Home Loan Interest Rates: హోంలోన్ టెన్యూర్ పెంచుకుంటే మంచిదా లేక ఈఎంఐ ఎక్కువ కడితే బెటరా..

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇటీవలే రెపో రేటు పెంచింది. దానికి అనుగుణంగా బ్యాంకులు, ఇంటి రుణాలు ఇచ్చే ఇతర కంపెనీలు కూడా గృహ రుణాల మీద వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. తద్వారా కస్టమర్ల మీద భారం పడుతోంది.
ఇలాంటప్పుడు ఇంటి కోసం రుణాలు తీసుకున్న వారిలో కొందరు ఈఎమ్‌ఐ భారం తగ్గించుకోవాలనే తొందరలో కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. అవేంటో చూసే ముందు ఒకసారి రెపో రేటు అంటే ఏమిటి? అది ఇంటి రుణాల మీద కట్టే వడ్డీ రేట్లను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
రెపో రేటు అంటే ఏంటి?
ఆర్‌బీఐ దగ్గర తీసుకున్న అప్పుకు బ్యాంకులు చెల్లించే వడ్డీనే రెపో రేటు అంటారు. ఇటీవలే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్‌బీఐ. దాంతో ఇప్పుడు రెపో రేటు 4.40శాతానికి పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
రెపో రేటు పెరిగితే ఏమవుతుంది?
కస్టమర్లకు లోన్లు ఇవ్వాలంటే బ్యాంకులకు కూడా డబ్బులు కావాలి కదా. అందుకోసం ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు అప్పు తెచ్చుకుంటాయి. ఇలా తెచ్చుకున్నందుకు ఆర్‌బీఐకి వడ్డీ కడతాయి.
రెపో రేటు పెరిగితే ఆర్‌బీఐకి బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్ల మీద వేస్తాయి.
రెపో రేటు తగ్గితే ఏమవుతుంది?
ఆర్‌బీఐ రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ తగ్గుతుంది. కాబట్టి కస్టమర్ల మీద కొంత భారాన్ని తగ్గిస్తాయి. అంటే తక్కువ వడ్డీకే బ్యాంకులు వినియోగదారులకు రుణాలు ఇస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
రెపో రేటుకు హోం లోను వడ్డీ రేట్లకు సంబంధం ఏంటి?
ఆర్‌బీఐ 2019లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం రెపో రేటు, ముంబయి ఇంటర్‌బ్యాంక్ అవుట్‌రైట్ రేటు(ఎంఐబీఓఆర్) వంటి ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ రేటుకు గృహ రుణాల వడ్డీ రేట్లు అనుసంధానమై ఉంటాయి. భారత్‌లో చాలా వరకు బ్యాంకులు రెపో రేటునే ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ రేటుగా తీసుకుని హోం లోన్లు ఇస్తుంటాయి.
అందువల్ల రెపో రేటు పెరిగితే ఫ్లోటింగ్ రేట్లు ఉండే ఇంటి రుణాల మీద వడ్డీ రేట్లు పెరుగుతుంటాయి. అలాగే ఆర్‌బీఐ రెపో రేటు తగ్గిస్తే హోం లోన్ల మీద వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి.
ఈ మేరకు ప్రతి మూడు నెలలకు కనీసం ఒక్కసారైనా రెపో రేటు ఆధారంగా బ్యాంకులు ఇంటి రుణాల మీద వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. తద్వారా వడ్డీ రేట్లలో హెచ్చు తగ్గుల ప్రభావం వెంటనే కస్టమర్లకు బదిలీ అవుతూ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
వడ్డీ రేట్లు పెరిగాయ్... ఇప్పుడేం చేయాలి?
ఆర్‌బీఐ ఇటీవలే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పుడు ఆ భారాన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్ల మీద వేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి ఇప్పటికే 30 నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెంచేశాయి.
ఫలితంగా హోం లోన్ల కిస్తీలు పెరుగుతాయి. ఒకవేళ ఈఎమ్‌ఐ స్థిరంగా ఉంటే రుణం తీర్చే కాల పరిమితిని పెంచుతారు. ఇలాంటప్పుడు ఇప్పటికే హోంలోన్ తీసుకున్నవారు ఏం చేయాలో బిజినెస్ జర్నలిస్ట్ కుందవరం నాగేంద్ర సాయి కొన్ని సూచనలు చేశారు.
- ఇంటి రుణం తీసుకున్న వారు ఏ సిస్టంలో ఉన్నారో చెక్ చేసుకోవాలి. అంటే రెపో రేటు లింక్డ్ సిస్టంలో ఉన్నారా లేక పాత పద్ధతిలో ఉన్నారో చూసుకోవాలి. గత 10-12 ఏళ్లలో అనేక మార్పులు వచ్చాయి. 2010 జులై 1కి ముందు ఇంటి రుణాలు బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్(బీపీఎల్‌ఆర్)కు లింక్ అయి ఉండేవి.
- సాధారణంగా వడ్డీ రేట్లు పెరగ్గానే ఎక్కువ మంది టెన్యూర్ అంటే రుణం తీర్చే కాల పరిమితిని పెంచుకుంటారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా ఆర్థికభారం తగ్గినా లాంగ్ టర్మ్‌లో నష్టమే జరుగుతుంది. అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపుల్ కింద ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
- అవకాశం ఉంటే టెన్యూర్ పెంచుకునే కంటే ఈఎమ్‌ఐ పెంచుకోవడమే ఉత్తమం.
- లోనులో కొంత మొత్తాన్ని ఎటువంటి పెనాల్టీ లేకుండానే ముందే చెల్లించే వెసులుబాటు, ఫ్లోటింగ్ రేటు సిస్టంలో ఉన్న వారికి ఉంటుంది. కుదిరితే ప్రీ పే రూపంలో కొంత మొత్తాన్ని చెల్లించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపుల్ అమౌంట్ తగ్గుతుంది.
- వేరే చోట తక్కువ వడ్డీకే లోను దొరుకుతోందని వెంటనే అటు వైపు వెళ్లిపోకూడదు. కనీసం 50 బేసిస్ పాయింట్లు అయినా తక్కువ ఉంటేనే లోన్ ట్రాన్సఫర్ గురించి ఆలోచించాలి. ఇందులో ప్రాసెసింగ్ ఫీజుతోపాటు ఇతర చార్జీలు ఉంటాయనే విషయం మరచిపోకూడదు.
ఇవి కూడా చదవండి:
- LIC స్టార్ ఏజెంట్ భరత్ విక్రయించిన పాలసీల విలువ ఎంతో తెలుసా... రూ. 2,467 కోట్లు
- మహిళల వక్షోజాల నగ్న ఫొటోలతో అడిడాస్ స్పోర్ట్స్ బ్రా ప్రకటనలపై నిషేధం
- పాకిస్తాన్: గంజాయి సాగును చట్టబద్ధం చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?
- సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట
- తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












