"నా భార్య నా జీవితంలోకి వచ్చే వరకు కౌగిలింత ఎలా ఉంటుందో కూడా తెలియదు"

కోవిడ్ 19 మహమ్మారి మానవ జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చేసింది.
మీ ఆప్తులను కౌగలించుకుని ఎన్ని రోజులవుతోంది? ఎవరినైనా ప్రేమతో స్పృశించడం, కౌగిలించుకోవడం వలన ఒంటరితనం తగ్గి వ్యక్తి శ్రేయస్సుకి తోడ్పడుతుందని, యూకేలో లాక్ డౌన్ విధించడానికి ముందు నిర్వహించిన 'ది టచ్ టెస్ట్' అనే ఒక అంతర్జాతీయ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయన ఫలితాలను బీబీసీకి చెందిన క్లాడియా హామండ్ పరిశీలించారు.
రాబ్ మోటార్ బైకు ప్రమాదానికి గురయ్యే నాటికి అతనికి 25 సంవత్సరాలు. ప్రమాదానికి గురి కాక ముందు రాబ్ నవ్వుతూ, తుళ్ళుతూ ఉండేవారని రాబ్ తల్లి షారెన్ చెప్పారు. కానీ, బైకు ప్రమాదంలో అతని తలకు గాయం కావడంతో రెండేళ్ల నుంచి అతను రెసిడెన్షియల్ కేర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అతనిని హత్తుకోవడం కూడా అతని చికిత్సలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని షారెన్ చెప్పారు.
"నేను తనతో పాటు కూర్చుని ఏదైనా సినిమా చూపిస్తూ, పాటలు వినిపిస్తూ అతని చిన్నప్పటి రోజుల్లోలా తన ముఖాన్ని తడమడం, చేతులు కదపడం, పాదాలు, కాళ్ళు మర్దనా చేయడం, ముద్దు పెట్టుకోవడం, గట్టిగా హత్తుకోవడం లాంటివి చేసేదానిని" అని వివరించారు.
కోవిడ్ మహమ్మారి తలెత్తినప్పటి నుంచి పీపీఈ కిట్ ధరించి రోజుకు కేవలం మూడు సార్లు మాత్రమే రాబ్ ని తాకగలుగుతున్నట్లు ఆమె చెప్పారు. ఇప్పుడు ఇంట్లో కూడా ఒకరికి కోవిడ్ పాజిటివ్ రావడంతో అది కూడా చేయలేకపోతున్నట్లు చెప్పారు.
"నేను రాబ్ ని తాకకుండా, హత్తుకోకుండా, ముద్దు పెట్టలేకుండా ఉండటం నరకాన్ని తలపిస్తోంది. నేను రాబ్ ని కేవలం ఫోనులో, ఫోటోలలో మాత్రమే చూడగల్గుతున్నాను" అని ఆమె అన్నారు.
హాస్పిటళ్లల్లో, రక్షణ గృహాలలో చికిత్స తీసుకుంటున్న రోగులను బంధువులెవరూ తాకలేకపోవడం వారిని చాలా బాధకు గురి చేస్తోంది.
మానవ స్పర్శ, హత్తుకోవడం లాంటి విషయాల ప్రాముఖ్యతను కోవిడ్ వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంతగా గుర్తించడం మొదలు పెట్టాం.

ఫొటో సోర్స్, Family photo
చాలా మంది తమ తల్లి తండ్రులను, స్నేహితులను కౌగలించుకుని 6 నెలలు పైనే అయ్యిందని చెబుతున్నారు. ముద్దు పెట్టుకోవడం, గుడ్ బై చెప్పే తీరు పూర్తిగా మారిపోయాయి.
కౌగిలింత, హత్తుకోవడం వలన కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను పొందేందుకు లండన్‌లో ఒక ఫ్లాట్ లో కలిసి నివసించే ఇద్దరు వ్యక్తులు ప్రతి రోజు సాయంత్రం ఒక 25 సెకండ్ల పాటు కౌగలించుకోవాలని నిర్ణయించుకున్నారు. లాక్ డౌన్ లో ఎవరినీ కలుసుకుని తాకలేనందుకు ప్రత్యామ్న్యాయంగా వారిద్దరూ ఈ పద్దతిని ఎంచుకున్నారు.
ఒక కౌగిలింత ద్వారా ఇచ్చే సందేశాన్ని మాటలతో కూడా తెలియచేయవచ్చని అంటారు. కానీ, ఇది చాలా కష్టమైన పనని తెలిసింది.
"నేను నా స్నేహితురాలి తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తనతో పాటు వెళ్ళాను. శవ పేటికను మా కళ్ళ ముందే పైకి లేపుతూ ఉండగా నేను తన పక్కనే నిలబడి ఉన్నాను. నా స్నేహితురాలి చేయి గట్టిగా పట్టుకుని ఆమెకు ఓదార్పు ఇవ్వాలని బలంగా అనిపించింది. కానీ ఆ పని చేయలేకపోయాను" అని క్లాడియా అన్నారు.
"ఇలా జరగడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది చాలా కష్టంగా ఉండి ఉండవచ్చు. ఆయన ఎంతో స్నేహ శీలి, దయార్ద్ర హృదయం ఉన్నవారు. ఇప్పుడు నీకు ఆయన మరణం ఎంత లోటో నేను ఊహించలేక పోతున్నాను. నీకు మేమంతా ఉన్నాం. నువ్వు ఈ దుఃఖం నుంచి కోలుకుంటావు’’.. ఇలా నేను మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క స్పర్శ ఇచ్చి ఉండేది".
కొన్ని భావాలను స్పర్శ మాత్రమే పలికించగలదు. దానికి దూరం కావడం చాలా బాధాకరమైన విషయం.
ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి.

