కరోనావైరస్: ఇండియాలో ఆన్‌లైన్ మోసాలు 600 శాతం పెరిగాయి.. ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోండి.. మీరు మోసపోకుండా జాగ్రత్తపడండి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిధి రాయ్
- హోదా, బీబీసీ న్యూస్, ముంబయి
కరోనావైరస్ లాక్‌డౌన్ వల్ల దెబ్బతిన్న వారికి సాయం చేయటానికి ప్రయత్నిస్తున్న చాలా మంది ఇంటర్నెట్ మోసాలకు గురయ్యారు.
భారతదేశంలో కరోనావైరస్ లాక్‌డౌన్ మార్చి 25న మొదలైంది. ఇది దేశంలో భారీ కల్లోలం సృష్టించింది. షాపులు, దుకాణాలు మూతపడ్డాయి. కూలీలు గ్రామాల్లోని తమ ఇళ్లకు వెళ్లారు.
కానీ కొంత మంది పని చేస్తూనే ఉన్నారు. నెటిజన్లకు గాలం వేసి డబ్బులు దండుకోవటానికి, నకిలీ సేవా సంస్థలకు విరాళాలు ఇచ్చేలా చేయటానికి, హ్యాండ్ శానిటైజర్ వంటి కొరత ఉన్న వస్తువులను నమ్మలేని ధరలకు అమ్మజూపుతూ వాటిని క్లిక్ చేయించటానికి ప్రణాళికలు పన్నుతున్నారు.
ఇటువంటి ఆన్‌లైన్ ఆఫర్ల గురించి పోలసులు, వినయోగదారుల సంస్థలు చాలా హెచ్చరికలు జారీచేశాయి. కానీ.. అత్యంత సాధారణమైన కొన్ని ఉదంతాలను చూస్తే.. ఇటువంటి ఒత్తిడిలో జనాన్ని మోసం చేస్తున్న తీరు నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు.
సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ ప్రపంచ సంఘటనలను వలలుగా వాడుకుంటారని నిపుణులు చెప్తారు. కానీ కరోనావైరస్ విషయంలో ఈ దాడుల తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉంది.
‘‘ఈ దాడుల తీవ్రత, మాల్వేర్ సంఖ్య, సృజనాత్మకత స్థాయి, ఏమాత్రం సానుభూతి లేకపోవటం.. ఇవన్నీ ఆందోళన కలిగిస్తున్నాయి. నకిలీ వ్యాక్సిన్లు, బోగస్ చికిత్సలను వ్యాప్తిచేయటం మనుషుల జీవితాల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపగలవు. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయటం కూడా సమాజపు ఐక్యతను దెబ్బతీయగలదు’’ అని సైబర్ దాడుల విశ్లేషణ సంస్థ సైఫర్మా వ్యవస్థాపకుడు కుమార్ రితేష్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వచ్ఛంద సంస్థలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయం కింద ఏర్పాటు చేసిన కరోనావైరస్ సహాయ నిధికి డబ్బులు పంపించాలని తాను ప్రయత్నిస్తున్న క్రమంలో.. ఒక బూటకపు మొబైల్ పేమెంట్ అడ్రస్ వల్ల తాను మోసపోయానని ఒక బాధితురాలు తెలిపారు. ఆమె తన పేరు వెల్లడించటానికి ఇష్టపడలేదు.
ఆ విరాళం పంపించిన ఆన్‌లైన్ అడ్రస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో - pmcares@sbi అనే బ్యాంకు ఖాతాకు లింకై ఉంది.
ఈ కుంభకోణాల విస్ఫోటనంలో ఒకే రకమైన ఖాతా వివరాలు – లేదంటే విశ్వసనీయంగా కనిపించే ఖాతా వివరాలు జనానికి అందాయి. అందులో.. pmcares@pnb, pmcares@hdfcbank, pmcare@yesbank, pmcare@ybl, pmcares@icici వంటివి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోలీసులు.. ప్రజలను హెచ్చరిస్తూ సూచనలు జారీచేశారు.
