టీవీ చర్చలో సామెత చెప్పిన జర్నలిస్టు.. జైలు శిక్ష విధించిన టర్కీ కోర్టు

ఫొటో సోర్స్, AFP
టర్కీ అధ్యక్షుడిని అవమానించారనే ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు సెడెఫ్ కబాస్‌ను కోర్టు అదుపులోకి తీసుకుంది.
కబాస్‌ను శనివారం ఇస్తాంబుల్‌లో అరెస్టు చేశారు. విచారణ జరుపక ముందే ఆమెను జైల్లో పెట్టాలని కోర్టు ఆదేశించింది.
టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ఎర్డొగన్ ను లక్ష్యంగా చేసుకుని కబాస్ ఒక సామెతను ఉదహరించారని ఆమెపై ఆరోపణలు మోపారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక టీవీ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ ఆమె ఆ సామెతను ఉటంకించారు.
అయితే, కబాస్ ఈ అభియోగాలను ఖండించారు.
ఈ అభియోగంపై ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
"కిరీటం పెట్టుకున్న తల తెలివైనది అవుతుంది అనేది ప్రసిద్ధికెక్కిన ఒక సామెత. కానీ, అది నిజం కాదన్నది మనం చూస్తున్నాం" అని కబాస్ టెలి1 ఛానెల్‌లో అన్నారు.
"రాజభవనంలోకి ప్రవేశించినంత మాత్రాన ఎద్దు రాజుగా మారదు, కానీ రాజభవనం ఒక (పశువుల) కొట్టం అవుతుంది" అంటూ మరో సామెతను తరువాత ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఆమె వ్యాఖ్యలు "బాధ్యతా రహితమైనవని" ఎర్డొగన్ ప్రధాన ప్రతినిధి ఫహ్రెటిన్ ఆల్టున్ అన్నారు.
"విద్వేషాన్ని వ్యాప్తి చేయడం తప్ప మరో ధ్యేయం లేని టెలివిజన్ ఛానెల్‌లో జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక వ్యక్తి మా దేశ అధ్యక్షుడిని నిర్మొహమాటంగా అవమానించారు" అంటూ ఆయన ట్వీట్ చేశారు.
దేశాధ్యక్షుడిని అవమానించే ఉద్దేశం తనకు లేదని కబాస్ తన కోర్టు వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టెలి1 ఛానల్ ఎడిటర్ మెర్డాన్ యానార్దాగ్.. కబాస్ అరెస్టును దుయ్యబట్టారు.
"ఒక సామెత కారణంగా ఆమెను అర్థరాత్రి 2 గంటలకు నిర్బంధించడం పూర్తిగా అనంగీకారం. ఇది జర్నలిస్టులను, మీడియాను, సమాజాన్ని భయపెట్టే ప్రయత్నం" అని ఆయన అన్నారు.
రెకెప్ తయ్యిప్ ఎర్డొగన్ టర్కీకి నేరుగా ఎన్నికైన తొలి అధ్యక్షుడు. 2014 ఆగస్టులో ఆయన ఈ పదవిని చేపట్టారు. అంతకు ముందు 11 సంవత్సరాల పాటు ఆ దేశ ప్రధానిగా వ్యవహరించారు.
ఆయన విమర్శకుల నోళ్లు మూయించడం అంతర్జాతీయంగా ఆక్షేపణలు ఎదుర్కొంది. దాంతో, యూరోపియన్ యూనియన్‌తో టర్కీ సంబంధాలు సన్నగిల్లాయి. ఇది, కూటమిలో చేరడానికి టర్కీ చేస్తున్న ప్రయత్నాలను నిలువరించింది.
ఎర్డొగన్ అధ్యక్షుడైనప్పటి నుంచి ఆయనను అవమానించారనే అభియోగాలతో వేలాది మందిపై కేసులు మోపారు.
2020లో ఈ అభియోగానికి సంబంధించి 31,000 కంటే ఎక్కువ దర్యాప్తులను ఫైల్ చేశారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ ఖర్జూరంపై 200 శాతం పన్ను విధిస్తున్న భారత్.. పాక్ వ్యాపారులకు 700 కోట్లు నష్టం
- కోవిడ్ కారణంగా ప్రధాని పెళ్లి రద్దు
- అఫ్గానిస్తాన్ శరణార్థులు: ఆదుకునేదెవరు, ఆశ్రయమిచ్చేదెవరు?
- భారత్‌లోనే అత్యంత ఘాటైన రాజా మిర్చి కథ ఇది
- దూది కోట రహస్యం: స్వర్గంలాంటి ప్రదేశానికి ‘నరక ద్వారం’ అని పేరెందుకు వచ్చింది
- ‘రెండే శానిటరీ ప్యాడ్లు ఉన్న చిన్న ప్యాకెట్లతోనే అక్కడి మహిళలు సర్దుకుపోతున్నారు’
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- యుక్రెయిన్: అమెరికా హడావుడి దౌత్య ప్రయత్నాలు, ఊహకు అందని రష్యా వ్యూహాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












