‘వర్క్‌ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు జాగ్రత్త.. ఉత్తర కొరియా వాళ్లు జాబ్‌లు కొట్టేస్తున్నారు’ - ఐటీ సంస్థలకు అమెరికా హెచ్చరిక

ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనాబెల్ లియాంగ్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్

తమ గుర్తింపును దాచిపెట్టి ఉత్తర కొరియా ఐటీ నిపుణులు ‘‘వర్క్‌ ఫ్రమ్ హోమ్’’ ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఐటీ సంస్థలకు అమెరికా హెచ్చరించింది. వీరు దొంగతనంగా డబ్బులు సంపాదించి ఉత్తర కొరియాకు పంపిస్తున్నారని పేర్కొంది.

ఆసియాలోని భిన్న ప్రాంతాలకు చెందిన వారిమని చెబుతూ వారు ఉద్యోగాలు సంపాదిస్తున్నారని మూడు అమెరికా విభాగాలు హెచ్చరించాయి.

ఈ నకిలీ ఉద్యోగులు అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియా ఆయుధాల అభివృద్ధికి సాయం చేస్తున్నారని అమెరికా చెబుతోంది.

ఇటీవల కాలంలో ఉత్తర కొరియా వరుసగా క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

2017 తర్వాత తొలిసారిగా గత మార్చిలో ‘‘ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి’’ని ఉత్తర కొరియా ప్రయోగించింది.

వీడియో క్యాప్షన్, చరిత్రలో 70 ఏళ్ల పాటు సాగిన ఆ యుద్ధంలో ఇప్పటికీ విజేతలెవరో తేలలేదు

‘‘తమకు డబ్బులు సంపాదించి పెట్టేందుకు మంచి నైపుణ్యాలున్న వారిని భిన్న దేశాలకు ఉత్తర కొరియా పంపిస్తోంది. వీరు పంపిన డబ్బులను బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. వీరికి ఉద్యోగాలు ఇవ్వడమంటే అమెరికా, ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘించడమే’’అని అమెరికా విదేశాంగ, ఆర్థిక శాఖలు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంయుక్తంగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాయి.

‘‘ఆ ఉద్యోగుల్లో కొందరు ఉత్తర కొరియాలోనే ఉంటున్నారు. మరికొందరు చైనా, రష్యా లాంటి ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. మరికొంత మంది ఆఫ్రికా, ఆగ్నేయాసియా లాంటి దేశాల్లోనూ ఉన్నారు’’అని ప్రకటనలో పేర్కొన్నారు.

‘‘ఈ నకిలీ ఉద్యోగులు మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఐటీ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ లాంటి కోర్సులు చేస్తూ.. ఫ్రీలాన్స్ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఉత్తర అమెరికా, యూరప్, తూర్పు ఆసియా సంస్థల్లో వీరు ఉద్యోగాలు చేస్తున్నారు’’అని ప్రకటనలో వివరించారు.

ఉత్తర కొరియా నిపుణులకు ఉద్యోగాలిచ్చే సంస్థలు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ కన్నా ఆయన సోదరి 'కిమ్ యో జోంగ్' మరీ డేంజరా?

గత నెలలో ఉత్తర కొరియా మద్దతున్న హ్యాకర్లు భారీ క్రిప్టోకరెన్సీ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ ఆక్సీ ఇన్ఫినిటీ ప్లేయర్ల నుంచి వారు ఏకంగా 615 మిలియన్ డాలర్లు (రూ.4,765.85 కోట్లు) దోచుకున్నారు.

అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఉత్తర కొరియా వాసులకు సాయం చేస్తున్న అమెరికాకు చెందిన ఒక పరిశోధకుడికి గత ఏప్రిల్‌లో ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.

క్రిప్టోకరెన్సీ ఈథెర్ టెక్నాలజీని వెనకున్న స్వచ్ఛంద సంస్థ ఈథెరియమ్ ఫౌండేషన్ కోసం వర్జిల్ గ్రిఫ్పిత్ పనిచేసేవారు.

అమెరికా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తూ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఆయన ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారని రుజువైంది.

ఆయన అరెస్టైన సమయంలో ఈథెరియమ్ ఫౌండేషన్ స్పందిస్తూ.. ఆయన ఉత్తర కొరియా పర్యటనతో తమకు ఎలాంటి సంబంధమూలేదని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)