అనంతబాబు మీద హత్య కేసు విచారణ ఎలా సాగుతోంది, ఆయన ఎమ్మెల్సీగా కొనసాగవచ్చా?

ఎమ్మెల్సీ అనంతబాబు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్సీ అనంతబాబు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంద్రప్రదేశ్ లో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంత బాబు) ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు ఆదేశాలతో ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంచారు. తన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తిని హత్య చేసినట్టు ఆయన అంగీకరించారని కాకినాడ జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు. అనంతబాబు రిమాండ్ రిపోర్టులో కూడా పోలీసులు అదే విషయాన్ని నమోదు చేశారు.

అయితే, ఈ కేసు దర్యాప్తు తీరు మీద కొన్ని సంఘాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. సమగ్ర దర్యాప్తు కోసం జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి ఆయననను తొలగించాలని కూడా డిమాండ్ వస్తోంది.

చట్టం ప్రకారం హత్య కేసులో నేరం అంగీకరించినట్టు పోలీసులు చెబుతున్న తరుణంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే అవకాశం లేదని ఆయా సంఘాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష నేతలు దీనిపై గవర్నర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు.

ఈ నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారం హత్య కేసుల్లో అరెస్టయిన చట్ట సభల ప్రతినిధుల పదవి ఏమవుతుంది, ఈ కేసులో ఏం జరుగుతోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం

అనంతబాబు రిమాండ్ రిపోర్టులో ఏముంది?

కాకినాడలోని ప్రత్యేక మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, మే నెల 19వ తేదీ రాత్రి కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యం (24) హత్య జరిగింది. దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్సీ అనంతబాబు ప్రయత్నం చేశారు.

20వ తేదీ తెల్లవారుజామున తన కారులోనే మృతదేహాన్ని తీసుకుని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చారు. ఆ సమయంలో వాగ్వాదం జరిగింది. మృతుడి తల్లిదండ్రులను అనంతబాబు బెదిరించారు. ‘రూ. 2 లక్షలు ఇస్తాను.. తీసుకుని మీ సొంతూరు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసుకుని సైలెంట్ గా ఉండండి’ అంటూ హెచ్చరించారు. ‘లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాలో చెయ్యో తీసేస్తాను, సుబ్రహ్మణ్యానికి సోదరుడు కూడా ఉన్నాడు చూసుకోండి అంటూ తీవ్రంగా భయపెట్టాడు’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

మే 23వ తేదీన కోర్టు ముందు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఈ రిపోర్ట్ సమర్పించారు.

మే 19న హత్య తర్వాత అనుమానంతో మృతుడి తల్లి రత్నం ఇచ్చిన ఫిర్యాదుతో సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని, అనుమానాస్పద మృతిగా నమోదయిన కేసుని ఆ తర్వాత హత్య కేసుగా మార్చి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ సాగించినట్టు పేర్కొన్నారు.

రిమాండ్ రిపోర్ట్ కాపీ స్క్రీన్‌షాట్

అనంతబాబు నేరం అంగీకరించారు: ఎస్పీ

మే 23వ తేదీన అనంతబాబుని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఆ రిపోర్టులో తెలిపారు. ఆ తర్వాత ఆయనను మేజిస్ట్రేట్ ఆదేశాలతో 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.

అదే రోజు కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఈ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. మద్యం మత్తులో ఉన్న సుబ్రహ్మణ్యంపై దాడి జరిగిందని తెలిపారు. ఐదేళ్ల పాటు తన డ్రైవర్ గా పనిచేసిన మృతుడు అనంతబాబుకు రూ. 20 వేలు బాకీ ఉన్నాడని పేర్కొన్నారు. దాని నిమిత్తం పిలిచిన సమయంలో వివాదం హత్యకు దారితీసినట్టు చెప్పారు.

అనంతబాబు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన దాడిలో డ్రైవర్ స్పృహ కోల్పోయాడని, కారులో తీసుకెళుతుండగా మార్గ మధ్యలో మరణించారని ఎస్పీ వివరించారు. ఈ వివరాలను తమ విచారణలో అనంతబాబు అంగీకరించారని కూడా పేర్కొన్నారు.

