ACID: 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి భాగల్‌పుర్ ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1980లో అంధులైన కొంతమంది ఫోటోలు వార్తా పత్రికల్లో ప్రచురించడంతో దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది. సత్వర న్యాయం పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకొన్న కొంతమంది పోలీసులు.. 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోశారు. దీనిపై ‘‘గంగాజల్’’ పేరుతో బాలీవుడ్‌లో ఒక సినిమా కూడా తీశారు.
ప్రముఖ జర్నలిస్టు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ తన ఆత్మకథ ‘‘ద కమిషనర్ ఫర్ లాస్ట్ కాజెస్’’లో ఈ ఘటనల గురించి వివరించారు. ఆనాడు ఆయన పనిచేస్తున్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఈ విషయంపై పరిశోధనా కథనాలను ప్రచురించింది.
‘‘1980ల్లో మా పట్నా ప్రతినిధి అరున్ సిన్హాకు దీనిపై సమాచారం అందింది. భాగల్‌పుర్‌లో కొంతమంది పోలీసులు జైళ్లలో ఖైదీలుగా ఉన్న కొందరి కళ్లలో యాసిడ్ పోశారని ఆయనకు తెలిసింది. దీనిపై ఆయన పోలీసులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ, పట్నా ఐజీ (జైళ్ల) దీనిపై స్పందించేందుకు నిరాకరించారు’’అని అరుణ్ శౌరీ తన ఆత్మకథలో పేర్కొన్నారు.
అయితే, ఈ అంశంపై జైలు సూపరింటెంటెడ్ బచ్చూ లాల్ దాస్ మాట్లాడారు.

ఫొటో సోర్స్, PENGUIN
అరుణ్ సిన్హా ఆ తర్వాత గోవా పత్రిక నవ్‌హింద్ టైమ్స్ ఎడిటర్‌గా పనిచేశారు. అయితే, ఆ ఘటనలు ఇప్పటికీ ఆయనకు బాగా గుర్తున్నాయి. ‘‘నేను మొదట బచ్చూ లాల్ దాస్‌ను కలిసినప్పుడు ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో నేను రాసిన కథనాలను ఆయన చదివారు. దీంతో ఆయన నాతో మనసు విప్పి మాట్లాడారు’’అని అరుణ్ సిన్హా వివరించారు.
ఈ ఘటన చోటుచేసుకుని 40ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, బచ్చూ లాల్‌ను అరుణ్ సిన్హా ఇప్పటికీ మరచిపోలేదు.
‘‘ఆయనకు కాస్త ధైర్యం ఎక్కువ. ఆయన నాకు ఇప్పటికీ గుర్తున్నారు. ఎందుకంటే ఇతర ప్రభుత్వ అధికారుల్లో కనిపించని మనస్సాక్షి ఆయనలో నాకు కనిపించింది. ఆయనకు ఎవరిపైనా భయం కూడా ఉండేది కాదు. ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేసింది. అయితే, దానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. ఆయన తన కెరియర్‌ను ఫణంగా పెట్టి నాకు సమాచారం ఇచ్చారు. కీలకమైన డాక్యుమెంట్లను ఆయన నాకు చూపించారు. ఈ ఘటనలో పోలీసులకు భాగస్వామ్యం ఉందని ఆ పత్రాలు చెబుతున్నాయి’’అని అరుణ్ సిన్హా చెప్పారు.

ఫొటో సోర్స్, Arun sinha
కళ్లను పుల్లతో పొడిచి
ఖైదీలను ఎలా అంధులను చేశారని నేను శౌరీతో మాట్లాడాను. ‘‘మొదట ఖైదీలను వారు పట్టుకునేవారు. తర్వాత వారి చేతులను కట్టేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేవారు. అక్కడ నేలపై పడుకోబెట్టేవారు. వారిపై అధికారులు కూర్చొనేవారు. వారి చేతులు, కాళ్లను గట్టిగా పట్టుకునేవారు. ఆ తర్వాత కర్ర పుల్లతో కళ్లను మొదట పొడిచేవారు. ఆ తర్వాత ఒక డాక్టర్ సాబ్ వచ్చి వారి కళ్లలో యాసిడ్ పోసేవారు’’అని శౌరీ చెప్పారు.
