సైబర్ నేరాలు: అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తే శిక్షేమిటి.. ఎవరికి ఫిర్యాదు చేయాలి

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుశీలా సింగ్‌
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌

‘‘అతను స్కూల్లో నా బాయ్‌ఫ్రెండ్‌. నేనతనికి బ్రేకప్‌ చెప్పినప్పటి నుంచి నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లను చూపించి నన్ను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. నా ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని చెప్పేవాడు. నా ఫోటోలతో పోస్టర్లు తయారు చేసి నేను ఉండే వీధిలో అంటిస్తానని బెదిరించేవాడు’’

‘‘అతను నా పేరుతో ఫేస్‌బుక్‌ ఫేక్ ఖాతాలు సృష్టించి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేవాడు. నేను అప్పట్లో పదో తరగతి చదువుతున్నాను. నేను చాలా భయపడిపోయాను. ఆ సమయంలో నాలో సిగ్గు, బాధ, భయం, తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్‌ కలిగేవి’’

‘‘ఇదంతా నేను చేసిన తప్పే అనిపించేది. అతన్ని ఎందుకు ప్రేమించాలి ? ఎందుకు బాయ్‌ఫ్రెండ్‌ను చేసుకోవాలి ? అతనిని గురించి ఆలోచిస్తే చాలా బాధనిపిస్తుంది. నేను నా స్వచ్ఛతను కోల్పోయినట్లు భావించేదాన్ని. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉండేదాన్ని. మానసికంగా కుంగిపోయాను. చనిపోవాలని కూడా అనిపించింది. ఇలా మూడేళ్లపాటు బాధ అనుభవించాను’’

ఇదంతా చెన్నైకి చెందిన సబరితా కథ. ఈ ఘటనల తర్వాత సబరితా తన బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ 11, 12 తరగతులు చదువుకున్నారు.

ఆమెకు స్పోర్ట్స్‌డ్రెస్సులంటే చాలా ఇష్టం. పదో తరగతిలో ఆమెకు సరిగా మార్కులు రాలేదు. దానిని అధిగమించడానికి ఆమె చాలా కష్టపడి చదివారు. 12వ తరగతిలో మంచి మార్కులు సాధించారు.

సింబాలిక్ ఇమేజ్

ఫొటో సోర్స్, Sabaritha

ఆ అబ్బాయి వెంటాడాడు

‘‘కాలేజీలో ఫస్టియర్‌ చదువుతున్నప్పుడు ఈ విషయాన్ని కజిన్స్‌తో షేర్‌ చేసుకున్నాను. వారు నాన్నకు చెప్పారు. ఆయన లాయర్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయంచుకున్నార’’ని సబరితా చెప్పారు.

"నేను పోలీసుల ప్రశ్నలను ఎదుర్కోలేకపోయాను. అవి చాలా దారుణంగా ఉన్నాయి. నా బంధువులు, పోలీసులు ఈ వ్యవహారంలో నాదే పొరపాటు అన్నట్లు భావించడం మొదలుపెట్టారు. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇలా ప్రవర్తించకూడదు అనడం ప్రారంభించారు.

ఇదంతా చూశాక, నేను అతనిపై ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అతనికి కాల్‌ చేసి, నీ మీద కేసు పెట్టడంలేదని చెప్పాను. అలా చెబితే అయినా నన్ను వేధించడం ఆపేస్తాడని అనుకున్నాను. కానీ అతను అలా చేయలేదు’’ అని సబరితా వివరించారు.

"దీని తర్వాత నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నాను. అపరాధ భావన నుంచి బయటపడ్డాను. నా పరువు పోలేదని, తన వల్ల ఎలాంటి హాని జరగదని నాకు నేను చెప్పుకొన్నాను. నా విషయంలో ఎవరైనా పొరపాటు చేస్తే అది వాళ్ల తప్పవుతుంది తప్ప నాది కాదని నన్ను నేను సముదాయించుకున్నాను’’ అన్నారు సబరితా.

సబరితాకు ఇప్పుడు 24 ఏళ్లు. నాలుగేళ్ల వయసులో సబరితా తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి చనిపోయిన కొన్నాళ్లకు తండ్రి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఆమె తన వదినతో కలిసి ఉండటం మొదలుపెట్టారు.

చిన్నప్పటి నుంచీ తాను ఇలాంటి ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు సబరితా. స్కూల్‌ రోజుల్లో జరిగిన మరో సంఘటనను ఆమె వెల్లడించారు. తన క్లాసే చదువుతున్న అబ్బాయి ఒక అసభ్యకరమైన మెసేజ్ పంపాడని, అసలు దాని అర్ధమేమిటో కూడా తనకు తెలియదని సబరితా చెప్పారు. అతను ఈ మెసేజ్‌ను ఎందుకు పంపించాడా అని ఆమె చాలా ఆలోచించారట.

