జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో బయటపడ్డ శివలింగం.. సర్వే అక్రమం అన్న అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అనంత్ ఝణాణే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉండే జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో సర్వే సోమవారంతో ముగిసింది. అయితే, మసీదు ఆవరణలో శివలింగం కనిపించింది. దీంతో ఆ పరిసరాలను వెంటనే సీల్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది.
‘‘శివలింగం కనిపించిన ప్రాంగణాన్ని వెంటనే సీల్ చేయాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లడానికి వీల్లేదు’’అని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఆ కోర్టు ఆదేశాలు వాస్తవమైనవేనని బనారస్ జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ బీబీసీకి ధ్రువీకరించారు. ఆ ప్రాంతానికి తాను వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.
‘’30 X 30 అడుగుల విస్తీర్ణంలో ఆ ప్రాంతాన్ని ఇప్పటికే సీల్ చేశాం. ఆ ప్రాంతానికి మూడు ద్వారాలు ఉన్నాయి. మొత్తం మూడింటినీ మూసివేశాం’’అని ఆయన చెప్పారు.
మసీదు ద్వారాలను కూడా మూసేశారా? అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘‘లేదు. అలాచేసే అవకాశం లేదు. మసీదు ఆవరణలో ఒక భాగంలో ఒక చిన్న నీటి కొలను లాంటి ప్రాంతంలో శివలింగం కనిపించింది. ఆ ప్రాంతానికి వెళ్లే మూడు ద్వారాలను మూసివేశాం. ఇది మొత్తం ఆవరణలో కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. ఆ మిగతా ప్రాంతంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చు’’అని ఆయన చెప్పారు.

మసీదుకు వెళ్లేవారు మొహం, కాళ్లు, చేతులను శుభ్రంచేసుకునే ఆ ప్రాంతాన్ని సీల్ చేశారా? అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘‘అవును. మేం వారు మొహం, కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు వేరే సదుపాయాన్ని ఏర్పాటుచేస్తాం. పైపులు, ట్యాప్‌లతోపాటు మిగతా అన్ని పనులూ రేపటిలోగా పూర్తిచేస్తాం’’అని ఆయన చెప్పారు.
అడ్వొకేట్ హరిశంకర్ జైన్ అభ్యర్థనపై జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో కోర్టు సర్వే చేపట్టింది. ఈ కేసుపై కోర్టు ఆదేశాలను మూడు సోర్సుల సాయంతో బీబీసీ ధ్రువీకరించింది. హరిశంకర్ జైన్ కౌన్సిల్, అడ్వొకేట్ విష్ణు జైన్, ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహేంద్ర పాండే, అంజుమన్ ఇంతేజామియా న్యాయవాది రాయీస్ అన్సారీలతో బీబీసీ మాట్లాడింది. వీరంతా ఆ పిటిషన్‌తోపాటు కోర్టు ఆదేశాలు కూడా వాస్తవమేనని ధ్రువీకరించారు.
జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో ఒకచోట 12 అడుగుల శివలింగం కనిపించిందని హిందువుల తరఫు న్యాయవాది చెప్పారు. ఆ ప్రాంతాల్లో మరికొన్ని కీలకమైన ఆధారాలు లభించాయని వివరించారు.
అయితే, సర్వేలో పాల్గొన్నవారు ఎవరూ బయటకు సమాచారం వెల్లడించడానికి వీల్లేదని, బయటకు వస్తున్న వార్తలు, నినాదాలను నమ్మొద్దని జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ అభ్యర్థించారు. ‘‘సర్వే కోసం వెళ్లిన ఎవరూ లోపల ఏం చూశారో చెప్పడానికి వీల్లేదు. ఈ విషయంపై మే 17న మేం కోర్టుకు నివేదిక సమర్పిస్తాం. అప్పటివరకు ఎవరూ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించకూడదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా సమాచారాన్ని బయటపెడితే, వాటిని మేం ధ్రువీకరించలేం’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ARRANGED
సంతోషం వ్యక్తంచేసిన బీజేపీ
జ్ఞాన్‌వాపీ మసీదు పరిసరాల్లో శివ లింగం కనిపించడంపై ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు.
‘‘బుద్ధ పూర్ణిమ రోజు జ్ఞాన్‌వాపీ మసీదులో బాబా మహాదేశ్ శివలింగం బయటపడటంతో చాలా సంతోషంగా ఉంది. ఇది హిందువులకు దేవుడు ఇస్తున్న సందేశంలా ఉంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు విశ్వ హిందూ పరిషత్ కూడా ఈ అంశంపై స్పందించింది. ‘‘జ్ఞాన్‌వాపీ మసీదు పరిసరాల్లోని ఓ గదిలో శివ లింగం బయటపడింది. ఇది శుభవార్త. అక్కడ దేవాలయం ముందునుంచీ ఉందనే వాదనను ఇది బలపరుస్తోంది. ఈ రుజువులను అందరూ అంగీకరిస్తారని భావిస్తున్నాను’’అని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
సర్వే అక్రమం - అసదుద్దీన్ ఒవైసీ
జ్ఞాన్‌వాపీ మసీదు ఆవరణలో సర్వే ఆక్రమంగా నిర్వహించారని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఆజ్ తక్ ఛానెల్‌తో ఆయన మాట్లాడారు. హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ సర్వే చేపట్టారని ఆయన అన్నారు. ''బాబ్రీ మసీదు తీర్పు తర్వాత మాలో వ్యక్తమైన ఆందోళనలు నిజమయ్యాయి''అని ఆయన వ్యాఖ్యానించారు.
