ప్రేమను నిరాకరించిన యువతికి బహుమతిగా గంజాయి ప్యాకెట్, ఆ తర్వాత ఏమైందంటే..- ప్రెస్ రివ్యూ

గంజాయి

ఫొటో సోర్స్, REUTERS/CHALINEE THIRASUPA

ఫొటో క్యాప్షన్, గంజాయి మొక్క

ప్రేమను నిరాకరించిన యువతిపై కక్ష సాధించాలని ఆమెకు బహుమతిగా గంజాయి ప్యాకెట్ ఇచ్చి ఓ యువకుడు కటకటాల పాలయ్యాడని సికింద్రాబాద్ జీఆర్పీ వర్గాలు వెల్లడించినట్లు 'ఈనాడు' కథనం పేర్కొంది.

ఆ కథనం ప్రకారం విశాఖపట్నానికి చెందిన వినయ్ కుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తనతో పాటు చదువుకున్న అదే ప్రాంతానికి చెందిన యువతికి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. దీంతో కక్ష తీర్చుకోవాలని కుట్ర పన్నాడు.

ఆమె 2018 మే 31న మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ట్రైన్‌లో సికింద్రాబాద్‌కు బయల్దేరింది. ఈ విషయం తెలుసుకున్న అతను, స్నేహానికి గుర్తుగా గిఫ్ట్ అని నమ్మించి 3 కిలోల గంజాయి ప్యాకెట్ ఆమెకు ఇచ్చాడు. మరుసటి రోజు రైలు సికింద్రాబాద్ చేరుకునే ముందే ఆ యువతి గంజాయి స్మగ్లింగ్ చేస్తోందని జీఆర్పీ వారికి సమాచారమిచ్చాడు.

స్టేషన్‌లో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో గంజాయి ఇచ్చి ఆమెను మోసం చేసినట్లు పోలీసులు విచారణలో నిర్ధారణకొచ్చారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాలతో ఆ యువతిని వదిలిపెట్టారు.

అదేరోజు వినయ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటినుంచి అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. కేసేమీ లేదని, కేవలం సమాచారం కోసం మాట్లాడాల్సి ఉందని జీఆర్పీ అధికారులు పిలిపించగా, గురువారం స్టేషన్‌కు వచ్చాడు.

విచారణలో నేరాన్ని ఒప్పుకున్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఈనాడు పేర్కొంది.

ఇల్లు

'పేదలందరికీ ఇళ్లు' అప్పీలుపై విచారణ 26కి వాయిదా

'పేదలందరికీ ఇళ్ల' పథకం కింద 30 లక్షల మందికిపైగా పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడినట్లు 'సాక్షి' ప్రచురించింది.

ఈ కథనం ప్రకారం.. ఈ అప్పీల్‌తో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్‌ కాపీని జత చేయాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డికి సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ ప్రస్తావించని అంశాలపై కూడా సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చారని నివేదించారు. ఆ అంశాలపై తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు.

పేదలందరికీ ఇళ్ల పథకం వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణ పెండింగ్‌లో ఉందని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చారని ఏఏజీ పేర్కొన్నారు.

సింగిల్‌ జడ్జి తీర్పు వల్ల 30 లక్షల మందికిపైగా ప్రభావితం అవుతున్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ అప్పీల్‌ను పరిశీలించిన ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్‌ కాపీ లేకపోవడాన్ని గమనించింది. దీనిపై ఏఏజీ సుధాకర్‌రెడ్డిని వివరణ కోరింది.

ఈ నెల 8న సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చారని, ఆ మరుసటి రోజే తాము అప్పీల్‌ దాఖలు చేశామని, అప్పటికి తీర్పు సర్టిఫైడ్‌ కాపీ అందుబాటులో లేనందున అప్పీల్‌తో జత చేయలేకపోయామని ఏఏజీ తెలిపినట్లు'' సాక్షి పేర్కొంది.

కవిత

బుర్జ్‌ ఖలీఫాలో బతుకమ్మ.. హాజరు కానున్న కవిత

దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో బతుకమ్మ ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది.

''తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమర్చిన ఎల్‌ఈడీ తెరలపై శనివారం రాత్రి రెండుసార్లు ప్రదర్శిస్తారు.

ఆకాశ హర్మ్యంపై నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొంటారని, ఇప్పటికే కొందరు నాయకులు దుబాయ్‌ చేరుకున్నారని'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

సమంత

ఫొటో సోర్స్, SAMANTHAAKKINENI/FB

సమంత దావాపై వాదనలు పూర్తి

సామాజిక మాధ్యమాల్లో తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్‌ చానళ్లతోపాటు డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుపై సినీ నటి సమంత దాఖలు చేసిన పరువు నష్టం దావాపై కూకట్‌పల్లి కోర్టులో వాదనలు పూర్తయినట్లు 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.

''సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ ప్రసారాలు తన కక్షిదారును అవమానించేలా, ఆమె జీవన హక్కును ఉల్లంఘించేలా ఉన్నాయని సమంత తరఫు న్యాయవాది వాదించారు.

ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా సమంతపై, ఆమె కుటుంబ జీవితంపై తప్పుడు ఆరోపణలు చేసే హక్కు ప్రతివాదులకు లేదని పేర్కొన్నారు.

సమంత పరువుకు భంగం కలిగించేలా తప్పుడు వ్యాఖ్యలు, ప్రసారాలు చేయకుండా ప్రతివాదులను నిలువరించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోర్టును కోరారు.

దీంతో ప్రతివాదులకు నోటీసు ఎందుకు ఇవ్వలేదని న్యాయస్థానం ప్రశ్నించగా.. నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని సమంత తరఫు న్యాయవాది తెలిపారు. కేసును త్వరగా విచారించాలని కోరారు.

దీనిపై కోర్టు స్పందిస్తూ.. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా తమకు ఒక్కటేనని స్పష్టం చేసి, తీర్పును శుక్రవారానికి వాయిదా వేసినట్లు'' నమస్తే తెలంగాణ కథనంలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)