సంపూర్ణ చంద్రగ్రహణం - బ్లడ్ మూన్: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?

సంపూర్ణ చంద్రగ్రహణం

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, సంపూర్ణ చంద్రగ్రహణం

మే 15,16 తేదీల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఏడాది ఇప్పటికే తొలి పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడగా, తొలి సంపూర్ణ చంద్రగ్రహణం ఈ వారాంతంలో రాబోతోంది.

చంద్రగ్రహణం అంటే, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు, భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. ఈ నీడ పూర్తిగా చంద్రుడిని కప్పేసినప్పుడు ఏర్పడేదే సంపూర్ణ చంద్రగ్రహణం.

మే 15, 16 తేదీలలలో ఏర్పడే చంద్రగ్రహణంలో భూమి నీడ చంద్రుడిని 99.1 శాతం కప్పేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏ సమయంలో ఏర్పడుతుంది?

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.02 గంటల నుంచి గ్రహణం మొదలవుతుంది. ఉదయం 7.57 గంటల నుంచి భూమి నీడ చంద్రుడి మీద పడటం ప్రారంభమవుతుంది.

ఉదయం 8.59 గంటలకు భూమి నీడ సంపూర్ణంగా చంద్రుడి మీద పరుచుకోవడంతో చంద్రుడు ముదురు నారింజ రంగులో కనిపిస్తాడు. 10.23 గంటల నుంచి గ్రహణం వీడటం మొదలవుతుంది.

మధ్యాహ్నం 12.20 గంటలకు గ్రహణం ముగుస్తుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది.

''ప్రతి నెలా సూర్యుడికి, భూమికి చంద్రుడు పూర్తి వ్యతిరేక దిశలోకి వచ్చినప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. అయితే, చంద్రగ్రహణం రోజున చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖ మీదకు వస్తారు. దీంతో చంద్రుడు భూమి నీడలోకి వెళ్లిపోతాడు. ఇది పౌర్ణమి నాడే సాధ్యమవుతుంది'' అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ అన్నారు.

సూర్యగ్రహణం అంటే భూమికి, సూర్యుడికి మధ్యకు చంద్రుడు రావడం. ఆ సమయంలో చంద్రుడి మీద పడే సూర్యకాంతి భూమికి మీదకు పరావర్తనం చెందే అవకాశం ఉండదు. అందువల్ల అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

2010లో ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణంలో వివిధ దశలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2010లో ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణంలో వివిధ దశలు

ఏయే దేశాలలో కనిపిస్తుంది?

దక్షిణార్ధ గోళంలోని చాలా ప్రాంతాలలో కనిపించే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో మాత్రం కనిపించదు. ఇండియా ఉత్తరార్ధ గోళంలో ఉండటమే ఇందుకు కారణం.

దక్షిణ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని వారు పాక్షికంగా గ్రహణాన్ని చూడగలుగుతారు.

లండన్, హవానా, జోహెన్నెస్ బర్గ్, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, రోమ్ లాంటి నగరాలలో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ప్రజలు వీక్షించగలుగుతారు. అంకారా, కైరో, బుడాపెస్ట్, ఏథెన్స్ లాంటి చోట్ల పాక్షికంగా గ్రహణం కనిపిస్తుంది.

ఈ అద్భుత దృశ్యాన్ని చూడలేని వారికి నాసా ప్రత్యేక లైవ్ ద్వారా ఈ దృశ్యాలను అందిస్తోంది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ ఛానెళ్లలో ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

వీడియో క్యాప్షన్, చంద్రగ్రహణం పేరులో తోడేలు ఎందుకు చేరింది?

గ్రహణం ఎలా ఏర్పడుతుంది?

గ్రహణం అనేది ఒక అద్భుత ఖగోళ దృశ్య విశేషం. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఔత్సాహికులు, శాస్త్రవేత్తలు ఈ ఖగోళ అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు ఉవ్విళ్లూరతారు. ఇక గ్రహణ సమయాల్లో పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు.

''సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు రెండూ భూమికి ఎదురుగా ఉంటాయి. భూమి నీడ చంద్రుడి మీద పడుతున్నప్పటికీ, కొంత వెలుతురు చంద్రుడిని చేరుతూనే ఉంటుంది. భూ వాతావరణం మీదుగా ఈ వెలుతురు వెళుతున్నప్పుడు నీలం రంగు ఫిల్టర్ అవుతుంది'' అని నాసా వెల్లడించింది.

చంద్రుడు భూమి నీడ గుండా ప్రయాణించినప్పుడు చీకటిలోకి వెళ్లిపోతాడు. పూర్తిస్థాయిలో చీకటిలోకి వెళ్లినప్పుడు దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు.

భూమి వ్యాసం చంద్రుడికన్నా 4 రెట్లు అధికంగా ఉంటుంది. అందువల్ల దాని నీడ చంద్రుడి మీద చాలా సేపు ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంతో సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 104 నిమిషాల వరకు సాగే అవకాశం ఉంటుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖలోకి వచ్చి, భూమి మీద చంద్రుడి మీద పడినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది

ఫొటో సోర్స్, Getty Images

పాక్షిక చంద్రగ్రహణం అంటే ఏంటి?

