పాకిస్తాన్ సౌదీ అరేబియాకు దూరమై టర్కీకి చేరువ అవుతోందా... ఎందుకు?

ఇమ్రాన్, ఎర్దొవాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫర్హత్ జావేద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్

పాకిస్తాన్ విదేశీ సంబంధాల్లో విధానపరమైన మార్పులు జరిగాయని, ఇప్పుడు ఇస్లామాబాద్ టర్కీ వైపు చూస్తోందని గత కొన్ని నెలలుగా దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పాకిస్తాన్ ఇప్పుడు సౌదీ అరేబియాకు బదులు టర్కీకి ప్రాధాన్యం ఇస్తోందని కూడా చెప్పుకుంటున్నారు.

గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాల నడుస్తున్న వార్తలు, ట్రెండ్స్ వీటికి ఊతమిస్తున్నాయి.

వీటిలో కొన్నింటిని నకిలీ వార్తల ఆధారంగా చెబుతున్నారు. వీటిని ఖండించేందుకు ఇప్పుడు స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి ముందుకు రావాల్సొచ్చింది.

ఇటీవల ఎఫ్‌టీఎఫ్ సమావేశం రోజు కూడా సౌదీ అరేబియా ఓటింగ్ ప్రక్రియలో పాకిస్తాన్‌ను వ్యతిరేకించిందనే ఒక వార్త బయటికొచ్చింది. ఇది ట్రెండ్ అవడంతో విదేశాంగ శాఖ దీనిపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

తర్వాత, కశ్మీర్ డే సందర్భంగా రియాద్‌లోని పాకిస్తానీ ఏంబసీలో కార్యక్రమాన్ని నిర్వహిచడంపై ఆంక్షలు విధించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో మరోసారి సౌదీ అరేబియా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు తాజాగా సౌదీ కరెన్సీ గురించి ఒక కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సౌదీ అరేబియా ఇటీవల 20 రియాళ్ల కొత్త కరెన్సీ నోటు విడుదల చేసింది. అందులో తాము జీ-20కి అధ్యక్షత వహించడాన్ని ఆ దేశం హైలెట్ చేసింది.

అదే నోటుకు మరో వైపు ఒక మ్యాప్ ముద్రించారు. అందులో కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్‌ను భారత్‌లో భాగంగా చూపించలేదు. దాంతో పాకిస్తాన్ చాలా సంతోషపడిపోయింది.

కానీ, కొన్ని భారత చానళ్లు, సోషల్ మీడియా యూజర్లు ఆ మ్యాప్‌లో వాటిని పాకిస్తాన్‌లో భాగంగా కూడా చూపించలేదనే విషయం బయటపెట్టారు. సౌదీ చర్య రెండు దేశాల్లో కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్ అంశంపై భారత అధికారిక వాదనను ప్రతిబింబించేలా ఉంది. భారత మీడియా దానిని ప్రశంసించింది. కానీ పాకిస్తాన్‌లో ఈ మ్యాప్‌ పట్ల సానుకూలంగా లేదు.

పాకిస్తాన్‌తో టర్కీ, సౌదీ అరేబియా సంబంధాలు ఎలా ఉన్నాయి అనే విషయం టర్కీ లేదా సౌదీ అరేబియాకు అంత ముఖ్యమైన విషయంగా అనిపించకపోవచ్చు. కానీ పాకిస్తాన్‌కు ఈ సంబంధాలు చాలా కీలకం.

సౌద అరేబియా ముద్రించిన కొత్త నోటు

ఫొటో సోర్స్, SAUDI ARABIAN MONETARY AUTHORITY

ఫొటో క్యాప్షన్, సౌద అరేబియా ముద్రించిన కొత్త నోటు

దూరం అవడానికి కారణం

పాకిస్తాన్‌కు ఆర్థికసాయం చేసేందుకు సౌదీ అరేబియా చాలాసార్లు ముందుకొచ్చింది. బదులుగా పాకిస్తాన్ కూడా తన విదేశాంగ విధానంలో అన్నిటికంటే సౌదీ అరేబియాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా సందర్భాల్లో పాక్ విదేశాంగ విధానం 'మైక్రో మేనేజ్‌మెంట్‌'లో సౌదీ జోక్యం కూడా కనిపించడం మొదలైంది. అది ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.