“ఇలా వేధించేవాళ్లు మహిళల ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తామని భయపెడతారు. దీంతో వాళ్లు సిగ్గు, అపరాధ భావనతో కుంగిపోతారు. సమాజం కూడా స్త్రీ దేహానికి పరువు, గౌరవం అనే పదాలను జత చేస్తుంది. ఒకసారి వేధింపులకు గురైన వాళ్లు జీవితకాలం బాధ పడుతూనే ఉంటారు. ఇలాంటి అవమానాలకు గురైన వాళ్లు ఇతరులతో కలిసిమెలిసి ఉండలేరు. ఈ గొలుసును విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాను’’ అన్నారు సబరితా.

న్యాయవాది సోనాలి కర్వాసర

ఫొటో సోర్స్, SONALI KARWASRA/FACEBOOK

ఫొటో క్యాప్షన్, న్యాయవాది సోనాలి కర్వాసర

సెమీన్యూడ్‌పై అవగాహన

సైబర్‌ జోన్‌లో చిక్కుకున్న తన ఇబ్బందుల నుంచి బయటపడాలని సబరితా కోరుకున్నారు. ఇలాంటి నేరాలకు బాధితులైన వాళ్లను గుర్తించి వారితో మాట్లాడారు. చాలామంది మహిళలు ఈ విషయంలో చాలా బాధలు అనుభవించినట్లు గుర్తించారామె. ఈ విషయంలో తాను ఒంటరిదాన్ని కాదని ఆమెకు అప్పుడు అర్ధమైంది.

‘ఇన్‌ఫెక్టెడ్‌ నెట్‌’ పేరుతో ఒక ఫోటో షూట్‌ సిరీస్‌ను మొదలుపెట్టారు సబరితా. ఇందులో ఆమె తన సెమీ న్యూడ్‌ ఫోటోలను పోస్ట్‌ చేయడం ప్రారంభించారు.

“ఇలాంటి సైబర్‌ నేరాలబారిన పడినవారు ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలని నేను కోరుకుంటున్నాను. మనల్ని అవమానించేవారు స్వచ్ఛత అంటే శరీరం అని భావిస్తుంటారు. వాళ్లు మనల్ని అవమానిస్తే మన స్వచ్ఛత పోయినట్లు ప్రచారం చేస్తుంటారు. అందుకే నేను నా ప్రచారం ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నా శరీరం మీద ఎవరో దాడి చేస్తే నా స్వచ్ఛతకు ఎందుకు భంగం కలుగుతుంది ? ఈ విషయంలో దాడి చేసినవారు అవమానపడాలా లేక బాధితులు అవమానంగా భావించాలా ? అని నేను ప్రశ్నించదలుచుకున్నాను’’ అన్నారు సబరితా.

“నేను నా శరీరాన్నే ఆయుధంగా ఉపయోగించదలుచుకున్నాను. ఈ శరీరం కేవలం శరీరం. సంస్కృతి, నియమాల పేరుతో దీన్ని స్వచ్ఛతకు కొలమానంగా భావించడం సరికాదు’’ అంటారు సబరితా.

ఆమె చేస్తున్న కృషిని ప్రసిద్ధ చిత్రనిర్మాతలు, కవులు. సృజనాత్మక కళాకారులు మెచ్చుకున్నారు. మహిళలు కూడా ధైర్యంగా ముందుకు రావాలని అంటున్నారు సబరితా.

తనతోపాటు పలువురు బాధిత మహిళల అనుభవాల నుంచి ఈ నేరాలపై సమాజానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సబరితా. అయితే ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతుల పట్ల చట్టాలు ఎలా వ్యవహరిస్తున్నాయన్నది కూడా ముఖ్యమే.

సెమీ న్యూడ్ పై అవగాహన కల్పిస్తున్న సబరితా

ఫొటో సోర్స్, Sabaritha

ఫొటో క్యాప్షన్, సెమీ న్యూడ్ పై అవగాహన కల్పిస్తున్న సబరితా

చట్టం ఏం చెబుతోంది?

ఇంటర్నెట్‌, ఫోన్, కంప్యూటర్‌లను ఉపయోగించి నేరాలు జరిగినప్పుడు వాటిని సైబర్‌ నేరాలంటారు.

“ఇటువంటి కేసులు మహిళల గౌరవంతో ముడిపడి ఉంటాయి. ఫోన్‌ లేదా కంప్యూటర్‌ సహాయంతో అసభ్యకరంగా దాడి చేయడం వల్ల మహిళల గౌరవానికి భంగం కలుగుతుంది. దీనికి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 354, సెక్షన్‌ 292(ఎ)ల కింద శిక్షలు విధించవచ్చు’’ అన్నారు న్యాయవాది సోనాలీ కర్వాసర.

ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఒక మహిళపై దాడి చేసినా, ఆమె పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినా అది నేరం కిందికి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో అపరాధికి కనీసం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు శిక్ష, జరిమానా విధించేలా చట్టాలు ఉన్నాయి.

సెక్షన్ 509 ప్రకారం ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించినా, ఆమె గోప్యతకు నష్టం కలిగించే ఉద్దేశంతో ఏదైనా పదం, సంజ్ఞ, ధ్వని లేదా ఏదైనా వస్తువుల చూపినా అది నేరమే. దీనికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా జరిమానా లేదంటే రెండూ విధించవచ్చు.

ఈ ఆన్‌లైన్‌ నేరగాళ్ల నుంచి రక్షణ కోసం హోంశాఖ జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. పిల్లలు, మహిళలు తమపై జరుగుతున్న సైబర్‌ దాడులను, వేధింపులను ఈ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం 2018లో మహిళలపై సైబర్ నేరాలు కర్ణాటక (1374), మహారాష్ట్ర (1262), అసోం (670), ఉత్తర్‌ప్రదేశ్ (340)లలో ఎక్కువగా నమోదయ్యాయి.

అమ్మాయిల ఫోటోలను దుర్వినియోగం చేయడం అనేక విధాలుగా జరుగుతుందని అంటున్నారు న్యాయవాది పునీత్‌ భాసిన్‌.

ఉదాహరణకు సోషల్‌ మీడియాలో ఇంకొకరి పేరు, ఫోటోలను ఉపయోగించి నకిలీ ఎకౌంట్‌ను, ఐడీని తయారు చేయడం ద్వారా దుండగులు ఇతరులతో మాట్లాడతారు. అందులో అసభ్యకరమైన రాతలు, ఫోటోల ద్వారా సదరు మహిళ పరువుకు భంగం కలిగించవచ్చు.

లాయర్ పునీత్ భాసిన్
ఫొటో క్యాప్షన్, లాయర్ పునీత్ భాసిన్

రివెంజ్‌ పోర్న్‌ కూడా ఇందులో భాగమే. కొందరు తమ భాగస్వామితో ఏకాంతంలో తీసుకున్న ఫోటోలను దుర్వినియోగం చేస్తారు. వేధింపులకు పాల్పడతారు.

ముఖ్యంగా విడాకుల కేసుల్లో వీటిని తమ ప్రయోజనాల కోసం పురుషులు వాడుకుంటుంటారు.

ఇలాంటి పనులతో కేసును త్వరగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కేసులన్నీ సైబర్‌ నేరాల కిందికే వస్తాయి.

ఐపీసీ సెక్షన్‌ 292 ప్రకారం సైబర్‌ స్పేస్‌ను అశ్లీల ఫోటోలను ప్రసారం చేయడానికి వాడుకుంటే రెండేళ్ల వరకు శిక్ష, లేదా రూ.2000 జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఐటీ చట్టం-2000 ప్రకారం అనేక విభాగాలలో ప్రత్యేక శిక్షలు విధించే అవకాశం కూడా ఉంది.

అదే విధంగా సైబర్‌ స్టాకింగ్‌ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరొక వ్యక్తిని పదేపదే వేధించడం, ప్రత్యేక మాల్‌వేర్‌లను ఉపయోగించి అవతలి వ్యక్తులను అనుసరించడం కూడా నేరమే. దీని ద్వారా అమ్మాయిలను భయపెడతారు. ఆందోళనలో పడిన అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఇటువంటి సందర్భాల్లో ఐపీసీ సెక్షన్ 354 (డి) కింద శిక్ష విధించే అవకాశం ఉంది.

చాలా సందర్భాల్లో మహిళలు ఫిర్యాదు చేయడానికి భయపడతారని న్యాయవాది పునీత్‌ భాసిన్‌ అంటున్నారు. రివెంజ్‌ పోర్న్‌ కేసుల్లో పోలీసులకు వారి చిత్రాలను చూపాల్సి ఉంటుంది. దానివల్ల తన పరువుకు భంగం కలుగుతుందని మహిళలు భావిస్తారు.

అలాగే సైబర్‌ స్టాకింగ్‌ విషయంలో కూడా ఫిర్యాదు చేయడానికి మహిళలు భయపడతారు. అయితే మహిళలు ఈ విషయంలో మహిళలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, చట్టాలు క్రైమ్‌ ఓవర్‌ మనీ కన్నా క్రైమ్‌ టు బాడీని సీరియస్‌గా తీసుకుంటాయని న్యాయవాది భాసిన్‌ అన్నారు.

అందుకే అమ్మాయిలెవరైనా తమకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆమె సూచిస్తున్నారు. ఈ ఫిర్యాదులన్నీ సైబర్‌ సెల్‌కు వెళతాయని, అలాంటి కేసులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని పునీత్‌ భాసిన్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)