‘‘అలా అంధులను చేసిన ఖైదీలను ఒక గదిలో పెట్టేవారు. ఆ గదిలోకి ఒక డాక్టర్ వెళ్లేవారు. మీకు ఏమైనా కనిపిస్తుందా? అని అడిగేవారు. కొంతమంది చిన్న స్వరంతో కొద్దిగా కనిపిస్తుందని చెప్పేవారు. డాక్టర్ తమకు సాయం చేయడానికి వచ్చారని వారు భావించేవారు. అయితే, కొద్దిగా కనిపించేవారి కళ్లలో మరోసారి యాసిడ్ పోసేవారు. జులై 1980ల్లో ఈ ఘటనలు జరిగాయి. ఆ యాసిడ్‌ను పోలీసులు గంగాజల్‌గా పిలిచేవారు’’అని అరుణ్ శౌరీ గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉమేశ్ యాదవ్ కథ
ఆనాడు అంధుడై ఇప్పటికీ అలానే జీవిస్తున్న వారిలో ఉమేశ్ యాదవ్ ఒకరు. ఇప్పుడు ఆయన వయసు 66ఏళ్లు. భాగల్‌పుర్‌లోని కుప్పఘాట్ గ్రామంలో ఆయన నివసిస్తున్నారు.
‘‘మమ్మల్ని పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడే మా కళ్లలో యాసిడ్ పోశారు. ఆ తర్వాత మమ్మల్ని భాగల్‌పుర్ సెంట్రల్ జైల్‌కు తరలించారు. జైలు సూపరింటెండెంట్ దాస్ గారు.. మా నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు న్యాయవాది హింగోరానీ సాబ్‌ను కలిశాం. మాకు నెలకు రూ.500 పింఛను ఇచ్చారు. దాన్ని రూ.750కి పెంచారు. మొత్తంగా నాలా 33 మంది కళ్లలో యాసిడ్ పోశారు. వారిలో 18 మంది ఇంకా బతికే ఉన్నారు’’అని యాదవ్ బీబీసీతో చెప్పారు.
మరోవైపు పోలీసులు మొదట తమ కళ్లలో పొడిచి ఆ తర్వాత యాసిడ్ పోశారని బురారీలో జీవించే భోలా చౌధరి చెప్పారు. తనతోపాటు తొమ్మిది మందికి యాసిడ్ పోసినట్లు ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, उमेश यादव
నేరాలను కట్టడి చేసేందుకు ఇది మెరుగైన విధానమని అప్పట్లో పోలీసులు భావించేవారు.
ఈ విషయంపై అరుణ్ సిన్హా పరిశోధన చేపట్టారు. అయితే, ఆనాటి జగన్నాథ్ మిశ్ర క్యాబినెట్‌లో ఎవరికీ దీని గురించి తెలియదని ఆయన చెప్పారు. ‘‘నేను పోలీసులతో మాట్లాడేటప్పుడు నేరాలను కట్టడి చేసేందుకు ఇదే మెరుగైన విధానమని వారు నాతో అన్నారు. అంతేకాదు వారి గురించి ఎవరూ కన్నీరు కార్చాల్సిన పనిలేదని అన్నారు. వారు దోపిడీ దొంగలు, రేపిస్టులు అని చెప్పారు’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Indian Express
ఆ తర్వాత అరుణ్ సిన్హా పట్నాకు వచ్చేశారు. నవంబరు 22, 1980ల్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తొలి పేజీలో ఆయన రాసిన వార్త ప్రచురితమైంది. ‘‘కళ్లు పూర్తిగా పోయేలా చూసేందుకు రెండుసార్లు యాసిడ్ పోసేవారు’’అని ఆ వార్తకు శీర్షిక పెట్టారు.