తల్లి ఫిర్యాదు, కుటుంబ సభ్యుల ఆందోళన, మృతుడి శరీరంపై ఉన్న దెబ్బలు పరిశీలించిన తర్వాత రోడ్డు ప్రమాదం అంటూ ఎమ్మెల్సీ పేర్కొన్న మాటలు వాస్తవం కాదని నిర్ధారించి, అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అనంతబాబు వద్ద మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

అరెస్ట్ రిపోర్ట్ కాపీ స్క్రీన్ షాట్

అంతకుముందే పలు నేరారోపణలు, కేసులు

అనంతబాబు గత ఏడాది డిసెంబర్ లో స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి ఎన్నికయ్యారు. అంతకుముందే ఆయన మీద పలు నేరారోపణలున్నాయి. అనేక కేసులు కూడా నమోదయ్యాయి.

2014లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ తో ఆయన నామినేషన్ వేయడం వివాదాస్పదమైంది. కుల ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆయనకు భంగపాటు తప్పలేదు.

కాపు కులానికి చెందిన అనంతబాబు కొండకాపు పేరుతో ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించినా, అందుకు న్యాయపరమైన అడ్డంకులు ఆయన ఆశలను నీరుగార్చేశాయి.

అడ్డతీగల ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాల నుంచి కలప అక్రమ రవాణా, అనుమతుల్లేని మైనింగ్ వంటి పలు కేసులు ఆయన మీద గతంలో నమోదయ్యాయి.

తాజాగా డ్రైవర్ హత్య కేసులో ఐపీసీ సెక్షన్స్ 302, 201, రెడ్ విత్ 34, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ (2015)లోని సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్) మరియు 3 (2)(వి) కింది కేసు నమోదయ్యింది. క్రైమ్ నెం. 4706/సి3/2022 కింద జిల్లా ఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం జగన్‌తో ఎమ్మెల్సీ అనంతబాబు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సీఎం జగన్‌తో ఎమ్మెల్సీ అనంతబాబు

హత్య కేసులో నిందితుడు పెద్దల సభలో ఉండొచ్చా?

ప్రస్తుతం హత్య కేసులో జైలు పాలయిన నాయకుడిని మండలిలో కొనసాగించవచ్చా అనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి, వివిధ సంఘాల నుంచి వస్తున్నాయి. ఆయన్ని మండలి నుంచి బర్తరఫ్ చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి వినతిపత్రం కూడా ఇచ్చారు. ఇతర విపక్ష నేతలు కూడా ఈ డిమాండ్ ముందుకు తెస్తున్నాయి.

"అనంతబాబు హత్య చేసినట్టు అంగీకరించారని జిల్లా ఎస్పీ మీడియా సాక్షిగా వెల్లడించారు. నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ నుంచి పలువురి మీద దాడులకు పాల్పడిన నేపథ్యం కూడా అతనికి ఉంది. అడ్డతీగల పోలీస్ స్టేషన్లో కొంతకాలం రౌడీషీట్ కూడా ఉండేది. అధికారం ఉపయోగించుకుని అది తొలగించుకున్నారు. అలాంటి నాయకుడికి మండలిలో అవకాశం ఇవ్వడమే విడ్డూరం’’ అని ఏపీసీసీ అద్యక్షుడు శైలజానాధ్ పేర్కొన్నారు.

‘‘ఇప్పుడు హత్యానేరంలో ప్రథమ ముద్దాయిగా ఉన్న వ్యక్తిని మండలిలో కొనసాగించడం ఏమాత్రం నైతికత కాదు. ఇప్పటికే వైసీపీ తన పార్టీ నుంచి సస్ఫెండ్ చేసింది. తప్పు చేసినందున పార్టీ నుంచి తొలగించి, ఎమ్మెల్సీగా ఎలా కొనసాగిస్తారు? గిరిజన ప్రాంతంలో పలు నేరాలకు పాల్పడిన వ్యక్తిని పదవిలో ఉంచడం ద్వారా జగన్ ఏం సంకేతాలు ఇస్తున్నారు?" అని ఆయన ప్రశ్నించారు.