ఇక వివిధ రకాల రుణాల తిరిగి చెల్లింపుల మీద ప్రభుత్వం విధించిన మూడు నెలల మారటోరియంను కూడా మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు.
మారటోరియం విషయంలో సాయం చేస్తామంటూ అందుకు అవసరమైన వివరాలు ఇవ్వాలంటూ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన గోప్యమైన వివారాలను తెలుసుకుని నిధులు కొల్లగొట్టారని పీటీఐ చెప్తోంది.
ఈ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకులు ట్విటర్ వేదికగా సూచనలు ఇచ్చాయి.

ఫొటో సోర్స్, Proffpoint
మాల్‌వేర్‌తో వివరాల తస్కరణ...
కరోనావైరస్ భయాన్ని తమ ప్రయోజనాలకు వాడుకోవటానికి సైబర్ నేరగాళ్లు ప్రతి అవకాశాన్నీ వాడుకున్నారు. ఈమెయిల్స్, ఎస్ఎంఎస్‌లు, ఫోన్ కాల్స్, మాల్వేర్‌లు వాడుకుని.. మోసాన్ని తేలికగా గుర్తించగలమని నమ్మేవాళ్లని కూడా బుట్టలో పడేశారు.
ఒక స్కామ్ అయితే ఏకంగా ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచే వచ్చినట్లు కనిపిస్తోందని ఐబీఎం సైబర్ సెక్యూరిటీ సంస్థ ఒకటి గుర్తించింది.
‘‘ఆ ఈమెయిల్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ ఘేబ్రియేసస్ నుంచి నేరుగా వచ్చినట్లు కనిపిస్తోంది. ఆ ఈమెయిల్ అటాచ్‌మెంట్‌లో ఒక మాల్వేర్ ఉంది’’ అని వినియోగదారుల కన్సల్టెంగ్ సంస్థ గార్టనర్‌కు చెందిన ప్రధాన విశ్లేషకురాలు రాజ్‌ప్రీత్ కౌర్ చెప్పారు.
మాల్వేర్ తాను చొరబడిన డివైజ్ సక్రమంగా పనిచేయకుండా చేస్తుంది. సమాచారాన్ని తస్కరించటానికి దానిని వాడతారు.
మీ డివైజ్‌లోకి మాల్వేర్ చొరబడినట్లయితే అది వేగంగా పాడైపోయే అవకాశముంది. ఆ డివైజ్ క్రాష్ కావటమో, రీబూట్ కావటమో, నెమ్మదిగా పనిచేయటమో జరగొచ్చు.
ఇటువంటి ఈమెయిల్, మెసేజ్‌ల విషయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని.. ఎందుకంటే అవి మీ కంప్యూటర్లే లేదా మొబైల్ ఫోన్ల నుంచి కీలక సమాచారాన్ని దొంగిలించవచ్చునని ఎనలిటిక్ వేదిక డీఎన్ఐఎఫ్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
హ్యాకింగ్ దాడులూ పెరిగాయి...
‘‘ఫ్రీ కరోనావైరస్ చెక్’ అనో ‘రూ. 999 కే ఫుల్ బాడీ చెకప్’ అంటూనో ఈమెయిల్ లేదా వాట్సాప్ మెసేజ్‌లో పంపే అటాచ్‌మెంట్‌లో మాల్వేర్ ఎంబెడ్ అయి ఉంటుంది. ఇవిగాకుండా బాధితుల నుంచి కీలక సమాచారం కొట్టేయటానికి కరోనావైరస్ ట్రాకర్ మ్యాప్‌లను కూడా హ్యాకర్లు ఉపయోగిస్తున్నారు’’ అని డీఎన్ఐఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షోమిరాన్ దాస్ గుప్తా చెప్పారు.
నకిలీ ఈమెయిళ్లు లేదా ఆన్‌లైన్ చాట్ల ద్వారా పంపే మోసపూరిత లింకుల వరదతో పాటు.. డివైజ్‌లను హ్యాక్ చేయటం ద్వారా సమాచారం కొల్లగొట్టటానికి హ్యాకర్లు దాడులు చేయటం.. ఫిబ్రవరి ఆరంభం నుంచి 30 శాతం పెరిగాయని భారతదేశానికి చెందిన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ సంస్థ కె7 సెక్యూరిటీ ల్యాబ్స్ తెలిపింది.
