కరోనా వైరస్: మీరు ఇంతవరకూ వినని నాలుగు కోవిడ్ లక్షణాలు

కరోనా వైరస్ - జుట్టు రాలటం

ఫొటో సోర్స్, Getty Images

కరోనా వైరస్ మహమ్మారి మొదలై రెండేళ్లు దాటినా కూడా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ వైరస్‌లో కొత్త వేరియంట్లు పెరుగుతుండటంతో కోవిడ్ లక్షణాలు కూడా మారుతున్నాయి.

వైద్య నిపుణులు తొలుత జ్వరం, దగ్గు లేదా వాసన కానీ రుచి కానీ తెలియకపోవటం అనేవి కోవిడ్ సోకటాన్ని సూచించే ప్రధాన లక్షణాలుగా పరిగణించారు. వీటికి తోడుగా ఇప్పుడు తాజాగా గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, తలనొప్పి లక్షణాలను కూడా చేర్చారు.

మరి ఇతర సూచనలు, లక్షణాల సంగతేమిటి? చర్మం మీద దద్దుర్లు మొదలుకుని వినికిడి శక్తి తగ్గటం వరకు కోవిడ్ లక్షణాలు మరింత ఎక్కువగా ఉన్నాయని కొత్త అధ్యయనాలు చెప్తున్నాయి. ఇవి సాధారణ జలుబు లేదా ఫ్లూ లక్షణాలకు మించి ఉన్నాయి.

కరోనా వైరస్ - దద్దుర్లు

ఫొటో సోర్స్, Getty Images

1. చర్మం మీద దద్దుర్లు

కోవిడ్ సంబంధిత చర్మ సమస్యలు అసాధారణమేమీ కాదు. నిజానికి బ్రిటన్‌లో 2021లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రతి ఐదుగురు కోవిడ్ రోగుల్లో ఒకిరికి కేవలం చర్మం మీద దద్దుర్లు మాత్రమే కనిపించాయి. వారిలో మరే ఇతర కోవిడ్ లక్షణాలూ కనిపించలేదు.

కోవిడ్ చర్మం మీద పలు రకాలుగా ప్రభావం చూపవచ్చు. కొందరిలో చర్మం మీద దద్దుర్లు కనిపించవచ్చు. మరికొందరిలో ఈ దద్దుర్లు దురద కలిగించవచ్చు.

ఇక 'కోవిడ్ టోస్' అని పిలుస్తున్న సమస్యలో.. కాలి వేళ్ల మీద ఎర్రగా వాచిన పుండ్లు ఏర్పడవచ్చు. ప్రధానంగా మరే ఇతర కోవిడ్ లక్షణాలూ కనిపించని టీనేజీ పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.

కోవిడ్ వల్ల వచ్చే దద్దుర్లు చాలా వరకూ ఎలాంటి చికిత్సా అవసరం లేకుండానే కొద్ది రోజుల్లోనే నయమైపోతాయి. కొన్ని ఉదంతాల్లో కొన్ని వారాల తర్వాత తగ్గిపోతాయి. అయితే చర్మం మీద ఈ దద్దుర్లు బాగా దురదగా ఉన్నా, నొప్పిగా ఉన్నా సాధారణ వైద్యులను కానీ, చర్మవ్యాధి నిపుణులను కానీ సంప్రదించవచ్చు. ఏదైనా లేపనం వంటి పరిష్కారాలను వారు సిఫారసు చేసే అవకాశముంది.

కరోనా వైరస్ - గోళ్ల సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

2. కోవిడ్ గోళ్లు

మన శరీరానికి సార్స్ కోవ్-2 (కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే కరోనావైరస్) సహా ఏదైనా ఇన్‌ఫెక్షన్ సోకినపుడు.. మన శరీరం సహజంగానే అసాధారణ ఒత్తిడికి లోనవుతున్న సంకేతాలను వ్యక్తీకరిస్తుంది. ఈ పనిని అనేక చిత్ర, విచిత్రమైన పద్ధతుల్లో శరీరం చేయవచ్చు. అందులో మన వేలి గోళ్లు కూడా ఉండొచ్చు.