అయితే, పాకిస్తాన్, సౌదీ అరేబియా సంబంధాల్లో ఉదాసీనత వల్ల, టర్కీ, ఇరాన్ లేదా వేరే ఏ దేశంతోనూ పాకిస్తాన్‌కు సంబంధాలు పెట్టుకోలేకపోతోందని, బదులుగా పాకిస్తాన్ ఏ అంశంలో సౌదీ నుంచి మద్దతు ఆశిస్తోందో అది లభించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.

బీబీసీ దీనిపై మాజీ రాయబారులు, విదేశీ అంశాల నిపుణులతో మాట్లాడింది.

పాకిస్తాన్ టర్కీ వైపు మొగ్గుచూపడం వింతగా అనుకోవాలా, లేక ఆ దేశ విదేశాంగ విధానంలో ఇది ఒక పరిణాత్మక మార్పు అనుకోవచ్చా అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది.

సమాధానంగా "కశ్మీర్ అంశంలో సౌదీ అరేబియా భారత్‌కు మద్దతివ్వడాన్ని, లేదా తాము ఆశించినట్లు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వకపోవడం లాంటి కొన్ని నిర్ణయాలను పాక్ ప్రజలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు" అని పాక్ మాజీ విదేశాంగ కార్యదర్శి రామ్షాద్ అహ్మద్ అన్నారు.

ఎఫ్ఏటీఎఫ్ సదస్సు

ఫొటో సోర్స్, FATF

ఫొటో క్యాప్షన్, ఎఫ్ఏటీఎఫ్ సదస్సు

మరోవైపు, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం వల్లే పాకిస్తాన్ ప్రజలకు సౌదీ అరేబియాపై నమ్మక తగ్గిపోయిందని ఆయన భావిస్తున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ నయీమ్ జహ్రా పాకిస్తాన్ సంబంధాల్లో ఒక్కసారిగా మార్పులు వచ్చాయని భావించడం లేదు.

"ప్రాథమిక సంబంధాలపై ఏ ప్రభావం పడకుండా చూసుకోడానికి పాక్ పూర్తిగా ప్రయత్నస్తుంద"ని ఆయన అన్నారు.

ఇక సైనిక సంబంధాల విషయానికి వస్తే వాటిలో ఇప్పటివరకూ ఎలాంటి మార్పులూ లేవు, సమీప భవిష్యత్తులో ఉండవు కూడా.

టర్కీతో పాక్ సంబంధాలు సహజ పద్ధతిలోనే ముందుకు సాగుతున్నాయని ఆయన చెప్పారు. సౌదీ అరేబియాతో ప్రస్తుత సంబంధాలకూ వాటికి ఏ సంబంధం లేదన్నారు.

"బహుశా, మతపరమైన, చారిత్రక, సాంస్కృతిక, పర్యటక ఇంకా ఇతర కారణాల వల్ల టర్కీతో పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడి ఉండవచ్చు. అందుకే వీటిని సహజంగానే భావించాలి. ఈ అంశాలను బట్టి టర్కీతో పాక్ సంబంధాలు మరింత బలోపేతం కావాలి. కానీ, టర్కీతో సంబంధాల వల్ల సౌదీ అరేబియా-పాక్ బంధం క్షీణిస్తాయని చెప్పడం తప్పు" అన్నారు నసీమ్.

సౌదీ అరేబియాతో సంబంధాల్లో మార్పులకు వేరే కారణాలు ఉన్నాయని నసీమ్ అన్నారు.

"ప్రతి దేశానికి ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. భారత్ లేదా ఈ ప్రాంతంలో ఏ దేశానికైనా ప్రాధాన్యం ఇచ్చే అధికారం సౌదీ అరేబియాకు ఉంది. అదే అధికారం పాకిస్తాన్‌కు కూడా ఉంది" అన్నారు.

తన బౌగోళిక స్థితిని ఉపయోగించుకుంటూ ఆర్థికవ్యవస్థను అభివృద్ధి చేసుకునే పరిస్థితి పాకిస్తాన్‌కు మొదటిసారి వచ్చింది. అది ఏడాదిలో జరిగింది కాదు. గత కొన్నేళ్లుగా ఇది పాకిస్తాన్ విధానంగా ఉంది. దాంతో దానివల్ల అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి మెరుగుపడింది. ఆ ప్రాంతంలో సమగ్ర మార్పులకు ఇది కారణమయ్యింది" అని నసీమ్ చెప్పారు.

