జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు విడుదల చేసిన వీడియోలలో ఏం ఉంది

ఫొటో సోర్స్, RaghunandanaRao
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం వల్లే దర్యాప్తు వేగంగా సాగడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరాలంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
ప్రభుత్వం, పోలీస్ శాఖ నిందితులకు కొమ్ము కాస్తున్నాయని ఆయన తన లేఖలో ఆరోపించారు.
మరోవైపు యూత్ కాంగ్రెస్ నాయకులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. హోం మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు కొన్ని వీడియోలు, ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.
కారులో ఏం జరిగిందో చెప్పేలా ఉన్న ఆ ఫొటోలను రఘునందనరావు మీడియాకు విడుదల చేశారు.
సమ్మతి ఉన్నా లేకున్నా మైనర్‌తో లైంగిక చర్య నేరమని ఆయన చెప్పారు.
అసలు పబ్‌లోకి మైనర్లను ఎలా అనుమతించారనీ ఆయన ప్రశ్నించారు.
ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందని.. ఆయన్ను రక్షించేందుకు ఇతరులపై కేసులు మోపుతున్నారని రఘునందనరావు ఆరోపించారు.
కాగా ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు మైనర్లు, ఇద్దరు యువకులను(ఇద్దరూ 18 ఏళ్లు దాటినవారు) అరెస్ట్ చేశారు.

పోలీసులు ఏం చెప్పారంటే..
హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. కొంతమంది ప్రముఖుల పిల్లలకు ఈ నేరంతో సంబంధం ఉందనే ఆరోపణలు రావడంతో ఇది రాజకీయ వివాదంగానూ మారింది.
మే 28న జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటన గురించి జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ డీ జోయెల్ డేవిస్ గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
డీసీపీ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘మే 31 రాత్రి బాలిక తండ్రి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చారు. 28వ తేదీన బాలిక పార్టీకి వెళ్లింది. అక్కడ ఆమెపై లైంగికంగా దాడి జరిగింది అని ఫిర్యాదు ఇచ్చారు.
వెంటనే కేసు నమోదు చేసి, పాపకు కౌన్సెలింగ్ ఇప్పించాం, భరోసా సెంటర్‌కు పంపించాం. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాం. అప్పటి వరకూ ఆ బాలిక విషయాలను బయటపెట్టలేదు.
బాలిక స్టేట్‌మెంట్ వచ్చిన వెంటనే పోక్సో యాక్ట్ కూడా జత చేశాం.
బాలికను పార్టీ జరిగే ప్రాంతం నుంచి దూరంగా తీసుకెళ్లి ఈ దురాగతానికి పాల్పడ్డారు.
ఒక్కరు మినహా మిగతా నిందితులను ఆమె గుర్తించలేదు. వాళ్ల పేర్లు కూడా ఆమెకు తెలియవు.
ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం.. దర్యాప్తు చేశాం. ఐదుగురు నిందితులను గుర్తించాం.
స్టేట్‌మెంట్, సీసీటీవీ ఫుటేజ్, సీడీఆర్ అనాలసిస్, ఇతర సాంకేతిక విశ్లేషణల ద్వారా ఈ ఐదుగురినీ గుర్తించాం. వీరిలో ముగ్గురు మైనర్లు. వీరి వయస్సు 16-17 ఏళ్లు ఉండొచ్చు. మిగతా ఇద్దరూ 18 ఏళ్లు దాటినవారు.
సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడిని ఈ కేసులో అరెస్ట్ చేశాం. మరొక నిందితుడు ఉమైర్ ఖాన్. వీరిద్దరూ 18 ఏళ్లు దాటిన మేజర్లు.
మిగతా ముగ్గురూ మైనర్లు.
ఏసీపీ స్థాయి అధికారి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆమె నుంచి మరొకసారి స్టేట్‌మెంట్ తీసుకుంటాం’’ అని చెప్పారు.
‘హోం మంత్రి మనవడి ప్రమేయం లేదు’
‘‘ఈ ఘటనలో ఎంత స్థాయి వారి ప్రమేయం ఉన్నా వారిని వదిలిపెట్టం. ఈ కేసులో హోం మంత్రి మనుమడు ఉన్నాడని కొన్ని చానెళ్లు ప్రచారం చేశాయి. ఇవి వంద శాతం నిరాధారమైన వార్తలు.
