వీగర్ ముస్లిం శరణార్థులను టర్కీ నేరుగా చైనాకు అప్పగిస్తుందా?

ఫొటో సోర్స్, SOPA IMAGES
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనా, టర్కీ 2017లో నేరస్థుల అప్పగింత విషయమై ఓ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. 'ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న' 'కొందరు శరణార్థులు', 'వీగర్ ముస్లింల'ను చైనాకు అప్పగించే విషయం గురించి ఇందులో ప్రస్తావించారు.
గత శనివారం చైనా పార్లమెంటు ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. టర్కీ ఇంకా ఆమోదించాల్సి ఉంది.
కానీ, టర్కీలో ఉంటున్న వీగర్ ముస్లింలను లక్ష్యంగా చేసుకునేందుకు చైనా ఈ ఒప్పందాన్ని వాడుకుంటుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
అయితే, టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్ కార్వుసోగ్లూ ఈ వాదనలను తోసిపుచ్చారు. వీగర్ ముస్లింలను చైనాకు అప్పగించే విషయంలో ఇంకా తాము ఏ నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు.
టర్కీ పార్లమెంటు కూడా ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. వీగర్ ముస్లింలను వేధించేందుకు ఈ ఒప్పందాన్ని చైనా ఆయుధంగా మలుచుకోవచ్చని, ఆ అవకాశం ఇవ్వకూడదని ఎంపీలు అంటున్నారు.
అయితే ఒప్పందాన్ని టర్కీ ఆమోదించేలా ఆర్థికపరంగా, దౌత్యపరంగా చైనా ఒత్తిడి తెస్తోందని యూరప్‌లోని మానవహక్కుల కార్యకర్తలు, వీగర్ ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఈ ఒప్పందం వల్ల శరణార్థులుగా ఉంటున్న వీగర్ ముస్లింలను చైనాకు తిప్పిపంపిస్తారన్న భయం ఉంది. అక్కడ వారిపై చైనా నిఘా పెడుతుంది. వేధిస్తుంది'' అని గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ అధికార ప్రతినిధి లియో లెన్ అన్నారు.
తమ దేశాల్లో ఉంటున్న వీగర్ ముస్లింలను చైనాకు వెనక్కిపంపబోమని 2018లో జర్మనీ, స్వీడన్ ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయం తీసుకున్నాయి.
యురోపియన్ యూనియన్ కూడా సభ్యదేశాలకు ఇదే సూచిస్తూ ఓ అభ్యర్థన చేసింది. మలేసియా కూడా ఇలాంటి తీర్మానాన్ని చేసింది.
వీగర్ ముస్లిం శరణార్థులను వెనక్కిపంపితే, చైనాలోని షింజియాంగ్‌లో జరుగుతున్న 'సాంస్కృతిక నరమేధానికి’ వారు కూడా బాధితులు అవ్వాల్సి వస్తుందని యురోపియన్ యూనియన్, దాని సభ్య దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
షింజియాంగ్‌లో ఉంటున్న దాదాపు పది లక్షల మంది వీగర్ ముస్లింలను చైనా 'నిర్బంధ కేంద్రాల్లో' పెట్టి, వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మతపరమైన ఆంక్షలు పెట్టి, మహిళలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయించడం, బలవంతంగా పని చేయించుకోవడం వంటివి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అయితే, వీటిని చైనా ఖండిస్తోంది. వీగర్ ముస్లింలు 'ఉగ్రవాదం' వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆర్థిక అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని చెబుతోంది.

వీగర్ ముస్లింలతో టర్కీ సంబంధాలు
చైనా వీగర్ ముస్లింలకు, టర్కీ మూలాలున్న ముస్లింలకు టర్కీ ఎప్పటి నుంచో ఆశ్రయమిస్తూ వస్తోంది. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వీగర్, టర్కీ మూలాలున్న ముస్లిం శరణార్థులు ఆ దేశంలో ఉన్నట్లు అంచనా. వీగర్ ముస్లిం శరణార్థులు అత్యధికంగా ఉన్న దేశం టర్కీనే.
