పాకిస్తాన్: గంజాయి సాగును చట్టబద్ధం చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

- రచయిత, ఇస్లాంగుల్ అఫ్రిదీ
- హోదా, బీబీసీ కోసం
పాకిస్తాన్‌లోని గిరిజన జిల్లా లోయర్ ఔరాక్జాయ్ చెందిన జహంగీర్ జనానా (30)తో పాటు ఆ ప్రాంతానికి చెందిన రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఇక్కడ గంజాయి పండించడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని కూడా ఆశగా ఉన్నారు.
త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ నిర్ణయం త్వరగా వస్తే బాగుండని రైతులు కోరుకుంటున్నారు.
ఉన్నత విద్య చదువుకున్నప్పటికీ, జహంగీర్, అతని కుటుంబానికి ఆదాయం గంజాయి పంటే. దీనికి అమ్ముకోవడం ద్వారా వారి కుటుంబానికి ఏటా 5-6 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది.
అయితే, గత కొన్నేళ్లుగా అఫ్గానిస్తాన్ నుంచి అక్రమ రవాణా కారణంగా ధర తగ్గింది. దీంతో ఈ పంటపై వారి ఆదాయం సగానికి పడిపోయింది.
ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్‌లోని మూడు జిల్లాల్లో వాడీతీరా, ఔరాక్జాయ్, కుర్రం జిల్లాల్లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో గంజాయిని సాగు చేస్తారు. దీనితో తయారు చేసిన చరస్ (మత్తుమందు)ను దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు.
ఇతర దేశాలలో గంజాయి మొక్క నుంచి చరస్ కంటే చాలా ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఆహారం, దుస్తులు, మందులు, నిర్మాణ సామగ్రిని తయారు చేస్తారు.
దీని ఆధారంగా, ఖైబర్‌లోని వాడితీరా, ఔరాక్‌జాయ్, కుర్రం జిల్లాల్లో గంజాయిని చట్టబద్ధంగా సాగు చేయడం, దాని నుండి చరస్, ఇతర మత్తు పదార్థాల తయారీకి బదులుగా, ఉపయోగపడే వస్తువులను ఉత్పత్తి చేయడం కోసం ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రభుత్వం 2021 సంవత్సరంలో ఒక సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.
దీని బాధ్యతను పెషావర్ విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ విభాగానికి అప్పజెప్పారు.
ఫార్మసీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఫజల్ నాసిర్ ఆ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. జూన్ 2021 నుండి మూడు జిల్లాల్లో గంజాయికి సంబంధించిన సర్వే ప్రారంభించామని, ఆధునిక మెథడాలజీ, సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి, గత ఆరు నెలల్లో గంజాయి సాగు ఉన్న విస్తీర్ణం, దాని నుంచి ఎంత చరస్ దిగుబడి వచ్చింది అన్న వివరాలను డిసెంబర్ నాటికి సేకరించామని చెప్పారు.
ప్రస్తుత సంవత్సరంలో గంజాయి సాగుకు అన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాచరణను పూర్తి చేస్తుందని సర్వే నిర్వహించిన ప్రాంతాలకు చెందిన రైతులు ఆశించారు. అయితే, ఇది చాలా ఆలస్యమవుతోంది.