ఈ నేరం మొదలైన ప్రాంతం నుంచి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూశాం. నిందితులు తీసుకున్న ఫొటోలు చూశాం. నేరం ప్రారంభం నుంచి చివరి వరకూ అన్ని రకాల ఆధారాలను మేం విశ్లేషించాం.
ఇందులో హోం మంత్రి మనుమడి ప్రమేయం ఉందని చెప్పడం నిరాధారం.
కాగా, ఈ కేసులో ఒక ప్రముఖ వ్యక్తి కుమారుడు ఉన్నాడు. అతడు కూడా నిందితుడు. అయితే, అతడు మైనర్ కాబట్టి అతని పేరు బయటపెట్టడం లేదు’ అని డీసీపీ చెప్పారు.
ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు చేసేందుకు తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపారు.
ఏ స్థాయి వ్యక్తులు అయినా తాము కేసు నమోదు చేస్తామని, ఎవరినీ కాపాడబోమని చెప్పారు.
బాలికపై కారులోనే అఘాయిత్యం..
ఈ పబ్‌లో మద్యం సేవించినట్లు బాధితురాలు చెప్పలేదని, ఆ పబ్‌లో మద్యం వినియోగం కూడా లేదని డీసీపీ చెప్పారు.
పబ్ నుంచి బెంజ్ కారులో ఒక పేస్ట్రీ షాప్‌కు వెళ్లారు. అక్కడ ఒక ఇన్నోవాలో బయలుదేరి వెళ్లారని, కారులోనే బాలికపై అఘాయిత్యం చేశారని ప్రకటించారు.
కేసులో ఐదు రోజులు ఆలస్యం ఎందుకు?
ఐదు రోజుల పాటు ఆలస్యం అయ్యింది అన్న ఆరోపణలపై స్పందిస్తూ.. రెండు రోజుల పాటు అసలు బాలిక ఏమీ మాట్లాడలేదని, మూడో రోజు ఆమె తండ్రి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని డీసీపీ చెప్పారు.
ఆ తర్వాత ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, భరోసా ఇచ్చి స్టేట్‌మెంట్ తీసుకోవడానికి ఒక రోజు సమయం పట్టిందని చెప్పారు.
ఈ నెల 1న తాము బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోక్సో చట్టాన్ని కూడా ఈ కేసులో జోడించామన్నారు.
మీడియాకు సూచన
ఈ కేసులో బాధితురాలు మైనర్ కాబట్టి, నిందితులు మైనర్లు కాబట్టి వారి ఐడెంటిటీ బయటపడేలా ఎలాంటి సమాచారాన్నీ ప్రసారం చేయొద్దని మీడియాను డీసీపీ జోయెల్ డేవిస్ హెచ్చరించారు.

అసలేం జరిగింది?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందన్న వార్తలు నగరంలో రాజకీయ వేడిని పెంచాయి. మే 28వ తేదీన ఇన్సోమ్నియా పబ్ దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే, అనుమానితులు టీఆర్ఎస్ - ఎంఐఎం పార్టీ మద్దతుదారుల పిల్లలని, అందుకే పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తండ్రి ఫిర్యాదు ప్రకారం.. తన కుమార్తె మే 28వ తేదీ మధ్యాహ్నం అమ్నేసియా అండ్ ఇన్సోమ్నియా పబ్ కి వెళ్లింది. ఇద్దరు స్నేహితులు ఆమెను ఒక పార్టీకి ఆహ్వానించారు. ఈ పార్టీ ఇచ్చింది ఎవరనే అంశంపైన కూడా స్పష్టత లేదు.
పార్టీ తర్వాత తిరిగి ఇంటి దగ్గర దించుతామంటూ ఆ పార్టీలో కలిసిన యువకులు ఆమెను ఎర్ర రంగు బెంజ్ కార్ నెంబర్ TS 09 FL 6460 లో ఎక్కించుకున్నారు. ఇన్నోవాలో మరికొంతమంది కలిశారు.
ఇంటికి వచ్చిన అమ్మాయి మెడ దగ్గర గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా, తనపై కొంత మంది బలవంతం చేశారని కుమార్తె చెప్పినట్టుగా ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అప్పటి నుంచీ అమ్మాయి షాక్ లో ఉంది అని, అసలు ఏమి జరిగిందో చెప్పలేని స్థితిలో ఉంది అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అయిదుగురు నిందితుల మీద కేసు (నంబర్ 295/2022) నమోదు చేశారు. నిందితుల మీద ఐపీసీ 354, 323 సెక్షన్‌లతో పాటు, పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టంలోని 9, 10 సెక్షన్ల కింద అభియోగాలు దాఖలు చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో కింద కేసు పెట్టారు.
