టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలతో పాటు 21 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలో టెక్సస్ రాష్ట్రంలోని ఒక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పుల్లో 19 మంది పిల్లలు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
మంగళవారం సౌత్ టెక్సస్‌లో యువాల్డే నగరంలోని 'రాబ్స్ ఎలిమెంటరీ స్కూల్'లో ఈ దాడి జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించినట్లు అధికారులు తెలిపారు.
మరణించిన వారిలో ఎక్కువ మంది రెండవ, మూడవ, నాల్గవ తరగతి చదువుతున్న పిల్లలేనని, వారి వయస్సు 7 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుందని చెబుతున్నారు.
కాల్పుల్లో చనిపోయిన టీచర్ పేరు ఇవా మిరెలెస్ అని అమెరికా మీడియా చెబుతోంది. ఆమెకు కాలేజీ చదువుతున్న కూతురు ఉన్నట్టు, రన్నింగ్, హైకింగ్ అంటే ఇష్టమని పాఠశాల జిల్లా వెబ్‌సైట్‌లోని ఆమె పేజీలో ఉంది.
నిందితుడి వద్ద సెమీ ఆటోమేటిక్ రైఫిల్, ఒక హ్యాండ్‌గన్ ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పాఠశాలలోకి ప్రవేశించే ముందు ఒక వాహనాన్ని అక్కడే విడిచిపెట్టాడని టెక్సస్ గవర్నర్ గ్రెగ్ తెలిపారు.
5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలు చదివే పాఠశాలల్లో ఇలాంటి కాల్పులు చాలా అరుదు.

ఫొటో సోర్స్, Reuters
ఇటీవల అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతలో ఈ ఘటన జరిగింది.
మంగళవారం ఉదయం కాల్పులు ప్రారంభమైనప్పుడు సమీపంలో ఉన్న సరిహద్దు గస్తీ (బోర్డర్ పాట్రోల్) అధికారి పాఠశాలలోకి దూసుకెళ్లి బారికేడ్ వెనుక ఉన్న సాయుధుడిని కాల్చి చంపినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది.
అమెరికా సరిహద్దులను కాపలా కాసే దళమే బోర్డర్ పాట్రోల్. యువాల్డే, మెక్సికోకు 80 మైళ్ల కన్నా తక్కువ దూరంలో ఉంది. అక్కడ సరిహద్దు గస్తీ దళం విభాగం ఉంది.
ఈ దళానికి చెందిన ఇద్దరు అధికారులపై కాల్పులు జరిగాయని, ఒకరికి తలపై బుల్లెట్ తగిలిందని, ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.
నిందితుడు తన అమ్మమ్మను కూడా చంపినట్టు అనుమానిస్తున్నారని సీబీఎస్ న్యూస్ తెలిపింది. ఆ యువకుడు స్థానికి హై స్కూలు విద్యార్థి కావచ్చని స్థానిక మీడియా చెబుతోంది.

స్థానిక సమయం 11.32 నిమిషాలను నిందితుడు కాల్పులు జరపడం మొదలుపెట్టాడని, "ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడని" యువాల్డే కన్సాలిడేటెడ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ చీఫ్ ఆఫ్ పోలీస్ పీట్ అరెడోండో తెలిపారు.
వెంటనే పాఠశాల ఖాళీ చేయించారు. సుమారు 500 మంది పిల్లలు అందులో చదువుతున్నారు.
ఈ పట్టణం సాన్ ఆంటోనియాకు 85 మైళ్ల దూరంలో ఉంది. 66 ఏళ్ల వృద్ధురాలు, 10 ఏళ్ల పాప సాన్ ఆంటోనియాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని యూనివర్సిటీ హెల్త్ హాస్పిటల్ అధికారులు తెలిపారు.
పాఠశాల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరుకుందని రాష్ట్ర పోలీసులను ఉటంకిస్తూ అమెరికా మీడియా పేర్కొంది. వారిలో 18 మంది పిల్లలు కాగా, ముగ్గురు పెద్దవారని తెలిపింది.
13 మంది పిల్లలను "అంబులెన్స్‌లు, బస్సుల ద్వారా" ఆస్పత్రికి తరలించినట్లు యువాల్డే మెమోరియల్ హాస్పిటల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
ఎఫ్‌బీఐ దర్యాప్తులో సాయం చేస్తున్నట్టు సీబీఎస్ తెలిపింది.

ఫొటో సోర్స్, ReutersCopyright
గన్ కల్చర్‌ను ఖండించిన బైడెన్
ఇలాంటి కాల్పుల వార్తలు విని వినీ "అలసిపోయానని, నిరాశ, నిస్పృహలు కమ్ముకుంటున్నాయని" అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. దేశంలో తుపాకీలకు నియంత్రించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
"బిడ్డను కోల్పోవడం అంటే శరీరంలో ఒక భాగాన్ని కోల్పోయినట్టే. గుండె లోతుల్లో పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. మనం అందులో కూరుపోతున్నట్టు అనిపిస్తుంది. గతంలా ఎప్పటికీ ఉండదు. గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా ఇక మనం ఎప్పుడు నిలబడతాం? చాలా నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయి. అలిసిపోయాను. 18 ఏళ్ల యువకుడు దుకాణానికి వెళ్లి తుపాకులు కొనుక్కురావడం ఊహించలేనిది. ఇది చాలా తప్పు. ప్రపంచంలో మరెక్కాడా ఇన్ని మాస్ షూటింగులు జరగవు. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది" అని బైడెన్ అన్నారు.
యువాల్డేలో బాధితులకు సంతాపం ప్రకటిస్తూ వైట్ హౌస్, ఇతర అధికార భవనాలపై జెండాలను సగం కిందకు దించాలని ఆయన ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఇలాంటి ఘటన జరిగిన ప్రతిసారీ గుండె బద్దలైపోతుంది. మళ్లీ, మళ్లీ జరుగుతున్నాయి. ఇక చాలు. ఒక దేశంగా మనం ఇలాంటి హింసకు వ్యతిరేకంగా నడుం కట్టాలి" అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు.
ఈ ఏడాదికి స్కూళ్లు గురువారం ముగియనున్నాయి. పెద్ద పిల్లలకు శుక్రవారం గ్రాడ్యువేషన్ జరగనుంది.
అమెరికాలో పాఠశాలల్లో కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయని, గత ఏడాది 26 ఘటనలు జరిగాయని ఎడ్వీక్ పబ్లికేషన్ తెలిపింది.
ఇలాంటి ఘటనలు సాధారణంగా హైస్కూలు పాఠశాలల్లో జరుగుతున్నాయని, ప్రాథమిక పాఠశాలల్లో కాల్పులు ప్రమాదవశాత్తు జరుగుతాయని అమెరికా గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ రిపోర్ట్ (2020) తెలిపింది.
2020లో కరోనావైరస్ ప్రారంభమైన దగ్గర నుంచి "తుపాకీ కాల్పులు" రెట్టింపయ్యాయని సోమవారం ఎఫ్‌బీఐ కనుగొంది.
ఇవి కూడా చదవండి:
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- కోనసీమ ఉద్రిక్తం.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు, మూడు బస్సుల దహనం
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
- పామాయిల్ కంపెనీలు లక్షలాది నిరుపేద గిరిజనులను ఎలా దోచుకుంటున్నాయో తెలుసా? - బీబీసీ పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










