ఆంధ్రప్రదేశ్: 'గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం' కార్యక్రమంలో ఏం జ‌ర‌గాలి, ఏం జ‌రుగుతోంది?

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ పిరియా సాయిరాజ్ పర్యటన
ఫొటో క్యాప్షన్, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ పిరియా సాయిరాజ్ పర్యటన
    • రచయిత, శంకర్ వడిశెట్టి, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

గ‌డ‌ప గ‌డ‌పకూ మ‌న ప్రభుత్వం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో అనేక చోట్ల నాయ‌కుల‌ను ప్రజ‌లు ప్రశ్నిస్తున్న వీడియోలు వస్తున్నాయి. వివిధ స‌మ‌స్యల‌పై నేతలను ప్రజలు నిల‌దీస్తున్న తీరు చుట్టూ చ‌ర్చ సాగుతోంది.

ఈ కార్యక్రమంలో అధికారుల‌తోపాటు పాల‌క‌ వైసీపీ నేత‌లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో పాటుగా వైసీపీ ఇంఛార్జులు ఉన్న నాయ‌కులే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైసీపీ అనేది వైసీపీ చాలాకాలంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ప్రతిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో కూడా వైసీపీ ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టింది. ఆ పార్టీ నాయ‌కులు, శ్రేణులు సామాన్యుల‌కు చేరువ‌య్యేందుకు దీన్ని రూపొందించారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు విస్తృతంగా నిర్వహించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోగా.. ఏప్రిల్ చివ‌రిలో నిర్వ‌హించిన వైసీపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో ఎమ్మెల్యేల‌కు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత జ‌గ‌న్ నిర్వ‌హించిన తొలి శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం కూడా అదే.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళికాబ‌ద్ధంగా సాగాల‌ని, మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు అంతా సిద్ధం కావాల‌ని ఆయ‌న ఈ సమావేశంలో పిలుపునిచ్చారు.

మే రెండో వారం నుంచి ఎమ్మెల్యేలు, నాయ‌కులంతా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వెళ్లాల‌ని, గ్రామ/ వార్డు స‌చివాల‌యాల‌ను సంద‌ర్శించాల‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్ గా సాగాల‌ని టార్గెట్ విధించారు.

వీడియో క్యాప్షన్, ‘చెత్త సేకరణపై రూ.100 పన్ను విధిస్తే తప్పేంటి? కట్టకుంటే మీ చెత్త మీ ఇంటి ముందే పోస్తాం’

ప్ర‌జ‌ల్లోకి ఎంత విస్తృతంగా వెళితే అంత‌గా గుర్తింపు వ‌స్తుంద‌ని, స‌ర్వేల ఆధారంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని కూడా చెప్పారు. దాంతో చాలామంది నాయకులు ఈ కార్య‌క్ర‌మం కోసం స‌న్నాహాలు చేశారు.

అయితే గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరుతో కార్య‌క్ర‌మం అధికారికంగా నిర్వ‌హించాల‌ని ఆదేశిస్తూ మే 10వ తేదీన ప్ర‌భుత్వం జీవో ఆర్టీ నెం. 68ని విడుద‌ల చేసింది. ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొంది. దానికి మార్గ‌ద‌ర్శ‌కాలు నిర్దేశించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

జ‌గ‌న్ ప్ర‌భుత్వం వచ్చాక మూడేళ్ల కాలంలో చేప‌ట్టిన ప‌థ‌కాలు, ప్ర‌జ‌ల‌కు ఒన‌గూరిన ల‌బ్ది గురించి అంద‌రికీ వివ‌రించాల‌ని అందులో చెప్పారు. మే 11న ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించాల‌ని అప్పుడు సూచించారు.

స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్ల‌తో పాటు పంచాయ‌తీ, మునిసిప‌ల్ అధికారులు కూడా పాల్గొని సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని తెలియ‌జేశారు.