సర్వే నివేదిక ఏం వెల్లడించింది?
సర్వే నివేదికలో, గంజాయి సాగు చేసే మూడు జిల్లాల్లో చరస్ నుండి 'సీబీడీ' నూనెను తీయడానికి, గంజాయి కాండం నుండి వివిధ వస్తువులను తయారు చేయడానికి ఆరు కర్మాగారాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీని ద్వారా 6,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
బహిరంగ మార్కెట్‌లో లీటరు 'సీబీడీ' ఆయిల్ ధర 1250 నుండి 1500 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.95 వేల నుంచి 1 లక్షా 15 వేలు) వరకు ఉండగా, 3.5 కిలోల చరస్ నుంచి ఒక లీటరు సీబీడీ నూనె ఉత్పత్తి అవుతుంది. సీబీడీలో ఉండే మంచి పోషకాల కారణంగా దీనిని 'గ్రీన్ గోల్డ్' అని కూడా పిలుస్తారు.
ప్రస్తుత పంటలో 43% మత్తుపదార్థాలు అంటే 'హెచ్‌టీసీ'చాలా ఎక్కువగా ఉన్నందున గంజాయి విత్తనాలలో మార్పులు తీసుకురావాలని నివేదిక ప్రతిపాదించింది.
ఇప్పుడున్న విత్తనాల నుంచి పెరిగిన గంజాయి మొక్క పొడవు తొమ్మిది నుంచి పది అడుగులు కాగా, ప్రతిపాదిత కొత్త విత్తనాల నుంచి వచ్చే మొక్కల పొడవు 15 నుంచి 16 అడుగుల వరకు ఉంటుంది.
గంజాయితో తయారు చేసిన డ్రగ్స్ వాడకంపై పరిశోధన బాధ్యతలను పెషావర్ యూనివర్సిటీ ఫార్మసీ విభాగానికి, మార్కెటింగ్, బిజినెస్ ప్లాన్‌లను మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగానికి అప్పగించారు.
అదే విధంగా యంత్రాల ఏర్పాటు వల్ల పర్యావరణంపై ప్రభావాన్ని పరిశీలించడాన్ని ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విభాగానికి, భౌగోళిక సమాచారం బాధ్యతను జియాలజీ విభాగానికి, న్యాయపరమైన సమస్యల సమీక్షను లా కాలేజీకి, సామాజిక చైతన్యం కలిగించే బాధ్యతను సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌లకు అప్పగించారు.
అయితే, ఈ సర్వే ఫలితాలను స్మాల్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డు, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డుకు అప్పగించినట్లు ఖైబర్ పఖ్తూంఖ్వా ఎకనమిక్ జోన్ సీఈవో జావెద్ ఇక్బాల్ ఖటక్ చెప్పారు.

గంజాయి సాగు గణాంకాలు
ఖైబర్, ఔరాక్జాయ్, కుర్రంలలో ప్రస్తుతం గంజాయి సాగుకు సంబంధించి ఏ ప్రభుత్వ సంస్థ దగ్గరా అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ ఆధునిక సాంకేతికత, స్థానిక మార్కెట్ డేటా ప్రకారం, మూడు జిల్లాల్లో రెండు వందల చదరపు కిలోమీటర్లు అంటే 49 వేల ఎకరాలలో ఈ పంట పడుతోందని ప్రొఫెసర్ ఫజల్ నాసిర్ అన్నారు.
దీని నుండి సంవత్సరానికి 50 లక్షల కిలోగ్రాముల వరకు చరస్ లభిస్తుంది.

