మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జేమ్స్ గళాఘర్
- హోదా, హెల్త్ అండ్ సైన్స్ కరెస్పాండెంట్
కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి మనమింకా తేరుకోలేదు. నిజానికి కరోనావైరస్ ప్రపంచాన్ని ఇంకా కలవరపెడుతూనే ఉంది. ఇంతలోనే మరో వైరస్ కలకలం రేపుతోంది. దానిపేరు మంకీపాక్స్.
అంటే మశూచి (పెద్ద అమ్మవారు - స్మాల్ పాక్స్), పొంగు (చిన్న అమ్మవారు, ఆటలమ్మ - చికెన్ పాక్స్) తట్టు వంటి మరో వైరస్.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో 80 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. సాధారణంగా ఈ వ్యాధి కనిపించని బ్రిటన్‌లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి.
అసలు ఏం జరుగుతోంది? ఈ మంకీపాక్స్ గురించి మనం భయపడాలా? లేకపోతే కోవిడ్ నీడలో బతికి బయటపడ్డాం కనుక ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నామా?
ఒకటైతే స్పష్టం: ఇది మరో కోవిడ్ కాదు. మంకీపాక్స్ వ్యాప్తిని నిలువరించటానికి కొద్ది రోజుల్లో లాక్‌డౌన్ల వంటివేమీ రాబోవు.
అయితే మంకీపాక్స్ ఇన్ని దేశాల్లో ఇన్ని కేసులు నమోదవటం అసాధారణమైన విషయం. మునుపెన్నడూ ఇలా జరగలేదు. ఈ వైరస్, వ్యాధి గురించిన నిపుణులైన శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏదైనా ఒక వైరస్ ప్రవర్తన మారిందంటే అది ఆందోళన రేకెత్తించే విషయమే.
ఇప్పటివరకూ మంకీపాక్స్ తీరుతెన్నులను సులభంగానే ముందస్తుగా అంచనా వేయగలిగేవారు.

ఫొటో సోర్స్, UKHSA
ఈ వైరస్ సహజ ఆవాసం వన్యప్రాణులు. ముఖ్యంగా కోతులు, ఎలుకల్లో నివసిస్తుంది.
పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని వర్షాధార అడవుల్లో ఈ వైరస్ సోకివున్న జంతువుతో ఎవరో మనిషి కాంటాక్ట్‌లోకి రాగా.. ఆ జంతువులోని వైరస్ మ్యుటేట్ అయి మనిషికి సోకింది. వైరస్‌లలో మ్యుటేషన్ల వల్ల ఒక జంతు జాతి నుంచి మరో జంతు జాతికి సోకుతుంటాయి.
ఈ వైరస్ సోకిన వ్యక్తి చర్మం మీద దద్దుర్లు పుట్టుకొస్తాయి. అవి పొక్కులుగా బొబ్బలుగా మారతాయి. ఆ తర్వాత వాటిమీద చెక్కులు కడతాయి.
ఈ వైరస్ దాని సాధారణ నివాసాన్ని దాటి బయటకు వచ్చింది. వ్యాపించటానికి పోరాడుతోంది. అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించాలంటే దీర్ఘకాలం సన్నిహిత సాన్నిహిత్యంలో ఉండాలి. కాబట్టి గుంపుల్లో వీటి వ్యాప్తి మామూలుగా చిన్నస్థాయిలో ఉండటంతో పాటు వాటికవే తగ్గిపోతుంటాయి.
గతంలో కూడా బ్రిటన్ సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప సంఖ్యలో కేసులు కనిపించాయి. అయితే ఆ కేసులన్నిటిలోనూ.. ఆ వైరస్ ప్రభావిత దేశానికి వెళ్లిన వారు దానిని తమ వెంట తీసుకొచ్చినట్లు వెంటనే తెలిసిపోయేది.
కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.


ఫొటో సోర్స్, SPL
మంకీ పాక్స్ లక్షణాలేంటి?
మంకీ పాక్స్.. మశూచిలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన అరుదైన వైరల్ వ్యాధి. కానీ దీని తీవ్రత తక్కువగా ఉంటుంది.
మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వస్తుంటుంది.
- ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, వాపులు, వెన్నునొప్పి, కండరాల్లో నొప్పి ఉంటుంది.
- ఒక్కోసారి జ్వరం ఎక్కువైన తర్వాత దద్దుర్లు వస్తాయి. సాధారణంగా ఈ దద్దుర్లు ముఖంపై మొదలై శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఎక్కువగా అరి చేతులు, పాదాలు, అరికాళ్లపై వస్తాయి.
- చివరకు దద్దుర్లపై విపరీతమైన దురద వచ్చి పుండుగా మారుతుంది. పుండు తగ్గిన తర్వాత చర్మంపైన ఈ గాయాలు మచ్చలుగా ఉండిపోతాయి.
- మంకీ పాక్స్ కూడా చికెన్ పాక్స్ లాంటిదే. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి మాత్రమే విషమంగా మారుతుంది.
