లాక్‌డౌన్ ఎఫెక్ట్: విపరీతంగా పెరిగిన రివెంజ్ పోర్న్ కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

లాక్‌డౌన్ కాలంలో ఈ ఏడాది రివెంజ్ పోర్న్ ఎక్కువైందని పరిశోధకులు చెబుతున్నారు.

తమ భాగస్వాములు, మాజీ భాగస్వాములు, తమతో లైంగిక సంబంధాలు ఉన్నవారికి సంబంధించిన అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, చేస్తామని బెదిరించడమే ఈ రివెంజ్ పోర్న్.

బ్రిటన్‌లో ప్రభుత్వ నిధులతో నడిచే ఒక హెల్ప్‌లైన్ నంబరుకు ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటివి 2,050 ఫిర్యాదులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే 22 శాతం ఎక్కువ ఇది.

కరోనావైరస్ లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా కూడా రివెంజ్ పోర్న్ కేసులు ఇంకా పెరుగుతూనే ఉండడంతో ఈ హెల్ప్‌లైన్ నడుపుతున్నవారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అనుమతి లేకుండా అశ్లీల చిత్రాలను పంచుకోవడం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మరియు వేల్స్‌లో చట్టవిరుద్ధం.

ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్‌లో అనుమతి లేకుండా అశ్లీల చిత్రాలు షేర్ చేయడం చట్టవిరుద్ధం.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

గృహహింస సమస్యలపై పనిచేసే సంస్థ రిప్యూజీ పరిశీలనలోనూ ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. ఏడుగురు యువతులకు బెదిరింపులు వచ్చాయని.. వారు సన్నిహితంగా మెలగిన చిత్రాలు బయటపెడతామని బెదిరింపులు వచ్చాయని ఆ సంస్థ వెల్లడించింది.

కాగా హెల్ప్‌లైన్‌కు అందిన ఫిర్యాదులలో మూడింట రెండో వంతు కేసులలో మహిళల పాత్ర కూడా ఉందని గుర్తించారు.

లాక్‌డౌన్ కాలంలో ఇలాంటి రివెంజ్ పోర్న్ ధోరణి పెరిగిపోయిందని పెరుగుతున్న కేసులే చెబుతున్నాయని హెల్ప్ లైన్ మేనేజర్ సోఫీ మార్టిమర్ చెప్పారు.

యూకే సేఫర్ ఇంటర్నెట్ సెంటర్ కార్యక్రమంలో భాగంగా సౌత్‌వెస్ట్ గ్రిడ్ ఫర్ లెర్నింగ్ అనే చారిటీ ఈ హెల్ప్ లైన్ నిర్వహిస్తోంది.

బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇంటర్నెట్ నుంచి 22,515 ఫొటోలను ఈ సంస్థ తొలగించింది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

''లాక్‌డౌన్ వల్ల తీవ్ర పరిణామాలు చోటుచేసుకుని, అవి కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి'' అన్నారు యూకే సేఫర్ ఇంటర్నెట్ సెంటర్ డైరెక్టర్ డేవిడ్ రైట్.

ఈ ఏడాది కేసులు విపరీతంగా పెరిగాయని.. ఇదే సగటు స్థిరపడిపోతుందా అన్న ఆందోళన కలుగుతోందని అన్నారు.

ఉమెన్స్ ఎయిడ్ సంస్థ గుర్తించిన గృహహింస కేసుల్లో 60 శాతం మంది ఈ కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో తమ భాగస్వామి నుంచి ఎదుర్కొన్న వేధింపులు అత్యంత దారుణంగా ఉన్నాయని చెప్పారు.

''ప్రయివేట్ సెక్సువల్ చిత్రాలు బయటపెట్టడం.. బయటపెడతామని బెదిరించడం ఇటీవల కాలంలో ఎక్కువగా ఉందని.. వేధింపుల్లో ఇలాంటివి ఎక్కువ ఉంటున్నాయని.. ముఖ్యంగా యువతులు దీనికి బలవుతున్నారని ఉమెన్స్ ఎయిడ్ సంస్థ పాలసీ మేనేజర్ లూసీ హాడ్లీ అన్నారు.

‘ఆశ్చర్యమేమీ లేదు’

2014లో ఫొలామీ ప్రహాయే మాజీ భాగస్వామి ఆమెకు సంబంధించిన సెక్సువల్ చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టారు.

వేధింపులు, అభ్యంతరకర చిత్రాలు షేర్ చేసిన నేరంపై ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష పడింది.

ఆన్‌లైన్ వేదికగా సంబంధాలు ఏర్పరుచుకోవాలని ఒత్తిళ్లు పెరుగుతున్న ఈ లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి కేసులు పెరగడంలో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు ఫొలామీ.

''ఈ సమస్య ఎప్పుడూ ఉంది. లాక్‌డౌన్ వల్ల అదింత మరింత స్పష్టంగా బయటపడుతోంది'' అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)