చరస్ ధర ఎందుకు తగ్గింది?
వాడీ తీరా లోయకు చెందిన హాజీ కరీం (70) ప్రస్తుత ఏడాది పంటకు ఇప్పటికే పొలాలను సిద్ధం చేసినప్పటికీ సకాలంలో వర్షాలు కురవకపోవడంతో గంజాయి పంటను ఇంకా వేయలేదు.
రెండెకరాల వ్యవసాయ భూమితో ఏడాదికి రూ.15లక్షల ఆదాయం వచ్చేదని, మార్కెట్‌లో చరస్ ధర కిలో రూ.60 వేల నుంచి రూ.12 వేలకు పతనం కావడంతో పంట ఖర్చు కూడా భరించలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
ఈ ప్రాంతంలో చట్టబద్ధంగా గంజాయి సాగుకు అనుమతి లభించిన తర్వాత ప్రజల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, స్థానిక ప్రజలకు గంజాయి సాగు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు.
ఈ ప్రాంతానికి చెందిన షేర్‌ఖాన్( కల్పిత పేరు)కు చరస్ అక్రమ విక్రయాల వ్యాపారంతో సంబంధం ఉంది. 2018 మే లో గిరిజన ప్రాంతాలను ఖైబర్ ఫక్తుంఖ్వాలో విలీనం చేసిన తర్వాత, వివిధ సంస్థలు, చట్టాల విస్తరణ కారణంగా చరస్ వ్యాపారంలో ఇతర ప్రాంతాలకు రవాణా ఇబ్బందులు, ఖర్చులు పెరిగాయని అన్నారు.
గత కొన్నేళ్లుగా అఫ్గానిస్తాన్ నుంచి బలూచిస్తాన్ మీదుగా పెద్దఎత్తున చరస్‌ను అక్రమంగా రవాణా చేయడంతో, దాని ధర కిలో రూ.70వేల నుంచి రూ.10-12 వేలకు తగ్గిందని, ఇప్పుడు సాగు కూడా కష్టంగానే ఉందని ఈ ప్రాంత రైతులు అంటున్నారు.

'గంజాయి సాగు చట్టబద్ధమైతే రైతుకు మేలు జరుగుతుంది'
భవిష్యత్‌లో ఖైబర్, ఔరాక్జాయ్, కుర్రంలలో చట్టబద్ధంగా సాగుకు ప్రభుత్వం అనుమతి ఇస్తే తమ పరిస్థితి బాగుపడుతుందని రైతులు ఎదురు చూస్తుండగా, దీనిపై అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఔరాక్జాయ్ నివాసి అయిన రైతు ఆబద్ గుల్ 6 ఎకరాల పొలంలో గంజాయి సాగు చేస్తున్నారు. తన పొలంలో గంజాయి ఉత్పత్తితో పాటు స్థానిక రైతుల నుంచి ఏటా రూ.8 నుంచి 10 లక్షల వరకు గంజాయి కొనుగోలు చేసేవాడు.
ఈ ప్రాంతాల్లో గంజాయికి మించిన ఆదాయ సాధనాలు లేవని, ఫ్యాక్టరీల ఏర్పాటు చేసి, గంజాయి నుంచి లభించే వస్తువుల మార్కెటింగ్ తదితర పథకాల్లో స్థానిక రైతులకు, పెట్టుబడిదారులకు అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు.
అయితే, ఒక్కో ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ. 6 నుంచి 8 కోట్ల ఖర్చవుతుందని ప్రొఫెసర్ ఫజల్ నాసిర్ అన్నారు. ప్రైవేట్ రంగంలో స్థానిక పెట్టుబడిదారులు రూ.1 కోటి నుంచి కోటిన్నర రూపాయలతో చిన్న చిన్న ఫ్యాక్టరీలను స్థాపించవచ్చని ఆయన అన్నారు.
గంజాయి నుంచి లభించే రసాయన పదార్థాలను స్థానిక మార్కెట్‌కే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌కు కూడా చేరేలా ఖైబర్ జిల్లాలో 1000 ఎకరాల్లో ఖైబర్ ఎకనామిక్ కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జావేద్ ఇక్బాల్ ఖటక్ తెలియజేశారు.
చట్ట ప్రకారం గంజాయి నుంచి మెటీరియల్ పొందే ప్రక్రియ ప్రారంభిస్తే రైతులకు మంచి ధర లభిస్తుందని, వాడీతీరా, ఔరాక్జాయ్, కుర్రంలో చిన్న యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు రైతులను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు.

చట్టబద్ధమైన గంజాయి సాగు-ఆదాయం
నేషనల్ అసెంబ్లీకి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ గత సంవత్సరం అక్టోబర్‌లో జాతీయ గంజాయి పాలసీని సంవత్సరం చివరి నాటికి ఆమోదించాలని నిర్ణయించింది. కానీ, ఇప్పటి వరకు పురోగతి లేదు.
దీనికి సంబంధించి పరిశోధనల కోసం ఏర్పాటైన బృందం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూడగా అది ఆలస్యమవుతోంది. ఇప్పుడు పంట కాలం ముగిసింది.