''సుప్రీం కోర్టులో ఈ కేసుపై మంగళవారం విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని స్థానిక కోర్టు ఎందుకు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు స్టే తర్వాత అసలు అక్కడ సర్వే నిర్వహించకూడదు''అని ఒవైసీ అన్నారు.
ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలని ఒవైసీ డిమాండ్ చేశారు.

సర్వే ముగిసింది..
మసీదులో వీడియోగ్రఫీ సర్వే చేయాలని మే 12న వారణాసి కోర్టు బెంచ్ ఆదేశించింది.
ఆ మేరకు శనివారం ప్రారంభమైన ఈ సర్వే సోమవారంతో ముగిసింది. వీడియోగ్రఫీ సర్వేలో ఈ కేసులోని ఇరు పక్షాలు హాజరయ్యాయి.
బనారస్ పోలీస్ కమిషనర్ సతీష్ గణేష్ ఈ సర్వే ముగింపు సమాచారాన్ని అందించారు.
"విస్తృత స్థాయిలో వివిధ దశల్లో భద్రత ఏర్పాటుచేశాం. ఇరు పక్షాల వారితో సమావేశమయ్యాం. ఇది కోర్టు ఆదేశమని, దాన్ని పాటించడం మనందరి రాజ్యాంగపరమైన బాధ్యత అని నచ్చజెప్పాం."
మసీదు సర్వేకు సంబంధించిన అంశం చాలా సున్నితమైనది కాబట్టి, దాని కోసం విస్తృత స్థాయిలో సన్నాహాలు చేశారు.
"నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తులతో మాట్లాడి, వారి మనసులోని అపోహలను తొలగించాం. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేందుకు పటిష్టమైన భద్రతా బలగాలను మోహరించాం. నేటితో మూడు రోజుల సర్వే అధికారికంగా ముగిదింది" అని సతీష్ గణేష్ చెప్పారు.
ఈ విషయంలో అధికారిక ప్రకటనలు తప్ప మరే ఇతర ప్రకటనలను పరిగణించవద్దని సతీష్ గణేష్ కోరారు.
కేసు ఏంటి?
జ్ఞాన్‌వాపి మసీదు వెనుక భాగంలో ఉన్న శృంగార గౌరీ దేవి దర్శనానికి, పూజకు అనుమతి ఇవ్వాలని అయిదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ వేశారు.
దీనితో పాటు, ప్లాట్ నంబర్ 9130 తనిఖీ, వీడియోగ్రఫీని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను అంగీకరిస్తూ కోర్టు జ్ఞాన్‌వాపి మసీదు సర్వే జరపాలని, వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించింది.
ఈ సర్వే ఫలితాలను గోప్యంగా ఉంచాలని ఆదేశాలు అందినట్టు బనారస్ డీఎం కౌశల్ రాజ్ శర్మ చెప్పారు.
"సర్వే నివేదికను మే 17న కోర్టులో అందించాలని అడ్వకేట్ కమిషనర్ ఆదేశించారు. అంతవరకు, లోపల ఏం వివరాలు లభించాయన్నది గోప్యంగా ఉంచాలని చెప్పారు. లోపల ఏం జరిగిందో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు చెబితే, దానికి ప్రామాణికత ఉండదు. వాటిని నిరూపించలేరు. కోర్టు మాత్రమే దీనికి కస్టోడియన్. ఎవరైనా ఏమైనా చెబితే అది వారి వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. కమిషన్‌కు దానితో సంబంధం లేదు" అని స్పష్టం చేశారు.
అడ్వకేట్ కమిషనర్ తన నివేదికను మంగళవారం బనారస్ సివిల్ జడ్జికి సమర్పించనున్నారు.
సుప్రీం కోర్టులో విచారణ
మసీదులో సర్వేపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వేపై తక్షణ స్టే విధించేందుకు గత వారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసుపై మంగళవారం విచారణ జరగనుంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం సమక్షంలో ఈ మొత్తం వ్యాజ్యంపై విచారణ జరగనుంది.
దర్యాప్తు నివేదికను బహిరంగపరచకూడదని అంజుమన్ ఇంతేజామియా కమిటీ సుప్రీంకోర్టును అభ్యర్థించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఫిన్లాండ్: పుతిన్ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఈ దేశం ఎందుకు నాటోలో చేరుతోంది?
- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఔరంగాబాద్‌లో ఎందుకు నిర్మించారు?
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