ఫొటో సోర్స్, Indian Express
పోలీసులకు ప్రజల మద్దతు
‘‘ఆ వార్త తర్వాత నా ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులకు మద్దతుగా భాగల్‌పుర్‌లో ప్రజలు నిరసనలు చేపట్టేవారు. పోలీసులు మంచి పనే చేశారని వారు నినాదాలు చేసేవారు. భాగల్‌పుర్ వెళ్లేందుకు నేను ఫేక్ ఐడీ కార్డులను ఉపయోగించాల్సి వచ్చింది. అయితే, ఆ వార్త తర్వాత కొందరు పోలీసులను పైఅధికారులు సస్పెండ్ చేశారు. వారు కూడా నిరసనకారులతో కలిసి ఆందోళన చేపట్టేవారు’’అని అరున్ సిన్హా చెప్పారు.
‘‘భాగల్‌పుర్‌లో ఉన్నత వర్గాలన్నీ పోలీసుకు మద్దతు ప్రకటించేవి. ఉన్నత కులాలతోపాట న్యాయవాదులు, జర్నలిస్టులు కూడా పోలీసులకు మద్దతుగా మాట్లాడేవారు. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట వీరంతా నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. పోలీస్-ప్రజలు భాయీ భాయీ అంటూ వారు నినాదాలు చేసేవారు. అయితే, పోలీసుల్లో కొంతమందికి మానవ హక్కులపై అవగాహన ఉండేది. వారు మాత్రం సమాచారాన్ని బయటకు వెల్లడించేవారు’’అని అరుణ్ సిన్హా తెలిపారు.
అయితే, ఖైదీల కళ్లలో సామాన్య ప్రజలే యాసిడ్ పోశారని మొదట ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్ర వ్యాఖ్యానించారు. ‘‘నిజంగా సామాన్య ప్రజలే ఆ ఘటనలకు పాల్పడితే, వారికి యాసిడ్ ఎక్కడి నుంచి వచ్చింది? వారు యాసిడ్ బాటిళ్లు చేతుల్లో పట్టుకుని తిరుగుతున్నారా? అసలు ఎప్పుడు, ఎలా యాసిడ్ పోశారు? మరోవైపు యాసిడ్ పోసినప్పుడు నేరస్థులు తమ ఆయుధాలను ఉపయోగించలేదా? ఒకవేళ సామాన్య ప్రజలే ఈ యాసిడ్ పోస్తే.. పోలీసులు వారిని ఎందుకు పట్టుకోలేదు? లాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయి కదా?’’అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Jagganath Mishra
జైలు సూపరింటెండెంట్ దాస్‌పై చర్యలు
ఈ ఘటనలపై వివాదం పెద్దది కావడంతో జైలు సూపరింటెండెంట్ దాస్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు రిజిస్ట్రీలో అంధుల వివరాలను ఆయన సరిగ్గా నమోదు చేయలేదని, ఖైదీలకు సరైన వైద్య సాయం అందించలేదని ఆయనపై ఆరోపణలు మోపారు. కానీ, ఖైదీలతో అరుణ్ సిన్హా మాట్లాడేందుకు అనుమతించడమే ఆయన చేసిన పెద్ద నేరం.
