పాకిస్తాన్ ఎంపీలు 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు చేశారా.. ఇందులో నిజమెంత - Reality Check

మోదీ

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, శ్రుతి మీనన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, రియాలిటీ చెక్

ఫ్రాన్స్‌లో ఒక ఉపాధ్యాయుడి హత్య నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్ పార్లమెంటులో వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో అక్కడి విపక్ష ఎంపీలు భారత ప్రధాన మంత్రి మోదీ పేరుతో నినాదాలు చేశారని కొన్ని భారత మీడియా చానళ్లు, పత్రికలు కథనాలు ఇచ్చాయి.

కానీ, పాకిస్తాన్‌లో ఎంపీలు నిజంగానే తమ పార్లమెంటులో భారత ప్రధాని మోదీ నినాదాలు చేశారా? పాకిస్తాన్ పార్లమెంటులో అసలు ఏం జరిగింది?

వివాదాస్పద కార్టూన్లు ప్రచురించి ఈ నెల మొదట్లో పారిస్‌లో ఒక ఉపాధ్యాయుడి మరణానికి ప్రచురణకర్తలు కారణమయ్యారంటూ, దానికి సంబంధించి తాము పెట్టిన తీర్మానంపై ఓటింగ్ జరగాలని సోమవారం పాకిస్తాన్ విపక్ష నేత ఖ్వాజా ఆసిఫ్, సహా మిగతా ఎంపీలు పట్టుబట్టారు.

ఆ హత్య తరువాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇస్లామిక్ ప్రపంచంలో కొందరికి ఆగ్రహం తెప్పించాయి. పాకిస్తాన్ ప్రధాని కూడా వాటిని విమర్శించారు.

పాకిస్తాన్ అధికార, విపక్షాలు రెండూ ఈ అంశంలో తమ సొంత తీర్మానాలపై ఓటింగ్ జరగాలని ఒత్తిడి చేశాయి.

చర్చ జరుగుతున్న సమయంలో విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ సభను ఉద్దేశించి మాట్లాడ్డం ప్రారంభించారు. దీంతో విపక్ష సభ్యులు ప్రభుత్వం తరఫు తీర్మానం కాకుండా.. తాము ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ జరగాలంటూ "ఓటింగ్, ఓటింగ్" అంటూ అరిచారు.

టైమ్స్ నౌ

ఈ రెండు నిమిషాల వీడియో తర్వాత ఏ సందర్భం లేకుండానే భారత మీడియాలో, డిజిటల్ అవుట్‌లెట్లలో, విస్తృత రీచ్ ఉన్న పాపులర్ సోషల్ మీడియా హాండిళ్లలో కనిపించడం మొదలైంది.

విపక్ష ఎంపీలు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇబ్బంది పెట్టడానికి 'మోదీ'( ఓటింగ్ అని కాదు) అని నినాదాలు చేశారని టైమ్స్ నౌ, ఇండియా టీవీ, ఎకనమిక్ టైమ్స్ సహా చాలా మంది సోషల్ మీడియా యూజర్లు తప్పుడు వాదనలు వినిపించారు.

ఎకనమిక్ టైమ్స్ తర్వాత తమ కథనాన్ని తీసేస్తే, టైమ్స్ నౌ తన ట్వీట్ డిలీట్ చేసింది. కానీ పాకిస్తాన్ పార్లమెంటులో చర్చపై ఆ పత్రిక ఆర్టికల్ ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఉంది.

షా మెహమూద్ ఖురేషీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షా మెహమూద్ ఖురేషీ

పార్లమెంటులో అసలు మోదీ మాట వచ్చిందా?

అవును, వచ్చింది. కానీ అది ఆ చర్చ తర్వాత, వేరే సందర్భంలో మోదీ గురించి మాట్లాడారు.

భారత కథనాలను విపక్షాలు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాయని ఖురేషీ ఆరోపించిన సమయంలో పార్లమెంటులో మోదీ పేరు వినిపించింది.

విపక్షాలకు ఘాటుగా సమాధానం చెప్పిన ఆయన ప్రతిపక్షాలు భద్రతా దళాల మధ్య చీలికలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని, పాకిస్తాన్ వ్యతిరేక కథనాలకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు.

అదే సమయంలో ప్రభుత్వ మద్దతుదారులు ఉర్దూలో "మోదీ కా జో యార్ హై, గద్దార్ హై, గద్దార్ హై"(మోదీకి స్నేహితులు విశ్వాస ఘాతకులు) అంటూ అరవడం స్పష్టంగా వినిపిస్తుంది.

ఇక్కడ జరిగినదానికి, భారత్‌లో చెబుతున్న వాదనలకు ఎలాంటి సంబంధం లేదు.

పాకిస్తాన్‌లో విపక్ష ఎంపీలు 'మోదీ' అంటూ నినాదాలు చేశారని చెబుతున్న వాదనలను పూర్తిగా సందర్భం లేకుండా చెబుతున్నారు.

మీరు పాక్ పార్లమెంటులో ఆ చర్చను ఇక్కడ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)