దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసులోని పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలి: మహిళల, ట్రాన్స్ జెండర్ల జేఏసీ డిమాండ్

దిశ హత్య, అత్యాచారం కేసులో నిందితులను కాల్చిన పోలీసులపై తక్షణం ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసి, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
ఎన్‌కౌంటర్‌పై కోర్టుకు వెళ్లిన పిటిషనర్లు కె.సజయ, వి.సంధ్య, ఎం.విమల, మీరా సంఘమిత్రలు దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు.
చట్టవిరుద్ధంగా పౌరుల ప్రాణాలను బలి తీసుకున్న పోలీసు సిబ్బంది, దానికి బాధ్యులైన సీనియర్ అధికారుల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని వీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టం మీద ప్రజల నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టడానికి వారిని అరెస్టు చేసి వేగంగా విచారణ చేయాలని కోరారు.
అంతేకాదు, ఈ నలుగురిపై కాల్పుల కారణంగా.. దిశ అత్యాచారం, హత్య కేసు విచారణ మరుగున పడిపోయిందనీ, దాని దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. బూటకపు ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురి యువకుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలన్నారు.
సిర్పూర్కర్ ఇచ్చిన నివేదికను స్వాగించిన జేఏసీ సభ్యులు.. 'మహిళలకు భద్రత, స్వేచ్ఛ' పేరుతో పోలీసులు, అన్యాయంగా, చట్టవ్యతిరేకంగా అనుమానితులను చంపడం వల్ల అన్యాయానికి గురైన మహిళలకు న్యాయం జరగదనీ, చట్టబద్ధమైన వ్యవస్థల ద్వారా మహిళల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, UGC
నివేదికలో ఏముంది?
నలుగురు యువకుల హత్యలో పాల్గొన్న పది మంది పోలీసు సిబ్బంది “సెక్షన్స్ 302 r/w 34 IPC, 201 r/w 302 IPC, 341 IPC” కింద హత్య చేసినందుకు విచారణను ఎదుర్కోవాలని కమిషన్ సిఫార్సు చేసింది.
నలుగురు యువకులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా చంపాలనే కాల్పులు జరిపారని, అవి వారి మరణానికి దారితీస్తాయనే స్పష్టమైన అవగాహనతోనే చేశారని కమిషన్ నిర్ధారించింది. నిందితులు.. పోలీసు పార్టీ నుంచి ఎలాంటి ఆయుధాలను లాక్కోలేదని, అందుకే 'ఆత్మ రక్షణ' కోసం కాల్పులు జరిపారనే వాదన తప్పు అని కూడా పేర్కొంది.
పిటిషన్ ఏమని వేశారు?
ఆనాటి ఎన్‌కౌంటర్‌పై తెలంగాణకు చెందిన 15 మంది మహిళా హక్కుల, పౌర హక్కుల కార్యకర్తలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక మెమొరాండం ఇచ్చారు.
దానిని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం పిల్‌గా (WP(PIL) నం.173 ఆఫ్ 2019) స్వీకరించింది. ఈ సంఘటనలో చనిపోయినవారి మృతదేహాలను భద్రపరచాలని, PUCL vs యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం, కోర్టు పర్యవేక్షణలో విచారణతో పాటు హత్యకు పాల్పడిన అధికారులపై విచారణ జరపాలని సామాజిక కార్యకర్తలు తమ మెమొరాండంలో విజ్ఞప్తి చేశారు.
దీని మీద హైకోర్టు వెంటనే స్పందించి మృతదేహాలను భద్రపరచాలని, పియుసిఎల్ మార్గదర్శకాల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. తరువాత కే.సజయ, వీ.సంధ్య, ఎం. విమల, మీరా సంఘమిత్రలు సుప్రీం కోర్టు ముందు మరో రిట్ పిటిషన్ WP (Crl) 364/2019 నమోదు చేశారు.
ఈ విషయమై తిరిగి హైకోర్టులోనే పిటిషన్ వేసుకోవచ్చని నలుగురు దరఖాస్తుదారులకు సుప్రీంకోర్టు సూచన చేసింది. దీంతో సాక్ష్యాలను భద్రపరచడం, సేకరించడంపై ఆదేశాలను కోరుతూ కె. సజయ తెలంగాణ హైకోర్టులో ఒక దరఖాస్తును దాఖలు చేశారు.
ఈ కేసులో శవపరీక్ష, స్వాధీనం, సాక్ష్యాలను భద్రపరచడంపై తెలంగాణ హైకోర్టు వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. సిర్పూర్కర్ కమిషన్ ముందు కూడా ఈ బృంద సభ్యులు తమ వాదన వినిపించారు.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు చర్చ జరుగుతోంది
- మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?
- డ్రైవర్ మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేస్తాం: కాకినాడ జిల్లా ఎస్పీ
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారా, బౌద్ధ ఆరామాలను కూల్చి గుడులు కట్టారా? చరిత్ర ఏం చెబుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