భూమి నీడలోకి చంద్రుడిలోని కొంత భాగం మాత్రమే వచ్చినప్పుడు ఏర్పడేది పాక్షిక చంద్రగ్రహణం. అంటే చంద్రుడి మీద భూమి నీడ కొంత ప్రాంతం మాత్రమే పడగా, మిగిలిన భాగంలో సూర్యకాంతి కొనసాగుతుంటుంది. భూమి నీడ, సూర్యుడు వెలుతురు ఒకేసారి పడుతున్న కారణంగా దాని ప్రభావంతో చంద్రుడు నలుపు, ముదురు గోదుమ రంగుల్లో కనిపిస్తాడు.

నాసా చెప్పిన దాని ప్రకారం, సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా మాత్రమే వస్తాయి. పాక్షిక చంద్రగ్రహణాలు ఏడాదిలో కనీసం రెండుసార్లు వస్తాయి.

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మిస్టరీ హట్ కనిపెట్టిన చైనా.. ఈ గుడిసె ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది?

బ్లడ్ మూన్ అని ఎందుకంటారు?

సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఆయా టైమ్ జోన్‌లను బట్టి చంద్రుడు గ్రహణం సమయంలో ఎర్రగా, ముదురు నారింజ రంగులో కనిపిస్తాడు. అందుకే దీనిని ఇంగ్లీషులో బ్లడ్ మూన్ అని పిలుస్తారు. అయితే, ఇది శాస్త్రీయంగా ఉపయోగించే పేరు కాదు.

భూమి నీడ రెండు రకాలుగా ఉంటుంది. భూమి తేలికపాటి నీడను పెనంబ్రా అంటారు. భూమి పూర్తి చీకటి నీడను అంబ్రా అంటారు.

భూమి నీడ(Umbra)లోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు చంద్రుడి మీద సూర్యకాంతి కారణంగా ఏర్పడే పరావర్తనం ఆగిపోతుంది. అయితే, ఆ సమయంలో సూర్యుడి కాంతి వెలుతురు రూపంలో పరోక్షంగా చంద్రుడి మీద పడుతుంటుంది. ఇది భూ వాతావరణం ద్వారా చంద్రుడిని చేరుతుంది.

ఆ సమయంలో సూర్యుడి కాంతిలో ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యాల కన్నా నీలి రంగు తరంగ దైర్ఘ్యాలు ఎక్కువ విక్షేపణం చెందుతాయి. దీంతో కేవలం ఎరుపు రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుతుంది. అందుకే ఆ సమయంలో చంద్రుడు ఎర్రగా నారింజ రంగులో ప్రతిబింబిస్తాడు.

చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే ఏర్పడుతుంది. సూర్య గ్రహణం అమావాస్య నాడు మాత్రమే ఏర్పడుతుంది. అయితే ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు గ్రహణాలు ఏర్పడవు. ఎందుకంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే కక్ష్యా మార్గానికి, చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్యా మార్గం 5 డిగ్రీల వంపుతో ఉంటుంది.

వీడియో క్యాప్షన్, చంద్రయానానికి అతిపెద్ద రాకెట్..

సూర్య గ్రహణం కన్నా చంద్రగ్రహణం ఎక్కువసేపు ఎందుకుంటుంది?

భూమి వ్యాసం చంద్రుడికన్నా4 రెట్లు అధికంగా ఉంటుంది. అందువల్ల భూమి నీడలో చంద్రుడు ఎక్కువ సేపు ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో సంపూర్ణ చంద్రగ్రహణం గరిష్టంగా 104 నిమిషాల వరకూ సాగే అవకాశముంటుంది.

కానీ సూర్య గ్రహణం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే సూర్య గ్రహణంలో భూమి పై సూర్యుడి కాంతి పడకుండా... చంద్రుడు అడ్డుగా వస్తాడు. కానీ భూమి కన్నా చంద్రుడి పరిమాణం తక్కువ కాబట్టి సూర్య గ్రహణం తక్కువ సమయం ఉంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణం గరిష్టంగా ఏడున్నర నిమిషాల వరకూ సాగుతుంది.

'గ్రహణాల సమయంలో ఏదో కీడు జరుగుతుందని ప్రచారం చేసే వాళ్లు ఈ కాలంలో కూడా చేస్తూనే ఉన్నారు. ఆదిమ మానవుడి కాలంలో ఆ భయాలకు అర్థం ఉంది. కానీ, టెక్నాలజీ ఇంత పెరిగిన సమయంలో ఈ భయాలకు, అపోహలకు అర్థం లేదు. నిజంగా అలాంటి ప్రమాదాలు ఏవైనా ఉంటే ప్రభుత్వం అలర్ట్ జారీ చేస్తుంది. కానీ, అలాంటిదేమీ లేదు కదా'' అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)