చిలకలూరపేటలో మంత్రి విడదల రజనీ
ఫొటో క్యాప్షన్, చిలకలూరపేటలో మంత్రి విడదల రజనీ

రంగంలోకి యంత్రాంగం, దూరంగా విపక్షాలు

వారం రోజులుగా ఈ కార్యక్రమం రాష్ట్రమంతా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జులుగా ఉన్న నాయకులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకుని గడప గడపకూ కార్యక్రమం సాగిస్తున్నారు

ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమే అయినప్పటికీ విపక్ష ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికిన వారు పోగా మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలో ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. వారి స్థానాల్లో వైసీపీ నాయకులే ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడం విశేషంగా మారింది.

"ప్రభుత్వ కార్యక్రమంగా పేర్కొన్నారు. కానీ మా నియోజకవర్గంలో దానికి సంబంధించిన సమాచారం లేదు. అంతా వైసీపీ కార్యక్రమంగా చేసుకున్నారు. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారంలా ఉంది. గతంలో జన్మభూమి వంటి కార్యక్రమాల్లో మా ప్రభుత్వం అందరినీ భాగస్వాములు చేసేది’’ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేల మాట అలా ఉంచి గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఇతర పార్టీల వాళ్లని పిలవడం లేదని ఆయన అన్నారు.

‘‘అధికారులు కూడా ఏమీ చేయలేమని చెబుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో ఈ ప్రభుత్వానిది అగ్రస్థానం. అందుకు ఇది కూడా ఓ ఉదాహరణ " అని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

రాజమహేంద్రవరం రూరల్ లో అధికార పార్టీ ఇంచార్జీ చందన నాగేశ్వర్ అధ్వర్యంలో గడప గడపకు
ఫొటో క్యాప్షన్, రాజమహేంద్రవరం రూరల్ లో అధికార పార్టీ ఇంచార్జీ చందన నాగేశ్వర్ అధ్వర్యంలో గడప గడపకు

గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది?

అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. వివిధ కారణాలతో కొందరు ఎమ్మెల్యేలు ఇంకా ప్రారంభించకపోయినప్పటికీ అత్యధికులు మాత్రం గడప గడపకూ తిరుగుతున్నారు.

ఎండల తీవ్రత, మధ్యలో తుఫాన్ వంటి ఆటంకాలు రావడం కొంత సమస్య అయినప్పటికీ పార్టీ అధినేత ఆదేశాలను పాటించేందుకు అత్యధికులు ప్రయత్నిస్తున్నారు.

ఆ క్రమంలో ఎన్నికల ర్యాలీలను తలపించేలా భారీ ఊరేగింపులు, జనసమీకరణాలు కనిపిస్తున్నాయి. ఇక ఆయా నాయకులు తాము సందర్శించిన ఇళ్లకు వెళ్లిన సమయంలో కరపత్రాలు అందిస్తున్నారు. అందులో ఆ కుటుంబానికి గడిచిన మూడేళ్లలో లభించిన లబ్ది వివరాలున్నారు.

నగదు బదిలీ ద్వారా నేరుగా బ్యాంకు అకౌంట్లలో ఆ కుటుంబ సభ్యులకు దక్కిన ప్రయోజనాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ మరో 16 పేజీల బుక్ లెట్ కూడా అందరికీ అందిస్తున్నారు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ముద్రించినట్టుగా అందులో పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: బందరు పోర్టు.. నిర్మాణం ఎప్పుడు?

2021లో కూడా జగన్ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంలో ఇలాంటి కరపత్రాలు, బుక్ లెట్లు పంపిణీ చేశారు. అప్పట్లో వలంటీర్లు, ఆశా, అంగన్ వాడీ వర్కర్ల ద్వారా ఇంటింటికీ వాటిని చేర్చారు. ఈసారి పార్టీ క్యాడర్ రంగంలో దిగి పంపిణీ చేపట్టింది.

"ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. దానికి తగ్గట్టుగానే దీనిని చూడాలి. దాదాపుగా ఇంటింటికీ వెళ్లి జగన్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి, మళ్లీ జగన్ ని ఆశీర్వదించాలి, మళ్లీ గెలిపించాలి అంటూ కోరుతున్నారు. దాదాపు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారా అనే సందేహం కూడా కలుగుతోంది’’అని సీనియర్ జర్నలిస్ట్ పి.విజయ్ చంద్రన్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తాను చేసింది ప్రజలకు చెప్పాలనుకోవడం మంచి విషయమేనని, అదే సమయంలో ప్రజలు ఏం కోరుతున్నారనేది తెలుసుకోవడానికి ప్రాధాన్యత పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘చాలాచోట్ల జనం గొంతు వినడానికి కూడా అవకాశం కనిపించడం లేదు" అని విజయ్ చంద్రన్ వ్యాఖ్యానించారు.

గడప గడపకు మన ప్రభుత్వం

ప్రశ్నలు, నిలదీతలు

తమ సమస్యలను అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. నాయకులను కొందరు సామాన్యులు నిలదీస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా పెరుగుతున్న ధరల మీద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, చెత్తపన్నులు వంటి వాటిని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల మీద నిలదీస్తున్నారు.

గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రజల నుంచి వస్తున్న స్పందనలకు నాయకులు సమాధానం చెప్పలేని స్థితి ఏర్పడుతోంది.

కరెంటు ఛార్జీల పెరుగుదలకు నాయకులు చెబుతున్న కొన్ని కారణాలు విని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. "రష్యా- యుక్రెయిన్ యుద్ధం మూలంగా మనకు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి" అని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చెప్పిన వీడియో వైరల్ అయ్యింది.

ప్రజల నుంచి దాదాపు నాయకులంతా ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.

"ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది. మూడేళ్లలో కుటుంబానికి కనీసంగా రూ. లక్ష నుంచి మూడు నాలుగు లక్షల వరకూ లబ్ధి జరిగిందని ప్రభుత్వం రికార్డులలో చెప్పుకుంటోంది. అయినప్పటికీ పెరుగుతున్న ధరలు, ఇసుక, మద్యం పాలసీ సహా పలు కారణాలు ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి’’ అని పట్టభద్రుల ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు.

‘‘ఇంటింటికీ నాయకులు వెళ్లడం మంచిదే. కానీ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపితేనే లక్ష్యం నెరవేరుతుంది" అన్నారాయన.

గడప గడపకు మన ప్రభుత్వం

కుళాయిలు బాగు చేయిస్తారా? లేదా?

'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కోటవురట్ల మండలం యండపల్లి గ్రామం వెళ్లినప్పుడు ప్రజలు పలు సమస్యలను ఏకరువుపెట్టారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయి రెండు వారాలు అవుతున్నా ఇంతవరకు బాగు చేయలేదని, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న కాలనీల తీరుపై కూడా ప్రజలను నుంచి ఫిర్యాలు వెల్లువెత్తాయి. కాలనీలకు సరైన రోడ్డు సదుపాయం లేదని, నీటి వసతి లేదని ఎమ్మెల్యే ముందు వాపోయారు.

"గడప గడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి, వాటని పరిష్కరించాలి."అని గొల్ల బాబురావు అధికారులతో అన్నారు.

ఓట్లేశాం, కనీసం శ్మశానం కూడా లేదు

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా మూడేళ్ల తర్వాత ప్రజల్లోకి వెళ్తున్న వైకాపా నాయకులకు, ఎమ్మేల్యేలను ప్రజలు కొన్ని చోట్ల గట్టిగా నిలదీస్తుంటే, కొన్ని చోట్ల హామీలను గుర్తుచేస్తున్నారు.

‘‘ఎన్నికలప్పుడు వచ్చారు. మళ్లీ ఇపుడోచ్చారు. ఈ మూడేళ్లలో ఏం చేశారు మీరు?’’ అంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్‌ని కేడీపేట, గొలుగొండ గ్రామస్థులు ప్రశ్నించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాత కృష్ణాదేవిపేట పంచాయతీలో ఎమ్మెల్యే పర్యటించారు.

