మహారాష్ట్ర: నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకే అమరావతి వాసి ఉమేశ్ హత్యకు గురయ్యారా?

ఉమేశ్ కొల్హే
ఫొటో క్యాప్షన్, ఉమేశ్ కొల్హే
    • రచయిత, నితేశ్ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రలోని అమరావతిలో జూన్ 21న ఉమేశ్ కొల్హే అనే కెమిస్ట్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు, నూపుర్ శర్మ వ్యాఖ్యలకు సంబంధం ఉందని కొందరు బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

గత వారం ఉదయపూర్‌లో టైలర్ కన్నయ్యలాన్ హత్య కూడా ఇదే విషయానికి సంబంధించినదని పోలీసులు తెలిపారు.

అమరావతి, ఉదయపూర్ కేసులకు ఏదైనా ప్రత్యక్ష సంబంధం ఉందా అని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు.

ఉమేశ్ కొల్హే హత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారు. అనుమానితులపై ఐపీసీ సెక్షన్ 302, 120B, 109 కింద కేసు నమోదు చేసినట్లు అమరావతి డీసీపీ విక్రమ్ ఏఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపారు.

"నూపుర్ శర్మకు మద్దతుగా ఉమేశ్ కొల్హే సోషల్ మీడియాలో రాసిన పోస్ట్ కారణంగా ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది" అని డీసీపీ విక్రమ్ చెప్పారు.

మహారాష్ట్ర
ఫొటో క్యాప్షన్, మహారాష్ట్ర

హత్య ఎలా జరిగింది?

51 ఏళ్ల ఉమేశ్ కొల్హేకు అమరావతి తాలూకాఫీసు సమీపంలోని రచనశ్రీ మాల్‌లో అమిత్ వెటర్నరీ పేరుతో ఒక మెడికల్ షాపు ఉంది.

జూన్ 21 రాత్రి మెడికల్ షాపు కట్టేసి ఇంటికి బయలుదేరారు. ఒక వాహనంలో ఉమేశ్, మరొక వాహనంలో ఆయన భార్య వైష్ణవి, కొడుకు సంకేత్ ఉన్నారు.

రాత్రి 10.30 గంటల సమయంలో నలుగురైదుగురు దుండగులు ఉమేశ్‌పై దాడి చేసి కత్తితో గొంతు కోసి పారిపోయారు.

కొడుకు సంకేత్ ఆయన్ను సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఉమేశ్ మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

హత్య సమయంలో ఉమేశ్ జేబులో రూ. 35 వేల నగదు ఉంది. కానీ, దుండగులు దాన్ని ముట్టుకోలేదు. కాబట్టి ఈ హత్య డబ్బు కోసం చేసింది కాదని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, కన్నయ్యలాల్:ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను ఎందుకు హత్య చేశారు, రాజస్థాన్ పోలీసులు ఏం చెప్పారు?

ఉమేశ్ సోదరుడు ఏం చెప్పారంటే..

ఉమేశ్ కొల్హే సోదరుడు మహేశ్ కొల్హే ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.

"మా అన్నయ్య నూపుర్ శర్మ గురించి కొన్ని మెసేజ్‌లు కొన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారు. కానీ, ఇంత చిన్న కారణానికి హత్య వరకు వెళ్లడం, దీన్ని మేం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇది తప్ప మాకు వేరే కారణం కనిపించడంలేదు. మా అన్నయ్యకు ఎవరితోనూ శత్రుత్వం లేదు’’ అని మహేశ్ అన్నారు.

‘‘హత్యకు కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇది జరిగి 12 రోజులు కావస్తున్నా పోలీసులు మాకు ఎలాంటి కారణం చెప్పలేదు. ఇది దోపిడీ కేసు కావచ్చునా అని పోలీసులను అడిగాం. దోపిడీ అయితే శరీరంపై గాయాలు ఉంటాయని, మెడ మీద కాదని పోలీసులు చెప్పారు" అని వెల్లడంచారు మహేశ్.

తాజాగా ఈ హత్యకు సంబంధించి అమరావతి పోలీసులకు ఒక పేపర్ దొరికింది. అందులో నూపుర్ శర్మకు మద్దతుగా ఉమేశ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని రాసి ఉంది.

ఉమేశ్ హత్యకు నూపుర్ శర్మ వ్యాఖ్యలకు సంబంధం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, ఇకపై దర్యాప్తు ఆ కోణంలోనే జరుగుతుందని అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర

ఉమేశ్ పోస్టు వైరల్ అయింది

ఉమేశ్ వాట్సాప్‌లో 'బ్లాక్ ఫ్రీడం' అనే గ్రూపులో యాక్టివ్ మెంబర్‌గా ఉండేవారు. ఈ గ్రూపులో హిందుత్వ అనుకూల పోస్టులు షేర్ చేస్తుంటారు. నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతుగా ఉమేశ్ ఈ గ్రూపులో ఒక పోస్టు రాశారు.

ఈ పోస్టు గ్రూపు బయట కూడా వైరల్ అయ్యుండవచ్చని అమరావతి పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమేశ్ పోస్టు పొరపాటున ముస్లిం గ్రూపుకు చేరి ఉండవచ్చని, అందుకే ఉమేశ్‌పై దాడి చేసి ఉండవచ్చని పోలీసుల అనుమానం. ఈ కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)