కోవిడ్ సోకిన కొందరిలో 'కోవిడ్ గోళ్లు' అనే లక్షణం కూడా కనిపిస్తోంది. ఈ లక్షణంలో మన గోళ్లలో కింది మార్పులు కనిపిస్తాయి:

బ్యూస్ లైన్లు - చేతి వేళ్ల గోళ్లలో కానీ, కాలి వేళ్ల గోళ్లలో కానీ.. గోరు మొదలు భాగంలో అడ్డు చారలు కనిపిస్తాయి. శరీరం మీద ఒత్తిడి కారణంగా గోళ్ల పెరుగుదలకు తాత్కాలిక అవరోధం కలిగినపుడు ఈ చారలు వస్తాయి. వీటిని బ్యూస్ లైన్లుగా పిలుస్తున్నారు.

మీస్ లైన్లు - గోళ్ల మీద అడ్డంగా తెల్లని గీతలు కనిపిస్తాయి. గోరు అడుగు భాగంలో అసాధారణ స్థాయిలో ప్రొటీన్లు ఉత్పత్తి అవటం వల్ల ఈ గీతలు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

అలాగే గోళ్ల మొదలు వద్ద అర్ధచంద్రాకారంలో ఎర్రటి గుర్తులు ఏర్పడతాయి. (దీని వెనుక గల కారణాలేమిటనేది ఇంకా అస్పష్టంగానే ఉంది)

కానీ కోవిడ్ గోళ్లు ఎంత మందిలో కనిపిస్తున్నాయనే సమాచారం ఇంకా పరిమితంగా ఉంది. అయితే 1 నుంచి 2 శాతం వరకూ కోవిడ్ పేషెంట్లలో ఈ లక్షణాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

కోవిడ్ సోకిన తర్వాత కొన్ని రోజులు లేదా వారాల్లో కోవిడ్ గోళ్లు కనిపించే అవకాశముంది. ఇవి తొలుత కాస్త నొప్పి కలిగించే అవకాశమున్నా.. చాలా మందిలో కొన్ని వారాల్లోనే ఈ సమస్య నయమైపోవచ్చు.

గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ మార్పులు కోవిడ్ సోకిందనటానికి సంకేతాలు కావచ్చు కానీ వేరే సమస్యల వల్ల కూడా గోళ్లలో ఇలాంటి మార్పులు రావచ్చు. ఉదాహరణకు బ్యూస్ లైన్లు కీమోథెరపీ ప్రభావం వల్ల కానీ, మరేదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ కనిపించవచ్చు.

కరోనా వైరస్ - జుట్టు రాలటం

ఫొటో సోర్స్, Getty Images

3) జుట్టు రాలటం

కోవిడ్-19 లక్షణాల్లో బహుశా పెద్దగా పట్టించుకోని లక్షణం జుట్టు రాలడం. కోవిడ్ సోకిన నెల రోజుల తర్వాత కానీ, ఆపైన కానీ ఈ సమస్య మొదలవుతుంది. దీనికి సంబంధించి.. గతంలో కోవిడ్ సోకిన దాదాపు 6,000 మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. వారిలో 48 శాతం మంది తమకు జుట్టు రాలే సమస్య ఎదురైనట్లు తెలిపారు.

కోవిడ్ తీవ్రత పెరిగిన వారిలోనూ, తెల్లజాతి మహిళల్లోనూ ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.

కోవిడ్ కారణంగా శరీరంలో అసాధారణ ఒత్తిడి వల్ల జుట్టు ఊడిపోవటం ఎక్కువవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే.. ప్రసవం వంటి ఇతరత్రా ఒత్తిడి కలిగించే కారణాల వల్ల కూడా జుట్టు రాలే సమస్య తలెత్తవచ్చు. శుభవార్త ఏమిటంటే.. ఇలా రాలిపోయిన జుట్టు కాలం గడిచేకొద్దీ క్రమంగా సాధారణ రీతిలో పెరుగుతుంది.