ఈ మహమ్మారి సంక్షోభ సమయంలో ఎస్ఎంఎస్ ఫిషింగ్ విపరీతంగా పెరిగిందని.. దేశం నుంచే పుట్టుకొచ్చి భారతదేశ పౌరులనే లక్ష్యంగా చేసుకుని మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్‌లైన్ మెసేజ్‌లు పంపుతున్నారని కె7 తన వెబ్‌సైట్‌లో వివరించింది.
అమెరికాకు చెందిన బరాకుడా నెట్‌వర్క్స్ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి చివరి నుంచి ఫిషింగ్ 600 శాతం పెరిగింది.
ప్రభుత్వం నుంచి పన్ను వాపసు అంటూ చెప్తున్న నకిలీ లింక్ అటువంటి మోసాల్లో ఒకటని.. నిజానికది బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలుసుకునేందుకు వేసిన వల అని కె7 తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మద్యం ఇంటికి పంపిస్తామంటూ...
ఇక వారాల తరబడి ఇంట్లో ఉండటం వల్ల కొన్ని రకాల వస్తువుల కోసం తహతహలాడే పరిస్థితి రావచ్చు. అటువంటి వాటిలో ప్రభుత్వం విక్రయించే మద్యం ఒకటి.
భారతదేశంలో ‘నిత్యావసరం కానివి’గా పరిగణించే వస్తువులను కూడా మోసగాళ్లు తమ పన్నాగాల్లో వాడుకున్నారు. ఎందుకంటే చాలా మంది వాటిని కూడా నిత్యావసరాలుగా భావిస్తారని వీరికి తెలుసు.
లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాలను మూసివేశారు. చాలా రాష్ట్రాలు, నగరాల్లో మద్యాన్ని చట్టబద్ధంగా బయట విక్రయించే దుకాణాలు ఇవే.
మో ఆరంభంలో ఈ దుకాణాలను తరవటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ జనం పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో సామాజిక దూరం గురించిన ఆందోళనలు తలెత్తాయి.
ఈ పరిస్థితుల్లోకొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రాంతాల్లో మళ్లీ మద్యం దుకాణాలను మూసివేశాయని వార్తా కథనాలు వచ్చాయి.
ఇది.. కరోనావైరస్‌ను అడ్డుపెట్టుకుని మరో మోసానికి పాల్పడటానికి ఇంకో అవకాశం ఇచ్చింది. మీరు కోరుకున్న మద్యాన్ని మీ ఇంటికి డెలివరీ చేస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు వచ్చాయి.
మద్యం కొనుగోలు చేస్తూ.. జాతీయ ఆన్‌లైన్ చెల్లింపుల సర్వీస్ అయిన యూపీఐ ద్వారా ముందుగా చెల్లింపులు చేయాలని మోసగాళ్లు ఆ మెసేజ్‌లలో నిర్దేశించారు.
అలా చెల్లించిన తర్వాత సదరు మొబైల్ నంబర్ స్విచాఫ్ అయిపోతుంది. వస్తుందనుకున్న మద్యం ఎన్నటికీ రాదు.

ఫొటో సోర్స్, Getty Images
నమ్మశక్యం కాని ఆఫర్లు...
జనం సామాజిక దూరం పాటించాలని, చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వం ప్రజలకు సూచిస్తుండటంతో రాత్రికి రాత్రి డిమాండ్ పెరిగిపోయి షాపులు ఖాళీ అయిపోయాయి. జనం ఆన్‌లైన్‌లో వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
హ్యాండ్ శానిటైజర్లు, మాస్కుల కొనుగోళ్ల కోసం జనం ఆన్‌లైన్‌లోకి విపరీతంగా రావటంతో.. ఇక్కడ మోసానికి ఆస్కారం లభించింది.
