట్టింది. ఇపుడాయన మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారు.
జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఫ్రంటు కట్టాలనుకుంటున్న టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుడు గోసాల ప్రసాద్ అన్నారు.
''బీజేపీ - టీడీపీ - జనసేన కలిస్తే ఫలితాలు 2014లాగా ఉంటాయి. ఇప్పటి దాకా దీని మీద బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. పార్టీలోని ఒక వర్గం టీడీపీతో వెళ్లాలని భావిస్తూ ఉంది. ఒకవేళ టీడీపీ - జనసేనతో కలిసేందుకు బీజేపీ రాకపోతే, బీజేపీకి జనసేన గుడ్ బై చెప్పవచ్చు. ఈ ఫ్రంటులోకి వామపక్షాలు వచ్చి చేరవచ్చు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఈ విషయం మీద క్లారిటీ రావచ్చు" అని ప్రసాద్ అన్నారు.
టీడీపీతో కలుస్తామన్న సంకేతం బీజేపీ ఇవ్వడం లేదు. బీజేపీ 'జగన్ వ్యతిరేక కూటమి'లో చేరకపోతే మరో దారేది? బీజేపీ నుంచి పవన్‌ని బయటకు తీసుకువచ్చి వామపక్షాలతో కలసి 'థర్డ్ ఫ్రంట్' కట్టడమా? దీనికి పవన్ సిద్ధపడతారా? అపుడేమయినా పవనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తారా? ఏమవుతుందో చూద్దాం.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: పెళ్లయిన నెల రోజులకే భర్త పీక పిసికి, పైట బిగించి హత్య చేసిన భార్య... ఏం జరిగిందంటే
- సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట
- మదర్స్ డే: తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇది
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- బిట్ కాయిన్ ధర ఆరు నెలల్లో ఎందుకు సగానికి పడిపోయింది... క్రిప్టోవింటర్ అంటే ఏంటి?
- యుక్రెయిన్ యుద్ధం: వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతు తెలిపేందుకు నకిలీ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











