NFHS-5: భారతీయులు లావెక్కిపోతున్నారు... ఇది మామూలు సమస్య కాదు

ఊబకాయం
ఫొటో క్యాప్షన్, సిద్ధార్థ్ ముఖర్జీ
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతీయులు లావైపోతున్నారని, ఊబకాయుల సంఖ్య పెరిగిపోతోందని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు చెబుతున్నాయి. ఊబకాయాన్ని అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఊబకాయం, ఇప్పుడు దిగువ, మధ్య ఆదాయ దేశాలకు వ్యాపిస్తోంది. భారతదేశంలో ఇది రోజు రోజుకూ పెద్ద సమస్యగా మారుతోంది.

ఒకప్పుడు మనదేశంలో పొషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. తక్కువ బరువు సమస్యగా ఉండేది. కానీ, గత కొన్నేళ్లల్లో ఊబకాయం సమస్యగా పరిణమించింది. ఊబకాయం అధికంగా ఉన్న మొదటి అయిదు దేశాల్లో భారతదేశం ఒకటి.

2016లో వచ్చిన ఒక నివేదికలో 1.35 కోట్ల భారతీయులు ఊబకాయులుగా ఉన్నారని అంచనా వేశారు. ఆ సంఖ్య వేగంగా పెరుగుతోందని, దేశంలోని పోషకాహార సమస్యను ఊబకాయం భర్తీ చేసిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం, సుమారు 23 శాతం పురుషులు, 24 శాతం మహిళల బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 లేదా అంతకన్నా ఎక్కువ ఉందని తేలింది. 2015-16 గణాంకాలతో పోల్చి చూస్తే ఆడ, మగ ఇద్దరిలో ఈ సూచిక 4 శాతం పెరిగింది.

అంతేకాకుండా, అయిదేళ్లలోపు వారిలో 3.4 శాతం పిల్లలు అధిక బరువు కలిగి ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. 20-15-16లో నమోదైన 2.1 శాతం నుంచి ఇది పెరిగింది.

ఊబకాయం

'జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్ ప్రధాన కారణాలు'

"భారతదేశంలో, అంతర్జాతీయంగా కూడా ఊబకాయం రుగ్మతగా మారింది. దీని గురించి పట్టించుకోకపోతే మహమ్మారిగా పరిణమించే అవకాశం ఉంది" అని చెన్నైలోని ఒబేసిటీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ రవీంద్రన్ కుమరన్ అన్నారు.

జీవనశైలిలో వస్తున్న మార్పులు, సులువుగా దొరికే ఫాస్ట్ ఫుడ్ ప్రధాన కారణాలని, అందుకే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.

బరువును కొలిచేందుకు ఒక ప్రామాణిక సూచిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI). దీన్ని కొలిచేందుకు బరువు, ఎత్తులను లెక్కలోకి తీసుకుంటారు. తక్కువ బరువు, సాధారణ బరువు, అధిక బరువు, ఊబకాయం.. ఇలా వర్గీకరించేందుకు ఈ సూచిక ఉపయోగకరంగా ఉంటుంది. BMI 25 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఊబకాయం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది.

అయితే, దక్షిణాసియా వాసులకు ఈ సూచికను కొంత సర్దుబాటు చేయాలని డాక్టర్ కుమరన్ సహా పలువురు నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని కొలిచే ప్రతి దశలో ఓ రెండు పాయింట్లు తగ్గించాలి. ఎందుకంటే, ఈ ప్రాంతం వారికి పొట్ట దగ్గర కొవ్వు సులువుగా పెరుగుతుంది. శరీరంలో మిగతా భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం కన్నా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం అనారోగ్య సూచిక. అంటే, భారతీయులకు 23 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఊబకాయంగా గుర్తించాలని నిపుణులు అంటున్నారు.

"23ను కటాఫ్ పాయింట్‌గా తీసుకుంటే సగం మంది భారతీయులు ఊబకాయులే అవుతారు. ముఖ్యంగా పట్టణ జనాభా అధిక బరువు వర్గంలోకి వస్తారు" అని డాక్టర్ కుమరన్ అన్నారు.

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, శరీరంలో కొవ్వు ఎక్కువైతే క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, శాసకోస వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం కారణంగా 28 లక్షల మంచి చనిపోయారు.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

'బరువు పెరుగుతుంటే ఆయుష్షు తగ్గిపోతున్నట్టే'

"ప్రతి 10 కేజీల అదనపు బరువు, జీవితాన్ని మూడేళ్లు తగ్గించేస్తుంది. అంటే 50 కేజీలు అధిక బరువు ఉంటే,15 ఏళ్లు ఆయుష్షు తగ్గిపోయినట్టు లెక్క వేసుకోవాలి. కోవిడ్ సమయంలో కూడా అధిక బరువు ఉన్నవారిలో మరణాల రేటు ఎక్కువగా నమోదయింది." అని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ది సర్జరీ ఆద్ ఒబేసిటీ అండ్ మెటబాలిక్ డిసార్డర్స్ (Ifso) మాజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రదీప్ చౌబే అన్నారు.

20 సంవత్సరాల క్రితం భారతదేశానికి బారియాట్రిక్ శస్త్రచికిత్సను తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ చౌబే. BMI 40 దాటి అత్యంత ప్రమాద స్థితిలో ఉండేవారికి చివరి పరిష్కారంగా ఈ సర్జరీ చేస్తారు.

