కేరళ: ‘భార్యను చంపేందుకు రక్తపింజరి పాము కొన్నాడు.. అది కాటువేసినా చనిపోలేదని నాగుపాముతో కాటు వేయించి చంపాడు’

సూరజ్ కుమార్, ఉత్రా
ఫొటో క్యాప్షన్, నాగుపాము కాటుతో తన భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు సూరజ్ కుమార్ (మధ్య వ్యక్తి).

నాగుపాముతో కాటు వేయించి, భార్యను చంపినందుకు గానూ ఓ వ్యక్తికి ‘రెండు జీవితఖైదులు' శిక్షను గతవారం విధించారు. ఈ కేసు పూర్వాపరాలను సౌతిక్ బిశ్వాస్, అష్రఫ్ పడన్నా వివరించారు.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన నాగుపాము కోసం, 28 ఏళ్ల సూరజ్ కుమార్, గతేడాది ఏప్రిల్ నెలలో రూ. 7000 చెల్లించారు.

భారత్‌లో పాములతో వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. కాబట్టి పాములను పట్టుకునే కేరళకు చెందిన సురేశ్ కుమార్ నుంచి రహస్యంగా సూరజ్ పామును కొనుగోలు చేశారు.

ప్లాస్టిక్ కంటైనర్‌లో పామును ఉంచి దాన్ని తన ఇంటికి తీసుకెళ్లారు. గాలి ఆడటం కోసం కంటైనర్‌కు ఒక రంధ్రాన్ని చేశారు.

13 రోజుల తర్వాత సూరజ్, పాము ఉన్న కంటైనర్‌ను బ్యాగ్‌లో పెట్టుకొని 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన అత్తవారింటికి వెళ్లారు. అప్పటికే ఒకసారి పాము కాటుకు గురైన ఆయన భార్య ఉత్రా పుట్టింట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

Uthra

మ్యాట్రిమోని బ్రోకర్ ద్వారా రెండేళ్ల క్రితం సూరజ్, ఉత్రా కలిశారు.

సూరజ్ తండ్రి ఆటో రిక్షా డ్రైవర్ కాగా తల్లి గృహిణి. సూరజ్ కన్నా ఉత్రా మూడేళ్లు చిన్నది. వారిది సంపన్న కుటుంబం.

ఆమె తండ్రి రబ్బర్ వ్యాపారి. తల్లి రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపల్. ఉత్రా గతంలో లెర్నింగ్ డిజెబిలిటీస్‌తో బాధపడేవారు.

వివాహం సందర్భంగా సూరజ్‌ 768 గ్రాముల బంగారం, కారుతో పాటు 4 లక్షల రూపాయలు కట్నంగా తీసుకున్నారు. వీటితో పాటు ఉత్రా బాగోగుల కోసం, ఆమె తల్లిదండ్రులు నెలకు రూ. 8000 కూడా చెల్లించేవారని తెలిసింది.

పాముకాటు కారణంగా 52 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఉత్రా, డిశ్చార్జి అయ్యాక పుట్టింటికి వెళ్లారు.

భూమిలో కలిసిపోయే రంగులో ఉండే రక్త పింజరి(రసెల్ వైపర్) పాము ఆమె కాలును కరిచింది. దీంతో ఆమె మూడు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. రసెల్ వైపర్ పాము కారణంగా భారత్‌లో ఏటా వేలాదిమంది మరణిస్తున్నారు.

నాగుపాము

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన నాగుపాముల్లో ఇది కూడా ఒకటి.

సర్జరీల నుంచి కోలుకుంటోన్న ఉత్రాకు మే 6న, సూరజ్ నిద్రమాత్రలు కలిపిన పండ్లరసాన్ని ఇచ్చారు. ఆమె నిద్రలోకి జారుకోగానే కంటైనర్‌లో ఉన్న 5 అడుగుల పామును ఆమెపైకి విసిరేశారు.

కానీ పాము ఆమెను కాటు వేయకుండా పక్కకు వెళ్లిపోయింది. మళ్లీ దాన్ని ఆమెపైకి విసిరివేయగా అది నేలపై పాక్కుంటూ తప్పుకుంది.

సూరజ్ మూడోసారి ప్రయత్నించారు. కానీ ఈసారి ఆయన పామును ఉత్రా ఎడమచేతి దగ్గరగా ఉంచి, దాని తలపై గట్టిగా నొక్కి పట్టుకున్నారు. దీంతో గందరగోళానికి గురైన పాము, రెండుసార్లు ఆమెను కాటు వేసింది. ఆ తర్వాత గదిలోని ఒక షెల్ఫ్‌లో దూరి రాత్రంతా అక్కడే ఉండిపోయింది.