మోసపూరిత ఈ-కామర్స్ వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. వినియోగదారులను వలలలో వేసుకోవటానికి ‘నమ్మశక్యం కాని ఆఫర్లు’ ప్రకటించాయి.
ముంబైకి చెందిన కీర్తి తివారి (27) అనే మహిళ ఇటువంటి ఒక నకిలీ వెబ్‌సైట్ నుంచి తమ కుటుంబం కోసం కొన్ని మాస్కులు కొనాలని ప్రయత్నించి రూ. 1,500 పోగొట్టుకున్నారు.
‘‘నేను వెబ్‌సైట్ ఓపెన్ చేసినపుడు అది చాలా నిజమైన వెబ్‌సైట్‌లాగే కనిపించింది. మహమ్మారిని వాడుకుని డబ్బులు దండుకోవటానికి మోసం చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు’’ అంటారామె.
నకిలీ ఎన్95 మాస్కులను అధిక ధరతో కొనుగోలు చేసిన ఉదంతాలూ ఉన్నాయి. లాక్‌డౌన్ ఉన్నంత కాలం అన్‌లిమిటెడ్ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ సబ్‌స్క్రిప్షన్ అంటూ మరికొన్ని నకిలీ వెబ్‌సైట్లు గాలం వేశాయి.

ఫొటో సోర్స్, PA Media
తీసుకోవలసిన జాగ్రత్తలు...
ప్రతి ఒక్కరూ తమ సైబర్ భద్రతను తమ చేతుల్లోకి తీసుకోవటం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ లూసిడియస్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ త్యాగి కొన్ని చిట్కాలు తెలిపారు.
- మెయిల్ లేదా ఎస్ఎంస్ఎస్ లేదా మెసేజ్ పంపిన వారి సందేహాస్పద చిరునామాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- ‘ప్రియమైన వినియోదారు’ అని కానీ ‘సర్, మేడమ్’ అని కానీ ఉండే మామూలు సంబోధనలతో వచ్చే సందేశాలను విస్మరించాలి.
- సందేశంలో గ్రామర్ తప్పులు, స్పెల్లింగ్ తప్పులు ఉంటే అవి నకిలీవేమోనని అనుమానించాలి.
- గుర్తుతెలియని సెండర్ల నుంచి వచ్చే అనుమానాస్పద అటాచ్మెంట్లను పూర్తిగా పక్కనపెట్టాలి.
- వీలైన ప్రతి చోటా టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించాలి.
- టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించేటపుడు గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్‌ను వాడటం మంచిది. అలాగే ఎస్ఎంఎస్‌ల ద్వారా కాకుండా ఫోన్ కాల్స్ ద్వారా కోడ్స్ తెప్పించుకోవాలి.
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. మోసపోయినట్లయితే వెంటనే మీ బ్యాంకును సంప్రదించి వారు చెప్పిన మార్గదర్శకాలను పాటించవచ్చు.
ఇటువంటి సైబర్ నేరాల పట్ల ఎవరైనా సరే https://cybercrime.gov.in/ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చునని సైబర్ సెక్యూరిటీ కన్సల్టంగ్ సంస్థ పీడబ్ల్యూసీకి చెందిన సిద్ధార్థ్ విశ్వనాథ్ బీబీసకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- రష్యా: తండ్రిని చంపిన కూతుళ్లు.. ‘ఆత్మరక్షణ కోసం’ చేసిన హత్య కాదా
- కరోనావైరస్ సమయంలో తట్టు కూడా ప్రబలే ప్రమాదముందా
- కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- ‘80 ఏళ్ల క్రితం అంటువ్యాధులపై మా డాక్టర్ తాతయ్య ఇచ్చిన సలహాలు ఇప్పుడు కూడా పనికొస్తాయా’
- కరోనావైరస్: విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేస్తోందా.. ఆన్‌లైన్ తరగతుల ప్రభావం వారిపై ఎలా ఉంటోంది
- కరోనావైరస్: ఈ మహమ్మారి మగవారినే ఎక్కువగా టార్గెట్ చేసిందా... మహిళల పట్ల పక్షపాతం చూపిస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