''వీగర్ ముస్లింలతో టర్కీకి చారిత్రక సంబంధాలు ఉన్నాయి. 1873లో ఒటమాన్ సామ్రాజ్యాన్ని సుల్తాన్ అబ్దుల్ అజీజ్ పాలిస్తున్నప్పుడు చైనాలో కుయింగ్ సామ్రాజ్యంతో పోరాడేందుకు వారికి ఆయుధాలు కూడా పంపించారు. ఆ తర్వాత నుంచి షింజియాంగ్‌లో ఉండే వీగర్ ముస్లింలు నాయకత్వం కోసం, ఇతరత్రా అవసరాల కోసం టర్కీపై ఆధారపడుతూ ఉన్నారు. కానీ, 1949లో చైనాలో కమ్యూనిస్టు విప్లవం వచ్చాక, చైనా ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంది'' అని దిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌కు చెందిన యథార్థ్ కచియార్ చెప్పారు.
ఆ తర్వాత వీగర్ ముస్లింలు, టర్కీ మూలాలున్న ముస్లింలు షింజియాంగ్ నుంచి పెద్ద స్థాయిలో వెళ్లిపోవడం మొదలైందని, రాజకీయ శరణార్థులుగా వాళ్లు టర్కీని ఆశ్రయించారని ఆయన చెప్పారు.
టర్కీలో శరణార్థులుగా ఉన్న వీగర్ ముస్లింలకు అమెరికా, ఐరాస సాయం చేస్తూ వస్తున్నాయి. టర్కీ కూడా వారికి పౌరసత్వం కల్పిస్తూ వస్తోంది.
టర్కీలోని అక్సరాయ్, జెత్యిన్బుర్నుల్లో వీగర్ ముస్లిం శరణార్థులు 1950ల నుంచి ఉంటున్నారు.
అయితే, కొన్నేళ్లుగా టర్కీ చైనాకు దగ్గరవుతూ వస్తోంది. 'ఉగ్రవాద' కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారంటూ చైనా చెబుతున్న శరణార్థులను చైనాకు అప్పగిస్తోందంటూ టర్కీపై ఆరోపణలు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
టర్కీ నేరుగా ఈ శరణార్థులను చైనాకు అప్పగించకుండా, వారిని తజికిస్తాన్‌కు పంపి, అక్కడి నుంచి చైనాకు అప్పగిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
చైనా కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే షింజియాంగ్‌లో ఉన్న తమ బంధువులను వేధిస్తామని చైనా పోలీసులు తమకు ఫోన్లు చేస్తున్నారని టర్కీలో ఉంటున్న వీగర్ ముస్లింలు అంటున్నారు.
టర్కీ పౌరసత్వం ఇంకా రాని వీగర్ శరణార్థులకు కొత్త ఒప్పందం వల్ల ఎక్కువ ప్రమాదం ఉందని జర్మనీలోని వీగర్ వరల్డ్ కాంగ్రెస్ సంస్థకు చెందిన దిల్జాత్ రక్సిత్ ఓ వార్తా సంస్థతో అన్నారు.
ఈ ఒప్పందం ద్వారా వీగర్ ముస్లింలను వేధించే అవకాశాన్ని చైనాకు కల్పించవద్దని టర్కీ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ అణు శాస్త్రవేత్తలు వరుసగా ఎందుకు హత్యకు గురవుతున్నారు? ఇది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఆపరేషనా?
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- ‘ఎవరైనా నా ఇంటి తలుపు తట్టి 5 బుల్లెట్లను పేల్చవచ్చు.. నన్ను, నా కుటుంబాన్ని చంపేయొచ్చు’
- ఏపీలో కుక్కలు పెంచాలంటే లైసెన్స్ తప్పనిసరి.. ఈ జీవోపై విమర్శలకు కారణమేంటి
- "ఆమె అందగత్తె, తెలివైన అమ్మాయి. కానీ, భారతీయురాలు"
- 72,000 టన్నుల వజ్రాలు నిక్షిప్తమైన సుందర నగరం
- మీరు ఎంతటి తెలివిగలవాళ్లైనా, ప్రతిభావంతులైనా సరే లెక్కల్లో ఈ చిన్న తేడా మిమ్మల్ని ముంచేస్తుంది..
- కరోనావైరస్ చరిత్రను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా రచించుకుంటోందా?
- లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