గంజాయి నుండి చరస్ ఎలా తీస్తారు?
వాడీతీరా, ఔరాక్జాయ్, కుర్రంలలో మే ప్రారంభంలో గంజాయి సాగును ప్రారంభిస్తే , రెండు మూడు వారాల్లో నాటే ప్రక్రియ పూర్తవుతుంది. మొక్కల పొడవు రెండున్నర అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత ఆకులను తీసేస్తారు. కొన్ని మొక్కలను కూడా తొలగిస్తారు.
రైతులు అంతకు ముందు ఏడాది పండించిన పంట నుంచి తీసిన విత్తనాలు విత్తుతారు. మే, జూన్ నెలల్లో కృత్రిమ ఎరువుల మగ మొక్కలను తొలగిస్తారు. దీనివల్ల పంట దిగుబడి మెరుగ్గా ఉంటుంది.
అక్టోబరు చివరిలో హార్వెస్టింగ్ జరుగుతుంది. చిన్నసైజు మొక్కలను వదిలేసి పెద్ద మొక్కలను సేకరిస్తారు. తర్వాత వర్షాలు, మంచు కురిస్తే చిన్న మొక్కలు మళ్లీ పెరుగుతాయి. సేకరించిన పంట నుంచి చరస్ ను తీసే ప్రక్రియ డిసెంబర్-జనవరి ప్రారంభంలో ప్రారంభమై ఫిబ్రవరి, మార్చి వరకు కొనసాగుతుంది.

ఉపాధి ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న యువత
వాడీతీరా లోయలోని కొంతమంది యువత తక్కువ ఖర్చుతో, అధిక ఆదాయంతో చట్టబద్ధమైన ఉపాధి కోసం చూస్తున్నారు.
ఈ లక్ష్యాన్ని సాధించడానికి, న్యూక్లియర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్- నిఫా- సాంకేతిక సహాయంతో జనవరి 2021లో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఏర్పాటు చేశారు. ఇందులో 30 మందికి పైగా స్థానిక రైతులు పాల్గొన్నారు. వారిలో ఫజల్ రబ్బీ (30) అనే రైతు శిక్షణ తర్వాత తన ఇంట్లో పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు.
దీనితో పాటు, ఆ ప్రాంతంలో పుట్టగొడుగుల ఉత్పత్తిని పెంచడానికి, తీరాలో మష్రూమ్ క్లబ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారాయన. ఇందులో లోయలోని డెబ్బై మందికి పైగా రైతులు సభ్యులు.
వ్యవసాయ భూమిలో పండే గంజాయి పంటకు గతం కంటే తక్కువ ధర రావడంతో ఈ ప్రాంత యువకులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని ఫజల్ రబ్బీ చెబుతున్నారు.
అయితే, గంజాయి సాగు చేసే ప్రక్రియను బలవంతంగా ఆపడం లేదని, సంస్థలు, సైనిక అధికారుల సహాయంతో అటువంటి భూముల్లో కూరగాయలు, పంటలు, పండ్ల తోటలు పండిస్తున్నారని, వీటి ఆదాయం గంజాయి కంటే ఎక్కువగా ఉంటుందని ఖైబర్‌లోని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జియా ఇస్లాం దావద్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అసాని తుపాన్ ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు
- బిట్ కాయిన్ ధర ఆరు నెలల్లో ఎందుకు సగానికి పడిపోయింది... క్రిప్టోవింటర్ అంటే ఏంటి?
- దేశద్రోహం: బ్రిటిష్ కాలం నాటి చట్టం ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటి?
- వీరు కవలలు, కానీ తండ్రులు వేరు, ఎలా సాధ్యం?
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