‘‘ఈ ఘటనలపై దాస్ పైఅధికారులకు సమాచారం ఇవ్వలేదు. పత్రికలకూ తను చెప్పాలని భావించిన విషయాలను తనకు నచ్చినట్టుగా చెప్పేవారు’’అని ఆయన్ను సస్పెండ్ చేసినప్పుడు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
‘‘అయితే, జులై 1980ల్లో ఈ ఘటనలపై విచారణ చేపట్టాలని తూర్పు రేంజ్ డీఐజీ గజేంద్ర నారాయణ్.. ఒక ఇన్‌స్పెక్టర్‌ను పంపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఖైదీలను అంధులను చేశారని ఆ ఇన్‌స్పెక్టర్ తేల్చారు. ఆ ఇన్‌స్పెక్టర్ పట్నా వచ్చి నివేదిక సమర్పించారు. అయితే, ఈ నివేదికలోని అంశాల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు బదులుగా.. ఈ నివేదికలోని అంశాలను మార్చాలని ఆ ఇన్‌స్పెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు ఆ ఇన్‌స్పెక్టర్‌ను వెంటనే వెనక్కి రప్పించాలని డీఐజీపై కూడా ఒత్తిడి తెచ్చినట్లు ఆయనకు సన్నిహితులు సిన్హాతో చెప్పారు’’అని అరుణ్ శౌరీ వివరించారు.

ఫొటో సోర్స్, ANI
ఈ విషయం పెద్దదైనప్పుడు.. శాంతి, భద్రతల పరిరక్షణ అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమంటూ కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంది.
అప్పటి కేంద్ర మంత్రి వసంత్ సాఠే దీనిపై స్పందించారు. ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనాలతో పోలీసుల్లో అభద్రతా భావం పెరిగేలా చేస్తోంది’’అని ఆయన అన్నారు. కానీ, ఆయన వ్యాఖ్యలను ఆచార్య కృపలానీ తప్పుట్టారు. ఈ అంశంపై పార్లమెంటులో ప్రశ్నించినప్పుడు.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని, శాంతి, భద్రతల పరిరక్షణ అంశం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు.
ఈ ఘటనపై అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నేటి కాలంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయా? అని ఆమె ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
మరోవైపు అంధులైన ఖైదీలకు రూ.15,000 పరిహారం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
సుమోటోగా సుప్రీం కోర్టు విచారణ
ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బాధిత ఖైదీలను దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స అందించాలని కోర్టు సూచించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

ఫొటో సోర్స్, Indian Express
‘‘ఈ పరిణామాల నడుమ బిహార్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మీడియాకు చెప్పింది. తమను ఎవరు అంధులను చేశారో గుర్తుపట్టాలని ఖైదీలకు సూచించింది. మొత్తంగా 15 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. అయితే, మూడు నెలల్లోనే ఆ ఆదేశాలను ఎత్తివేశారు. కొంతమంది సీనియర్ అధికారులను బదిలీ చేశారు. భాగల్‌పుర్ ఎస్పీని రాంచీ ఎస్పీగా బదిలీ చేశారు’’అని అరుణ్ శౌరీ చెప్పారు.
ఆ తర్వాత బిహార్ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రను దిల్లీలో అరుణ్ శౌరీ కలిశారు. ‘‘మిశ్రా జీ మీ ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షంచలేకపోతోంది. మీరు రాజీనామా చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు’’అని శౌరీ అన్నారు. దీనిపై స్పందిస్తూ ‘‘శౌరీ గారు, ఆ ఘటలకు నైతిక బాధ్యత తీసుకుంటున్నానని చెప్పానుగా. అదిసరిపోతుంది కదా.. నేను రాజీనామా చేయాలా?’’అని మిశ్ర ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- పోస్టాఫీసులో ప్రజలు డిపాజిట్ చేసిన కోటి రూపాయలతో ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన సబ్ పోస్ట్ మాస్టర్
- ఫేస్‌బుక్: మెటావర్స్‌లో మహిళ అవతార్‌పై లైంగిక దాడి
- యాసిన్ మలిక్‌కు జీవితఖైదు విధించడంపై పాకిస్తాన్ ఎలా స్పందించింది
- భారతీయులు లావెక్కిపోతున్నారు... ఇది మామూలు సమస్య కాదు
- స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు నష్టాల నుంచి బయట పడేందుకు ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