- మిగతావారికి మామూలుగానే కొన్ని వారాల్లో తగ్గిపోతుంది. వందల్లో ఒక్కరిపై మాత్రమే ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని సీడీసీ పేర్కొంది.

మొట్టమొదటిసారిగా.. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలతో స్పష్టమైన సంబంధమేదీ లేని వారిలో ఈ వైరస్ కనిపిస్తోంది.
ఎవరి నుంచి వీరికి ఈ వైరస్ సోకుతోందో తెలియటం లేదు.
ఈ మంకీపాక్స్ లైంగిక కార్యకలాపాల సమయంలో వ్యాపిస్తోంది. చాలా వరకూ కేసుల్లో రోగుల జననేంద్రియాల మీద, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుపులు ఉన్నాయి.
ప్రభావిత వ్యక్తుల్లో చాలా మంది స్వలింగ సంపర్కులు (గే) లేదా ద్విలింగ సంపర్కులైన (బైసెక్సువల్) పురుషులే ఉన్నారు.
''ఇది చాలా కొత్త పరిస్థితి. ఇది ఆశ్చర్యకరంగానూ, ఆందోళనకరంగానూ ఉంది'' అని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ పాండమిక్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సర్ పీటర్ హార్బీ నాతో చెప్పారు.
ఇది 'రెండో కోవిడ్ కాదు' అని చెప్తూనే.. ఈ వైరస్ నిలదొక్కుకోకుండా నివారించటానికి 'మనం పని చేయాలి' అని ఆయన పేర్కొన్నారు.
దీనితో మంకీపాక్స్ రోగులకు చికిత్స చేసిన డాక్టర్ హగ్ ఆడ్లర్ ఏకీభవిస్తున్నారు. ''ఈ తీరును మనం మునెపన్నడూ చూడలేదు. ఇది ఆశ్చర్యకరంగా ఉంది'' అంటారాయన.

ఫొటో సోర్స్, Science Photo Library
మరి ఏం జరుగుతోంది?
ఈ వైరస్ వ్యాప్తి విభిన్నంగా ఉందని మనకు తెలుసు. కానీ అలా ఎందుకు జరుగుతోందో తెలీదు.
ఇందుకు రెండు విస్తృత అవకాశాలున్నాయి: ఈ వైరస్‌లో మార్పులు జరిగి ఉండాలి. లేదంటే అదే పాత వైరస్ పెంపొందటానికి సరైన చోటు సరైన సమయం దొరికి ఉంటుంది.
మంకీపాక్స్ అనేది ఓ డీఎన్ఏ వైరస్. కాబట్టి కోవిడ్ లేదా ఫ్లూ అంత వేగంగా అది మ్యుటేట్ కాదు. ప్రస్తుత ఇన్ఫెక్షన్ కేసులు.. 2018, 2019 సంవత్సరాల్లో కనిపించిన వైరస్ రూపాలకు చాలా దగ్గరగా ఉన్నట్లు ఈ వైరస్ ప్రాధమిక జన్యు విశ్లేషణ సూచిస్తోంది. ఇప్పుడే కచ్చితంగా నిర్ధారించలేకపోయినప్పటికీ.. ఇప్పుడు వ్యాపిస్తున్నది పాత వైరస్‌కు కొత్త మ్యూటంట్ అని చెప్పటానికి ఆధారాలేవీ లేవు.
అయితే ఒక వైరస్ తనకు లభించిన అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి రూపం మారాల్సిన అవసరం లేదని గత దశాబ్దంలో ఎబోలా, జికా వైరస్‌ల విజృంభణతో మనకు తెలిసివచ్చింది.
''ఎబోలాను సులభంగి నిరోధించవచ్చునని మనం చాలా కాలం భావించాం. చివరికి అది కష్టమని తేలింది'' అంటారు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ ఆడం కుచార్స్కీ.
అయితే.. ఈ వైరస్ చాలా ఎక్కువగా గే, బైసెక్సువల్ పురుషులకే సోకటానికి కారణమేమిటనేది ఇంకా స్పష్టం కాలేదు. లైంగిక ప్రవర్తనల వల్ల ఈ వైరస్ వ్యాపించటం సులభమవుతోందా? లేదంటే ఈ సముదాయానికి లైంగిక ఆరోగ్యం గురించి ఎక్కువ అవగాహన ఉండి, ఎక్కువగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
మంకీపాక్స్ వ్యాపించటం అంతకంతకూ సులభంగా మారుతుండవచ్చు. పాత తరాల వారికి సామూహికంగా స్మాల్‌పాక్స్ (మశూచి) టీకాలు ఇవ్వటం వల్ల.. ఆ వైరస్‌కు చాలా సన్నిహిత బంధమున్న మంకీపాక్స్ నుంచి కూడా వారికి కొంత రక్షణ లభించి ఉండవచ్చు.