''మనం రెచ్చగొడితే తప్ప నాగుపాములు కరవవు. సూరజ్ దాన్ని గట్టిగా పట్టుకుని బలవంతంగా భార్యను కరిపించారు'' అని హెర్పెటాలజిస్ట్ మావిష్ కుమార్ చెప్పారు.

ఆ తర్వాత సూరజ్ కుమార్ జ్యూస్ గ్లాస్‌ను కడిగి పక్కన పెట్టారు. పామును నియంత్రించడానికి ఉపయోగించిన కర్రను విరగ్గొట్టారు. తన ఫోన్‌లోని కాల్ రికార్డులన్నింటిని తొలగించినట్లు ఈ కేసును పరిశీలించిన వారు చెప్పారు.

మరుసటి రోజు ఉదయం తాను ఉత్రా గదిలోకి వెళ్లానని ఆమె తల్లి మణిమేఖల విజయన్ పోలీసులకు చెప్పారు. ''ఆ సమయంలో నా కూతురు బెడ్‌పై చలనం లేకుండా పడి ఉంది. ఆమె నోరు తెరిచి ఉంది. ఎడమ చేయి కిందకు వేలాడుతోంది'' అని పోలీసులకు ఆమె తల్లి వివరించారు.

సూరజ్ కూడా గదిలోనే ఉన్నాడని ఆమె చెప్పింది.

''ఉత్రా లేచిందా? లేదా? అనే సంగతిని నువ్వెందుకు చూడలేదు?'' అని తన అల్లుడిని మణిమేఖల విజయన్ అడిగారు.

''నిద్ర చెడగొట్టకూడదనే ఉద్దేశంతో నేను ఆమెను లేపలేదు'' అని సూరజ్ ఆమెతో చెప్పారు.

గది

ఫొటో సోర్స్, SREEDHAR LAL

ఫొటో క్యాప్షన్, ఈ గదిలో ఎడమవైపున్న బెడ్‌పైనే పాము కాటు వల్ల ఉత్రా మరణించారు.

వెంటనే వారు ఉత్రాను ఆసుపత్రికి తరలించారు. విషం కారణంగా ఉత్రా మరణించినట్లు ధ్రువీకరించిన వైద్యులు, పోలీసులను పిలిపించారు.

శవపరీక్షలో ఆమె శరీరంపై రెండు జతల పాము కాటు గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. ఎడమచేతిపై అంగుళం కంటే తక్కువ లోతులో ఈ గాయాలైనట్లు తెలిసింది. రక్త నమూనాల్లో మత్తుమందులతో పాటు పాము విషం ఆనవాళ్లు లభించాయి. పాము విషం కారణంగా శ్వాసకండరాలు పక్షవాతానికి గురై గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతారు.

ఉత్రా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, భార్య అనుమానాస్పద మృతి కేసులో మే 24న సూరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 78 రోజుల దర్యాప్తు తర్వాత కేసు విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో ఆయనపై 1000 పైజీలకు పైగా చార్జిషీటు నమోదైంది.

హెర్పెటాలజిస్టులు, డాక్టర్లతో సహా మొత్తం 90 మంది సాక్ష్యాలను తీసుకున్నారు. సూరజ్ ఫోన్ రికార్డులు, ఇంటర్నెట్ హిస్టరీ, ఇంటివెనుక గార్డెన్‌లో పాతిపెట్టిన నాగుపాము, వారి కారులో లభించిన మత్తుపదార్థాల నిల్వలు, సూరజ్ ఒకటి కాదు ఏకంగా రెండు పాములను కొన్నాడని నిరూపించే ఆధారాలతో ప్రాసిక్యూషన్ ఈ కేసును బలపరిచింది.

ఉత్రా చనిపోవడానికి నెలల ముందు ఆమెను కాటేసిన రసెల్ వైపర్ పామును కూడా సూరజ్ కొన్నట్లు దర్యాప్తులో రుజువైంది.

సూరజ్‌కు పాములను అమ్మిన సురేశ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. తన వద్ద సూరజ్ రెండు పాములను కొన్నట్లు చెప్పారు.

ఎత్తుగా ఉన్న కిటికీలో నుంచి నాగుపాము, దంపతుల బెడ్‌రూమ్‌లోకి రావడం చాలా అరుదైన విషయమని ఒక హెర్పెటాలజిస్ట్ కోర్టుకు చెప్పారు.