స్పర్శ అన్ని భావాలలో కెల్లా ప్రాధమిక భావమని మ్యూనిచ్ లుడ్విగ్ మాక్స్మిలియన్స్ యూనివర్సిటీ కి చెందిన ఒఫీలియా డెరోయ్ అంటారు.
తోటి వారితో అనుబంధం ఏర్పర్చుకోవడానికి స్పర్శ అనేక విధాలుగా పని చేస్తుందని ఆమె అన్నారు.
"ఇది ఒకరికి భరోసా ఇవ్వవచ్చు, వారి దృష్టిని మరల్చవచ్చు. ప్రేమ, స్నేహం, ఆప్యాయతను వ్యక్తపరచడానికి ఇది అత్యుత్తమమైన సాధనం" అని ఆమె అన్నారు.
లండన్ గోల్డ్ స్మిత్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మైకేల్ బానిస్సి ఆధ్వర్యంలో టచ్ టెస్ట్ అధ్యయనాన్ని కొంత మంది మానసిక శాస్త్రవేత్తలు ఆన్ లైన్ లో నిర్వహించారు. ఈ అధ్యయనాన్ని చేయమని వెల్కమ్ కొలాబరేషన్, బీబీసీ సంయుక్తంగా కోరాయి.
జనవరి 2020 నుంచి మార్చి 2020 వరకు రెండు నెలల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో 112 దేశాల నుంచి సుమారు 40000 మంది పాల్గొన్నారు. ఈ టచ్ టెస్ట్ లో హత్తుకోవడం, తాకడం వలన వ్యక్తుల శ్రేయస్సుకి తోడ్పడి ఒంటరితనం తగ్గుతుందని వెల్లడించింది.

జాన్ మారియట్‌కి 80 సంవత్సరాలు. ఆయన ఆరు నెలలున్నప్పుడే అతని తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో అతని తాత మామ్మల దగ్గర పెరిగారు. కానీ, ఆయన బాల్యంలో ఆయనకు ప్రేమతో కూడిన స్పర్శ కరువయింది.
"మా తాత మామ్మలు నన్ను ప్రేమించారు. కానీ, వాళ్లెప్పుడూ నన్ను హత్తుకున్నట్లు గుర్తు లేదు" అని ఆయన అన్నారు. వాళ్ళు బాగా పాత కాలం వారు కావడంతో పిల్లలను హత్తుకోవడం వారు నమ్మిన విక్టోరియా కాలం నాటి విలువలకు వ్యతిరేకంగా భావించేవారు.
"పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు చాలా మంది తల్లులు వారిని కౌగలించుకునేవారు. నా విషయంలో అది కరువయింది. అసలు కౌగిలించుకోవడం ఎలా ఉంటుందో నా భార్యను కలిసేవరకు నాకు తెలియదు" అని ఆయన అన్నారు.
ఒక కౌగలింతకు ఎంత శక్తి ఉందో నా భార్య వచ్చిన తర్వాతే అర్ధమవ్వడం ప్రారంభమయిందని ఆయన చెప్పారు.
"నాకు పిల్లలు పుట్టినప్పుడు నా ఇద్దరి కూతుర్లను కౌగలించుకున్నప్పుడు నాకు కలిగిన ఆనందానుభూతిని వర్ణించలేను" అని ఆయన చెప్పారు.
"ఇప్పుడు నా మనుమలను, ముని మనుమరాళ్ళను హత్తుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ వెల్లువలా వస్తాయి" అని ఆయన గుర్తు చేసుకున్నారు.
అయితే, ఈ టచ్ టెస్ట్‌లో పాల్గొన్న వారిలో 72 శాతం మంది స్పర్శ ఇచ్చే లాభాల పట్ల సానుకూలంగా స్పందిస్తే 27 శాతం మంది మాత్రం ప్రతికూలంగా స్పందించారు.
దీనిని బట్టి కౌగిలింత, హత్తుకోవడాన్ని అందరూ ఒకేలా చూడరని అర్ధం అవుతోంది. అలాగే స్పర్శ వలన అందరికీ శ్రేయస్సు కలుగుతుందని కూడా చెప్పలేం. ఈ అధ్యయనాన్ని పరిశీలించినప్పుడు, స్పర్శ పట్ల సానుకూలంగా స్పందించినవారి వ్యక్తిత్వాలలో కొత్త అనుభూతుల ఆస్వాదన పట్ల అంగీకార భావం,బయటకు తమ భావాలను వ్యక్తపరుచుకోవడం పట్ల ఇష్టం కనపడ్డాయి.
స్పర్శ అంటే ఇష్టం లేని వారిలో నమ్మకమైన బంధాలను ఏర్పర్చుకోవడం కష్టం అని భావించిన వారు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