ట్రంప్‌తో సల్మాన్

ఫొటో సోర్స్, Getty Images

హఠాత్తుగా మార్పులు జరగలేదు

సౌదీ అరేబియా అంశాలను నిశితంగా గమనించే విశ్లేషకులు రషీద్ హుస్సేన్ కూడా బీబీసీతో మాట్లాడారు.

ఈ సంబంధాల్లో మార్పులు హఠాత్తుగా జరిగినవి కావు, ఒత్తిడి గత కొన్నేళ్ల నుంచీ పెరుగుతోంది అన్నారు.

ఆయన ఈ ఒత్తిడికి లింకులను 2002తో జోడించారు. ఆ సమయంలో అప్పటి భారత విదేశాంగ మంత్రి జస్వంత సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించారు. అప్పుడు ఆర్థిక దౌత్యాన్ని ఉపయోగించి సౌదీ అరేబియా, పాకిస్తాన్ సంబంధాల మధ్య చీలికలు తీసుకురావడంలో విజయం సాధించారని చెప్పారు.

"తర్వాత సౌదీ అరేబియా ఈ ప్రాంత సమస్యలను పాకిస్తాన్ దృష్టికోణంలో చూడ్డానికి బదులు ఒక కొత్త దృష్టితో చూడ్డం మొదలుపెట్టింది. అలా, సౌదీ-భారత్ సంబంధాల్లో ఒక కొత్త శకం మొదలైంది. అక్కడ పాకిస్తాన్ ప్రయోజనాలు, సంబంధాల ప్రస్తావనే లేదు" అన్నారు రషీద్

తర్వాత, గత ఏడాది పాకిస్తాన్‌కు వ్యతిరేకతను పట్టించుకోని యూఏఈ ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఆహ్వానించింది. దాంతో, పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఆ సమావేశంలో పాల్గొనలేదు.

విషయం అక్కడితో ఆగలేదు. యూఏఈ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపింది. తర్వాత సౌదీ అరేబియా నరేంద్ర మోదీని తమ దేశానికి ఆహ్వానించింది. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోడానికి ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందించింది.

ఆ తర్వాత ఇస్లామిక్ దేశాల సంస్థ(ఐఓసీ) వైఖరి, పాకిస్తాన్ డిమాండ్లకు విరుద్ధంగా కశ్మీర్ అంశంలో సమావేశం ఏర్పాటుచేయకపోవడం, దానికి షా మహమ్మద్ ఖురేషీ సౌదీ అరేబియాపై విమర్శలు చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బీటలు వారాయి.

షా మహమ్మద్ ప్రకటన తర్వాత పాకిస్తాన్‌కు 2018లో తాము ఇచ్చిన 3 బిలియన్ల డాలర్ల రుణాన్ని, గడువుకు ముందు చెల్లించాలని సౌదీ అరేబియా కోరిందని మీడియాలోకథనాలు వచ్చాయి.

ఈ స్పందన తర్వాత ఈ విభేదాలు ఏ స్థాయికి చేరాయంటే, చివరకు ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వాను చర్చల కోసం సౌదీ అరేబియా పంపించాల్సి వచ్చింది.

ఆ సమయంలో పాకిస్తాన్‌లో సౌదీ అరేబియా మాజీ రాయబారి డాక్టర్ అలీ ఆవాజ్ అసీరీ అరబ్ న్యూస్‌కు ఒక వ్యాసం రాశారు.

అందులో "పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య పరస్పర ప్రేమ, మత, సాంస్కృతిక, సామాజిక విలువలపై ఆధారపడిన ఏ సంబంధాలనూ పోల్చలేం. ఈ సంబంధాలు రెండు దేశాల వ్యక్తిత్వం, ప్రభుత్వాల పరివర్తనను మించినవి" అన్నారు.

అయితే, మాజీ సౌదీ రాయబారి పాక్ విదేశాంగ మంత్రి ప్రకటనను ప్రమాదకరం అని వర్ణించారు. కశ్మీర్ అంశంలో సౌదీ అరేబియా ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశానికి పిపులునివ్వలేదని, పాకిస్తాన్ ఆ సంస్థకు సమాంతరంగా మరో సంస్థతో సమావేశానికి పిలుపునిస్తుందా" అన్నారు.