ఎస్సీ యువకుడిని హత్య చేయడమేగాకుండా, అధికార దురహంకారంతో మృతదేహాన్ని తీసుకెళ్లి కుటుంబ సభ్యులను బెదిరించిన వారిని పెద్దల సభలో ఉంచడం సిగ్గుచేటని శైలజానాథ్ విమర్శించారు.

కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద పోలీసులు

‘విచారణ సజావుగా సాగడం లేదు...’

అనంతబాబు తీరు మీద ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం హత్య కేసు విచారణ కూడా సజావుగా సాగడం లేదని అంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు అంటున్నారు.

‘‘అనంతబాబు అనేక నేరాలకు పాల్పడ్డారు. హత్య కేసులో అడ్డంగా దొరికారు. అయినా పోలీసులు కేసు నమోదుచేయకుండా తాత్సార్యం చేశారు. అనేక సంఘాలు, ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత చివరకు అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసు కూడా కట్టారు. కానీ పోలీసుల నివేదికలను పరిశీలిస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి’’ అన్నారాయన.

‘‘అరెస్ట్ రిపోర్టులో కాపు/ కొండకాపు అని పేర్కొన్నారు. ఇది నేరం. అతని సర్టిఫికెట్ చెల్లదని ఇప్పటికే స్పష్టత వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితుడికి ఎస్టీ కులం ప్రస్తావించడం వెనుక మర్మం ఏమిటన్నది పోలీసులు చెప్పాలి’’ అని ప్రశ్నించారు.

‘‘ఏ1 నిందితుడిని అరెస్ట్ చేసి రెండు వారాలవుతోంది. రిమాండ్ గడువు కూడా ముగుస్తోంది. మిగిలిన నిందితుల సంగతేంటన్నది తేల్చలేదు. సెక్షన్ 164 కింద సాక్ష్యుల అభిప్రాయం సేకరించాలి. అది జరగలేదు" అంటూ ముప్పాళ్ల సుబ్బారావు బీబీసీకి తెలిపారు.

అధికారాన్ని ఉపయోగించుకుని ఈ కేసు నీరుగార్చేసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతబాబు అరెస్ట్ సందర్భంగా పోలీసులు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం, మీడియాతో మాట్లాడిన సమయంలో ఓ నేరస్తుడిని అనంతబాబు గారు అంటూ ఎస్పీ ప్రస్తావించడం వంటివి అందుకు ఉదాహరణలుగా ముప్పాళ్ల ప్రస్తావించారు.

అనంతబాబుని పదవి నుంచి తొలగించి కేసు సమగ్ర దర్యాప్తు కోసం జ్యుడీషియల్ దర్యాప్తు అవసరమని ఆయన కోరారు.

‘అనైతికం, చట్ట ప్రకారం కూడా చాన్స్ లేదు..’

శాసనమండలి సభ్యుడిగా ఉండి తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా మార్చాలని చూసిన నేరానికి అనంతబాబుకు పదవిలో కొనసాగే అర్హత లేదని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

"అనంతబాబుని మండలిలో కొనసాగించడం అనైతికం. ఇప్పటికే అతని మీద చర్యలు తీసుకుని ఉండాల్సింది. ఎస్సీల రక్షణకు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుధ్ధి ఉన్నా తక్షణం ఈ హత్యానేరస్తుడిని భర్తరఫ్ చేయాలి. చట్టం ప్రకారం కూడా అలాంటి వారిని కొనసాగించే అవకాశం లేదు. మండలి చైర్మన్ గా ఉన్న ఎస్సీ నాయకుడు దీనిపై ఆలోచించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, హత్య, కేసుని తారుమారు చేసేందుకు చేసిన మోసపూరిత ప్రయత్నం, మృతుడి తల్లిదండ్రులను బెదిరించడం వంటి అనేక నేరాలు ఈ కేసులో ఉన్నాయి. తీవ్రమైన శిక్షలు తప్పవు. కాబట్టి మండలిలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి కేసు త్వరితగతిన విచారించాలి" అంటూ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు.

మృతదేహం తీసుకుని ఎమ్మెల్సీ వచ్చిన కారు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మృతదేహాన్ని తీసుకుని ఎమ్మెల్సీ వచ్చిన కారు

చట్టం ఏం చెబుతోంది?

