సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే ఎందుకు వస్తుంది? ప్రతి పౌర్ణమికి ఎందుకు ఏర్పడదు?
గ్రహణం ఎలా ఏర్పడుతుంది?
గ్రహణం అనేది ఒక అద్భుత ఖగోళ దృశ్య విశేషం. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఔత్సాహికులు, శాస్త్రవేత్తలు ఈ ఖగోళ అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు ఉవ్విళ్లూరతారు. ఇక గ్రహణ సమయాల్లో పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు.
''సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు రెండూ భూమికి ఎదురుగా ఉంటాయి. భూమి నీడ చంద్రుడి మీద పడుతున్నప్పటికీ, కొంత వెలుతురు చంద్రుడిని చేరుతూనే ఉంటుంది. భూ వాతావరణం మీదుగా ఈ వెలుతురు వెళుతున్నప్పుడు నీలం రంగు ఫిల్టర్ అవుతుంది'' అని నాసా వెల్లడించింది.
చంద్రుడు భూమి నీడ గుండా ప్రయాణించినప్పుడు చీకటిలోకి వెళ్లిపోతాడు. పూర్తిస్థాయిలో చీకటిలోకి వెళ్లినప్పుడు దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు.
భూమి వ్యాసం చంద్రుడికన్నా 4 రెట్లు అధికంగా ఉంటుంది. అందువల్ల దాని నీడ చంద్రుడి మీద చాలా సేపు ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంతో సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 104 నిమిషాల వరకు సాగే అవకాశం ఉంటుంది.
పాక్షిక చంద్రగ్రహణం అంటే ఏంటి?
భూమి నీడలోకి చంద్రుడిలోని కొంత భాగం మాత్రమే వచ్చినప్పుడు ఏర్పడేది పాక్షిక చంద్రగ్రహణం. అంటే చంద్రుడి మీద భూమి నీడ కొంత ప్రాంతం మాత్రమే పడగా, మిగిలిన భాగంలో సూర్యకాంతి కొనసాగుతుంటుంది. భూమి నీడ, సూర్యుడు వెలుతురు ఒకేసారి పడుతున్న కారణంగా దాని ప్రభావంతో చంద్రుడు నలుపు, ముదురు గోదుమ రంగుల్లో కనిపిస్తాడు.
నాసా చెప్పిన దాని ప్రకారం, సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా మాత్రమే వస్తాయి. పాక్షిక చంద్రగ్రహణాలు ఏడాదిలో కనీసం రెండుసార్లు వస్తాయి.
సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే ఎందుకు వస్తుంది? ప్రతి పౌర్ణమికి ఎందుకు ఏర్పడదు?
సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఆయా టైమ్ జోన్‌లను బట్టి చంద్రుడు గ్రహణం సమయంలో ఎర్రగా, ముదురు నారింజ రంగులో కనిపిస్తాడు. అందుకే దీనిని ఇంగ్లీషులో బ్లడ్ మూన్ అని పిలుస్తారు. అయితే, ఇది శాస్త్రీయంగా ఉపయోగించే పేరు కాదు.
భూమి నీడ రెండు రకాలుగా ఉంటుంది. భూమి తేలికపాటి నీడను పెనంబ్రా అంటారు. భూమి పూర్తి చీకటి నీడను అంబ్రా అంటారు.
భూమి నీడ(Umbra)లోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు చంద్రుడి మీద సూర్యకాంతి కారణంగా ఏర్పడే పరావర్తనం ఆగిపోతుంది. అయితే, ఆ సమయంలో సూర్యుడి కాంతి వెలుతురు రూపంలో పరోక్షంగా చంద్రుడి మీద పడుతుంటుంది. ఇది భూ వాతావరణం ద్వారా చంద్రుడిని చేరుతుంది.
ఆ సమయంలో సూర్యుడి కాంతిలో ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యాల కన్నా నీలి రంగు తరంగ దైర్ఘ్యాలు ఎక్కువ విక్షేపణం చెందుతాయి. దీంతో కేవలం ఎరుపు రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుతుంది. అందుకే ఆ సమయంలో చంద్రుడు ఎర్రగా నారింజ రంగులో ప్రతిబింబిస్తాడు.
చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే ఏర్పడుతుంది. సూర్య గ్రహణం అమావాస్య నాడు మాత్రమే ఏర్పడుతుంది. అయితే ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు గ్రహణాలు ఏర్పడవు. ఎందుకంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే కక్ష్యా మార్గానికి, చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్యా మార్గం 5 డిగ్రీల వంపుతో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- హోంలోన్ వడ్డీ రేటు పెరిగినప్పుడు టెన్యూర్ పెంచుకుంటే మంచిదా లేక EMI ఎక్కువ కడితే బెటరా..
- తాజ్మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
- సి విటమిన్ మన వయసు పెరగకుండా ఉండటానికి ఎంతవరకూ సాయపడుతుంది? అధ్యయనాలు, ఆధారాలు ఏం చెప్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)