పాకిస్తాన్ ఖర్జూరంపై 200 శాతం పన్ను విధిస్తున్న భారత్.. పాక్ వ్యాపారులకు 700 కోట్లు నష్టం

వీడియో క్యాప్షన్, భారత్ వ్యాపారాన్ని ఆపేయడంతో ఇబ్బందుల్లో పాకిస్తాన్ ఖర్జూరం రైతులు

పాకిస్తాన్ లోని ఖైర్ పూర్ లో అత్యధికంగా ఖర్జూరం పండుతుంది. ఈ ప్రాంతం సముద్రానికి దూరంగా ఉండటం, తేమ లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ పంట పండించేందుకు ఇక్కడ అనువుగా ఉంటుంది.

ఫిబ్రవరి నుంచి ఖర్జూరం కాయడం మొదలయి, జూన్ నాటికి పూర్తిగా పండుతాయి. దానిని ఖర్జూరం పళ్ళలా చేయాలా లేదా ఎండు కర్జూరం చేయాలా అనేది రైతు నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ లో ఉన్న ధర, కాలానికనుగుణంగా రైతు దీనిని నిర్ణయిస్తారు.

అయితే, ప్రస్తుతం పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్న సంబంధాలతో ఈ ప్రక్రియలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి.

గులాం ఖాసిం జస్కాని ఖైర్ పూర్ కు చెందిన అభ్యుదయ రైతు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త సంబంధాలు చిన్న రైతుల ఆదాయం పై ప్రభావం చూపించాయని ఆయన చెప్పారు. ఎండు ఖర్జూరం ధర బాగా తగ్గిపోయిందని తెలిపారు.

2019లో బాలాకోట్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తలు మొదలయ్యాయి. దీంతో ఇరు దేశాలు పరస్పర సంబంధాలను తెంచుకుని, వాఘా సరిహద్దు మీదుగా జరిగే వాణిజ్యాన్ని ఆపేశాయి.

ఇది సుక్కూర్ లో ఉన్న అత్యంత పెద్ద ఖర్జూరం మార్కెట్. ఇక్కడ ఖర్జూరాన్ని బలూచిస్తాన్ తో పాటు దగ్గర్లో ఉన్న ప్రాంతాల నుంచి కూడా కొనుగోలు చేసి అమ్ముతారు. ఈ మార్కెట్ నుంచే భారత్ తో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.

పాకిస్తాన్ 55లక్షల టన్నుల ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తుందని పాకిస్తాన్ ఆహార మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగం పంట సింధ్ ప్రాంతంలోనే పండిస్తారు. ఈ మార్కెట్ లో ప్రతీ ఏటా 22లక్షల సంచులు, 400,000 క్రేట్ల ఖర్జూరం కొనుగోలు చేస్తారు

వాఘా సరిహద్దును మూసేసిన తర్వాత ఈ ఎండు ఖర్జూరాన్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులు ప్రత్యామ్న్యాయ మార్గాలను చూసుకోవాల్సి వచ్చింది.

పాకిస్తాన్ లో ఉత్పత్తయ్యే అన్ని వస్తువుల పైనా భారత్ 200% పన్నును విధిస్తోంది. ఇది ఎండు ఖర్జూరానికి కూడా వర్తిస్తుంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అవార్డు ను కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఖర్జూరం ఎగుమతి వ్యాపారులు ఒక్క 2021లోనే 10 కోట్ల డాలర్లను (సుమారు రూ.700 కోట్లు) నష్టపోయారని నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పాకిస్తాన్ స్టాండింగ్ కమిటీ చెప్పింది. ఇతర దేశాల్లో కొత్త మార్కెట్ లను చూపించమని ఈ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.

పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే ఖర్జూరం పై పన్ను విధించిన తర్వాత దీని ధర భారతీయ మార్కెట్ లో కూడా బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో, పాకిస్తాన్ రైతులు, ఇరు దేశాల్లో ఉన్న వర్తకులు కూడా నష్టాలను ఎదుర్కొంటున్నారు. మరో వైపు థర్డ్ పార్టీలుగా వ్యవహరిస్తున్న దేశాలు లాభాలు పొందుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)