దేశంలోని పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటుగా శాసనమండలికి ప్రాతినిధ్యం వహించే సభ్యుల అర్హతలకు సంబంధించి కొన్ని నిబంధనలున్నాయి. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 ప్రకారం వాటిని రూపొందించారు.

ఆ చట్టంలోని సెక్షన్ 8లోని 3వ అంశం ప్రకారం సభ్యులు ఎవరైనా 2 సంవత్సరాలు లేదా అంతకుమించిన కాలం శిక్షకు గురయితే సభలో కొనసాగే అర్హత కోల్పోతారు. వారిపై వేటు వేసే అధికారం సభకు ఉంటుంది. అంతేకాకుండా, ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోతారు.

"వైసీపీ తమ తన ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్ఫెండ్ చేసింది. పార్టీ కార్యకలాపాలకు అర్హత లేనప్పుడు మండలిలో ఎలా కొనసాగిస్తారన్నది ఆలోచించాలి. చట్ట ప్రకారం శిక్ష పడే వరకూ అనంతబాబు నిందితుడు మాత్రమే. కానీ, ఇప్పటికే ఈ కేసులో స్పష్టమైన ఆధారాలున్నాయి. స్వయంగా నేరాన్ని అంగీకరించినట్టు పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి వాటిని ప్రత్యేకంగా పరిగణించాలి’’ అని రాజ్యాంగ పరిశీలకుడు అచ్యుత్ దేశాయ్ వ్యాఖ్యానించారు.

‘‘అధికారం అండ చూసుకుని ఎంతకైనా తెగిస్తామనే ధోరణిని కొనసాగనివ్వడం శ్రేయస్కరం కాదు. న్యాయం జరగడమే కాదు.. న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించడం కూడా ప్రాథమిక సూత్రాల్లో ఒకటన్నది గుర్తుంచుకోవాలి" అని ఆయన పేర్కొన్నారు.

రంపచోడవరం నియోజకవర్గంలో అనంతబాబు అధికార దుర్వినియోగం చుట్టూ అనేక ఆరోపణలున్న నేపథ్యంలో వాటన్నింటినీ వెలికి తీసేందుకు తక్షణమే మండలి సభ్యత్వాన్ని రద్దు చేయడం అవసరమని దేశాయ్ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: కామారెడ్డిలో తల్లీకొడుకుల ఆత్మహత్య... మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు

‘కోర్టు పరిధిలో ఉంది...’

అనంతబాబు కేసు కోర్టు పరిధిలో ఉండగా తాము స్పందించలేమని కాకినాడ జిల్లా పోలీసులు చెబుతున్నారు. రిమాండ్ రిపోర్టు సహా పలు నివేదికల్లో నిందితుడి కులం విషయంలోనూ, ఇతర అంశాల్లోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో తాము స్పందించేందుకు సిద్ధంగా లేమని పోలీసులు బీబీసీకి తెలిపారు. కేసు విచారణ నిబంధనల ప్రకారం జరుగుతోందని, ఎవరినీ ఉపేక్షించేంది లేదని చెప్పారు.

మరోవైపు మృతుడి కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మృతుడి భార్య, అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం, సోదరుడికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు ఉత్తర్వులు విడుదలయ్యాయని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ తెలిపారు.

వారికి ఇంటి నిర్మాణం కోసం స్థలం పట్టా కూడా నేరుగా అందించారు. చట్టం ప్రకారం ఇతర ప్రయోజనాలన్నీ అందిస్తామని, బాధితుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

తమ ప్రభుత్వంలో నేరానికి పాల్పడిన వారు, సొంత పార్టీ అయినా విడిచిపెట్టబోరని అనంతబాబు కేసు సాక్ష్యంగా ఉందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

అనంతబాబు విషయంలో పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరుతో సస్ఫెన్షన్ ఆదేశాలు వచ్చాయి. ఈ ఘటన సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చినందున అనంతబాబు మండలి సభ్యత్వం విషయంలో ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

వీడియో క్యాప్షన్, ‘నిందితులు ఎవరో మేం చెప్పినా, పోలీసులు మాత్రం అరెస్ట్ చెయ్యడం లేదు ఎందుకు?’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)