చైనా: వూహాన్‌లో కరోనావైరస్ వార్తలు కవర్ చేసిన జర్నలిస్టుకు నాలుగేళ్ల జైలు

ఫొటో సోర్స్, Youtube/Screenshot
కరోనావైరస్ బైటపడిన వూహన్‌లో వైరస్‌కు సంబంధించిన వార్తలు కవర్ చేసిన ఓ మహిళ సిటిజన్ జర్నలిస్ట్‌కు చైనా న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
“విద్వేషాలు రగిలించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడం'' అనే అభియోగాలపై ఆమెపై కేసులు నమోదయ్యాయి. చైనాలో ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించే ఉద్యమకారులపై తరచూ ఇలాంటి అభియోగాలు మోపుతుంటారు.
37 ఏళ్ల మాజీ న్యాయవాది, జర్నలిస్ట్ లీ ఝాంగ్ ఝాన్ మే నెల నుంచి ప్రభుత్వ అదుపులో ఉన్నారు. ఆమె కొన్ని నెలలుగా నిరాహార దీక్ష చేస్తున్నారని, ఆమె ఆరోగ్యం బాగా లేదని ఆమె తరఫు న్యాయవాదులు అన్నారు.
వూహాన్‌లో వైరస్ వ్యాప్తి గురించి రిపోర్ట్ చేసి ఇబ్బందులకు గురైన పలువురు సిటిజన్ జర్నలిస్టులలో ఝాంగ్ ఝాన్ ఒకరు.
చైనాలో మీడియాకు స్వేచ్ఛ లేదు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేవారిని, ఉద్యమకారులను టార్గెట్ చేసుకుని అణచివేస్తారని అక్కడి అధికారులకు పేరుంది.
కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించగానే ఆమె హతాశురాలయ్యారని ఆమె తరఫు లాయర్లలో ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు. తీర్పు వచ్చినప్పుడు కోర్టులోనే ఉన్న లీ ఝాన్ తల్లి బిగ్గరగా ఏడ్చినట్లు కూడా వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘తిరుగుబాటు తత్వం’
వూహాన్‌లో పరిస్థితుల గురించి ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి రాసిన పోస్ట్ చదివి తాను ఆ నగరానికి వెళ్లాలనుకున్నట్లు అరెస్టుకు ముందు ఒక స్వతంత్ర సంస్థకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో లీ ఝాన్ వెల్లడించారు.
ఒకపక్క అధికారుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నా, వూహాన్‌లోని ఆసుపత్రులలో పరిస్థితులపై లైవ్ స్ట్రీమింగ్ చేశారు. వాటి ఆధారంగా ఆమె రాసిన కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి.
లీ ఝాన్ రాసిన వ్యాసాలలో ఇండిపెండెంట్ జర్నలిస్టులపై అధికారుల అణచివేత, బాధితుల కుటుంబాలపై వేధింపుల ప్రస్తావన కూడా ఉందని నెట్‌వర్క్ ఆఫ్ చైనీస్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్(సీహెచ్‌ఆర్‌డి) అనే ఉద్యమ సంస్థ వెల్లడించింది.
“బహుశా నాలో తిరుగుబాటు తత్వం ఉంది. అందుకే వాస్తవాలను రిపోర్ట్ చేస్తున్నాను. ఈ నిజాలను ఎందుకు బైటపెట్టకూడదు? అని ఆమె బీబీసీకి లభించిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ఈ దేశం వెనుక్కి వెళుతోంది. అందుకే నేను నా ఉద్యమాన్ని ఆపదలుచుకోలేదు’’ అన్నారామె.
చైనీస్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ సంస్థ ప్రకారం, మే 14 నుంచి లీఝాంగ్ ఝాన్ కనిపించకుండా పోయారు. మరుసటి రోజు ఆమె వూహాన్‌కు 640 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాంఘైలో పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
నవంబర్ ఆరంభంలో ఆమెపై అధికారికంగా అభియోగాలు మోపారు. “టెక్స్ట్, వీడియో ఇంకా ఇతర మీడియాల ( వీచాట్, ట్విటర్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల) ద్వారా ఆమె తప్పుడు సమాచారాన్ని పంపారన్నది అధికారుల ఆరోపణ.
విదేశీ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చి దేశానికి హాని తలపెట్టే ప్రయత్నం చేశారన్న అభియోగాలపై ఆమెకు నాలుగు సంవత్సరాల శిక్షను విధించారు.

ఫొటో సోర్స్, Reuters
'ప్రమాదకరమైన శిక్ష'
మే నెలలో తన అరెస్టుకు నిరసనగా ఆమె నిరాహార దీక్షకు దిగడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. డిసెంబర్‌లో తాను కలిసినప్పుడు ఆమెకు ఫీడింగ్ ట్యూబ్ ద్వారా బలవంతంగా ఆహారం అందిస్తున్నారని ఆమె లాయర్లలోఒకరు వెల్లడించారు. తలనొప్పి, నీరసం, అలసటతో ఆమె బాధపడుతున్నారని కూడా తెలిపారు.
“ఆమె బాత్రూమ్‌కు వెళ్లాలన్నా ఎవరో ఒకరి సాయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ప్రతిరోజూ హింసను ఎదుర్కొంటున్న ఆమె మానసికంగా అలసిపోయారు” అని ఆమె న్యాయవాది వెల్లడించారు. అనారోగ్యం కారణంగా విచారణను వాయిదా వేయాలని కూడా ఆమె తరఫు లాయర్లు కోర్టును కోరారు.
హాంకాంగ్‌లో ఆందోళనకారులకు మద్దతు తెలిపినందుకు 2019లో కూడా ఝాంగ్ అరెస్టయ్యారు.
ఈ శిక్ష చాలా భయంకరమైనదని చైనీస్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ న్యాయవాది లియో లాన్ అన్నారు.“ఆమెకు పెద్ద శిక్ష వేశారు. ఆమె గొంతునొక్కడానికీ, వూహాన్‌లో ఏం జరిగిందో చెప్పాలనుకున్న వారిని బెదిరించడానికి చైనా ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది’’ అని లాన్ బీబీసీతో అన్నారు.
వూహాన్ గురించి వార్తలు రాసిన లీజెహువా, చెన్, క్యూషి, ఫాంగ్‌బిన్ అనే జర్నలిస్టులు ఈ ఏడాది ఆరంభంలో కనిపించకుండాపోయారు.
తర్వాత లీజెహువా ప్రభుత్వ నిర్భందంలో ఉన్నట్లు వెల్లడైంది.
చెన్ ఆయన కుటుంబాన్ని కలుసుకున్నా ప్రభుత్వ నిఘా కొనసాగుతునట్లు తేలింది. అయితే ఫాంగ్‌బిన్ ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









