Türkiye: పేరు మార్చుకున్న దేశం.. టర్కీ ఇకపై తుర్కియా

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి వేదికలపై టర్కీని ఇకపై తుర్కియాగా పిలుస్తారు. తమ దేశం పేరును మార్చాలని టర్కీ పెట్టుకున్న అభ్యర్థనకు ఐరాస అంగీకారం తెలిపింది.
టర్కీ గుర్తింపులో మార్పులుచేసే ‘‘రీబ్రాండింగ్’’ కార్యక్రమాన్ని గత ఏడాది దేశ అధ్యక్షుడు రెచప్ తయ్యప్ ఎర్దోవాన్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా తమ దేశం పేరును మార్చాలని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను ప్రభుత్వ అధికారులు ఆశ్రయిస్తున్నారు.
తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు ‘‘తుర్కియా’’ అనే పదం చక్కగా నప్పుతుందని గత ఏడాది డిసెంబరులో ఎర్దోవాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, @MevlutCavusoglu
గత వారం టర్కీ నుంచి అభ్యర్థన వచ్చిన వెంటనే పేరు మర్చినట్లు ఐక్యరాజ్యసమతి వెల్లడించింది.
చాలా మంది తుర్కులు తమ దేశాన్ని తుర్కియాగానే పిలుస్తారు. అయితే, ఆంగ్లీకరించిన టర్కీ అనే పదం కూడా విస్తృతంగా వాడుకలో ఉంది.
గత ఏడాది పేరును మారుస్తున్నట్లు టర్కీ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్‌టీలో వెంటనే మార్పులు చేశారు. టర్కీ అనే పేరు ఒక పక్షికి ఉండటంతోపాటు ‘‘దారుణంగా విఫలమైనది లేదా మతిలేని వ్యక్తి’’అనే అర్థాలు దీనికి ఆంగ్లంలో ఉన్నాయి. దీంతో పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్‌టీ తెలిపింది.
అన్నింటిలోనూ మార్పు..
రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా టర్కీ నుంచి ఎగుమతయ్యే ప్రాడక్టులపై ‘‘మేడ్ ఇన్ తుర్కియా’’అని మారుస్తారు. గత జనవరిలో ‘‘హెలో తుర్కియా’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
అయితే, ఈ మార్పులకు ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు దీనికి మద్దతు పలుకుతుంటే, వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోవాన్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు.
దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు.
2020లో హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని నెదర్లాండ్స్ తెలిపింది. అంతకుముందు మాసిడోనియా కూడా తమ పేరును నార్త్ మాసిడోనియాగా మార్చుకుంది. గ్రీస్‌తో వివాదం నడుమ మాసిడోనియా ఈ చర్యలు తీసుకుంది.
మరోవైపు స్వాజీలాండ్ కూడా 2018లో ఈ-స్వాటినిగా పేరు మార్చుకుంది.
ఇరాన్‌ను ఒకప్పుడు పర్షియాగా పిలిచేవారు. థాయ్‌లాండ్ ఒకప్పుడు సియాం. జింబాబ్వే ఒకప్పుడు రొడీషియా.
ఇవి కూడా చదవండి:
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
- భారత్-నేపాల్ మధ్య ఒక నది ఎలా చిచ్చు పెడుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