"ఊరిలో గుడి లేదు, బడి లేదు, అంగన్ వాడీ కేంద్రం లేదు, చివరకు శ్మశానం లేదు, రోడ్లు అంతకంటే లేవు, ఏదో చేస్తారని ఓటేస్తే చేసిందేమీ లేదు. అర్హులకు పింఛన్లు సైతం మంజూరు కాలేదు. రెండేళ్ల నుంచి చాలా వీధి కొళాయిలు పనిచేయడం లేదు’’ అని కేడీ పేట, గొలుగొండ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

గడప గడపకు మన ప్రభుత్వం

రూ. 25 వేలు కట్టాం., ఇల్లు ఎప్పుడిస్తారు?

విశాఖ నగరంలోనూ కూడా వైసీపీ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నగర ప్రాంతం కావడంతో ఎక్కువగా ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇళ్లు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఉదాహరణకు విశాఖ తూర్పు నియోజకవర్గొ వైసీపీ సమన్వయకర్త, వీఎంఆర్డీఏ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి ఇళ్లు ఎప్పుడిస్తారనే అంశంపైనే ఎక్కువగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

"టిడ్కో ఇంటి కోసం రూ. 25 వేలు చెల్లించాం. ఇప్పటి వరకు ఇల్లు రాలేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఎంత కాలం అద్దెలు చెల్లించాలి? మీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లవుతోంది. ఇప్పటికీ ఇల్లు మంజూరుకాలేదు. మాకు ఇల్లు ఇంకెప్పుడు ఇస్తారు?" అంటూ అక్కరమాని విజయనిర్మలను మహిళలు నిలదీశారు.

ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముందే తెలుగుదేశం పార్టీ 'బాదుడే బాదుడు' కార్యక్రమం మొదలుపెట్టింది

ఫొటో సోర్స్, Telugu Desam Party/twitter

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముందే తెలుగుదేశం పార్టీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం మొదలుపెట్టింది

‘ప్రభుత్వం మీద ఆశ పోయింది..’

"వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజలు తీవ్రకష్టాల పాలయ్యారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో గ్రామస్థాయి వరకు వెళుతున్న టీడీపీ శ్రేణులు, నేతలకు..ప్రజలు ఎదురొచ్చి తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఇదే సందర్భంలో వైసిపి నేతలు గడప గడపకు కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళుతుంటే సమస్యలపై గట్టిగా నిలదీస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. జగన్ ప్రభుత్వ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే 2024కంటే ముందుగా ఎన్నికలు వచ్చినా వచ్చే అవకాశం ఉంది. టీడీపీ క్యాడర్ కూడా సిద్ధంగా ఉండాలి" అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

వైసీపీ నాయకులు అధికారిక కార్యక్రమాలు ప్రారంభించకముందే టీడీపీ ఆధ్వర్యంలో ‘బాదుడే బాదుడు’ పేరుతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమం చేపట్టారు. జగన్ హయంలో పెరిగిన ధరలు, పన్నుల వివరాలను కరపత్రాల రూపంలో ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ఊరూరా తిరుగుతూ టీడీపీ శ్రేణులు ప్రజలకు వివరిస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల మీద ఆయన ప్రచారం సాగిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, మద్య నిషేధంపై జగన్ ఎప్పుడెప్పుడు ఏమేమన్నారు? వాస్తవాలు ఎలా ఉన్నాయి?

‘ప్రజాదరణ చూసి సహించలేకపోతున్నారు..’

గడప గడపకూ కార్యక్రమాన్ని జనాలు ఆదరిస్తున్నారని ఏపీ సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు బీబీసీతో చెప్పారు.

"ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతున్నారు. తమకు జరిగిన లబ్దిని గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కడైనా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే దానిని భూతద్దంలో చూపించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు’’ అని మంత్రి వేణు అన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలు ఎంత మేరకు చేశామని చెప్పడానికి మళ్లీ జనం దగ్గరకు వెళ్లిన ప్రభుత్వం ఇదని ఆయన అన్నారు.

‘‘గతంలో మ్యానిఫెస్టో జనాలకు కనిపించకుండా చేసిన వాళ్లు ఇప్పుడు విమర్శలు చేయడాన్ని జనం హర్షించరు" అని ఆయన చెప్పారు.

గడప గడపకూ కార్యక్రమం విస్తృతంగా సాగుతోందని, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)