ఊబకాయం వలన ఆరోగ్యానికి కలిగే చేటు గురించి అందరికీ తెలుసు. కానీ, దాని వలన మానసికంగా, సామాజికంగా కూడా ప్రభావాలుంటాయి. దీని గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటారని డాక్టర్ చౌబే అన్నారు.

"మూడేళ్ల క్రితం 1,000 మందితో ఒక సర్వే చేశాం. అధిక బరువు లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుందని ఈ సర్వేలో కనుగొన్నాం. అది, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, వివాహాల్లో సమస్యలు, మానసిక వేదన లాంటి సమస్యలకు దారి తీసింది" అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, అందానికి- ఊబకాయానికి సంబంధం ఉందా ?

నటుడు, 56 ఏళ్ల సిద్ధార్థ్ ముఖర్జీ 2015లో బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. గతంలో ఆయన అథ్లెట్.. 80-85 కేజీల బరువు ఉండేవారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. దాంతో, ఆయన క్రీడల కెరీర్‌కు తెరపడింది.

"నేనెప్పుడూ క్రీడాకారుల డైట్ ఫాలో అయ్యేవాడిని. నూనె పదార్థాలు, మసాలాలు తినేవాడిని. డ్రింక్ చేసేవాడిని. అలా బరువు పెరిగి 188 కిలోలకు చేరుకున్నా" అని సిద్ధార్థ్ చెప్పారు.

దాంతో, ఆయనకు మధుమేహం, అధిక కొవ్వు స్థాయిలు, థైరాయిడ్ లాంటి ఆనేక అనారోగ్యాలు చుట్టుకున్నాయి. 2014లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి.

"పడుకుంటే ఊపిరి అందేది కాదు. కూర్చునే నిద్రపోయేవాడిని. డాక్టర్ చౌబే నాకు కొత్త జీవితం ఇచ్చారు. నా బరువు 96 కిలోలకు తగ్గిపోయింది. నేను ఇప్పుడు బైక్ రైడింగ్ చేస్తా, స్టేజి మీద నాటకాలు వేస్తా. విహార యాత్రలకు వెళతా. ఒకప్పుడు నేను రెండు మెట్లు కూడా ఎక్కలేకపోయేవాడిని. ఇప్పుడు 17-18 కిమీ నడిచేస్తా. ఇప్పుడు హాయిగా స్వీట్లు తింటా, ఫ్యాషన్ బట్టలు వేసుకుంటా. ప్రపంచం ఎంతో అందమైనది. మన కుటుంబాలకు మనం అవసరం. వాళ్ల బాధ్యత మన మీద ఉంది. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే నేనిచ్చే సలహా" అన్నారు సిద్ధార్థ్.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

'ప్రభుత్వం ఊబకాయాన్ని రుగ్మతగా గుర్తించాలి'

సిద్ధార్థ లాంటి వారికి బారియాట్రిక్ సర్జరీ జీవితాన్ని కాపాడగలదని డాక్టర్ చౌబే అన్నారు.

కానీ, అంతకన్నా ముఖ్యంగా బరువు పెరగడం, దాని వల్ల వచ్చే సమస్యల గురించి అవగాహన పెంపొందించాలని అంటారాయన.

ప్రభుత్వం ఊబకాయాన్ని రుగ్మతగా గుర్తించాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

"ప్రభుత్వం అంటువ్యాధులను నివారించడంలో బిజీగా ఉంది. జీవనశైలి వల్ల కలిగే జబ్బులపై దృష్టి పెట్టడానికి వారి వద్ద వనరులు లేవు. కానీ, ఊబకాయం చాలా క్లిష్టమైన, ఖరీదైన సమస్య. ఆరోగ్య రక్షణ వ్యవస్థపై దీని భారం పడుతుంది" అని డాక్టర్ చౌబే అన్నారు.

కొన్నేళ్ల క్రితం "పాపపు పన్ను" (సిన్ టాక్స్) ప్రవేశపెడతారనే వార్తలు వచ్చాయి. దీని వలన జంక్ ఫుడ్ ధరలు పెరుగుతాయి. వాటి వినియోగం తగ్గించడానికి ఈ సిన్ టాక్స్ అమలుచేస్తారని అన్నారు. కానీ, జంక్ ఫుడ్‌ను మార్కెట్ చేసే కంపెనీల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గిందని నిపుణులు అంటున్నారు.

పొగ తాగడం విషయంలో భారత్ ఎలాంటి విధానాలు అమలుచేస్తోందో, అలాంటి వ్యూహాలనే జంక్ ఫుడ్ విషయంలో కూడా అవలంబించాలని డాక్టర్ కుమరన్ అంటున్నారు.

ఒకప్పుడు బహిరంగ స్థలాల్లో, విమానాల్లో, ఆఫీసుల్లో సిగరెట్ తాగడానికి అనుమతి ఉండేది. ఇప్పుడు దానిపై నిషేధం ఉంది. అలాగే, సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో పొగ తాగడం గురించి డిస్‌క్లైమర్ పెట్టడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

అలా మళ్లీ మళ్లీ హెచ్చరించడం అవసరం అని, ఊబకాయం విషయంలో కూడా ప్రభుత్వం ఇలాంటి విధానాలనే అనుసరించాలని డాక్టర్ కుమరన్ సూచిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, నిన్నటి వరకు ఊబకాయం... ఇవాళ ఆరు పలకల సౌష్టవం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)