''ఈ మంకీపాక్స్ వైరస్.. మశూచి కాలం కన్నా ఇప్పుడు మరింత సమర్థవంతంగా వ్యాపిస్తుండవచ్చు. అయితే ఇది అదుపులేకుండా చెలరేగిపోతుందనే సూచనలేవీ మనకు కనిపించటం లేదు'' అంటారు డాక్టర్ ఆడ్లర్. ప్రస్తుతం కొన్ని గుంపుల్లో వ్యాపిస్తున్న మంకీపాక్స్ దానికదే ఆగిపోతుందని ఆయన ఇంకా భావిస్తున్నారు.
అసలు ప్రస్తుత వ్యాప్తి ఎలా మొదలైందనేది అర్థం చేసుకోగలిగితే.. తర్వాత ఏం జరుగుతుందనేది అంచనా వేయటానికి అది దోహదపడుతుంది.
మనకి కనిపిస్తున్న కేసులు.. నీటిలో మునిగివున్న మంచుకొండ శిఖరం మాత్రమేనని మనకు తెలుసు. ఎందుకంటే ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి వైరస్ సోకింది, ఈ విధంగా సోకుతోంది.. అని చెప్పే స్పష్టమైన చిత్రం ఇంకా కనిపించటం లేదు.
అసలు చాలా కేసులకు ఒక దానితో మరొకదానికి సంబంధం లేనట్లే కనిపిస్తున్నాయి. అంటే యూరప్ లోపలా, ఆవలా వ్యాపిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓ గొలుసులోని లింకులు దొరకటం లేదు.
ఒక భారీ సూపర్‌స్ప్రెడింగ్ ఈవెంట్.. అంటే ఏదైనా పండగకో, పబ్బానికో జనం పెద్ద సంఖ్యలో ఒక చోట గుమిగూడినపుడు వారికందరికీ ఒకే చోట ఈ వైరస్ సోకిందని, వారు తమ వెంట వేర్వేరు దేశాలకు ఈ వైరస్‌ను తీసుకెళ్లారని అనుకుంటే ప్రస్తుత పరిస్థితిని అది వివరిస్తుంది. కానీ అలాంటి లింకేదీ కనిపించటం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకరితో ఒకరికి సంబంధం లేని మనుషుల్లో ఈ వైరస్ కనిపిస్తోందంటే.. ఇది చాలా మందిలో కొంతకాలంగా వారికి తెలియకుండానే నివసిస్తూ ఉండిందా అన్నది మరొక అనుమానం.
కారణం ఏదైనా మున్ముందు మరిన్ని కేసులు బయటపడవచ్చు.
''ఈ దశలో సాధారణ జనం ఆందోళన చెందాల్సిన అవసరముందని నేను భావించటం లేదు. కానీ దీనికి సంబంధించిన గుట్లన్నీ మనకు ఇంకా తెలీదు. కాబట్టి ఇది మన నియంత్రణలో లేదు'' అంటారు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ జిమ్మీ వైట్‌వర్త్.
అయితే.. ఇది కోవిడ్ తరహా పరిస్థితి కాదనేది గుర్తుంచుకోవాలి.
మంకీపాక్స్ అనేది మనకు ముందే తెలిసిన వైరస్. కొత్త వైరస్ కాదు. దీనికి చికిత్స చేయటానికి మనదగ్గర వ్యాక్సీన్లు, చికిత్సలు ఉన్నాయి. ఈ వైరస్ సోకినప్పుడు వచ్చే వ్యాధి చాలా వరకూ స్వల్పంగానే ఉంటుంది. కానీ పిల్లలకు, గర్భిణిలకు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది ఎక్కువ ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది.
కానీ కోవిడ్ కన్నా ఈ వ్యాధి చాలా నెమ్మదిగా వ్యాపిస్తుంది. అలాగే కోవిడ్ ప్రధాన లక్షణాల్లో ఒకటైన దగ్గు.. ఏ కారణంవల్లనైనా రావచ్చు. కొందరిలో కోవిడ్ సోకినా లక్షణాలేవీ కనిపించకపోవచ్చు కూడా. మంకీపాక్స్ సోకిన వారిలో వ్యాధి ప్రధాన లక్షణమైన దద్దుర్లు, పొక్కుల వల్ల వైరస్ సోకినట్లు తెలియకుండా పోయే అవకాశం చాలా తక్కువ. దీనివల్ల ఈ వైరస్ సోకిన వారిని గుర్తించటం, ఇది సోకే ముప్పు ఉన్నవారికి వ్యాక్సీన్లు వేయటం సులభమవుతుంది.
ఏదిఏమైనా.. ''వేసవి కాలం మొదలవుతూ భారీ సమావేశాలు, పండుగలు పార్టీల సీజన్‌లోకి మనం అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాపించటం వేగవంతం కావచ్చునని ఆందోళనగా ఉంది'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హాన్స్ క్లూగి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం,10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారించాలి - విచారణ కమిషన్ సిఫారసు
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. ‘బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