"అంటే దానర్థం విదేశాంగ మంత్ర ఖురేషీ కౌలాలంపూర్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం. అయితే అది ఒక ప్రమాదకరమైన ఆలోచన. ఒక సోదర దేశం నుంచి దానిని ఆశించలేమ"ని ఆయన తన వ్యాసంలో రాశారు.

"స్వయంగా రాజ పరివారంలో కూడా సౌదీ విధానాల పట్ల వ్యతిరేకత ఉంది. పాకిస్తాన్ విదేశాంగ విధానాలకు సమర్థించలేం, ప్రతి దేశానికీ తమకంటూ ఒక విదేశాంగ విధానం ఉంటుంద"ని మాజీ రాయబారి రామ్షాద్ అహ్మద్ అన్నారు.

ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ బిన్ సల్మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ బిన్ సల్మాన్

పాకిస్తాన్‌లో అభిప్రాయ బేధాలు

మరోవైపు "పాకిస్తాన్, సౌదీ అరేబియా సంబంధాల్లో ఇంతకు ముందు కూడా ఒకటి రండు సార్లు అభిప్రాయ బేధాలు వచ్చాయి. కానీ పాక్ విదేశాంగ విధానం మూల స్తంభాల్లో సౌదీ అరేబియా ఒకటి అనేది సుస్పష్టం" అని సీనియర్ జర్నలిస్ట్ అమీర్ జియా అన్నారు.

ఆయన టర్కీ, సౌదీ అరేబియా రెండూ పాకిస్తాన్‌కు చాలా ముఖ్యమైన దేశాలని అంటున్నారు.

"దౌత్యంలో రెండు దేశాలతో చక్కటి సంబంధాలు కొనసాగించడం ముఖ్యం. పాక్‌తో సంబంధాలు సౌదీ అరేబియాకు కూడా ముఖ్యమే. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడకూడదు. ఇక ప్రజల విషయానికి వస్తే పాకిస్తాన్ ప్రజలు టర్కీ, సౌదీ అరేబియా రెండిటి పట్లా నిజాయితీగా ఉన్నారు.

కశ్మీర్ అంశానికి వద్దాం. తమ స్వప్రయోజనాలను బట్టి ప్రతి దేశం దౌత్య సంబంధాలను పెంచుకోవడం, తెంచుకోవడం చేస్తుంటుంది. కశ్మీర్ అంశంలో పాక్ ప్రజల ఆలోచనలు వాస్తవికత కంటే భావోద్వేగాలపై ఆధారపడ్డాయి" అన్నారు.

"ప్రతి దేశం తమ ప్రయోజనాలను చూస్తుంది. కశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు ఈ అంశం చాలా ముఖ్యమైనది. దీనిపై భారత్‌కు సౌదీ అరేబియా మద్దతివ్వడాన్ని బహుశా పాకిస్తాన్‌ భరించలేకపోతోంది. కశ్మీర్ అంశంపై ఓఐసీ మద్దతు పొందాలనుకోవడం కరెక్టే. అందుకే, పాకిస్తాన్ ప్రజలు ఈ అంశంపై సౌదీ అరేబియాపై కోపంగా ఉన్నారు" అంటున్నారు.

పాకిస్తాన్ విదేశాంగ విధానంలో 'మైక్రో మేనేజ్‌మెంట్‌' ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే, అది దేశ ప్రయోజనాలకు విరుద్ధం" అన్నారు జియా.

సంబంధాల స్వభావం మారిపోవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో భారత్‌తో సౌదీ అరేబియా సంబంధాలు, యెమెన్ అంశం లేదా స్వయంగా పాకిస్తాన్ ఆశలు ఇలా చాలా ఉంటాయి అంటారు నసీమ్ జహ్రా.

నవాజ్ షరీఫ్ ఎప్పుడూ సౌదీ అరేబియాకు కోపం తెప్పించేవారు కాదు. కానీ, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్, ముఖ్యంగా పాకిస్తాన్ సాయుధ దళాలకు కూడా ఇప్పుడు అన్నీ మన ఇంట్లోనే చాలా దగ్గరగా వచ్చాయని అనిపిస్తోంది. అది ఇరాన్‌కు వ్యతిరేకత లేదంటే యెమెన్ యుద్ధం.. ఏదయినా కావచ్చు. పాకిస్తాన్ ఒక హద్దును నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)