దీంతో ఆ క్రైమ్ సీన్‌ను పునర్నిర్మించారు. ఇందుకోసం బతికి ఉన్నపాముతో పాటు, పాములను నియంత్రించే వ్యక్తి సహాయాన్ని తీసుకున్నారు. బెడ్‌పై ఒక బొమ్మను ఉంచి సీన్‌ను రీక్రియేట్ చేశారు.

క్లూస్ టీమ్ దర్యాప్తు

ఫొటో సోర్స్, SREEDHAR LAL

ఫొటో క్యాప్షన్, భార్యను చంపేందుకు పామును తీసుకొచ్చిన కంటైనర్‌ను పోలీసులు కనుగొన్నారు.

'రాత్రిళ్లు నాగుపాములు మరీ అంత చురుగ్గా ఉండవు. బొమ్మపై మేం పామును వేసిన ప్రతిసారీ అది పక్కకు వెళ్లిపోయింది. పాకుతూ వెళ్లి గదిలోని ఒక చీకటి మూలకు నక్కింది. మేం దాన్ని కావాలని రెచ్చగొట్టినప్పటికి కూడా అది కరిచేందుకు ప్రయత్నించలేదు'' అని మావిష్ కుమార్ చెప్పారు.

తర్వాత పాము మెడను గట్టిగా పట్టుకొని, బొమ్మ చేతికి కట్టిన చికెన్ ముక్కపై కాటు వేసేలా ప్రేరేపించారు. అప్పుడు పాము కాటు వేయగా... చికెన్ ముక్కపై పడిన గాయాలు, అచ్చం ఉత్రా చేతిపై పడిన గాయాలతో సరితూగేలా ఉన్నాయని ఆయన చెప్పారు.

'' ఇది చాలా పైశాచికత్వంతో కూడిన అమానుషకమైన కేసు'' అని జడ్జి ఎం. మనోజ్ అన్నారు. భార్యను చంపేందుకు ప్రణాళిక రచించడమే కాకుండా, దాన్ని ప్రమాదవశాత్తు పాముకాటు మరణంగా చిత్రీకరించారని వ్యాఖ్యానిస్తూ సూరజ్‌కు జీవితఖైదు విధించారు.

అందరూ అనుకుంటున్నట్లుగా హత్యాయత్నం రెండుసార్లు కాదని, మొత్తం మూడుసార్లు ఇలా జరిగిందని కేసు దర్యాప్తు చేసిన వారు వెల్లడించారు. నాలుగు నెలల కాలంలో 3 సార్లు సూరజ్ తన భార్యను చంపడానికి ప్రయత్నించినట్లు చెప్పారు.

స్థానిక బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేసే సూరజ్, గతేడాది ఫిబ్రవరిలో పాములు పట్టే వ్యక్తి సురేశ్‌ను తొలిసారిగా కలిశారు. అప్పుడే 10 వేలు వెచ్చించి రస్సెల్ వైపర్ పామును కొన్నారు. దాన్ని కంటైనర్‌లో తీసుకెళ్లి షెడ్డూలోని కట్టెలమండ కింద దాచారు.

ఫిబ్రవరి 27న, తన ఇంటి తొలి అంతస్థులో పామును విడిచిపెట్టిన సూరజ్... పైకెళ్లి తన మొబైల్ ఫోన్‌ను తెచ్చివ్వాలని ఉత్రాను అడిగినట్లు దర్యాప్తు చేసినవారు చెప్పారు.

''నేలపై పామును చూసిన ఉత్రా, డేంజర్ అలారమ్ మోగించినట్లు'' పోలీసులతో ఆమె తల్లి చెప్పారు. వెంటనే సూరజ్ వచ్చి, కర్ర సహాయంతో పామును తీసుకొని బయటకు వెళ్లారు. దాన్ని తిరిగి కంటైనర్‌లో భద్రపరిచారు.

మార్చి 2న సూరజ్ మరో ప్రయత్నం చేశారు. ఉత్రా తినే ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చి, ఆమె పడుకున్నాక రస్సెల్ వైపర్‌ను బెడ్‌రూమ్‌లో వదిలిపెట్టారు.

ఉత్రా పుట్టిళ్లు

ఫొటో సోర్స్, SREEDHAR LAL

ఫొటో క్యాప్షన్, కొల్లాం జిల్లాలో ఉన్న ఈ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉత్రా హత్య జరిగింది.

కానీ ఈసారి పాము, ఆమె కాలుపై దాడి చేసింది. వెంటనే మేల్కొన్న ఉత్రా భయంతో కేకలు వేసింది. వెంటనే సూరజ్ పామును కిటికీ నుంచి బయటకు విసిరేశారు.