కరోనా వైరస్ - వినికిడి లోపం

ఫొటో సోర్స్, Getty Images

4) వినికిడి లోపించటం, చెవిలో గుయ్‌మనే శబ్దం

ఫ్లూ, మీజిల్స్ వంటి ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల తరహాలో కోవిడ్ కూడా మన చెవి లోపలి భాగంలోని కణాల మీద ప్రభావం చూపుతుందని గుర్తించారు. దీనివల్ల వినికిడి శక్తి లోపించటం కానీ చెవిలో గుయ్యిమనే శబ్దం వినిపించే (టినిటస్) సమస్య కానీ తెలెత్తుతుంది.

దీనికి సంబంధించి 560 మంది కోవిడ్ రోగుల మీద నిర్వహించిన ఒక అధ్యయనంలో.. 3.1 శాత మంది రోగుల్లో వినికిడి శక్తి లోపించిందని, 4.5 శాతం మందిలో టినిటస్ సమస్య తలెత్తిందని వెల్లడైంది.

అంతేకాదు.. కోవిడ్ సోకిన 30 మంది రోగులతో పాటు, కోవిడ్ సోకని 30 మంది మీద ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ 60 మందిలో ఎవరికీ గతంలో వినికిడి సమస్యలు లేవు. కోవిడ్ వల్ల చెవి లోపలి భాగం దెబ్బతిని, వినికిడి శక్తి లోపించటానికి దారితీసిందని పరిశోధకులు గుర్తించారు. అయితే చాలా మంది రోగుల్లో ఈ సమస్య దానికదిగానే తగ్గిపోతోంది. కానీ కోవిడ్ వల్ల తలెత్తిన వినికిడి లోపం శాశ్వతంగా మారిన కేసులూ నమోదయ్యాయి.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఈ లక్షణాలన్నీ ఎందుకు?

ఈ లక్షణాలకు కారణాలేమిటన్నది మనకు కచ్చితంగా తెలియదు. అయితే.. శరీరంలో తాపం (ఇన్ఫ్లమేషన్ - దహనగుణం) అనే ప్రక్రియ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుసు. తాపం అనేది.. బయటి నుంచి ఏవైనా వ్యాధికారకాలు శరీరంలోకి ప్రవేశించినపుడు వాటికి వ్యతిరేకంగా మన శరీరం అప్రమత్తం చేసే సహజ రక్షణ వ్యవస్థ. కోవిడ్ విషయంలో మన శరీరంలోకి సార్స్-కోవ్-2 వైరస్ ప్రవేశించినపుడు కూడా దానికి వ్యతిరేకంగా శరీరంలోని ఈ సహజ రక్షణ వ్యవస్థ క్రియాశీలమవుతుంది. ఈ ప్రక్రియలో.. మన రోగనిరోధక కణాల కార్యకలాపాలను నియంత్రించటానికి ముఖ్యమైన కైటోకైన్లు అనే ప్రొటీన్ల ఉత్పత్తి జరుగుతుంది.

కోవిడ్ ఇన్ఫెక్షన్ల వల్ల ప్రేరేపితమైన తాపంలో భాగంగా ఈ ప్రొటీన్లు అధిక మోతాదులో ఉత్పత్తి అయినట్లయితే.. అది ఇంద్రియ లోపాలను కలిగించగలదు. కొందరిలో వినికిడి లోపించటం వంటి సమస్యలు తలెత్తటానికి కారణాన్ని ఇది విశదీకరిస్తోంది. చర్మానికి, చెవులకు, గోళ్లకు రక్తం సరఫరా చేసే అతి సూక్ష్మ రక్తనాళాల వ్యవస్థ అయిన కేశనాళికల వ్యవస్థను కూడా ఇది దెబ్బతీయగలదు.

ఈ కథనంలో వివరించిన లక్షణాలు కనిపించటానికి కేవలం కోవిడ్ ఇన్ఫెక్షన్ మాత్రమే కారణం కాదు. అయితే ఈ లక్షణాల్లో ఏవైనా కనిపించినట్లయితే కోవిడ్ టెస్ట్ చేయించుకునే అంశాన్ని పరిశీలించాలి.

ఈ లక్షణాలు ముదురుతున్నా, అవి ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్నా వైద్యుడిని సంప్రదించాలి. అయితే.. ఈ లక్షణాలు చాలా వరకూ కాలక్రమంలో తగ్గిపోతాయి కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

వీడియో క్యాప్షన్, పిల్లలకు కరోనా టీకా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)