కేసులో పేర్కొన్న బెంజి కారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. ఇన్నోవా ఇంకా దొరకలేదు. బాధిత అమ్మాయిని భరోసా కేంద్రానికి పంపారు.
‘‘నేను సాయంత్రం 5.30 సమయంలో పబ్ కి వెళ్లాను. తిరిగి వస్తుండగా, నాతో పార్టీలో ఉన్న యువకులు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అని చెప్పడంతో నేను వారితో పాటు వెళ్లాను. చీకటి పడిన తరువాత నన్ను ఒక చీకటి ప్రదేశానికి తీసుకెళ్లారు’’ అని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.
రాజకీయ వివాదం ఎందుకు?
కేసులో టీఆర్ఎస్ నాయకులు ఉన్నందువల్లే కేసును నీరుగార్చి, నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన రావు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై స్పందించారు.
‘‘ఈ ఘటనలో ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉంది. అందుకే నిందితులను తప్పించేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. నిందితులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. బాలికపై అఘాయిత్వం జరిగి 5 రోజులైనా నిందితులను ఇంతవరకు అరెస్టు చేయలేదు. మీరు మనుషులా... రాక్షసులా. మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే నిందితులను అరెస్ట్ చేయరా? ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లు నమోదు చేయరా? సీసీ టీవీ కెమెరాలున్నదెందుకు? బాలికను తీసుకెళుతున్న కారులో టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ ఫుటేజీల ఆధారంగా నిందితులను ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదు? చంచల్‌గూడ జైల్లో ఉంచాల్సిన నిందితులను సేఫ్ గా దాచిపెడతారా? కేసు నుండి వారిని తప్పించేందుకు కష్టపడుతున్న పోలీసులు చట్టాన్ని రక్షించేవాళ్లా... భక్షించేవాళ్లా? రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐంఎం నాయకులు ఏదైనా చేయొచ్చు... కాపాడటానికి పోలీసులు రడీగా ఉన్నారనే సంకేతాలను పంపుతున్నారా?’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సంజయ్.
అటు కాంగ్రెస్ కూడా ఈ ఘటనపై స్పందించింది. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
మరో కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఈ ఘటనపై డీసీపీని కలిశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కేటీఆర్ ట్వీట్.. హోం మంత్రి స్పందన
ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో స్పందించారు. ‘‘మైనర్‌పై అత్యాచారం ఘటన షాక్‌కు, ఆగ్రహానికి గురి చేసింది. నిందితులు ఎవరైనా వారిని వదలవద్దు. వారి స్థాయితో పనిలేకుండా చర్యలు తీసుకోండి’’ అంటూ హోం మంత్రి, డీజీపీ, హైదరాబాద్ కమిషనర్లను ట్యాగ్ చేశారు కేటీఆర్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కేటీఆర్ ట్వీట్‌కు తెలంగాణ హోం మంత్రి మొహమ్మద్ మహ్మూద్ అలీ స్పందించారు. ఇదొక ఘోరమైన సంఘటన అని, బాధ్యులు ఎవరైనప్పటికీ వారి నేపథ్యంతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్‌లను కోరానని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- సోలోగమీ: తనను తానే పెళ్లి చేసుకుంటోన్న ఈ 24 ఏళ్ల యువతి ఎవరు?.. ఈ పెళ్లి ఎందుకు?
- ఉత్తర కొరియాలో కోవిడ్ మిస్టరీ, అసలు ఏం జరుగుతోంది
- టర్కీ దేశం పేరును ‘తుర్కియా’గా ఎందుకు మార్చారు?
- టీటీడీ: తిరుమలలో పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి.. భక్తులు, వ్యాపారులు ఏమంటున్నారు?
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. లోక్‌సభలో బిల్లు పెట్టిన రోజు ఏం జరిగింది? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర ఏంటి?
- కాలి బొటనవేలు రూ. 30 లక్షలు - జింబాబ్వే పేదలు వేళ్లను అమ్ముకుంటున్నారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