''కేరళలో పాముకాటు కేసులు చాలా సాధారణం. అందుకే మాకు ఎలాంటి అనుమానం రాలేదు. ఏదో కుట్ర జరిగినట్లు మాకు అనిపించలేదు'' అని ఉత్రా తండ్రి విజయసేనన్ విద్యాధరణ్ చెప్పారు. (భారత్‌లో ప్రతీఏటా పాము కాటు కారణంగా 60,000 మంది చనిపోతున్నారు.)

ఆ రాత్రి, పాముకాటుకు చికిత్స అందించే ఆసుపత్రి దొరకడం కష్టమైంది. రెండు గంటల తర్వాత ఆసుపత్రిలో చేర్చాం. అప్పటికే కాలు వాపు రావడంతో పాటు రక్తస్రావంతో ఉత్రా విలవిల్లాడింది. మూడు 'స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్' సర్జరీల తర్వాత ఆమె కొల్లామ్ జిల్లాలోని వెర్డంట్ గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వచ్చారు. అక్కడ వారు రెండస్థుల భవనంలో నివసిస్తుంటారు.

మరోవైపు సూరజ్, పథనంథిట్టలోని తన ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ ఆయన తల్లిదండ్రులతో పాటు కొడుకు ఉన్నారు. అయినప్పటికీ సూరజ్ భార్యను చంపేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు.

''ఉత్రా ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా, సూరజ్ ఇంటర్నెట్‌లో పాముల గురించి వాటి విషం గురించి వివరాలు సేకరించినట్లు'' ఈ పరిశోధనలో పాల్గొన్న అనూప్ కృష్ణ వెల్లడించారు.

సూరజ్

ఫొటో సోర్స్, SREEDHAR LAL

ఫొటో క్యాప్షన్, భార్యను చంపేందుకు సూరజ్ (ఆకుపచ్చ రంగు టీ షర్టు వ్యక్తి) ఏడాదికి పైగా వ్యూహాలు రచించినట్లు పోలీసులు చెప్పారు.

2019లో ఉత్రా, సూరజ్ దంపతులకు కుమారుడు ధ్రువ్ జన్మించారు. అప్పటినుంచే ఉత్రాను హత్య చేసేందుకు సూరజ్ ప్రణాళికలు రచించారు. ఇంటర్నెట్‌లో పాముల గురించి, వాటి విషం గురించి వెతికేవాడని, యూట్యూట్‌లో పాములకు సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడని ఇంటర్నెట్ హిస్టరీని పరిశీలించగా వెల్లడైంది. స్థానికంగా ఫేమస్ అయిన పాములు పట్టే వ్యక్తికి సంబంధించిన యూట్యూబ్ చానెల్‌ను సూరజ్ అనుసరించేవారు. ఆ యూట్యూబ్ చానెల్‌లో 'అత్యంత ప్రమాదకరమైన రస్సెల్ వైపర్' గురించి ఆయన చేసిన వీడియో ఎక్కువగా పాపులర్ అయింది.

ఉత్రాకు వచ్చే ఒక కల గురించి సూరజ్ తన మిత్రులకు తరచుగా చెబుతుండేవారు. ఆ కలలో ఆమెకు ఒక పాము శాపం పెట్టినట్లు, దాని కాటు ద్వారానే ఆమె మరణిస్తుందని వారితో అంటుండేవారు.

కానీ నిజానికి, తన భార్యను చంపేసి ఆమె డబ్బునంతా కొట్టేయడానికే సూరజ్ ఇలాంటి కథలు సృష్టించాడని ఈ కేసును పరిశోధించినవారు చెబుతున్నారు. ఆయన మరో మహిళను వివాహం చేసుకోవడానికి ఈ పనికి తెగబడినట్లు విచారణలో వెల్లడైంది.

''అనుకున్నట్లుగానే ఆమెను చంపేందుకు పక్కాగా ప్రణాళికలు రచించాడు. మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించాడు'' అని లీడ్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్ అపుకుట్టన్ అశోక్ వెల్లడించారు.

''ఈ కేసు, దేశంలోని పోలీసు దర్యాప్తులో మైలురాయి. హత్య చేయడానికి ఒక జంతువును ఆయుధంగా ఉపయోగించారని ప్రాసిక్యూషన్ వారు పక్కా ఆధారాలతో నిరూపించగలిగారు'' అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్‌రాజ్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు.

ఆయన చేసిన నేరానికి గానూ, సూరజ్‌కు అరుదైన డబుల్ 'జీవిత ఖైదు' శిక్ష పడింది. అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కూడా లేదు అని గోపాలకృష్ణన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)