ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ ఆందోళన.. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇళ్లకు నిప్పు - రాళ్లు రువ్విన నిరసనకారులు, పోలీసుల లాఠీ ఛార్జ్

అమలాపురంలో తగలబడుతున్న బస్సు
ఫొటో క్యాప్షన్, అమలాపురంలో తగలబడుతున్న బస్సు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై మొదలైన ఆందోళన తీవ్రరూపం దాల్చింది.

అమలాపురంలో పోలీస్ ఆంక్షలు ఉల్లంఘించి వందల మంది రోడ్లపైకి వచ్చారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు.

కొందరు యువకులు బారికేడ్లు, అడ్డుగా పెట్టిన వాహనాలను తోసుకుంటూ కలెక్టరేట్ వైపు దూసుకెళ్లారు. నిరసన చేస్తున్నవారిలో కొందరు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు గాయాలపాలయ్యారు.

మంత్రి విశ్వరూప్ ఇంటికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. ఆయన ఇంటికి సమీపంలో మూడు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు. బస్సు తగలబడుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

వీడియో క్యాప్షన్, పోలవరం డయాఫ్రమ్ వాల్ ఎందుకిలా అయింది?

సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, నిరసనకారులు రోడ్డుపైకి రావద్దని ఉదయం నుంచి పోలీసులు ప్రచారం చేశారు.

అయితే ముందుగా ప్రకటించినట్టు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా వందలమంది వివిధ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారి మీదకు రావడంతో ఒక్కసారిగా వేడెక్కింది.

కలెక్టర్ ఆఫీసు వైపు ఆందోళనకారులు వెళ్లకుండా పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. జై కోనసీమ నినాదాలతో వందల మంది కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

అమలాపురం

పోలీసులపై రాళ్లదాడి...

కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. ''కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు''అంటూ యువకులు నినాదాలు చేశారు.

వైసిపి జిల్లా అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు
ఫొటో క్యాప్షన్, వైసిపి జిల్లా అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు

నిరసనల నడుమ కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సుబ్బా రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అమలాపురం ఏరియా ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులపై కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు.

నల్ల వంతెన సమీపంలో నిరసకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న నిరసనకారులను తరలిస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.

విశ్వరూప్ ఇల్లు
ఫొటో క్యాప్షన్, విశ్వరూప్ ఇల్లు

విశ్వరూప్ క్యాంప్ కార్యాలయంపైనా దాడి

అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మంత్రి క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. అయితే ఈ దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు అక్కడ నుంచి తరలించారు.

మరోవైపు వైసిపి జిల్లా అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు.

హోం మంత్రి తానేటి వనిత
ఫొటో క్యాప్షన్, హోం మంత్రి తానేటి వనిత

20 మంది పోలీసులకు గాయాలయ్యాయి - హోం మంత్రి తానేటి వనిత

అంబేడ్కర్ పేరు జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరమని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు. జిల్లా ప్రజల విజ్ఞప్తుల మేరకే జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చామని అన్నారు. ఆందోళనకారులను కొందరు వెనకుండి నడిపిస్తున్నారని చెప్పా రు. విచారణ అనంతరం నిందితులపై చర్య లు తీసుకుంటామని ఆమె అన్నారు.

''20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారు. స్కూల్ బస్సులను కూడా తగులబెట్టారు''అని ఆమె చెప్పారు.

ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించామని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)